AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు జూలై 2015

అవార్డులు జూలై 2015
క్రిడాకు సర్దార్ పటేల్ పురస్కారం
హైదరాబాద్‌లోని జాతీయ మెట్ట పరిశోధనా కేంద్రం (క్రిడా)కు సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జూలై 25న పాట్నాలో క్రిడా సంచాలకుడు శ్రీనివాసరావుకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఏటా దేశంలో వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరచిన సంస్థకు ఈ పురస్కారం ప్రకటిస్తోంది.
పీటర్ హిగ్స్‌కు కాప్లీ అవార్డు
ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ గ్ర హీత పీటర్ హిగ్స్ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ కాప్లీ అవార్డు అందుకున్నారు. హిగ్స్‌బోసాన్(దైవకణం) థియరీపై ఆయన చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ఈ ప్రాచీన సైన్స్ పురస్కారం లభించింది. నోబెల్ బహుమతి కంటే ముందు నుంచే1731 నుంచి రాయల్ సొసైటీ ఈ అవార్డును అందిస్తోంది. చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ రూపకర్త అలెక్ జెఫ్రీ, గ్రాఫీన్ ఆవిష్కర్త ఆండ్రీ జిమీలు అందుకున్నారు. 86 ఏళ్ల పీటర్ హిగ్స్ బ్రిటన్‌వాసి. ప్రపంచంలోని అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశిని సమకూరుస్తోందని భావిస్తున్న దైవకణం ఉనికిని కనుగొనే దిశగా చేసిన పరిశోధనలకు గాను పీటర్ హిగ్స్, ప్రాంకోయిస్ ఎంగ్లర్ట్(బెల్జియం) సంయుక్తంగా 2012లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. దాదాపు యాభై ఏళ్ల కిందటే వీరు దైవకణం గురించి ఊహించి ప్రపంచానికి చెప్పారు. 
భారతీయ విద్యార్థికి యూఎస్ అవార్డు
భారత్‌కు చెందిన ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థి కార్తీక్ వర్మ ప్రతిష్టాత్మక గ్లోబల్ జేమ్స్ మెక్‌గేర్ బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్-2015లో విజేతగా నిలిచాడు. మియామి ఫ్లోరిడాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లారేట్ ఎడ్యుకేషన్ సీఈఓ, చైర్మన్ జేమ్స్ మెక్‌గేర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. గర్భిణులు, బాలింతలకు సౌకర్యంగా, ఫ్యాషన్‌గా ఉండే దుస్తుల తయారీ ఐడియాకు గాను ఈ అవార్డు లభించింది. 
నెడ్‌క్యాప్‌కు బెస్ట్ నోడల్ ఏజెన్సీ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం (నెడ్‌క్యాప్)కు 2014-15 సంవత్సరానికి అత్యుత్తమ నోడల్ ఏజెన్సీ అవార్డు లభించింది. గ్లోబల్ ఎనర్జియా అనే జాతీయ పత్రిక జూలై 23న ఈ అవార్డును ప్రకటించింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మంజూరు, ఆల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టుల పర్యవేక్షణ, సోలార్ వ్యవసాయ పంపు సెట్లు అందించడంలో అత్యున్నత ఫలితాలు సాధింస్తున్నందువల్లే ఈ అవార్డుకు ఎంపికైనట్లు నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు జూలై 24న ఓ ప్రకటనలో తెలిపారు.
పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు
ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) ప్రతిష్టాత్మక కార్పొరేట్ అవార్డులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లు అందుకున్నాయి. జూలై 23న న్యూఢిల్లీలో డీఅండ్‌బీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ ‘ఇండియా టాప్ పీఎస్‌యూ అవార్డు-2015’ను పీఎఫ్‌సీకి, ‘ఇండియా టాప్ పీఎస్‌యూ-2015’ అవార్డును ఎన్‌టీపీసీకి అందజేశారు.
రామచంద్ర గుహకు ఫుకువోకా ఏసియన్ కల్చర్ ప్రైజ్
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఫుకువోకా ఏసియన్ కల్చర్ ప్రైజ్’కు ఎంపికయ్యారు. అకడమిక్ కేటగిరీలో ఆయనకు ఈ అవార్డు లభించింది. గ్రాండ్ ప్రైజ్ విభాగంలో మైన్మార్‌కు చెందిన థాంట్ మియంట్-యూ, ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రైజ్ విభాగంలో వియత్నాంకు చెందిన మిన్హ్ హాన్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 17న జపాన్‌లో జరిగే ‘ఫుకువోకా ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సెంటర్’లో విజేతలకు ఈ అవార్డులను అందజేస్తారు. 
ఇద్దరు భారతీయులకు మెగసెసె అవార్డు
ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షు గుప్తా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన చతుర్వేది(40) ప్రస్తుతం ఎయిమ్స్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అత్యంత సాహసం, నిజాయతీతో అవినీతి నిర్మూలనకు కృషి చేసినందుకుగాను ‘ఎమెర్జెంట్ లీడర్‌షిప్’ కేటగిరీ కింద చతుర్వేదిని పురస్కారానికి ఎంపికచేసినట్లు రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్(ఆర్‌ఎంఏఎఫ్) ప్రకటించింది. ఇక అన్షు గుప్తా కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 1999లో గూంజ్ ఎన్జీవోను స్థాపించారు. పాత బట్టలు, గృహోపకరణాలను సేకరించి వాటిని నిరుపేదలకు అందించే సదుద్దేశంతో ఈయన ఈ సంస్థను నెలకొల్పారు. చతుర్వేది, అన్షు గుప్తాతోపాటు మరో ముగ్గురు కూడా మెగసెసె అవార్డుకు ఎంపికయ్యారు. లావోస్‌కు చెందిన కొమలై చాంతావాంగ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన లిగయా ఫెర్నాండో-ఎమిల్‌బంగ్సా, మయన్మార్‌కు చెందిన క్యావ్ తు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు ఆర్‌ఎంఏఎఫ్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్ మూడో అధ్యక్షుడు రామన్ మెగసెసె గౌరవార్థం 1957 నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు. 
డాక్టర్ షేక్ మీరాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు
వరి పరిశోధనలో విశిష్ట సేవలకుగానూ హైదరాబాద్‌లోని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ షేక్ ఎన్. మీరా ప్రతిష్టాత్మక లాల్ బహదూర్ శాస్త్రి ఔట్‌స్టాండింగ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. పాట్నాలో జరిగిన ఐసీఏఆర్ 87వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ ఈ అవార్డును అందజేశారు.

భారతీయ అమెరికన్‌కు వైట్ హౌస్ పురస్కారం
పర్యావరణ పరిరక్షణ కోసం సేవలందించేవారికి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అందించే ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ పురస్కారానికి భారత సంతతి అమెరికన్ సునీతా విశ్వనాథ్ ఎంపికయ్యారు. సునీత సహా 12 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 30 ఏళ్లుగా సునీత మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలతో కలసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణలో హిందువులను భాగస్వాములను చేసినందుకుగానూ ఆమెను చాంపియన్ ఆఫ్ చేంజ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ పేర్కొంది. చెన్నైలో జన్మించిన సునీత అమెరికాలో స్థిరపడ్డారు. సాధనా, ఫ్రంట్ లైన్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఫర్ ఆఫ్ఘాన్ ఉమెన్ తదితర సంస్థల్లో ఆమె క్రియాశీల సభ్యురాలు.
హేమమాలినికి జీవిత సాఫల్య పురస్కారం
చలనచిత్ర, కళారంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 108వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ యాజమాన్యం జూలై 20న ఆమెకు ఈ అవార్డు అందించింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుండడంతో తన కుమార్తె ఈషా దేవల్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి సాహితీ పురస్కారం
దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్య అందుకున్నారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జూలై 22న రవీంద్రభారతిలో దాశరథి కృష్ణమాచార్య 91వ జయంత్యుత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులను సీఎం కేసీఆర్, ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి సత్కరించారు.
కిమ్స్ వైద్యులిద్దరికి ఇండో గ్లోబల్ అవార్డులు
కిమ్స్‌కు చెందిన ఇద్దరు వైద్యులు డాక్టర్ మేక ప్రత్యూష, డాక్టర్ కె. శివరాజ్‌లు ఇండో గ్లోబల్ అవార్డులకు ఎంపికయ్యారు. దంత వైద్యరంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ మేక ప్రత్యూషను ఇండో గ్లోబల్ ఎక్సలెన్స్ డెంటిస్ట్ అవార్డు వరించగా, ఇదే ఆస్పత్రిలో కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ కె.శివరాజ్‌కు ఇండో గ్లోబల్ ఎక్సలెన్స్ జనరల్ మెడిసిన్ అవార్డు దక్కింది.డెంగీ, హైపర్‌టెన్షన్, థైరాయిడ్, ఓస్టోపెరోసిస్, ఒబెసిటీ రోగులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జూలై 23న హోటల్ మ్యారీ గోల్డ్‌లో జరిగిన ఇండోగ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను అందజేశారు.
ధ్యాన్‌చంద్‌కు ‘భారత్ గౌరవ్’ పురస్కారం
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. సంస్కృతి యువ అనే ఎన్‌ఆర్‌ఐ సంస్థ ధ్యాన్‌చంద్‌కు ‘భారత్ గౌరవ్’ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. జూలై 25న బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగే కార్యక్రమంలో ధ్యాన్‌చంద్ కొడుకు అశోక్ కుమార్ ఈ అవార్డును స్వీకరిస్తారు. ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలను అందించారు. అంతర్జాతీయ కెరీర్‌లో ఆయన 400 గోల్స్ చేశారు.

ఉర్దూ ‘పొయెట్ ఆఫ్ ద ఈయర్’ మునావర్ అలీ
జమ్మూకశ్మీర్‌కు చెందిన పదిహేడేళ్ల కవి మునావర్ అలీ హుస్సేనీ 2014 సంవత్సరానికిగానూ ‘పొయెట్ ఆఫ్ ద ఈయర్’ అవార్డు గెలుచుకున్నారు. హుస్సేనీ రచించిన ‘జులుమ్ కా మారా’ అనే పద్యానికిగానూ ఈ అవార్డు లభించింది. 20 లైన్లు ఉన్న ఈ పద్యం..ప్రపంచంలోని ముస్లిం బాలల చావుబతుకులను వివరిస్తుంది. జమ్మూకశ్మీర్, పాలస్తీనా, సిరియా, మయనార్మ్ దేశాల్లోని ముస్లిం బాలలు దీనస్థితిని అలీ ఈ పద్యంలో వర్ణించారు. ఒక్కొక్క రచయిత తను రాసిన ఐదు పద్యాలను ఉర్దూ అకాడమీకి పంపించాలి. వాటిలో ఉత్తమ పద్యం రాసిన రచయితను ‘పోయెట్ ఆఫ్ ద ఈయర్’గా అకాడమీ జూరీ సభ్యులు ప్రకటిస్తారు. హుస్సేనీ గతేడాది తాను రచించిన మూడు పద్యాలను అకాడమీకి పంపించారు. అందులోని ‘జులుమ్ కా మారా’ అనే పద్యాన్ని ఈ అవార్డు వరించింది. చిన్నతనం నుంచి పద్యాలు రాసే హుస్సేనీకి ఉర్దూ పద్యాలతో పాటు ఇంగ్లిష్‌లో చిన్నచిన్న కథలు రాసే అలవాటు ఉంది.
ఆంధ్ర యూనివర్శిటీకి బెస్ట్ రీసెర్చ్ వర్సిటీ అవార్డు
దేశంలో ఉన్నతవిద్య, డాక్టరేట్ అంశాలలో పరిశోధనను ప్రోత్సహిస్తున్న అత్యుత్తమ వర్సిటీగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంపికైంది. గుజరాత్ టెక్నికల్ వర్సిటీ, కమ్యూనికేషన్ మల్టీ మీడియా అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌సంయుక్తంగా ఏయూను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 17న అహ్మదాబాద్‌లో జరగనున్న ఆఫ్రో ఏసియన్ సదస్సులో వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు ఈ అవార్డును అందుకోనున్నారు. 
ఎస్‌హెచ్ రజాకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
ప్రముఖ భారతీయ కళాకారుడు సయ్యద్ హైదర్ రజాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఫ్రాన్స్ దౌత్య కార్యాలయంలో జూలై 14న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాయబారి ఫ్రాన్సోయిస్ రిచర్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. భారత, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. 1922 ఫిబ్రవరి 22న మధ్యప్రదేశ్‌లో జన్మించిన రజా 1950 నుంచి ఫ్రాన్స్‌లో ఉంటున్నారు. ఆయన వేసిన పలు పెయింటింగ్‌లు విశేష ఆదరణ పొందాయి. 2007లో పద్మభూషణ్, 2013లో పద్మ విభూషణ్‌లతో భారత్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

సర్ ఫాజల్ హసన్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
బంగ్లాదేశ్‌కు చెందిన సర్ ఫాజల్ హసన్ అబెద్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను వాషింగ్టన్‌లో జూలై 1న ప్రకటించారు. అబెద్ బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, మానవాభివృద్ధికి దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. ఆ సంస్థ 10 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆకలి బాధలు తొలగించేందుకు, ఆహార భద్రత సాధించడంలో కృషిచేసిన వ్యక్తులకు అందిస్తున్నారు.
పాల్ సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం
భారతీయ అమెరికన్ ఆర్.పాల్ సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం లభించింది. లెబనాన్‌లో 2015 జూన్ చివరి వారంలో జరిగిన వ్యవసాయ, జీవన ప్రమాణ శాస్త్రాలకు చెందిన ఉన్నత విద్యా సంఘాల ప్రపంచ సమాఖ్య-2015 సమావేశంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. పాల్ సింగ్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు. విద్యుత్తు పొదుపు, ఆహార ఉత్పత్తుల సంరక్షణ, పంటల కోతల అనంతర టెక్నాలజీ వంటి అంశాలలో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
దర్శన్ జైన్‌కు ప్రెసిడెన్షియల్ అవార్డు
గణితం, సైన్స్ సబ్జెక్టుల బోధనలో సేవలందించినందుకుగాను ప్రఖ్యాత యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డుకు భారతీయ అమెరికన్ దర్శన్ జైన్ ఎంపికయ్యారు. ఇల్లినాయిస్‌లోని అడ్లాయి స్టీవెన్‌సన్ హై స్కూల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్న ప్రస్తుతం ఈ స్కూల్‌కి డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ అవార్డు కింద ఆయన ప్రశంసపత్రంతో పాటు 10,000 డాలర్ల బహుమతి అందుకోనున్నారు. వాషింగ్టన్‌లో జరిగే ప్రదానోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు బారక్ ఒబామా చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తారు.
నలుగురు భారతీయ అమెరికన్లకు ‘ప్రైడ్ ఆఫ్ అమెరికా’
న్యూయార్క్‌కు చెందిన కార్నెగీ కార్పొరేషన్ అందించే ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా’ పురస్కారానికి నలుగురు భారత సంతతి అమెరికన్లు ఎంపికయ్యారు.
మొత్తం 30 దేశాల నుంచి 38 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో నలుగురు భారత సంతతికి చెందిన వారున్నారు.
ఎంపికైన నలుగురు భారతీయులు... ప్రీత్ బరారా(యూఎస్ అటార్నీ), రాకేశ్ ఖురానా (హార్వర్డ్ కాలేజ్ డీన్), మధూలికా సిక్కా(మిక్(ఇండియా)) వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్), అబ్రహం వర్గీస్(డాక్టర్).
జేఎన్‌యూ ప్రొఫెసర్‌కు మంగోలియా పురస్కారం
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అధ్యాపకునికి అరుదైన గౌరవం దక్కింది. మంగోలియా పురస్కారమైన నైరాందల్ (స్నేహం) మెడల్‌ను జేఎన్‌యూ అసొసియేట్ ప్రొఫెసర్ అండ్ డెరైక్టర్ శరద్ కే సోనీ అందుకున్నారు. తమ దేశంలో అత్యుత్తమ సేవలందించిన విదేశీయులకు మంగోలియా ఈ అవార్డును అందిస్తుంది.

రావి కొండలరావుకు ‘కొవ్వలి’ పురస్కారం
ప్రముఖ రచయిత, రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు రావికొండలరావు ‘కిన్నెర- కొవ్వలి’ స్మార క పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ అందజేస్తుంది. 1,000 నవలల రచయిత కొవ్వలి లక్ష్మీ నర్సింహారావు 103వ జయంతి సందర్భంగా జూలై 1న ఈ పురస్కారాన్ని కొండలరావుకు అందజేస్తారు. రావి కొండలరావు 1931లో శ్రీకాకుళంలో జన్మించారు. రంగస్థల నటుడైన కొండలరావు 1957లో ‘శోభ’ సినిమా ద్వారా వెండితెర ప్రవేశం చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణ విజయం సినిమాలకు రచయితగా పనిచేశారు. పెళ్లిపుస్తకం, వరకట్నం సినిమాల్లో నటన ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

సంజీవ్ గలాండేకు జీడీ బిర్లా అవార్డుప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే 2014వ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక జీడీ బిర్లా అవార్డుకు ఎంపికయ్యారు. కణ జీవశాస్త్రం, ఎపిజెనెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది. పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్ జన్యుశాస్త్ర పరిశోధనలతో ప్రసిద్ధి పొందారు. 1967లో జన్మించిన సంజీవ్ బెంగళూరులోని ఐఐఎస్‌సీలో 1996లో బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఐఐఎస్‌ఈఆర్‌లో ఎపిజెనెటిక్స్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించిన ఆయన యువ శాస్త్రవేత్తలకు నేతృత్వం వహిస్తున్నారు. జీడీ బిర్లా అవార్డు కింద విజేతకు రూ.2.5 లక్షల నగదు అందజేస్తారు.

రవిశంకర్‌కు పెరూ అత్యున్నత పురస్కారంప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌కు పెరూ ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆండియన్ పార్లమెంటు, పెరూ కాంగ్రెస్ ఉమ్మడిగా నిర్వహించిన సమావేశంలో ఆయనను సన్మానించి పురస్కారం ప్రదానం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిసాధనకు కృషి చేసినందుకు గానూ ఆయనకు ‘మెడల్లా డి లా ఇంటెగ్రేషియన్ ఎన్ ఎల్ గ్రేడో డి గ్రాన్ ఆఫీషియన్’ పురస్కారాన్ని జూన్ 30న ప్రదానం చేశారు.

No comments:

Post a Comment