AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు ఫిబ్రవరి 2016

అవార్డులు ఫిబ్రవరి 2016
ఆస్కార్ ఉత్తమ చిత్రంగా స్పాట్‌లైట్
88వ ఆస్కార్ అవార్డులను ఫిబ్రవరి 29న లాస్‌ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు. 
ఉత్తమ చిత్రం: స్పాట్‌లైట్
ఉత్తమ నటుడు: లియోనార్డో డికాప్రియో (చిత్రం: ద రివెనంట్)
ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గొంజాల్వెజ్ ఇనార్రిటు (చిత్రం: ద రివెనంట్)
ఉత్తమ నటి: బ్రీ లార్సన్ (చిత్రం: రూమ్)
ఉత్తమ సహాయ నటి: అలీసియా వికండెర్ (చిత్రం: డానిష్ గర్ల్)
ఉత్తమ సహాయ నటుడు: మార్క్ రైలాన్స్ (చిత్రం: బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఇమ్మాన్యుయెల్ లుబెజ్కి (చిత్రం: ద రివెనంట్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఇన్‌సైడ్ అవుట్
ఉత్తమ ఒరిజనల్ స్క్రీన్‌ప్లే: స్పాట్‌లైట్
ఉత్తమ సంగీతం: ఎన్నియో మొర్రికోన్ (హేట్ పుల్ ఎయిట్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఆన్ ఆఫ్ సాల్ (నీమ్స్, హంగరీ)
ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు మూర్తిదేవి అవార్డు
ప్రముఖ సాహితీవేత్త, ఎస్వీయూ మాజీ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ జ్ఞానపీఠ్ అందించే ఈ అవార్డు.. మొదటిసారి తెలుగు సాహిత్యానికి దక్కింది. రాయలసీమలోని వారసత్వ సంపదను కాపాడుకోవటానికి సామాన్యుడు పడుతున్న తపనను మనసుకు కట్టినట్టు రచించిన ‘అనంత జీవనం’ పుస్తకానికి అవార్డు లభించింది. ఆయనకు గతంలో పద్మశ్రీ, సంగీత, నాటక అకాడెమీ అవార్డులు లభించాయి.
అవినాశ్ చందర్‌కు ఆర్యభట్ట అవార్డు
అంతరిక్ష రంగంతోపాటు వైమానిక రంగంలో చేసిన విశేష సేవలకుగాను డీఆర్‌డీవో మాజీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాశ్ చందర్ ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఫిబ్రవరి 25న జరిగిన ఏఎస్‌ఐ-ఇస్రో అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిదంబరం, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా అవినాశ్ చందర్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం లభిస్తాయి. సుప్రసిద్ధ భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరుతో 1975 ఏప్రిల్ 19న తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో కేంద్రం ఏటా ఆర్యభట్ట అవార్డును అందిస్తోంది. అలాగే హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అసోసియేట్ డెరైక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తికి రాకెట్, రాకెట్ సంబంధిత టెక్నాలజీల అభివృద్ధి అవార్డు లభించింది. రాకెట్లలోని కంప్యూటర్ల డిజైనింగ్, మిసైల్ లాంచ్ ప్రాసెస్‌ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినందుకు గాను నారాయణమూర్తికి ఈ అవార్డు అందజేశారు.

టేలర్ స్విఫ్ట్‌కు గ్రామీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
58వ గ్రామీ సంగీత అవార్డుల్లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పాప్ సంగీత గాయని టేలర్ స్విఫ్ట్ దక్కించుకున్నారు. ఆమె ఆల్బమ్ 1989కు ఈ అవార్డు లభించింది. 2014లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్‌గా 1989 నిలిచింది. ర్యాప్ గాయకుడు కెండ్రిక్ ల్యామర్ అత్యధికంగా ఐదు అవార్డులను దక్కించుకొన్నారు. ఫిబ్రవరి 15న లాస్‌ఏంజెలస్‌లో ఈ అవార్డులను ప్రధానం చేశారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలకు జియోసైన్స్ అవార్డు
జియోఫిజిక్స్‌లో చేసిన విశేష పరిశోధనలకు హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు అరుదైన అవార్డులు లభించాయి. 2014 సంవత్సరానికి డాక్టర్ సింహాచలం పదే, డాక్టర్ సందీప్‌గుప్తాలు జాతీయ జియోసైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. భూ నిర్మాణంపై నిర్వహిస్తున్న పరిశోధనకు డాక్టర్ సింహాచలాన్ని, భూకంపాలు సంభవించినప్పుడు వచ్చే శబ్దాలను గుర్తించినందుకు సందీప్ గుప్తాను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇండియా ఆస్ట్రేలియా స్టార్టజిక్ రీసెర్చ్‌లో ఇతను కీలక శాస్త్రవేత్త. 
మలయాళం సినిమాకు అంతర్జాతీయ అవార్డు
ఇప్పటికే జాతీయ అవార్డు అందుకున్న మలయాళం సినిమా ‘ఒత్తాళ్’ బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ బాలల సినిమా అవార్డును (క్రిస్టల్ బేర్ అవార్డ్) గెలుచుకుంది. జయరాజ్ రాజశేఖరన్ నాయర్ ఈ సినిమా దర్శకుడు. సుప్రసిద్ధ ర ష్యన్ రచయిత ఆంటన్ చెహోవ్ రాసిన ఓ కథానికను ఒత్తాళ్ పేరుతో ఆయన తెరకెక్కించారు. ఓ వృద్ధ జాలరి, అతని మనవడు ఎదుర్కొన్న ఆటుపోట్లే సినిమా కథాంశం.

న్యూజిలాండ్‌లో భారతీయ జంటకు అవార్డు
న్యూజిలాండ్‌లో అత్యధిక కాలం వైవాహిక జీవితం గడిపిన దంపతులుగా భారతీయ జంట అవార్డు దక్కించుకుంది. ఫ్యామిలీ ఫస్ట్ సంస్థ వీరిని సన్మానించింది. అక్లాండ్‌కు చెందిన జెరమ్ రావ్‌జీ, గంగా రావ్‌జీల వయసు ప్రస్తుతం 99 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులోనే వీరికి నిశ్చితార్థం కాగా, 19వ ఏట వివాహం చేసుకున్నారు. ఈ జంట మరో 2 నెలల్లో 81వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. వీరిద్దరు 2016 మే, జూన్ నెలల్లో వందో ఏట అడుగుపెడుతున్నారు.
రచయిత్రి ఓల్గాకు సాహిత్య అవార్డు ప్రదానం
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలుగు రచయిత్రి ఓల్గా అందుకున్నారు. ‘విముక్త’ నవలకు గాను ఆమెకు ఈ అవార్డును గత డిసెంబరులో ప్రకటించారు. సాహిత్య అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని ఫిక్కీ ఆడిటోరియంలో నిర్వహించారు. 24 భారతీయ భాష రచయితలకు ఈ అవార్డులు అందజేశారు.

థాయ్ యువరాణికి తొలి ‘ప్రపంచ సంస్కృతం అవార్డు’
మొట్టమొదటి ప్రపంచ సంస్కృతం అవార్డుకు థాయ్‌లాండ్ యువరాణి, సంస్కృత భాషాకోవిదురాలు మహాచక్రీ సిరింధోర్న్‌ను భారత్ ఎంపిక చేసింది. ఈ మేరకు అవార్డు అందుకోవాల్సిందిగా భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఫిబ్రవరి 5న ఆమెను కలసి ఆహ్వానించారు. 2015లో బ్యాంకాక్‌లో అంతర్జాతీయ సంస్కృతం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని సుమారు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సును థాయ్‌లాండ్ విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఆ దేశ యువరాణికి అందజేయనున్నారు.

జేకే రౌలింగ్‌కు పెన్ అవార్డు
హ్యారీ పోర్టర్ రచయిత్రి జేకే రౌలింగ్ పెన్/అలెన్ ఫౌండేషన్ లిటరరీ సర్వీస్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూయార్క్‌లో మే 16న జరిగే లిటరరీ అండ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ సమావేశంలో ఆమెకు అవార్డును అందజేయనున్నారు. గతంలో ఈ అవార్డును టోని మోరిసన్, సల్మాన్ రష్దీ, టిమ్ స్టాపర్డ్‌లు అందుకొన్నారు.

నితీశ్ కుమార్‌కు సోషల్ జస్టిస్ అవార్డు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘కే వీరమణి సోషల్ జస్టిస్ అవార్డు’కు ఎంపికయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పెరియార్ ఇంటర్నేషనల్... పెరియార్ ఈవీ రామస్వామి పేరిట ఈ అవార్డును అందజేస్తుంది. గతంలో కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు, దివంగత ప్రధాని వీపీసింగ్, కరుణానిధి, ఛగన్ భుజ్‌బల్, సీతారాం కేసరి తదితర ప్రముఖులు ఈ అవార్డు అందుకున్నారు.

No comments:

Post a Comment