AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు మార్చి 2016

అవార్డులు మార్చి 2016
పద్మ అవార్డులు ప్రదానం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 28న పద్మ అవార్డులను అందించారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూబాయి అంబానీ తరపున ఆయన భార్య కోకిలాబెన్ పురస్కారాన్ని అందుకున్నారు. అంబానీతో పాటు ఆర్థికవేత్త అవినాశ్ కమలాకర్ దీక్షిత్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్, ప్రఖ్యాత నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తిలకు పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. పద్మభూషణ్ అందుకున్న వారిలో పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, సైనా నెహ్వాల్, ప్రముఖ ఉదరకోశ వైద్య నిపుణుడు డాక్టర్ జి.నాగేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, పకృతి వ్యవసాయ వేత్త సుభాష్ పాలేకర్, ప్రముఖ వైద్యుడు యార్లగడ్డ నాయుడమ్మ తదితరులు.. పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 44 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రీహ తల్లో ఎనిమిది మంది తెలుగువారున్నారు.

జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలితొలిసారి తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 2015కి గానూ మార్చి 28న ప్రకటించిన 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాహుబలి ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో కలిపి మొత్తం రెండు అవార్డును సొంతం చేసుకుంది. దీంతో 1953 నుంచి ప్రకటిస్తున్న ఈ అవార్డుల్లో.. ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్న తొలి తెలుగు సినిమాగా బాహుబలి నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా కంచె సినిమా ఎంపికైంది. హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీకి మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.
  • ఉత్తమ చిత్రం: బాహుబలి
  • ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (చిత్రం: పికు)
  • ఉత్తమ నటి: కంగనా రనౌత్ (చిత్రం: తను వెడ్స్ మను రిటర్న్స్)
  • ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా బన్సాలీ (చిత్రం: బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ జాతీయ సమైక్యతా పురస్కారం: నానక్ షా ఫకీర్
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయిజాన్

వెంకయ్యకు స్కోచ్ చాలెంజర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును స్కోచ్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం(స్కోచ్ చాలెంజర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్)తో మార్చి 18న సత్కరించింది. అలాగే ‘చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ స్టార్టప్ ఇండియా’ను తెలంగాణా ఐటి మంత్రి కె. తారక రామారావుకు స్కోచ్ సంస్ధ అందజేసింది. ‘25 ఏళ్ల భారత సంస్కరణల’పై స్కోచ్ నిర్వహించిన సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పురస్కారాలను అందజేశారు.
ఏపీ, టీఎస్‌ఆర్‌టీసీలకు జాతీయ అవార్డులు
ఇంధన పొదుపులో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మొదటి స్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందజేసే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 22న బెంగళూరులో జరిగింది. దేశంలోని ఇతర రవాణా సంస్థలతో పోలిస్తే అత్యంత ఎక్కువ కేఎంపీఎల్ అందజేస్తున్న సంస్థగా (లీటరుకు 5.46 కిలోమీటర్లు) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవార్డును అందుకుంది. ఇదే సందర్భంలో 2013-14, 2014-15 సంవత్సరాల్లో పోల్చిచూసినపుడు ఏడాదిలో సంస్థ కేఎంపీఎల్ సామర్థ్యాన్ని 5.41 నుంచి 5.46 కిలోమీటర్లు పెంచడం ద్వారా రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)కు సైతం నాలుగు అవార్డులు దక్కాయి. 2014-15 సంవత్సరానికి గాను గ్రామీణ సర్వీసులలో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్ (పన్ను ఎలిమెంట్ లేకుండా కి.మీ.కు రూ. 26.02 వ్యయం) కలిగి ఉన్నందుకు ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డులు లభించాయి.
జగదీశ్ చంద్‌కు కీర్తిచక్ర ప్రదానం
పఠాన్‌కోట్ దాడి ఘటనలో విరోచితంగా పోరాడి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి మృతిచెందిన సిపాయి జగదీశ్ చంద్‌ను కేంద్రం కీర్తి చక్రతో గౌరవించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించి, అత్యున్నత, అసాధారణ సేవలు కనబరిచిన సైనికులకు ఇచ్చే శౌర్య అవార్డుల ప్రదానోత్సవం మార్చి 22న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రాణాలు సైతం లెక్క చేయక పలు సందర్భాల్లో సేవలు అందించిన మొత్తం 58 మందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతకాలను అందజేశారు. జగదీశ్ చంద్ తరఫున ఆయన భార్య కీర్తిచక్ర (సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం) అవార్డును అందుకున్నారు. 2015 జనవరి 27న జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రతిభ కనబరిచి మృతిచెందిన ఎంఎన్ రాయ్‌కి శౌర్య పతకాన్ని బహూకరించారు. ఆయన కూతురు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2015 జూన్ 8న ఇండో-మయన్మార్ సరిహద్దులో జరిగిన ఘటనలో సత్తా చాటిన హవిల్దార్ తన్కా కుమార్ సహా మరికొందరికి శౌర్య పతకాలను అందజేశారు. వైస్ అడ్మిరల్ మురుగేషన్‌కు పరమ్ విశిష్ట్ సేవా మెడల్ బహూకరించారు.

శక్తి బర్మన్‌కు ఫ్రాన్స్ అత్యుత్తమ అవార్డు
ప్రముఖ చిత్రకారుడు శక్తి బర్మన్‌ను ఫ్రాన్స్ ఆ దేశ అత్యున్నత అవార్డు ‘నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’తో సత్కరించింది. మార్చి 10న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాన్స్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ రిచియర్.. శక్తి బర్మన్‌కు అవార్డును బహూకరించారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఏటా ఇచ్చే ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులను 2015 సంవత్సరానికి గాను మార్చి 14న ప్రకటించారు. టి20 ఫార్మాట్‌లో ఉత్తమ ఇన్నింగ్స్ అవార్డు భారత ఆటగాడు రోహిత్ శర్మకు దక్కింది. రోహిత్ దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ (106) ఇన్నింగ్స్ ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో వరుసగా మూడోసారి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డును సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. న్యూజిలాండ్‌ను ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చిన మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌కు ‘కెప్టెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. ఇయాన్ చాపెల్, వాల్ష్, జాన్ రైట్, జయవర్ధనే, అగార్కర్, మంజ్రేకర్, రస్సెల్ ఆర్నాల్డ్, మార్క్ నికోలస్‌లతో కూడిన ప్యానెల్ క్రిక్‌ఇన్ఫో అవార్డులను ప్రకటించింది.ఇతర అవార్డులు:ఉత్తమ టెస్టు బౌలింగ్ -స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)
ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్ - కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
ఉత్తమ వన్డే ఇన్నింగ్స్ - డి విలియర్స్ (దక్షిణాఫ్రికా)
ఉత్తమ వన్డే బౌలింగ్ - టిమ్ సౌతీ (న్యూజిలాండ్)
ఉత్తమ టి20 బౌలింగ్ - డేవిడ్ వీస్ (దక్షిణాఫ్రికా)
ఉత్తమ అరంగేట్రం - ముస్తాఫిజుర్ రహమాన్ (బంగ్లాదేశ్)
పాలస్తీనా ఉపాధ్యాయురాలికి ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’
పాలస్తీనాలోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు హనన్ అల్ హ్రౌబ్ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ను గెల్చుకున్నారు. అవార్డు కింద ఆమెకు రూ. 6.8 కోట్ల నగదు లభిస్తుంది. భారత్‌కు చెందిన రాబిన్ చౌరాసియాతోపాటు మరో 8 మందిని తుదిపోరులో వెనక్కునెట్టి హనన్ ఈ ఘనతను సాధించారు. దుబాయ్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వీడియో లింక్ ద్వారా పోప్ ఫ్రాన్సిస్.. హనన్‌ను విజేతగా ప్రకటించారు. కేరళ మూలాలున్న వ్యాపారవేత్త సన్నీ వార్కే ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను స్థాపించారు. విద్యావృత్తికి అత్యుత్తమ సేవలందించిన వారికి 2015 నుంచి ఈ బహుమతి ఇస్తున్నారు.
జయప్రకాష్‌కు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం
‘గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డు-2015’ తమిళనాడుకు చెందిన సినీ దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్‌కు దక్కింది. అవార్డు రూపంలో రూ.1.50 లక్షల నగదు అందజేస్తారు. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ 1992లో విశాఖలో ప్రమాదవశాత్తు మృతి చెందిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం 19 ఏళ్ల నుంచి జాతీయస్థాయి ఉత్తమ సినీ కళాకారులకు అవార్డులు ఇస్తున్నారు. 2015 సంవత్సరానికి ‘లెన్స్’ అనే ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్‌ను ఉత్తమ దర్శకుడిగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా వివిధ భాషా చిత్రాల నుంచి మొత్తం 33 నామినేషన్లు వచ్చాయని మారుతీరావు తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా సినీ దర్శకులకు జాతీయ పురస్కారం ఇవ్వడం ఇదే తొలిసారిని గొల్లపూడి పేర్కొన్నారు.
ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్‌కి 2016 అబెల్ ప్రైజ్
గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ప్రతిష్టాత్మక ‘అబెల్ ప్రైజ్’ను 2016 సంవత్సరానికి గాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సర్ ఆండ్రూ వైల్స్ గెలుచుకున్నారు. 300 ఏళ్ల క్రితం నాటి గణిత సమీకరణాన్ని సాధించినందుకు గాను నార్వే అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ వైల్స్‌ను అబెల్ ప్రైజ్‌కు ఎంపికచేసింది. అవార్డు కింద వైల్స్‌కు 5 వేల బ్రిటన్ పౌండ్లు (రూ. 4.75 కోట్లు) దక్కనున్నాయి. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త పైరే డి ఫెర్మాట్ 1637లో ఒక సమీకరణాన్ని ప్రవేశపెట్టారు. సాధించిన సమీకరణాన్ని ‘ఫెర్మాట్ లాస్ట్ థీరమ్’ పేరుతో 1994లో సర్ ఆండ్రూ వైల్స్ ప్రచురించారు. దీని ఆధారంగా ఆయనకు అబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు.

మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
2015 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్‌కుమార్ ఎంపికయ్యారు. చిత్ర రంగానికి చేసిన సేవకు గానూ ఆయన్ను 47వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మార్చి 4న ప్రకటించింది. మనోజ్‌కుమార్ ఉపకార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి తదితర చిత్రాల్లో నటించారు. 1992లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
119 హెలికాప్టర్ విభాగానికి ‘ప్రెసిడెంట్స్ స్టాండర్డ్’ అవార్డుభారత వైమానిక దళంలో అత్యంత కీలకమైన 119 హెలికాప్టర్ విభాగానికి ‘ప్రెసిడెంట్స్ స్టాండర్డ్’ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. దీంతో పాటు జామ్‌నగర్‌లోని 28 ఎక్విప్‌మెంట్ డిపో ‘ప్రెసిడెంట్స్ కలర్స్’ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా 26/11 ముంబాయి దాడులు జరిగినప్పుడు 119 హెలికాప్టర్ చేసిన సేవలను ఆయన గుర్తుచేశారు. 119 హెలికాప్టర్ విభాగం 1972లో ఏర్పడింది.
ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీకి జాతీయ అవార్డుఇంధన పొదుపులో దేశవ్యాప్తంగా ఉన్న రవాణా సంస్థల్లో టీఎస్‌ఆర్టీసీ ఉత్తమంగా నిలిచింది. బస్సులు సగటున లీటరు డీజిల్‌కు 5.46 కిలోమీటర్ల మైలేజీతో తెలంగాణ ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్స్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ)’ ప్రతి సంవత్సరం అందించే అవార్డుకు ఎంపికైంది. 2014-15 సంవత్సరానికి గాను టీఎస్‌ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. ఉమ్మడి ఆర్టీసీ దాదాపు 14 సార్లు ఈ అవార్డు పొందింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాదే ఈ అవార్డు తెలంగాణ ఆర్టీసీ పరమైంది. ఉత్తమ కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకునే కేటగిరీలో టీఎస్‌ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 
తెలంగాణ ‘న్యాక్’కు సీఐడీసీ అవార్డుహైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)కు కేంద్ర ప్రణాళిక శాఖ అధీనంలోని ప్రతిష్టాత్మక ‘కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ)’ అవార్డు ప్రకటించింది. నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి అంశంలో ‘న్యాక్’ విస్తృత కృషికి గాను ఈ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, శిక్షణ సంస్థలకు ఏటా ఈ కౌన్సిల్ అవార్డులు ప్రకటించి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలంగాణ ‘న్యాక్’ను అవార్డుకు ఎంపిక చేసింది. ‘న్యాక్’ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో 3.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 26 వేల మందికి శిక్షణ ఇచ్చారు.

No comments:

Post a Comment