AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు జూన్ 2015

అవార్డులు జూన్ 2015
సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడమీ అందజేసే భాషా సమ్మాన్ పురస్కారాలను జూన్ 24న ప్రకటించారు. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యానికి ఈ పురస్కారాలు దక్కాయి. 2013 సంవత్సరానికి దక్షిణాది సాహిత్యానికి కృషిచేసిన కె.మీనాక్షి సుందరం, 2014 సంవత్సరానికి ఆచార్య మునీశ్వర్ ఝా ఎంపికయ్యారు. కమౌని భాషను వెలుగులోకి తెచ్చినందుకు చారు చంద్రపాండే, మథురదుట్ట మథ్‌పాల్‌లకు సంయుక్తంగా భాషా సమ్మాన్ పురస్కారం లభించింది. అలాగే 23 మంది రచయితలకు యువ పురస్కారాలు, 24 మంది రచయితలకు బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించింది. తెలుగు భాషకు సంబంధించి చొక్కాపు వెంకటరమణకు బాలసాహిత్య పురస్కారం దక్కగా, పసునూరి రవీంద్రకు లఘు కథా విభాగంలో యువ పురస్కారం లభించింది.
రవిశంకర్‌కు కొలంబియా అత్యున్నత పురస్కారం
భారత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌కు కొలంబియా అత్యున్నత పౌర పురస్కారం‘ఆర్డెన్ డి లా డెమొక్రసియా సైమన్ బొలివర్’ను ఆ దేశ అధ్యక్షుడు ఫాబియో రౌల్ అమిన్ సలెమె జూన్ 25న బొగొటా(కొలంబియా)లో ప్రదానం చేశారు. రవి శంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా కొలంబియాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
నడియా జిల్లాకు ఐరాస పబ్లిక్ సర్వీస్ అవార్డు
పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాకు ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ అవార్డు 2015 లభించింది. జిల్లాలో బహిర్భూమి మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించినందుకు నడియా జిల్లాకు ఈ అవార్డు దక్కింది. దీన్ని కోల్‌కతాలో జూన్ 27న నడియా జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు అందుకున్నారు. ఈ అవార్డును ఐరాస తాత్కాలిక సెక్రటరీ జనరల్ లెన్నీ మోంటియెల్, యూఎన్ ఉమెన్ చీఫ్ స్టెఫానీ సెనెసే ప్రదానం చేశారు. 2013 వరకు నడియా జిల్లాలో సగం మంది బహిర్భూమిలో కాలకృత్యాలకు వెళ్లేవారు. జిల్లా పాలనా యంత్రాంగం సబర్ సౌచాగర్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంతో వారి సంఖ్య 0.2 శాతానికి తగ్గిపోయింది.

సీఎన్‌ఆర్ రావుకు జపాన్ అత్యున్నత పురస్కారం
జపాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్’ను భారత ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు ఆ దేశ ప్రభుత్వం జూన్ 19న ప్రదానం చేసింది. ఇరు దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసేందుకు చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. 
ఇద్దరు అమెరికన్లకు రష్యా ‘ఎలక్ట్రానిక్ నోబెల్’ ప్రైజ్
రష్యా అత్యుత్తమ టెక్నాలజీ అవార్డు ‘ది గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్’ ఈ ఏడాదిగానూ ఇద్దరు అమెరికన్లకు దక్కింది. ‘నోబెల్’ గ్రహీత షుజీ నకమురా, భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త బి.జయంత్ బాలిగ ఈ అవార్డును రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చేతుల మీదుగా మే 19న అందుకున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో సేవలందించిన వారికి ఇచ్చే ఈ అవార్డు అధికారికమైనది కానప్పటికీ రష్యాలో దీన్ని ‘ఎలక్ట్రానిక్ నోబెల్’గా వ్యవహరిస్తారు. ఆ దేశంలోని కొన్ని ప్రఖ్యాత విద్యుత్ కంపెనీలు కలిసి స్థాపించిన ఈ అవార్డ్‌ను ఏటా రష్యా అధ్యక్షుడు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రదానం చేస్తారు. దీంతోపాటు విజేతలకు 33 మిలియన్ రూబెల్స్ ప్రైజ్‌మనీ దక్కుతుంది. దీని విలువ 1.2 మిలియన్ యూఎస్ డాలర్లకు సమానం. అయితే ప్రస్తుతం రూబెల్ విలువ క్షీణించడంతో ఈ మొత్తం 5.5 లక్షల డాలర్లకు పడిపోయింది. 
బెన్నీ జోసెఫ్‌కు వీకే క్రిష్ణమీనన్ అవార్డు
బ్రిటన్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి బెన్నీ జోసెఫ్ మావెలిల్ 2015కు గాను వీకే క్రిష్ణమీనన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలకు, నిస్వార్థసేవలకు గుర్తింపుగా ఈ అవార్డు బహూకరిస్తున్నారు. కేరళకు చెందిన బెన్నీ జోసెఫ్ బ్రిటన్‌లో స్థిరపడ్డారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే భారత సంతతి వ్యక్తులకు వీకే క్రిష్ణమీనన్ అవార్డు అందజేస్తారు. 
డీఆర్‌డీవో, ఇస్రో శాస్త్రవేత్తలకు ఆర్యభట్ట అవార్డులు
క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అవినాశ్ చందర్, విక్రమ్ సారాభాయ్ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రంగనాథ్ ఆర్ నవల్‌గుంద్‌లను ఆర్యభట్ట అవార్డుకు ఎంపిక చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఈ అవార్డులను అందజేస్తున్నారు. డీఆర్‌డీవో అధ్యక్షుడిగా, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా (మాజీ) డాక్టర్ అవినాశ్ చందర్ అగ్ని క్షిపణుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సంస్మరణార్థం అందించే ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. రాకెట్ సంబంధిత టెక్నాలజీలను అభివృద్ధి చేసిన వారికి కూడా ఏఎస్‌ఐ రెండు అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో నావిగేషన్, ఎంబెడెడ్ కంప్యూటర్స్ విభాగం అసోసియేట్ డెరైక్టర్‌గా ఉన్న బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి, ఇస్రోకు చెందిన డాక్టర్ పి.పి.మోహన్‌లాల్‌లు ఈ అవార్డులు అందుకోనున్నారు. 
ముగ్గురు భారతీయులకు క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డు
క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డుకు ముగ్గురు భారతీయులు ఎంపికయ్యారు. మొత్తం అరవై మందిని ఎంపిక చేయగా అందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అశ్విని అంగడి, దేవికా మాలిక్, అక్షయ్ జాదవ్‌లకు జూన్ 22న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను బహూకరించారు. ఈ అవార్డును క్వీన్ ఎలిజబెత్ 2 గతేడాది ఏర్పాటుచేశారు. ప్రజల జీవితంలో మార్పు తీసుకువచ్చేందుకు విశేష కృషి చే సే యువతీ యువకులకు ఈ అవార్డు అందజేస్తారు. 
నలుగురికి ‘భాషా సమ్మాన్’ అవార్డులు
వివిధ భాషల్లో శాస్త్రీయ, మధ్యయుగ సాహిత్యంపై విశేష కృషి చేసిన నలుగురిని ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ ‘భాషా సమ్మాన్’ అవార్డులు వరించాయి. శాస్త్రీయ, మధ్యయుగ సాహిత్యం(దక్షిణాది)లో కృషి చేసినందుకు గాను కె. మీనాక్షీ సుందరం 2013 ఏడాదికి, శాస్త్రీయ, మధ్యయుగ సాహిత్యం(తూర్పు)లో కృషి చేసినందుకు గాను ఆచార్య మునీశ్వర్ ఝా 2014వ ఏడాదికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కుమౌనీ భాషలో కృషి చేసినందుకు చారుచంద్ర పాండే, మథురదత్ మత్పల్‌లు సంయుక్తంగా భాషా సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ 2015వ ఏడాదికి గాను 23 భారతీయ భాషల్లో వచ్చిన పలు రచనలకు యువ అవార్డులను ప్రకటించింది. యువ పురస్కారాలు పొందినవారిలో తెలుగు రచయిత పసునూరి రవీందర్ కూడా ఉన్నారు. పురస్కారం కింద రూ. 50 వేలు ఇస్తారు. బాలసాహిత్యంలో కృషికి గానుచొక్కాపు వెంకటరమణకు బాలసాహిత్య పురస్కారం-2015 లభించింది. నవంబర్ 14న ముంబైలో ఆయనకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేయనున్నారు.

2014 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు
ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, పురస్కారాలను 2014 సంవత్సరానికి జూన్ 10న కేంద్రం ప్రకటించింది. ఫెలోషిప్‌లు పొందిన వారిలో సంగీత స్రష్ట ఎస్.ఆర్.జానకి రామన్, భారత శాస్త్రీయ సంగీత విద్వాంసులు విజయ్ కిచ్లూ, తులసీదాస్ బోర్కర్, చిత్ర దర్శకుడు ఎం.ఎస్.సత్యూ ఉన్నారు. ఈ ఫెలోషిప్‌లను అరుదైన గౌరవంగా భావిస్తారు. సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు వివిధ రంగాల నుంచి 36 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గా ప్రసాద్ రావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రాధేశ్యామ్ సత్యభామ, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. దుర్గా ప్రసాదరావు విజయనగరం సంగీత కళాశాలలో పనిచేసి, పదవీ విరమణ చేశారు.
వివేక్ మూర్తికి ‘ప్రైడ్ ఆఫ్ కమ్యూనిటీ’ అవార్డు
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ‘ప్రైడ్ ఆఫ్ కమ్యూనిటీ’ పురస్కారం స్వీకరించారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్(హెచ్‌ఏఎఫ్) ఈ అవార్డును ఇటీవల ఆయనకు అందజేసింది. స్వామి వివేకానంద జీవితం నుంచి తాను స్ఫూర్తిని పొందానని వివేక్ మూర్తి ఈ సందర్భంగా చెప్పారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. 12 వార్షికోత్సవం సందర్భంగా పలు పురస్కారాలు అందజేసింది. సెయింట్ ఒలాఫ్ కాలేజీ ప్రొఫెసర్ అనంతానంద్ రామ్‌బచన్‌కు ధర్మా సేవా అవార్డు, హర్‌ప్రీత్ సింగ్ మోఖాకు మహాత్మా గాంధీ, సెనేటర్ మార్క్ కిర్క్, జే క్రౌలీకి ఫ్రెండ్ ఆఫ్ కమ్యూనిటీ పురస్కారాలు ప్రదానం చేసింది. అమెరికాలోని హిందువుల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ 2003 సెప్టెంబర్ 3న ఏర్పాటైంది.

వాజ్‌పేయికి బంగ్లాదేశ్ అవార్డు
 మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ‘ఫ్రెండ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవార్డు’ ను బహూకరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ జూన్ 1న ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయేందుకు జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అందించిన సేవలకు ఆయనను ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. 1971 విమోచన యుద్ధ సమయంలో వాజ్‌పేయి లోక్‌సభ సభ్యుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాకు మద్దతు తెలిపారని పేర్కొంది. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు ఈ అవార్డు లభించింది.

కల్మాడీకి ఆసియా అథ్లెటిక్ సంఘం అవార్డుఆసియాలో అథ్లెటిక్స్ అభివృద్ధికి విశేష కృషి చేశారంటూ ఆసియా అథ్లెటిక్ సంఘం తమ అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్స్ అవార్డును సురేశ్ కల్మాడీకి అందించింది. 13 ఏళ్ల పాటు ఈ సంఘానికి కల్మాడీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో అనేక మెగా ఈవెంట్స్‌ను నిర్వహించారు. కాగా 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో జరిగిన కుంభకోణంలో అరెస్టైన కల్మాడీ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు.

No comments:

Post a Comment