AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు సెప్టెంబరు 2015

క్రీడలు సెప్టెంబరు 2015
సానియా- హింగిస్‌లకు గ్వాంగ్‌జౌ ఓపెన్ టైటిల్
గ్వాంగ్‌జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్‌లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015 సీజన్‌లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్‌కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది. 
క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్
ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్‌కి 14వ టైటిల్.
హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్
ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్‌బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు.
ఖతర్‌లో 2022 సాకర్ ప్రపంచకప్
2022 సాకర్ ప్రపంచకప్‌ను అరబ్ దేశం ఖతర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఫిఫా సెప్టెంబర్ 25న ప్రకటించింది. 28 రోజుల పాటు జరిగే ఈ 22వ ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి ఖతర్ ఆతిథ్యమిస్తోంది. ఫిఫా ప్రంపచకప్‌ను నిర్వహిస్తున్న తొలి అరబ్, మధ్య ఆసియా దేశంగా ఖతర్ నిలిచింది. టోర్నీ 2022 నవంబర్ 21న మొదలై డిసెంబర్ 18 (ఖతర్ జాతీయ దినం)న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. జూన్-జూలైల్లో కాకుండా వేరే నెలల్లో జరుగుతున్న మొదటి ఫిఫా ప్రపంచకప్ ఇదే.
ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్
చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన 16వ ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు ఏడు పతకాలు సాధించారు. వీటిలో ఐదు రజతాలు కాగా రెండు కాంస్య పతకాలున్నాయి. తొలుత కపిల్ శర్మ, జస్విందర్ సింగ్, రాజేశ్ వర్మ, మహ్మద్ అజాద్‌ల తో కూడిన భారత బృందం తొలి రజతాన్ని అందించింది. అనంతరం దత్తు బబన్ భోకనాల్ పురుషుల సింగిల్స్‌లో రెండో రజతాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు. పురుషుల డబుల్స్ లైట్ వెయిట్, పురుషుల డబుల్స్, పురుషుల 8 ఈవెంట్ విభాగాల్లో భారత్‌కు రజతాలు దక్కాయి. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో దేవిందర్ సింగ్, నవీన్, పురుషుల లైట్‌వెయిట్ విభాగంలో దుష్యంత్ కాంస్యాలు అందించారు.
చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అనర్హత
దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టు మినీ ప్రపంచకప్‌గా భావించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. 2015 సెప్టెంబర్ 30 వరకు ఐసీసీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది. తాజాగా సెప్టెంబర్ 30న ప్రకటించిన ర్యాంకుల్లో విండీస్ 9వ స్థానానికి పడిపోయింది. దీంతో 1998 నుంచి సాగుతున్న ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ కరీబియన్ జట్టు ఆడలేకపోతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో పాక్, భారత్, దక్షిణాఫ్రికా జట్లను తమ అద్భుత ఆటతీరుతో వణికించిన బంగ్లాదేశ్ 9వ ర్యాంకు నుంచి 7కు చేరింది. ఈ ర్యాంకుతో 2006 అనంతరం మరోసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.

నేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ ఛాంపియన్‌గా రైల్వేస్
కోల్‌కతాలో సెప్టెంబరు 19లో ముగిసిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా రైల్వేస్ నిలిచింది. మొత్తం 267 పాయింట్లతో రైల్వేస్ మొదటి స్థానంలో నిలువగా, ఓఎన్‌జీసీ(185),సర్వీసెస్(174.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్
ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సింగపూర్‌లో సెప్టెంబరు 20న జరిగిన రేసులో వెటల్ మొదటి స్థానంలో నిలువగా, డేనియల్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు.
కొరియా ఓపెన్ టైటిల్
కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. సెప్టెంబరు 20న సియోల్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అజయ్ జయరామ్ (భారత్)ను చెన్ లాంగ్ ఓడించాడు.కెరీర్‌లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు.విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వ స్థానం
అపియా (సమోవా)లో సెప్టెంబరు 11న ముగిసిన యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 24 స్వర్ణాలు, 19 రజతాలు, 19 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(13 స్వర్ణ పతకాలు), ఇంగ్లండ్(12), మలేసియా(11)తో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 9 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలతో భారత్ 5వ స్థానంలో నిలిచింది.
జకోవిచ్, పెనెట్టాలకు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్
పురుషుల సింగిల్స్: నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 14న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు.

మహిళల సింగిల్స్: ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాబెర్టా విన్సీ (ఇటలీ)ని ఓడించింది. అత్యంత పెద్ద వయసులో (33) తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న మహిళగా పెనెట్టా గుర్తింపు సాధించింది.

పురుషుల డబుల్స్: హెర్బెర్ట్-నికోలస్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్)- జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించారు.

మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో కేసే డెలాక్వా (ఆస్ట్రేలియా), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్) జంటను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్.. స్విస్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించాడు. వీరు ఫైనల్లో అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సామ్ క్వెరీ జోడీని ఓడించారు. ఈ విజయంతో పేస్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరాయి.
రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్‌కు కాంస్యం
రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. లాస్‌వెగాస్‌లో సెప్టెంబరు 13న కాంస్యం కోసం జరిగిన పోటీలో జెలిమ్‌ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై యాదవ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో నర్సింగ్ యాదవ్ 2016-రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
యూకీ బాంబ్రీకి షాంఘై చాలెంజర్ టైటిల్
భారత్ టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ షాంఘై చాలెంజర్ టైటిల్ గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను లిన్ డాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి గె ఒకుహారా (జపాన్) గెలుచుకుంది. ఆమె ఫైనల్లో అకానె యమగుచి (జపాన్)ను ఓడించింది.
విజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికిన మేవెదర్
స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ విజయంతో రింగ్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఈ 38 ఏళ్ల బాక్సర్ చివరిదైన 49వ మ్యాచ్‌లో అండ్రీ బెర్టోపై నెగ్గి తన రికార్డును 49-0కు మెరుగుపర్చుకున్నాడు. దాంతో దిగ్గజ ఆటగాడు రాకీ మార్సియానో రికార్డును (49-0) సమం చేశాడు.

అపూర్వికి షూటింగ్‌లో రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అపూర్వి చండేలా రజత పతకం సాధించింది. సెప్టెంబరు 5న మునిచ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అహ్మది ఎల్హాన్ (ఇరాన్) స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియాకు కాంస్య పతకం దక్కింది.
జోష్న చిన్నప్పకు ఇండియన్ స్క్వాష్ టైటిల్
ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్‌లో జోష్న చిన్నప్ప (భారత్) మహిళల టైటిల్ గెలుచుకుంది. ముంబైలో సెప్టెంబరు 6న జరిగిన పోటీలో హబీబా మహ్మద్ (ఈజిప్టు)ను జోష్న ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఆడ్రియన్ వాలెర్(ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. మహేశ్ మంగోంకర్ (భారత్)ను వాలెర్ ఓడించారు.
హామిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రి
ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మొంజా (ఇటలీ) లో సెప్టెంబరు 6న జరిగిన రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలువగా, ఫెరారీ డ్రైవర్ వెటల్ రెండో స్థానం సాధించాడు.
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. బ్యాంకాక్‌లో సెప్టెంబరు 6న ముగిసిన పోటీల్లో కజకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ రెండో స్థానంలో, థాయిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఈవెంట్ ద్వారా అక్టోబరులో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు.
కోచ్ పదవికి అటపట్టు రాజీనామా
భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. శ్రీలంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆమోదించారు.

శ్రీలంకపై భారత్ చరిత్రాత్మక విజయం
భారత క్రికెట్ జట్టు చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 22 ఏళ్ల తర్వా త లంక గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. 2011 తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 1993 తర్వాత శ్రీలంకలో సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని టీమ్ 1-0తో సిరీస్‌ను గెలిచింది. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన కోహ్లికి ఇదే తొలి సిరీస్ విజయం. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 

2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరం డర్బన్
 
2022లో కామన్వెల్త్ గేమ్స్‌ను దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న ఆక్లాండ్‌లో సమావేశమైన గేమ్స్ సమాఖ్య ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఈ గేమ్స్‌కు ఓ ఆఫ్రికా దేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. అధిక ఖర్చు కారణంగా కెనడా, ఎడ్మాంటన్ ఫిబ్రవరిలోనే రేసు నుంచి వైదొలగడంతో డర్బన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అలాగే గేమ్స్‌లో నిర్వహించే క్రీడాంశాల సంఖ్యను కూడా 10 నుంచి 16కు పెంచారు. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ప్రెసిడెంట్‌గా స్కాట్లాండ్‌కు చెందిన లూయిస్ మార్టిన్‌ను ఎన్నుకున్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.

No comments:

Post a Comment