AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు మార్చి 2015

అవార్డులు మార్చి 2015
మదన్ మోహన్ మాలవ్యకు భారతరత్న
ప్రసిద్ధ విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయకు మరణానంతరం ప్రకటించిన భారత రత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లోని చరిత్రాత్మక దర్బార్ హాల్‌లో మార్చి 29నపద్మ అవార్డుల ప్రదానోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ పురస్కారాలను ప్రదానం చేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, పాత్రికేయులు స్వపన్ దాస్‌గుప్తా, రజత్ శర్మ తదితరులు స్వీకరించారు. బాలీవుడ్ సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, గీత రచయిత ప్రసూన్ జోషీ, వైద్యుడు రణదీప్ గులేరియా, ప్రముఖ కార్టూనిస్ట్ ప్రాణ్ కుమార్ శర్మ(మరణానంతరం), హాకీ స్టార్ సర్దార్ సింగ్, ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా తదితరులు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ప్రాణ్ కుమార్ శర్మ తరఫున ఆయన భార్య ఆశా ప్రాణ్ పురస్కారం స్వీకరించారు. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు మిథాలీరాజ్, పి.వి.సింధు, వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ మంజుల, డాక్టర్ రఘురాం, సినీ నటుడు కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ నెల 27న ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత రత్న అవార్డును అందజేసిన సంగతి తెలిసిందే. 
భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా అవార్డు
అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఎస్. కంభంపాటి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని సదరన్ యూనివర్సిటీలో జీవశాస్త్రం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనాసక్తి పెంచేందుకు కృషిచేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ చదివారు. 
ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 2014 సంవత్సరానికిగానూ గాంధీ శాంతి బహుమతి లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక బృందం ఇస్రోను ఎంపిక చేస్తూ మార్చి 27న నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడినందుకు ఇస్రోను ఎంపిక చేశారు. అహింసా మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతి కింద రూ. 1 కోటి నగదు, ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు. 
మాధవ్ గాడ్గిల్‌కు టైలర్ ప్రైజ్
ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త మాధవ్‌గాడ్గిల్ ప్రతిష్టాత్మక టైలర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. గాడ్గిల్ అమెరికా శాస్త్రవేత్త జేన్ లుబ్‌చెన్కోతో సంయుక్తంగా ఈ బహుమతి అందుకోనున్నారు. భారత్, అమెరికాలలో పర్యావరణ పరిరక్షణకు చేసిన విశేష కృషికిగాను వీరు ఈ ఏడాది దీనికి ఎంపికయ్యారు. ఏప్రిల్‌లో లాస్‌ఏంజెలిస్‌లో జరగనున్న కార్యక్రమంలోవీరికి రూ.1.24 కోట్లు, గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. గాడ్గిల్ గోవా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. గాడ్గిల్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ(1981), పద్మ భూషణ్(2006) అవార్డులు అందుకున్నారు. 
ఇద్దరు అమెరికన్లకు ‘గణిత నోబెల్’
గణితశాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు అమెరికన్లను గణిత నోబెల్‌గా చెప్పుకునే అబెల్ పురస్కారం వరించింది.అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్తలు జాన్ ఎఫ్. నాష్ జూనియర్, లూయిస్ నిరెన్‌బర్గ్‌లకు సంయుక్తంగా ప్రతిష్టాత్మక ‘అబెల్ పురస్కారం- 2015’ లభించింది. ఈ పురస్కారం గణిత నోబెల్‌గా ప్రసిద్ధి చెందింది. ‘నాన్ లీనియర్ పార్శియల్ డిఫెరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ అప్లికేషన్స్ టు జియోమెట్రిక్ అనాలిసిస్’ థియరీ కోసం వీరు విశేష కృషి చేశారు. నాష్ (86), నిరెన్‌బర్గ్ (90)లకు ఈ పురస్కారంతోపాటు దాదాపు 7,65,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమానం అందజేయనున్నారు. మే 19న ఓస్లోలోని నార్వే కింగ్స్ హెరాల్డ్‌లో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో వీరికి ఈ పురస్కారం అందజేయనున్నారు. పిన్స్‌టన్ యూనివర్సిటీ, మసాచుట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాష్ పనిచేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని కురాంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథెమెటికల్ సెన్సైస్‌లో నిరెన్‌బర్గ్ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు.

62వ జాతీయ చలనచిత్ర అవార్డులు 
డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలనచిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వీటిని విజేతలకు మే 3, 2015న అందజేస్తారు. ఉత్తమ ఫీచర్ చలనచిత్రం: కోర్టు (మరాఠీ); ఉత్తమ పాపులర్ చలనచిత్రం: మేరీ కోమ్ (హిందీ); ఉత్తమ బాలల చలనచిత్రం: కాక్కా ముత్తైతమిళం); ఎలిజబెత్ ఏకాదశి (మరాఠీ); ఉత్తమ నటుడు: విజయ్ (నాను అవనల్లా అవళు, కన్నడ); ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్, హిందీ); ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (చోటుష్కోనే, బెంగాలీ); ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రం (తెలుగు): చందమామ కథలు
శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి శశికపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు.
రాజేంద్రసింగ్‌కు స్టాక్‌హోం వాటర్ ప్రైజ్
ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ప్రతిష్టాత్మక స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015కు ఎంపికయ్యారు. వాటర్ మ్యాన్‌గా పిలిచే రాజేంద్రసింగ్ గ్రామీణుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు విశేష కృషిచేశారు. రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన 1959లో జన్మించారు. అనేక దశాబ్దాలుగా కరవుపై పోరాటం చేస్తున్నారు. గ్రామీణ సమాజాల్లో సాధికారతకు కృషిచేస్తున్నారు. సామాజిక పరంగా నీటి పరిరక్షణ, నిర్వహణకు కృషిచేసినందుకు ఆయనకు 2001లో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. స్టాక్‌హోం వాటర్ ప్రైజ్‌ను 1991లో స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పింది. ఈ అవార్డు కింద 1,50,000 డాలర్లు అందజేస్తారు.
భారతీయ అమెరికన్‌కు యూకే లిటరసీ అవార్డు
ప్రతిష్టాత్మక బ్రిటిష్ లిటరసీ అవార్డు ‘ఫోలియో ప్రైజ్’కు భారతీయ అమెరికన్ రచయిత అఖిల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘ఫ్యామిలీ లైఫ్’ నవలకుగాను ఈ అవార్డు లభించింది. లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అఖిల్ శర్మకు అవార్డుతో పాటు 40వేల పౌండ్లు(సుమారు రూ. 37 లక్షలు) చెక్‌ను ఫోలియో సొసైటీకి చెందిన జీన్ మార్క్ రాత్ అందజేశారు. ఢిల్లీలో జన్మించిన అఖిల్ శర్మ న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. తన జీవిత కథను వృత్తాంతంగా తీసుకుని రచించిన ‘ఫ్యామిలీ లైఫ్’ నవల పోటీలో నిలిచిన ఏడు నవలలను వెనక్కి తోసి అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఓ యువకుడు ఉన్నతంగా జీవించేందుకు తన కుటుంబంతో సహా చేసే ప్రయాణమే ‘ఫ్యామిలీ లైఫ్’ కథ.

భారత పరిశోధకురాలికి ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఆస్ట్రేలియాలో వైద్య రంగంలో విశేషమైన పరిశోధనలు చేస్తున్న భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. 56 ఏళ్ల మినోతీ ఆప్టే న్యూ సౌత్ వేల్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం(2015) అందుకున్నారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన సౌత్ వెస్ట్రన్ సిడ్నీ క్లినికల్ స్కూల్‌లో మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పాంక్రియాటిక్ క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవలే యూనివర్సిటీ అధ్యక్షుడు మైక్ బెయిర్డ్, ఆస్ట్రేలియా మహిళా శాఖ మంత్రి ప్రూ గోవార్డ్ నుంచి అవార్డు అందుకున్నారు. మహిళలంతా మినోతీ ఆప్టేను స్ఫూర్తిగా తీసుకొని, ఆమె అడుగుజాడలోల నడవాలని బెయిర్డ్ పిలుపునిచ్చారు. సిడ్నీలోని మరాఠీ అసోసియేషన్ కార్యకలాపాల్లోనూ మినోతీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆమె గతేడాది ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్(ఓఏఎం)ను అందుకున్నారు.
స్మృతి ఇరానీ.. యంగ్ గ్లోబల్ లీడర్ 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్ ఫ్రమ్ ఇండియా’ అవార్డుకు ఎంపికయ్యారు. నిమ్న స్థాయి నుంచి భారతదేశంలో అగ్రనాయకురాలిగా ఆమె ఎదిగిన తీరు ఆదర్శనీయమని ప్రశంసించింది. గతంలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్, అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా, యాహూ సీఈఓ మారిస్సా మేయర్, గూగుల్ చీఫ్ లారీ పేజ్, ఇటలీ ప్రధానమంత్రి మాటియో రెంజీ తదితరులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యంగ్ గ్లోబల్ లీడర్ -2015 అవార్డులకు 187 మంది నామినేట్ అయ్యారు. ఇందులో స్మృతి ఇరానీ, యువ ఎంపీ గౌరవ్ గొగోయ్ (అస్సాం) సహా పదిమంది భారతీయులకు చోటు దక్కడం విశేషం.

వీరప్ప మొయిలీకి సరస్వతీ సమ్మాన్ అవార్డు
కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన రామాయణ మహాన్వేషణనకుగాను ఈ అవార్డు దక్కింది. 2007లో తొలిసారి కన్నడ భాషలో ఈ పద్య రచన ప్రచురితమైంది. తర్వాత ఇది ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లోకి అనువాదమైంది. 1991 నుంచి కేకే. బిర్లా ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. దీని కింద ప్రశంసా పత్రంతో పాటు రూ. 10 లక్షల నగదు బహూకరిస్తారు.

 సినారెకు సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారంప్రముఖ కవి, రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం లభించింది. ప్రముఖ రచయితలకు అత్యున్నత ఫెలో పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1999లో గుంటూరు శేషేంద్రశర్మకు, 2004లో భద్రిరాజు కృష్ణమూర్తికి ఈ పురస్కారం దక్కింది.

ఆర్.శాంతకుమారికి అనువాద పురస్కారంరచయిత్రి ఆర్. శాంతకుమారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ప్రకటించింది. ఈమె ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కమార్తె. ప్రేమ్‌చంద్ (హిందీ రచయిత) ఆత్మకథను తెలుగులోకి అనువదించినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం లభించింది.

No comments:

Post a Comment