AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు నవంబరు 2016

అవార్డులు నవంబరు 2016
మాలినికి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డు
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డు(International Press Freedom Award)2016ను ప్రముఖ పాత్రికేయురాలు మాలిని సుబ్రహ్మణ్యం అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, రాష్ట్ర భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనను వెలుగులోకి తెచ్చినందుకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. న్యూయార్క్‌లో నవంబర్ 23న జరిగిన అంతర్జాతీయ పాత్రికేయుల సంరక్షణ కమిటీ సమావేశంలో మాలినితోపాటు మహమ్మద్ అబౌ జీద్ (ఈజిప్టు), కాన్ డ్యూండర్ (టర్కీ), అస్కార్ మార్టినెజ్ (ఎల్ సాల్వెడర్)లకు కూడా పత్రికా స్వేచ్ఛ పురస్కారాలను ప్రదానం చేశారు.
సిధారెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం
ప్రముఖ కవి, మంజీర రచయితల సంఘం వ్యవస్థాపకుడు నందిని సిధారెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం అందుకోనున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక అందచేస్తారు. డిసెంబర్ 2న జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్‌‌సలర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.
గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ పురస్కారం
తెలుగు సాహితీవేత్త గోరటి వెంకన్నను లోక్‌నాయక్ పురస్కారం-2016కు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ వెల్లడించారు. జనవరి 21న ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమంలో వెంకన్నకు పురస్కారం ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.15 లక్షలు నగదు, జ్ఞాపికను అందచేస్తారు.
ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పేయి
ఆస్ట్రేలియాలో జరుగుతున్న 10వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, నవాజుద్దీన్ సిద్దిఖీకి సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. హన్సల్ మెహతా తెరకెక్కించిన ‘అలీగఢ్’ చిత్రంలో ప్రొఫెసర్ సైరస్ పాత్రలో నటనకుగాను మనోజ్‌కు ఈ అవార్డు దక్కగా.. ‘రామన్‌రాఘవ్ 2.0’ చిత్రంలో నటనకుగాను నవాజుద్దీన్‌ను ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. గర్త్ డేవిస్ తీసిన ‘లయన్’ చిత్రంలో అద్భుత ప్రతిభ కనబర్చిన సన్నీకి జ్యూరీ గ్రాండ్ స్పెషల్ ప్రైజ్ వరించింది.
‘డాటర్’ కు ‘గోల్డెన్ పికాక్’ అవార్డు
గోవా రాజధాని పణజిలో నిర్వహించిన 47వ భారత అంతర్జాతీయ సినీ ఉత్సవం(ఇఫీ)లో ఇరాన్ చిత్రం ‘డాటర్’ ‘గోల్డెన్ పికాక్’ పురస్కారాన్ని కై వసం చేసుకుంది. రెజా మిర్కారిమి ఈ సినిమా దర్శకుడు. అదుపాజ్ఞల్లో పెట్టే తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన ఒక బాలిక స్నేహితురాలికి వీడ్కోలు చెప్పేందుకు టెహరాన్‌కు వచ్చే ఘటనల సమాహారమే ‘డాటర్’ చిత్రం.

పొత్తూరికి ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా పురస్కారం
 తెలుగు సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నవంబర్ 16న జాతీయ పురస్కారంతో సత్కరించింది. గత 50 ఏళ్లుగా పత్రికారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును బహుకరించారు. 82 ఏళ్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర జనత పత్రికలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం, ఈనాడు పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ మెటీరియల్‌కు సంబంధించి చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు.
రవిశంకర్‌కు నాగేంద్రసింగ్ శాంతి పురస్కారం
ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ప్రతిష్టాత్మక డాక్టర్ నాగేంద్రసింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నవంబర్ 20న జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్ అవార్డును అందజేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి స్థానాన్ని పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన నాగేంద్ర జ్ఞాపకార్థం ఈ అవార్డును అందిస్తున్నారు. 
ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డు
సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2016ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. గోవాలో జరిగిన47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి వెంకయ్య నాయుడు అవార్డును అందజేశారు.

ఈసీఐఎల్‌కు సీఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డు
 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)కు 2016 ఏడాదికి గాను సీఐఐ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. ఎలక్ట్రానిక్ రంగంలో పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నూతన ఆవిష్కరణలతో సాగుతున్నందుకుగాను ఈ ఈసీఐఎల్‌కు ఈ అవార్డు ప్రకటించారు.

దక్షిణాఫ్రికా భారతీయుడికి గ్లోబల్ సిటిజన్ అవార్డు‘గిఫ్ట్ ఆఫ్ ది గివర్స్’ ఫౌండేషన్ ద్వారా 42 ఆఫ్రికాదేశాల్లో చేస్తున్న సమాజసేవకు గాను దక్షిణాఫ్రికా భారతీయుడు ఇంతియాస్ సులేమాన్‌కు గ్లోబల్ సిటిజన్ అవార్డు దక్కింది. లండన్‌లో నవంబర్ 11న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద 50 వేల డాలర్ల నగదు, ప్రత్యేక పతకం ఇస్తారు. మానవాభివృద్ధికి అసమాన కృషి చేసిన వారికి గ్లోబల్ సిటిజన్ అవార్డు అందచేస్తారు.

No comments:

Post a Comment