AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు మే 2016

అవార్డులు మే 2016
దోహా బ్యాంక్ సీఈవోకు గ్రీన్ ఎకానమీ అవార్డు
రెండు దశాబ్దాలుగా పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేస్తున్న దోహా బ్యాంక్ సీఈవో, భారత సంతతి వ్యక్తి ఆర్. సీతారామన్‌కు 2016 సంవత్సరానికి గాను ‘గ్రీన్ ఎకానమీ విజనరీ’ అవార్డు దక్కింది. రోమ్‌లో మే 31న యూనియన్ ఆఫ్ అరబ్ బ్యాంక్స్ చైర్మన్ మహమ్మద్ జరాహ్ అల్ సబా చేతుల మీదుగా సీతారామన్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేయడంతోపాటు వాటిపై ఇతరుల్లో అవగాహన కల్పించేందుకు చేసిన కృషికిగాను సీతారామన్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు జరాహ్ తెలిపారు. 1978 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్న దోహా బ్యాంకుకు సీఈవోగా వ్యవహరిస్తున్న సీతారామన్‌ను పలు సంస్థలు గౌవర డాక్టరేట్‌లు అందజేశాయి.

ప్రొఫెసర్ హంచినాల్‌కు స్వామినాథన్ అవార్డు
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (ఢిల్లీ) చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్.ఆర్.హంచినాల్, ఎం.ఎస్.స్వామినాథన్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. వ్యవసాయ, ఆహార పరిశోధనల్లో విశిష్టమైన కృషి చేసిన శాస్త్రవేత్తలకు 2005 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డు అందిస్తున్నారు. కర్ణాటకకు చెందిన హంచినా వ్యవసాయ, ఆహార రంగాల్లో విశిష్ట కృషి చేశారు. భారీ సంఖ్యలో కొత్త వంగడాలను సృష్టించారు. నవంబర్‌లో అవార్డు ప్రదానం జరుగుతుంది.
ఎన్జీవో ‘మ్యాజిక్ బస్’కు ఏషియన్ చారిటీ అవార్డు
ముంబై కేంద్రంగా ఏర్పాటు చేసిన ‘మ్యాజిక్ బస్’ స్వచ్ఛంద సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సంస్థ భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో 3,60,000 మంది పిల్లలకు, 8,500 మంది యువతకు విద్యను అందించడంతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తోంది. ఈ సేవలకు గుర్తింపుగా ‘ఏషియన్ వాయిస్ చారిటీ-2016’ అవార్డును అందజేశారు. కేవలం భారత్‌లోనే కాకుండా యూకేలోనూ తన కార్యకలాపాలను ప్రారంభించిన ‘మ్యాజిక్ బస్’ను ప్రోత్సహించేందుకే ఈ అవార్డును అందజేస్తున్నట్లు ఏషియన్ వాయిస్ సంస్థ వెల్లడించింది.

ఇస్రో మాజీ చైర్మన్ యు.ఆర్.రావుకు ఐఏఎఫ్ అవార్డు 
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు- 2016కు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యు.రామచంద్రరావు ఎంపిక య్యారు. ఖగోళశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ ఐఏఎఫ్ అవార్డుకు ఎంపిక చేసింది.
‘యూఎన్ పోస్టర్’ పోటీలో భారత చిత్రకారిణికి బహుమతి
భారత సంతతికి చెందిన చిత్రకారిణి అంజలి చంద్రశేఖర్ ‘యూఎన్ పోస్టర్’ పోటీ శాంతి విభాగంలో మూడో బహుమతిని గెలుచుకున్నారు. న్యూయార్క్‌కి చెందిన అంజలి చంద్రశేఖర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ చేతుల మీదుగా మే 14న ఈ బహుమతి అందుకున్నారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని ఆపాలన్న అంశాన్ని అంజలి తన పోస్టర్‌లో చిత్రీకరించారు. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్న సందేశాన్ని పోస్టర్ ద్వారా వ్యక్తపరిచారు. ఈ పోటీలో మొదటి బహుమతి పెరూకి చెందిన 38 ఏళ్ల ఇవాన్ క్రియోని వరించింది. రెండో బహుమతి 15 ఏళ్ల మిచెల్ లీ సొంతం చేసుకుంది. 
జిలానీ బానోకు ‘ఎన్టీఆర్ సాహితీ’ పురస్కారం
నందమూరి తారక రామారావు విజ్ఞాన ట్రస్ట్ ఏటా ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఉర్దూ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ కవయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్‌కు చెందిన జిలానీ బానో పేరును ఎంపిక చేశారు. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించి అప్పటి నుంచి నిరాఘాటంగా ఎన్టీఆర్ పేరుతో జాతీయ స్థాయి అవార్డును అందజేస్తున్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు ఇస్తారు. ఇప్పటికే తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో పేరు గడించిన తొమ్మిది మంది రచయితలకు అవార్డులు అందజేశారు.
ఐదుగురు భారతీయులకు ప్రపంచ శాంతి అవార్డు
ప్రపంచ శాంతికి కృషి చేసి వీర మరణం పొందిన వారికి ప్రతి ఏటా ఇచ్చే ‘డ్యాగ్ హామార్స్క్‌జోల్డ్ అవార్డు 2015’ ఐదుగురు భారతీయులతో పాటు 124 మందిని వరించింది. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి రక్షకుల దినోత్సవం రోజున వీరికి ఐక్యరాజ్య సమితి అవార్డులను బహూకరించనుంది. ప్రతి ఏటా మే 29న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి రక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ఈ అవార్డులను వీరి తరఫువారికి 2015, మే 19న అందజేస్తారు. అవార్డు పొందిన వారిలో హెడ్‌కానిస్టేబుల్ శుభకరణ్ యాదవ్, రైఫిల్‌మన్ మనీష్ మాలిక్, హవిల్దార్ అమల్ దేకా, నాయక్ రాకేష్ కుమార్, గగన్ పంజాబీ ఉన్నారు.
తెలుగు విద్యార్థినికి యూరోపియన్ అవార్డు
యూరోపియన్ మెటీరియల్ రీసెర్చ్ సొసైటీ-2016 యువ శాస్త్రవేత్త అవార్డు తెలుగు విద్యార్థిని నందిని భండారుని వరించింది. ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో పీహెచ్‌డీ చేస్తున ్న నందిని మెటీరియల్ సైన్స్, నానో టెక్నాలజీలో చేసిన కృషికిగానూ ఈ అవార్డు లభించినట్లు వర్సిటీ మే 16న ఒక ప్రకటనలో తెలిపింది. నందిని సూక్ష్మ ఆకారంలో ఉండే వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడే నానో ఫాబ్రికేషన్, నానో పాటర్నింగ్ మొదలగు అంశాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఆవిష్కరణల వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే ‘మదర్ బోర్డు’ల పరిమాణం తగ్గడంతో పాటు తక్కువ ఖర్చుకే లభించే అవకాశం ఉంది. 
భారతీయ అమెరికన్ బాలునికి ఇంటెల్ అవార్డు
శ్యామంతక్ పాయ్‌రా అనే 15 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలునికి ప్రతిష్ఠాత్మక ‘ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు’ పురస్కారం లభించింది. విద్యుత్తు సాయంతో పనిచేసే మోకాలి తొడుగు (నీ బ్రేస్)ను తక్కువ ఖర్చుతో తయారుచేసినందుకు ఈ అవార్డు దక్కింది. మరోవైపు, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ట్యూమర్ బయోలజీ బోధిస్తున్న భారత అమెరికన్ ప్రొఫెసర్ రాకేశ్ జైన్‌కు ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ అనే అవార్డును అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
‘ది వెజిటేరియన్’కు మాన్ బుకర్ పురస్కారం
‘ది వెజిటేరియన్’ పుస్తక రచయిత్రి హాన్ కాంగ్ ప్రతిష్టాత్మక ‘మాన్ బుకర్-2016 అవార్డు’ను గెలుచుకున్నారు. అవార్డుతోపాటు 50 వేల పౌండ్ల నగదు బహుమతిని మే 16న అందుకున్నారు. దక్షిణ కొరియాకు చెందిన 45 ఏళ్ల ఈ మహిళా రచయిత్రి ‘మహిళల వ్యక్తిత్వం, మాంసాహారాన్ని త్యజించడం’ అనే కథాంశంతో ఈ పుస్తకాన్ని రచించారు. కొరియన్ భాషలోని ఈ పుస్తకాన్ని 28 ఏళ్ల స్మిత్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. మొత్తం 155 పుస్తకాలు పోటీలో నిలవగా ఐదు మంది సభ్యులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం ‘ది విజిటేరియన్’ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. బోయ్డ్ టోన్కిన్ ఈ బృందానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

మహేంద్రదేవ్‌కు మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఉపకులపతి సూర్యదేవర మహేంద్రదేవ్‌కు 2016కి మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
సతీశ్‌రెడ్డికి ఎస్వీయూ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
డీఆర్‌డీవో శాస్త్రవేత్త, కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు జి.సతీశ్‌రెడ్డికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఎస్వీయూ వీసీ దామోదరం మే 7న తిరుపతిలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. డిఫెన్స్ రీసెర్చ్ సంస్థలో సతీశ్‌రెడ్డి చేసిన విలువైన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
ఎన్‌కే సింగ్‌కు జపాన్ అత్యున్నత పురస్కారం
భారత్-జపాన్ మధ్య వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడుల పెంపు కోసం విశేష కృషి చేసినందుకుగాను మాజీ అధికారి, రాజకీయ నాయకుడు ఎన్‌కే సింగ్‌కు జపాన్ తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం అందజేసింది.టోక్యోలో మే 10న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక ‘ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్, అండ్ సిల్వర్ స్టార్’ పురస్కారాన్ని సింగ్ జపాన్ ప్రధాని షింజో అబే చేతుల మీదుగా స్వీకరించారు. సింగ్ కృషి ఫలితంగా ఎన్నో జపాన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులను పెట్టాయని ప్రశంసాపత్రంలో జపాన్ పేర్కొంది. ఇటీవలి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సింగ్, గతంలో రెవెన్యూ కార్యదర్శిగా, ప్రణాళికసంఘం సభ్యుడిగానూ పనిచేశారు.

ఎన్‌కే సింగ్‌కు జపాన్ అవార్డు
 మాజీ ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుడు ఎన్‌కే సింగ్ జపాన్ ప్రభుత్వం అందజేసే ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కొనసాగడానికి చేసిన కృషికి గుర్తింపుగా సింగ్‌ను ‘ది ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు జపాన్ ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే చేతుల మీదుగా మే 10వ తేదీని సింగ్ ఈ అవార్డును అందుకుంటారు. జపాన్ రాజధాని టోక్యోలోగల ఇంపీరియల్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. జపాన్, ఇండియా మధ్య కుదిరిన మారుతి-సుజుకి వంటి అనేక అటోమొబైల్ ఒప్పందాల విషయంలో సింగ్ మధ్యవర్తిగా వ్యవహరించారు. గతంలో భారత ఆదాయ వ్యయాలశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా విధులు నిర్వర్తించిన సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఏపీ జెన్‌కోకు శ్రామికశక్తి అవార్డు‘మే డే’ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ(ఏపీ జెన్‌కో)కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కార్మిక సంక్షేమ అవార్డు(శ్రామిక శక్తి)ను అందజేసింది. మే 1న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జెన్‌కో డెరైక్టర్(థర్మల్) సుందర్‌సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలతో పాటు ఉత్పత్తి పెంపునకు చేసిన కృషికి గానూ కార్మిక శాఖ ఈ అవార్డు దక్కింది.

నీలా బెనర్జీకి ఎడ్గర్ ఏ పో అవార్డుఇండో-అమెరికన్ జర్నలిస్టు నీలా బెనర్జీ ప్రతిష్టాత్మకమైన ‘ఎడ్గర్ ఏ పో’ అవార్డును అందుకున్నారు. మే 1న వాషింగ్లన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన కరెస్పాండెంట్ డిన్నర్‌లో ఒబామా దంపతులు నీలా బెనర్జీకి అవార్డును అందజేశారు. బెనర్జీ ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్’లో జర్నలిస్టుగా సేవలందిస్తున్నారు. జర్నలిజంలో అందించిన సేవలకు గుర్తింపుగా వైట్‌హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఈ అవార్డుతో సత్కరించింది. ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్‌లో చేరక ముందు లాస్‌ఏంజిలెస్ టైమ్స్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. ఇరాక్ యుద్ధం, గ్లోబల్ ఎనర్జీ వార్తలను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. యేల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీని పూర్తి చేసిన నీలా.. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కూడా మాస్కో కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించారు.

‘హరితప్రియ’కు ఐక్యరాజ్య సమితి అవార్డురైతులకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నిర్ధిష్ట సమాచారాన్ని అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వినూత్నంగా ప్రారంభించిన సంక్షిప్త సమాచార వ్యవస్థ(SMS) ‘హరితప్రియ’కు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇ-అగ్రికల్చర్ విభాగంలో వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ(WSIS) 2016 ప్రైజ్‌కు ‘హరితప్రియ’ ఎంపికైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్(ఐటీయూ) జెనీవాలో ప్రకటించింది. వ్యవసాయ క్షేత్రాల నుంచి వాతావరణ, భూ సమాచారాన్ని సేకరించి, శాస్త్రవేత్తలతో విశ్లేషించి రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించేందుకు ఏపీ వ్యవసాయ శాఖ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) సాయంతో 2015లో ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. అనంతపురం జిల్లాలోని కొత్తపేట, ధర్మాపురం గ్రామాల్లో 2015 జనవరి 4న ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ మెట్టభూముల పరిశోధనా సంస్థ(క్రిడా), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్), ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాయి.

No comments:

Post a Comment