AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు మే 2015

అవార్డులు మే 2015
కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ధీపన్
68వ కేన్స్ చిత్రోత్సవ అవార్డులు కేన్స్ (ఫ్రాన్స్)లో మే 24న ప్రదానం చేశారు. శ్రీలంక అంతర్యుద్ధం ఆధారంగా తీసిన ధీపన్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఉత్తమ చిత్రానికిచ్చే ఫామ్ డి ఓర్ అవార్డు: ధీపన్ (దర్శకత్వం-జాక్వస్ అడియార్డ్); ద్వితీయ చిత్రానికిచ్చే గ్రాండ్ ప్రి అవార్డు: సన్ ఆఫ్ సౌల్ (దర్శకత్వం- లాస్‌జ్లో నీమ్స్); జ్యూరీ ప్రైజ్: ది లోబ్‌స్టర్ (దర్శకత్వం- యోర్గోస్ లాంథిమోస్); ఉత్తమ దర్శకుడు: హో హైసో హసీన్(ద అస్సాసిన్); ఉత్తమ నటుడు: విన్సెంట్ లిండన్ (ద మెజర్ ఆఫ్ మాన్); ఉత్తమ నటి (సంయుక్తంగా): రూనీ మారా (కరోల్); ఇమ్మాన్యుయెల్లే బెర్కోట్ (మోన్ రోయ్); ఉత్తమ లఘుచిత్రం: వేవ్స్ 98 (దర్శకత్వం - ఇలే డాగర్)


శ్రీనివాసాచార్యులకు దాశరథి అవార్డు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రదానం చేస్తున్న దాశరథి కృష్ణమాచార్యుల అవార్డుకు ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్యులు ఎంపికయ్యారు. కరీంనగర్‌కు చెందిన ఈయన అనేక పుస్తకాలు రచించారు. ఈ అవార్డును జూలై 22న దాశరథి జయంతి రోజున అందజేస్తారు.
హంగేరీ రచయితకు మాన్ బుకర్ ప్రైజ్
హంగేరీ రచయిత లాస్‌జ్లో కసజ్నాహోర్కాయ్(61)కు 2015 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లభించింది. ఈ అవార్డును లండన్‌లో మే 20న ఆయనకు ప్రదానం చేశారు. జీవించి ఉన్న ఏ దేశ రచయిత అయినా ఆంగ్లంలో లేదంటే, ఆంగ్లంలోకి అనువదించిన కాల్పనిక ప్రచురణలకు ఈ బహుమతి అందజేస్తారు.
ఆరోగ్యశ్రీకి గోవా సర్కారు పురస్కారం
 పేద వర్గాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి వన్నె తగ్గడం లేదు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టును తాజాగా గోవా సర్కారు పురస్కారం వరించింది. గోవాలో ముగిసిన ‘ఎలెట్స్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్-2015’ సదస్సులో ఆరోగ్యశ్రీకి గుర్తింపు ధ్రువపత్రాన్ని అందజేశారు. గోవా ప్రభుత్వ సమాచారశాఖ, ఎలెట్స్ టెక్నోమీడియా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలకోసం విజయవంతంగా ఆరోగ్యశ్రీని నడుపుతున్నందుకు ఈ అవార్డు దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ ఆదర్శవంతమైందని వక్తలు కితాబిచ్చారు. రోగులకు సురక్షిత వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాపడ్డారు. టెలీమెడిసిన్‌ను మరింత విస్త్రృతపరచాలని సూచించారు. 
మసాన్’కు కేన్‌లో అవార్డు
వర్ధమాన దర్శకుడు నీరజ్ ఘేవంశ్ తీసిన బాలీవుడ్ చిత్రం ‘మసాన్’కు కేన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. నలుగురు కాశీ వాసుల జీవితాల చుట్టు తిరిగే ఈ చిత్రానికి అంతర్జాతీయ చిత్ర విమర్శకుల సమాఖ్య అవార్డు దక్కింది. రిచా చద్ధా కీలకపాత్ర పోషించిన మసాన్‌ను మే 23న కేన్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన కనిపించింది. తమ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చద్ధా ఆదివారం ట్వీట్ చేశారు. మసాన్‌లో శ్వేతా త్రిపాఠీ, సంజయ్ మిశ్రా, వికీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. మసాన్‌కు అవార్డు దక్కడంపై అర్జున్ కపూర్, నిమ్రత్ కౌర్, కల్కీ కోచ్లిన్ వంటి తారలు కూడా ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా హర్షం ప్రకటించారు.

అమెరికా నేషనల్ జియోగ్రఫిక్ బీ విజేతగా కరణ్ మీనన్
భారత సంతతికి చెందిన కరణ్ మీనన్ అమెరికాలో నిర్వహించిన నేషనల్ జియోగ్రఫిక్ బీ పోటీలో విజేతగా నిలిచాడు. వాషింగ్టన్‌లో మే 12న ముగిసిన పోటీలో అమెరికాలోని 11వేల పాఠశాలల నుంచి 40 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. న్యూజెర్సీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కరణ్ మీన న్ (14) ప్రథమ స్థానంలో నిలవగా, మరో భారత సంతతి విద్యార్థిని శ్రేయ యార్లగడ్డకు ద్వితీయ స్థానం దక్కింది. విజేత కరణ్‌మీనన్‌కు 85వేల డాలర్ల స్కాలర్ షిప్, నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీలో జీవిత కాల సభ్యత్వం లభించగా, రెండో స్థానంలో నిలిచిన శ్రేయ 25వేల డాలర్ల స్కాలర్‌షిప్ అందుకుంది. 
నీల్ ముఖర్జీకి బ్రిటన్ ఎన్‌కోర్ సాహిత్య అవార్డు 
ప్రముఖ రచయిత నీల్ ముఖర్జీకి బ్రిటన్‌కు చెందిన ఎన్‌కోర్ సాహిత్య అవార్డు లభించింది. ఆయన రాసిన ద లైవ్స్ ఆఫ్ అదర్స్ నవలకు ఈ బహుమతి దక్కింది. రచయిత రెండో నవలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. పురస్కారం కింద రూ. 10 లక్షల నగదు బహూకరిస్తారు. కోల్‌కతాలో జన్మించిన ముఖర్జీ మొదటి నవల ఎ లైఫ్ అపార్ట్.

విజయవాడ యువకుడికి గ్లోబల్ లీడర్ అవార్డు
విజయవాడకు చెందిన చెరుకూరి తరుణ్ ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఎమర్జింగ్ గ్లోజల్ లీడర్-2015’ అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికాలోని మాసాచూసెట్స్‌లోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ పూర్వ విద్యార్థుల మండలి ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తుంది. తరుణ్ 2011-13లో హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. ఆ సమయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్, జపాన్ స్కాలర్‌షిప్‌లను అందుకున్నారు. హార్వర్డ్‌లో బెస్ట్ అవుట్‌గోయింగ్ విద్యార్థిగా బంగారు పతకం అందుకున్నారు. తరువాత భారతదేశంలో ఇండస్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఏకలవ్య పేరుతో ‘విద్యా హక్కు చట్టం’ అమలయ్యేలా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి తరుణ్‌కు 2015 గ్లోబల్ లీడర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న తరుణ్ ఈ అవార్డును అమెరికాలోని మాసాచుసెట్స్‌లో అందుకోనున్నారు. 

నాగేంద్రమణికి నేషనల్ నైటింగేల్ అవార్డునేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఫ్ ఇండియా-2015 అవార్డు మాకరాజు ఉమానాగేంద్రమణికి రాష్ట్రపతి మే 12న ప్రదానం చేశారు. నర్సింగ్ రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డు బహూకరిస్తారు. నాగేంద్రమణి దక్షిణ మధ్య రైల్వేలకు చెందిన చిలకలగూడ హెల్త్ యూనిట్ చీఫ్ మాట్రన్‌గా పనిచేస్తున్నారు.

ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లే హెబ్డోకు పెన్ అవార్డుఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లే హెబ్డోకు పెన్ అమెరికన్ సెంటర్ అవార్డును మే 5న న్యూయార్క్‌లో ప్రదానం చేశారు. ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్ కరేజ్ అవార్డును హెబ్డో పత్రిక చీఫ్ ఎడిటర్ గెరార్డ్ బివార్డ్ స్వీకరించారు.

భారత సంతతి ప్రొఫెసర్‌కు అమెరికా అవార్డుఉత్తమ బోధనకుగాను భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ శివనాదన్ మంజినీకి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కాలిఫోర్నియా అవార్డు వరించింది. ఆయన అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రతి క్యాంపస్ నుంచి ఒక్కో ప్రొఫెసర్‌ను ప్రతియేడూ ఎంపిక చేస్తారు. ఈ అవార్డు కింద మంజినీకి 12,500 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందనుంది.

No comments:

Post a Comment