AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు అక్టోబరు 2016

అవార్డులు అక్టోబరు 2016
పాల్ బెయిటీ కి ‘బుకర్’ ప్రైజ్
ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మాన్ బుకర్ ప్రైజ్‌ను అమెరికాకు చెందిన పాల్ బెయిటీ గెలుచుకున్నాడు. తద్వారా బుకర్ బహుమతి పొందిన తొలి అమెరికన్‌గా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని జాతి వివక్ష రాజకీయాల నేపథ్యంగా బెయిటీ రచించిన ‘ది సెల్‌అవుట్’ నవల 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపికైంది. బహుమతి కింద యాభైవేల పౌండ్ల నగదు అందచేస్తారు.సంప్రదాయబద్ధంగా కామన్వెల్త్ దేశాల రచయితలకు మాత్రమే మ్యాన్ బుకర్ బహుమతిని ప్రదానం చేసేవారు. అయితే 2013లో ఈ సంప్రదాయాన్ని మార్చి ఇంగ్లిష్ మాట్లాడే దేశాల రచయితలకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 
ఐఎస్ బాధిత మహిళలకు సర్కోజీ మానవ హక్కుల పురస్కారం
ప్రతిష్టాత్మక సర్కోజీ మానవ హక్కుల పురస్కారం-2016 యాజీదీ మహిళలకు లభించింది. ఇస్లామిక్ స్టేట్ జీహాదీల బారి నుంచి బయటపడిన నదియా మురద్, లామియా హాజి బషర్‌లకు ఈ అవార్డు దక్కింది. ఒక ప్రాచీన మతాన్ని ఆచరించే వారిని యాజీదీలు అంటారు. యూరోపియన్ పార్లమెంట్ ఏటా సర్కోజీ బహుమతిని అందిస్తోంది.
ఇండియన్ పనోరమాకు ‘బాహుబలి’
గోవాలో నవంబర్ 20 నుంచి జరిగే 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం(ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ప్రదర్శనకుగాను ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి ‘బాహుబలి’ విజేతగా నిలిచింది. వివిధ భాషల్లో మొత్తం 230 నామినేషన్లు రాగా 22 సినిమాలు ఎంపికయ్యాయి. 63వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైనందున బాహుబలి చిత్రానికి నిబంధనల ప్రకారం పనోరమా-2016 లో కూడా చోటు కల్పించారు. హిందీ నుంచి బాజీరావు మస్తానీ, ఎయిర్ లిఫ్ట్, సుల్తాన్ చిత్రాలు ఎంపికయ్యాయి.
నిహాల్‌సింగ్‌కు రాజారామ్మోహన్ అవార్డు
పాత్రికేయ రంగంలో చేసిన కృషికిగాను సీనియర్ జర్నలిస్టు ఎస్.నిహాల్‌సింగ్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) రాజారామ్మోహన్ రాయ్ అవార్డును ప్రకటించింది. అవార్డు కింద రూ. లక్ష నగదును అందిస్తారు. దీపికా డైలీ పాత్రికేయుడు రంజిత్ జాన్‌కు ‘గ్రామీణ పాత్రికేయం, అభివృది’్ధ రిపోర్టింగ్‌లో అవార్డు దక్కింది.

శాంతినారాయణకు కామిశెట్టి పురస్కారం
అనంతపురం జిల్లా కథా సాహిత్యాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసిన డాక్టర్ శాంతినారాయణకు2016 సంవత్సరానికిగాను కామిశెట్టి సాహిత్య పురస్కారం దక్కింది. 80 కథా సంపుటాలు పరిశీలించి శాంతినారాయణ రచించిన ‘కొండు చిలువ’ను ఎంపిక చేసినట్లు కామిశెట్టి సాహిత్య పీఠం కన్వీనర్ విజయ రాంబాబు తెలిపారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని కామిశెట్టి సాహిత్య పీఠం ఏటా ఈ అవార్డుని అందిస్తుంది. అవార్డు కింద రూ.10,116 నగదు బహుమతి అందచేస్తారు.

బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్
అమెరికా జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్ (75) ను 2016 నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. సాహిత్యం విభాగంలో సంగీతకారుడు లేదా గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ఈ పాటలకు డిలన్‌కు 2008లో పులిట్జర్ ప్రైజ్ కూడా దక్కింది. ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి ఆల్బమ్స్‌తో డిలన్ ప్రసిద్ధి చెందారు. నోబెల్ సాహిత్య పురస్కారంను సాధారణంగా కవిత్వం, కథ, నవల, నాటకం వంటి వాటికి ప్రదానం చేస్తారు.
తూర్పుగోదావరి విద్యార్థినికి ఇగ్నైట్ అవార్డు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం జీజీ హైస్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎం.దేవి నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ వారి ఇగ్నైట్-2016 అవార్డుకు ఎంపికైంది. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రకటించే ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 458 జిల్లాల నుంచి 55,089 ప్రతిపాదనలు రాగా అందులో 28 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వంట పాత్ర శుభ్రతను సూచించే పరికరానికి సంబంధించిన ఆవిష్కరణకుగానూ ఎం.దేవికి ఈ అవార్డు లభించింది.
ఆనంద శంకర్‌కు విశ్వకళా భారతి పురస్కారం
లలిత కళలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ‘విశ్వకళా భారతి’ పురస్కారానికి 2016కు గానూ ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ ఎంపికయ్యారు. ఈ అవార్డును చెన్నైకు చెందిన ప్రముఖ కళా సంస్థ భారత్ కళాచార్ అందిస్తుంది. తమిళనాడులో జన్మించిన ఆమె ఇండియన్ రైల్వే ట్రాఫిక్స్ సర్వీస్‌లో బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

కొలంబియా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి
2016 నోబెల్ శాంతి పురస్కారానికి కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ ఎంపికయ్యారు. దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. శాంటోస్ నాలుగేళ్లుగా తిరుగుబాటు దళం రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(FARC) చీఫ్ రోడ్రిగో లండనోతో చర్చలు జరుపుతున్నారు. 2016 సెప్టెంబర్ 26న వీరి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే అక్టోబర్ 2న నిర్వహించిన రెఫరెండంలో ప్రజలు ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం వల్ల 2,60,000 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది గల్లంతయ్యారు. వామపక్ష గెరిల్లా గ్రూపులు, రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు, డ్రగ్ ముఠాల మధ్య దాడులతో దేశం అల్లకల్లోలంగా మారింది. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

కానాస్ వర్సిటీ(యూఎస్), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఉన్నతవిద్యను అభ్యసించిన శాంటోస్ రాజకీయాల్లోకి రాగానే కొలంబియా తొలి వాణిజ్య మంత్రి అయ్యారు. కొంత కాలానికి రక్షణ శాఖ బాధ్యత తీసుకున్నారు. ఆ సమయంలో ఫార్క్ రెబల్స్‌పై కఠినంగా వ్యవహరించారు. అయితే 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తన వ్యూహాన్ని మార్చి ఫార్క్ దళంతో శాంతి చర్చల కోసం ప్రయత్నించారు.
‘మాలిక్యులర్ మెషీన్స్’ కు కెమిస్ట్రీ నోబెల్
అణువుల స్థాయిలో పనిచేసే యంత్రాల (మాలిక్యులర్ మెషీన్స్)ను అభివృద్ధి చేసినందుకు జీన్ పియర్ సావేజ్(ఫ్రాన్స్), జె ఫ్రేజర్ స్టోడార్ట్(బ్రిటన్), బెర్నాండ్ ఫెరింగా(నెదర్లాండ్స్) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు 2016 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఈ పరిశోధనలో వీరు అత్యంత సూక్ష్మమైన మోటార్లను రూపొందించి, విజయవంతంగా నియంత్రించగలిగారు. బహుమతి కింద లభించే రూ.6.19 కోట్ల (8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల)ను డిసెంబర్ 10న అందుకుంటారు.మాలిక్యులర్ మెషీన్స్ అంటే?అణువుల స్థాయిలో అత్యంత సూక్ష్మంగా రూపొందించినవే మాలిక్యులర్ మెషీన్స్(అణు యంత్రాలు). వీటికి శక్తిని అందిస్తే మోటార్ల తరహాలో తిరిగి తమకన్నా ఎన్నో రెట్లు పెద్దవైన వాటినీ కదిలిస్తాయి. సూక్ష్మమైన రోబోట్లను రూపొందించడానికి, కృత్రిమ అవయవాల రూపకల్పనకు కూడా ఈ మాలిక్యులర్ మెషీన్స్ ఉపయోగపడతాయి.
ఓలివర్, హోమ్‌స్ట్రామ్‌కు ఆర్థిక నోబెల్
‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్‌లాండ్)లు 2016 ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత వేతనం, ఇన్సెంటివ్‌లు, బీమాలో మినహాయింపులు, పాలసీదారుల క్లెయిమ్‌లు, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల ప్రైవేటీకరణ, ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలను సమగ్రంగా విశ్లేషించి వీరు కాంట్రాక్ట్ థియరీని అభివృద్ధి చేశారు. వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఇది సహాయపడుతుంది. నోబెల్ అవార్డు కింద ఇచ్చే సుమారు రూ.6.14 కోట్ల (924 వేల డాలర్లు) నగదు బహుమతిని డిసెంబర్ 10న వీరు సంయుక్తంగా అందుకోనున్నారు.

1948లో జన్మించిన హార్ట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. హోమ్‌స్ట్రామ్ (67) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం, మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్.
జస్టిస్ ఎంఎన్ రావుకు రాజీవ్ సద్భావన అవార్డు
రాజీవ్ సద్భావన అవార్డు-2016కు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ రావు ఎంపికయ్యారు. ఆయనకు ఈ నెల 19న చార్మినార్ వద్ద జరిగే 26వ సద్భావన యాత్ర స్మారక సమావేశంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. జస్టిస్ ఎంఎన్ రావు లెక్చరర్‌గా, జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పలు హోదాల్లో పనిచేశారు.
భారత స్వచ్ఛంద సంస్థకు ఐరాస వాతావరణ అవార్డు
భారత్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ.. స్వయం శిక్షణ్ ప్రయోగ్‌కు 2016 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి వాతావరణ అవార్డు లభించింది. ఈ సంస్థ మహారాష్ట్ర, బిహార్‌లలో మహిళలను స్వచ్ఛమైన ఇంధన వినియోగదారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తుంది. క్లీన్ ఎనర్జీ, నీరు, శానిటేషన్ ఉత్పత్తుల అందుబాటుకు, సమాజంలో ఇతర సేవలకు 1100 మంది మహిళా ఔత్సాహికులను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. సంస్థ వ్యవస్థాపకురాలు ప్రేమ గోపాలన్ క్లీన్ ఎనర్జీ రంగంలో పదేళ్లుగా కృషి చేస్తున్నారు. నవంబర్‌లో మొరాకోలో జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో అవార్డును అందజేస్తారు.

జపాన్ శాస్త్రవేత్తకు వైద్యశాస్త్రంలో నోబెల్
 
కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ (ఆటోఫేజీ) గురించి చేసిన అధ్యయనానికి గాను జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ(71) వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. కణాల ఆత్మహత్యగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్ల వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్‌సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒషుమీ టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో 2016 నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు. తాజాగా ఒషుమీ గెలుచుకున్న నోబెల్ జపాన్‌కి 23వ నోబెల్. వైద్య రంగంలో 6వది.

ఆటోఫేజీ అంటే?మానవ శరీర కణాలు తమ లోపలి భాగాలు పాడైతే వాటిని కణంలోనే ఉండే లైసోసోమ్ అనే రీసైక్లింగ్ విభాగానికి పంపి నాశనం చేస్తాయి. దీనినే ‘ఆటోఫేజీ’(ఆటో-స్వయంగా, ఫేజియన్-తినేయడం) అంటారు. ఆటోఫేజీ గురించి 1950ల్లోనే శాస్త్రవేత్తలకు తెలిసినప్పటికీ దీనికి కారణమయ్యే జన్యువులు ఏమిటి?, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? అనే విషయాలు మాత్రం ఒషుమీ 1990లలో చేసిన ప్రయోగాల వల్ల అర్థమయ్యాయి.

ముగ్గురు బ్రిటిషర్లకు 2016 ఫిజిక్స్ నోబెల్పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసినందుకుగాను ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్‌లకు సంయుక్తంగా భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది. గణిత శాస్త్ర ప్రత్యేక విభాగమైన టోపాలజీలో పరిశోధన చేసి, మన చుట్టూ ఉండే పదార్థం మనకు తెలియని అసాధారణ స్థితిగతులను కలిగి ఉంటుందన్న రహస్యాన్ని ఛేదించినందుకు ఈ అవార్డు దక్కింది. థౌలెస్ వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో, హాల్డెన్, కోస్టార్లిట్జ్ బ్రౌన్ వర్సిటీలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. అవార్డు కింద రూ.6.18 కోట్లు (8 మిలియన్ల స్వీడన్ క్రోనార్లు) బహుమతిగా అందుకోనున్నారు.

టోపాలజీ..అంతరిక్షం, పదార్థాల భౌతిక ధర్మాలు, బహిర్గత ఒత్తిడికి గురై ఆకారంలో మార్పులు జరిగి పూర్వ స్థితికి చేరుకునే లక్షణం వంటి అంశాలపై చేసే అధ్యయనమే టోపాలజీ. ఈ తరహా ఒత్తిడికి గురి చేసిప్పుడు, (లేదా శక్తిని ప్రయోగించినప్పుడు) ఆ పదార్థం స్థితిగతుల్లో వచ్చే అసాధారణ మార్పులను వారు సిద్ధాంతపరంగా నిరూపించారు. ఉదాహరణకు రబ్బరు గ్లాసును వంచడం, మెలితిప్పడం, డోనట్ ఆకృతిలోకి (గుండ్రంగా ఉండి మధ్యలో రంధ్రం ఉండేలా) మార్చడం వంటివి. టోపాలజీ తొలుత ఉన్న రబ్బరు గ్లాసు ఆకృతికి, మార్చిన ఆకృతికి మధ్య భేదంను కాకుండా అందులోని పదార్థ అసాధారణ స్థితిగతులు, మార్పుల దశలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.

భారత సంతతి బాలికకు గూగుల్ ఉపకారవేతనంభారత సంతతికి చెందిన కియారా నిర్ఘిన్ అనే 16 ఏళ్ల దక్షిణాఫ్రికా విద్యార్థిని గూగుల్ సైన్స్ సదస్సులో రూ.33 లక్షల ఉపకార వేతనాన్ని గెలుపొందింది. కరువును తరిమికొట్టి, పంటలకు తగినంత నీరందించేందుకు ఉపయోగపడే శోషక పదార్థాన్ని రూపొందించినందుకు ఆమెకు ఈ బహుమతి లభించింది. కియారా నారింజ పండు తొక్కను వాడి ఈ పదార్థాన్ని రూపొందించింది. వర్షం పడినపుడు మట్టి నీటిని పట్టి ఉంచడంలో ఇది సాయపడుతుంది.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను శాస్త్ర సాంకేతికతల సాయంతో ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై ప్రతి ఏడాది 13 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల మధ్య గూగుల్ ఈ పోటీని నిర్వహిస్తుంది.

పద్మజారెడ్డికి సంగీత నాటక అకాడమీ అవార్డుప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డి 2015కి గానూ సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 45 ఏళ్లుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలో విశేష ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుతో సత్కరించింది. అక్టోబర్ 4న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈమె సేవలను గుర్తించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

యూఆర్ రావుకు ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుఇస్రో మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఉడుపి రామచంద్ర రావుకు ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్-2016లో చోటు కల్పించినట్లు అంతర్జాతీయ వ్యోమగామి సమాఖ్య ప్రకటించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో దేశం, ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్ 30 న మెక్సికోలోని గౌడ్లజరాలో నిర్వహించిన అంతర్జాతీయ వ్యోమగామి సదస్సు 2016లో దీనిని ప్రకటించారు. 2013 లో వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ఉపగ్రహ నిపుణుల సమాఖ్య కూడా శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రావుకు స్థానం కల్పించింది. సహజ వనరులను రిమోట్ సెన్సింగ్ సమాచారం ద్వారా తెలుసుకునే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

No comments:

Post a Comment