AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు ఆగష్టు 2015

అవార్డులు ఆగష్టు 2015
సన్‌హాక్ శాంతి బహుమతి
భారత వ్యవసాయ శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్త, కిరిబాటి ద్వీపాల అధ్యక్షుడు అనోట్ టాంగ్‌లకు సంయుక్తంగా సన్‌హాక్ శాంతి బహుమతి లభించింది. వీరిరువురికి ఈ అవార్డును దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆగస్టు 28న ఆ దేశ మతనాయకుడు హక్ జా హన్‌మూన్ ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రత్యామ్నాయంగా గుర్తిస్తున్న ఈ అవార్డును రెవ్‌సన్ మైయూంగ్ మూన్ స్థాపించారు. ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తులకు, వారి సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త విజయ్ గుప్త (76) మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఆయనకు 2005లో ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి కూడా లభించింది. సన్‌హాక్ బహుమతి పొందిన మరో గ్రహీత అనోట్ టాంగ్ పసిఫిక్ సముద్రంలో ఉన్న కిరిబాటి ద్వీపాల అధ్యక్షుడు. చిన్న దీవులకు ప్రమాదకారిగా మారిన కర్బన ఉద్గారాల విడుదల అదుపుచేయడానికి ఆయన పోరాడుతున్నారు.
సానియాకు ‘ఖేల్త్న్ర’ ప్రదానం
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ అవార్డును భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అందుకున్నారు. ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు కింద పతకం, సర్టిఫికెట్‌తో పాటు ఏడున్నర లక్షల నగదును బహుకరించారు. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ‘అర్జున’ అవార్డులను ప్రణబ్ చేతుల మీదుగా స్వీకరించారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ మాజీ ప్లేయర్ శివ ప్రకాశ్ మిశ్రాకు ‘ద్రోణచార్య’, సాయిబాబా వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ’ పురస్కారాలను అందజేశారు.

అర్జున గ్రహీతలు: శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), బబిత (రెజ్లింగ్), భజరంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (పారా సెయిలింగ్), మంజీత్ చిల్లర్ (కబడ్డీ), అభిలాష మహత్రే (కబడ్డీ).

ద్రోణాచార్య గ్రహీతలు: నావల్ సింగ్ (అథ్లెటిక్స్-పారా స్పోర్ట్స్), అనూప్ సింగ్ (రెజ్లింగ్), హర్భన్స్ సింగ్ (అథ్లెటిక్స్-లైఫ్‌టైమ్), స్వతంతర్ రాజ్‌సింగ్ (బాక్సింగ్-లైఫ్‌టైమ్), నీహర్ అమీన్ (స్విమ్మింగ్-లైఫ్‌టైమ్).

ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: రోమియో జేమ్స్ (హాకీ), శివ ప్రకాశ్ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్).
ఆర్తీ బారువాకు భారత జ్యోతి అవార్డ్
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దేశ్‌బంధు కాలేజీలో ఫిలాసఫీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్తీ బారువా ప్రతిష్టాత్మక భారత్ జ్యోతి అవార్డును గెలుచుకున్నారు. ఇండియా ఇంటర్‌నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ(ఐఐఎఫ్‌ఎస్) ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. అసోంకు చెందిన ఆర్తీ ప్రస్తుతం ఇండియన్ డివిజన్ ఆఫ్ ది స్కోపెన్హౌర్ సొసైటీ(ఐడీఎస్‌ఎస్)లో డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో ఆగస్టు 29న జరిగిన ‘ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్’ సదస్సులో మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి బారువాకు అవార్డును ప్రదానం చేశారు. విద్య, రాజకీయాలు, సంఘసేవ, వ్యాపారం, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 
ఇండియన్ అమెరికన్‌కు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు
‘ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఏఎఫ్‌ఎమ్‌ఐ)’ ప్రదానం చేసే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు ఈ ఏడాది భారత సంతతికి చెందిన అమెరికా పారిశ్రామికవేత్త ఫ్రాంక్ ఇస్లామ్‌ను వరించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ ధ్యానేశ్వర్ ఎమ్ ములాయ్ చేతుల మీదుగా ఆగస్టు 30న ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గ త మేలో అలీగఢ్ యూనివర్సిటీకి ఇస్లామ్ 2.22 లక్షల డాలర్లు విరాళం అందజేశారు. భారత్‌లోని ముస్లిం మైనారిటీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఏఎఫ్‌ఎమ్‌ఐ కృషి చేస్తోంది.

శివాజీరావు, పురుషోత్తం రెడ్డిలకు జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డు
పర్యావరణ పరిరక్షణకు విశిష్టసేవలు అందిస్తున్న ఇద్దరు తెలుగు పర్యావరణవేత్తలకు ప్రతిష్టాత్మక జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డులు లభించాయి. పర్యావరణ విద్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో అసాధారణ భాగస్వామ్యం వహించిన సెంట్రల్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ డెరైక్టర్, ప్రొఫెసర్ టి.శివాజీరావు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ప్రొఫెసర్ టి.పురుషోత్తం రెడ్డిలకు ఈ అవార్డులు లభించాయి. క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డు సంస్థ ఆగస్టు 21, 2015న ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ చేతుల మీదుగా టి.శివాజీరావు, పురుషోత్తంరెడ్డిలు అవార్డులు అందుకున్నారు. 
మోదీకి ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’ ప్రదానం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించిన ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్-2014’ అవార్డును ఆగస్టు 21, 2015న సింగపూర్‌లో ప్రదానం చేశారు. మోదీ తరఫున సింగపూర్‌లోని భారత హైకమిషనర్ విజయ్ ఠాకూర్ అవార్డును అందుకున్నారు. స్వదేశం లేదా ఆసియా అభివృద్ధికి కృషి చేసిన వారికి ‘ది స్ట్రైట్ టైమ్స్’ పత్రిక ఈ అవార్డు ఇస్తుంది. 
సెల్‌కాన్‌కు ‘మేకిన్ ఇండియా ఎక్సలెన్స్’ అవార్డు
ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీ సెల్‌కాన్‌కు ‘మేకిన్ ఇండియా ఎక్సలెన్స్’ అవార్డు వరించింది. కంపెనీ టెలికం గ్యాడ్జెట్స్ విభాగంలో ఈ అవార్డును కైవసం చేసుకుంది. ప్రముఖ హాకీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై సమక్షంలో గుజరాత్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి గోవింద్ భాయ్ పటేల్ చేతుల మీదుగా అవార్డును సెల్‌కాన్ ఏవీపీ దివ్య గుప్తా అందుకున్నారు. 
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు ‘స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్’ విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో ఎస్‌సీఎఫ్ శిక్షణ ఇస్తూ అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను క్రీడాశాఖ ఆమోదించింది. రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్, పారాలింపిక్స్ కోచ్ నావల్ సింగ్‌ల పేర్లను ప్రస్తుత ప్రదర్శన (2011-2014) ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేయగా జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో నిహర్ అమీన్ (స్విమ్మింగ్), ఎస్‌ఆర్ సింగ్ (బాక్సింగ్), హర్బన్స్ సింగ్ (అథ్లెటిక్స్)లకు దక్కనుంది. వీరికి తలా రూ.5 లక్షల నగదు, ప్రతిమను అందిస్తారు. ద్యాన్‌చంద్ అవార్డు కోసం రోమియో జేమ్స్ (హాకీ), ఎస్‌పీ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్) పేర్లను ఖరారు చేశారు. 
ఆర్‌సీఐకి పీఎస్‌యూ సమ్మిట్ అవార్డు
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన క్షిపణి అభివృద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ)’ను పీఎస్‌యూ సమ్మిట్ అవార్డు-2015 వరించింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల సదస్సులో ఆర్‌సీఐ డెరైక్టర్ జి.సతీశ్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. సంస్థలో ఐటీ సేవల దిశగా చర్యలు ప్రారంభించినందుకు ఆర్‌సీఐకి ఈ అవార్డు లభించింది.

సానియాకు ఖేల్ రత్న
అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరును పురస్కారాల కమిటీ ఆగస్టు 11న ఎంపిక చేసింది. కమిటీ మరో 17 మందిని అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. ఆగస్టు 29న ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఖేల్ రత్నను పొందిన రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా. లియాండర్ పేస్‌కు 1996లో ఈ పురస్కారం దక్కింది. సానియా మిర్జా ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించింది. ఆమెకు 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
అర్జున అవార్డు విజేతలు
రోహిత్ శర్మ (క్రికెట్); కె.శ్రీకాంత్ (బ్యాడ్మింటన్); పూవమ్మ (అథ్లెటిక్స్); పి.ఆర్.శ్రీజేశ్ (హాకీ); దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్); జీతు రాయ్ (షూటింగ్); సందీప్ కుమార్ (ఆర్చరీ); మన్ దీప్ జాంగ్రా (బాక్సింగ్); బబిత కుమారి, భజ్‌రంగ్ (రెజ్లింగ్); స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్); సతీశ్ (వెయిట్ లిఫ్టింగ్); సంతోయ్ దేవి (వుషు); శరత్ గైక్వాడ్ (ప్యారా సెయిలింగ్); మన్‌జీత్ చిల్లార్, అభిలాష మహాత్రే (కబడ్డీ); అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్).
సుహాసినీ హైదర్‌కు భాటియా అవార్డు
ఉత్తమ పొలిటికల్ రిపోర్టింగ్ చేసే వారికి ఇచ్చే ప్రేమ్ భాటియా స్మారక అవార్డు 2015 సంవత్సరానికి సుహాసిని హైదర్‌కు లభించింది. ఆమె హిందూ ఆంగ్ల దినపత్రికలో డిప్లొమాటిక్, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆమె పాకిస్తాన్, శ్రీలంక, సిరియా, లిబియా, లెబనాన్, టిబెట్ పోరాటాలపై రిపోర్టింగ్ చేశారు. ది ట్రిబ్యూన్ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు.
నెక్టార్ శాన్‌జెన్‌బామ్, సుబేదార్ రాజేశ్ కుమార్‌లకు కీర్తిచక్ర
భారత సైన్యంలో ధైర్యసహాసాలను ప్రదర్శించిన వారికి ఇచ్చే కీర్తి చక్ర అవార్డు ఈ ఏడాది ఇద్దరిని వరించింది. మయన్మార్‌లో ఉగ్రవాదులను హతమార్చిన భారత బృందానికి నేతృత్వం వహించిన 21 పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత నెక్టార్ శాన్‌జెన్‌బామ్, జమ్మూకశ్మీర్‌లో గత అక్టోబరులో ఉగ్రవాదులతో వీరోచిత పోరులో నేలకొరిగిన సుబేదార్ రాజేశ్‌కుమార్‌ను(మరణానంతరం) కీర్తిచక్ర వరించింది. 21 పారా రెజిమెంట్‌కు చెందిన మరో 10 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి. వీరితో సహా విధి నిర్వహణలో అసమాన ధైర్యం ప్రదర్శించిన మొత్తం 67 మంది జవాన్లు గ్యాలంటరీ అవార్డుల(శౌర్య పురస్కారాలు)కు ఎంపికయ్యారు.
విద్యా పీఠం అధ్యాపకుడికి కేంద్ర అవార్డు
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వీజే విరూపాక్షకు కేంద్ర ప్రభుత్వం మహర్షి బద్రాయన్ వ్యాస్ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్కృత సాహిత్యంలో పరిశోధనలు చేస్తున్న ఐదుగురికి కేంద్ర మానవ వనరుల శాఖ ఈ అవార్డు ప్రకటించింది. తాజాగా ప్రదానం చేయనున్న అవార్డు కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని త్వరలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీజే విరూపక్ష అందుకోనున్నారు. 
సూపర్-30 వ్యవస్థాపకునికి వేదవ్యాస్ అవార్డు
మధ్యప్రదేశ్‌లో ‘సూపర్-30’ అనే సంస్థను ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఆనంద్ కుమార్‌ను అక్కడి ప్రభుత్వం ‘వేదవ్యాస్ అవార్డు’తో సత్కరించింది. ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 2014-15 సంవత్సరానికి గాను ఈ అవార్డును ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఏటా విద్యారంగంలో విశేష కృషి చేసిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డును బహూకరిస్తుంది. అవార్డుతో పాటు రూ. 2 లక్షల నగదు బహుమతిని కూడా అందచేస్తుంది.
ఎస్‌పీ మిశ్రాకు ధ్యాన్‌చంద్ పురస్కారం
డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్‌పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్‌చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ రోమియో జేమ్స్‌లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం కింద ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును అందిస్తారు.
పురందరేకు మహారాష్ట్ర భూషణ్ అవార్డు
మహారాష్ట్ర అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డును చరిత్రకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరే అందుకున్నారు. ఆగస్టు 19న రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు పురందరేను అవార్డుతో సత్కరించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ రచనల ద్వారా పురందరే సుపరిచితుడు. అయితే పురందరేకు ఈ అవార్డు ఇవ్వడాన్ని మహారాష్ట్రలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

శివథాను పిళ్లైకి గీతం ఫౌండేషన్ అవార్డు
 గీతం విశ్వవిద్యాలయం 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది గీతం ఫౌండేషన్ అవార్డును సుప్రసిద్ధ శాస్త్రవేత్త, బ్రహ్మాస్ క్షిపణి రూపశిల్పి డాక్టర్ ఎ.శివథాను పిళ్లైకి అందజేశారు. ఆగస్టు 8న విశాఖలో జరిగిన కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తి.. పిళ్లైకి ఈ అవార్డుతో పాటు రూ. పది లక్షల నగదు బహుమతిని అందజేశారు.
సంజీవ్ గుప్తాకు ‘గొల్లపూడి’ అవార్డు
హిందీ చిత్రం ‘క్యూ’ దర్శకుడు సంజీవ్ గుప్తా 2014 సంవత్సరానికిగానూ గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. గొల్లపూడి శ్రీనివాస్ 18వ జాతీయ అవార్డు ప్రదానోత్సవం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో ఆగస్టు 12న జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి చేతుల మీదుగా సంజీవ్ గుప్తా అవార్డును అందుకున్నారు.

సంజీవ్, అన్షులకు మెగసెసే అవార్డు
2015 సంవత్సరానికి భారత్‌కు చెందిన సంజీవ్ త్రివేది, అన్షుగుప్తాలతోపాటు లావోస్‌కు చెందిన కొమలై చాంతా వాంగ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన లిగయా ఫెర్నాండో-ఎమిల్‌బంగ్సా, మయన్మార్‌కు చెందిన క్యావ్ తులు మెగసెసే అవార్డులు పొందారు. సంజీవ్ చతుర్వేది (40) ప్రస్తుతం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎయిమ్స్‌లో జరిగిన కుంభకోణాలపై ఆయన దర్యాప్తు చేసి ప్రశంసలు అందుకున్నారు. నిజాయతీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. అవినీతి నిర్మూలనకు కృషి చేసినందుకు ‘ఎమర్జెంట్ లీడర్‌షిప్’ కేటగిరీ కింద చతుర్వేదికి మెగసెసే పురస్కారం లభించింది. అన్షు గుప్తా కార్పొరేట్ ఉద్యోగం వదులుకొని గూన్జ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. పాత బట్టలు, గృహోపకరణాలను సేకరించి, అవసరమైన మార్పులు చేసి పేదలకు గూన్జ్ సంస్థ పంపిణీ చేస్తోంది. దేశంలోని 21 రాష్ట్రాల్లో దీనికి శాఖలున్నాయి. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మెగసెసే పేరున ఈ అవార్డును 1957లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డు కింద దాదాపు రూ.19 లక్షల నగదు బహుమతి విజేతలకు లభిస్తుంది.

కలాం స్మారకార్థం తమిళనాడు అవార్డుమాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం ఆయన పేరుతో ఏటా ఆగస్టు 15న ఓ అవార్డును అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత జూలై 31న ప్రకటించారు. అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తారు. అవార్డును ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. అదేవిధంగా భారతరత్న అబ్దుల్ కలాం జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని యువ చైతన్య దినంగా పాటించనున్నట్లు జయలలిత తెలిపారు. కాగా, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బొమ్మతో నాలుగు స్టాంపులను రూపొందించినట్లు తపాలా శాఖ చెన్నై డెరైక్టర్ తెలిపారు.

భారతీయ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ అవార్డు భారత సంతతికి చెందిన ప్రముఖ ఆహార శాస్త్రవేత్త హర్‌జిందర్ సింగ్ ‘ఇంటర్నేషనల్ డైరీ పుడ్స్ అసోసియేషన్ అవార్డు’కు ఎంపికయ్యారు. పాల సంబంధ ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రత ప్రమాణాల పెంపు కోసం ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు లభించింది. అమెరికన్ డైరీ సైన్స్ అసోసియేషన్ ప్రతి ఏటా ఈ అవార్డులను అందిస్తోంది. మాసీ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన హర్‌జిందర్ సింగ్ ఈ అవార్డు అందుకున్న తొలి ఉత్తర అమెరికాయేతర వ్యక్తి.

ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు భద్రతా పురస్కారంఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్‌కు 2013-14 ఏడాదికి సంబంధించి ఉత్తమ ఆన్‌షోర్ అసెట్ భద్రతా పురస్కారం లభించింది. ఆగస్టు 4న ఢిల్లీలోని స్కోప్ భవనంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పురస్కారాన్ని రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మేనేజర్ దేబశీష్ సన్యాల్‌కు అందజేశారు.

No comments:

Post a Comment