AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు నవంబరు 2015

అవార్డులు నవంబరు 2015
నంగి దేవేందర్ రెడ్డికి జయశంకర్ అవార్డు
ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు-2015కు నవ తెలంగాణ సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి ఎంపికయ్యారు. డిసెంబర్ 22న తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగే 5వ సౌత్ ఇండియా యాక్టివిస్ట్ కాన్ఫరెన్స్‌లో నంగి దేవేందర్‌కు అవార్డు అందజేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ఉన్నందునే ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు.
జీఎం రావుకు జీవిత సాఫల్య పురస్కారం
మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి. మల్లికార్జున రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి జీవిత సాఫల్య పురస్కారం వరించింది. దుబాయ్‌లో నవంబర్ 29న జరిగిన ఏబీఎల్‌ఎఫ్ ఆరో ఎడిషన్‌లో జీఎం రావు ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులను ఏబీఎల్‌ఎఫ్ ఏటా అవార్డులతో సత్కరిస్తోంది.

యూఎన్ హెచ్‌సీఆర్‌కు ఇందిర శాంతి బహుమతి
ఐక్యరాజ్యసమితి శరణార్థుల పరిరక్షక కమిషనర్ (యూఎన్‌హెచ్‌సీఆర్)కు 2015 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులకు సహాయ సహకారాలు అందించడంతోపాటు వారి సంక్షేమానికి ఇది కృషి చేస్తోంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ యూఎన్‌హెచ్‌సీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
కులదీప్ నయ్యర్‌కు గోయంకా అవార్డు
2013-14 సంవత్సరానికి రామ్‌నాథ్ గోయంకా జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, రచయిత కులదీప్ నయ్యర్‌కు నవంబర్ 23న న్యూఢిల్లీలో అందజేశారు. పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారం దక్కింది. ఆయన గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు.
యార్లగడ్డకు గురజాడ పురస్కారం
2015 గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం డా॥యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు లభించింది. విజయనగరంలోని సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థలు.. ఏటా నవంబర్ 30న ఈ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని గురజాడ పురస్కారంతో సత్కరిస్తాయి. 
ఇళయరాజాకు సెంటినరీ అవార్డు
వెయ్యికి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన మేస్ట్రో ఇళయరాజాకు సెంటినరీ అవార్డు ప్రదానం చేశారు. నవంబర్ 20న గోవా రాజధాని పనాజీలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్సవాల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందచేశారు. ప్రారంభోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే రష్యా ఫిల్మ్ మేకర్ నికిత మిఖల్కోవ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేష్‌కు జీవీ రాజా అవార్డు
భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌కు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘లెఫ్టినెంట్ కల్నల్ జీవీ రాజా అవార్డు’ దక్కింది. త్రివేండ్రంలో నవంబర్ 17న జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా శ్రీజేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డు కింద శ్రీజేష్‌కు రూ. 3 లక్షల నగదు అందజేశారు.
హోషంగాబాద్ కలెక్టర్‌కు జాతీయ పురస్కారం
వికలాంగుల వికాసానికి శాయశక్తులా పాటుపడినందుకుగాను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా కలెక్టర్ సంకేత్ భోండ్వేకు జాతీయ పురస్కారం దక్కింది. డిసెంబర్ 3న ఢిల్లీలో ఆయన ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోనున్నారు. జిల్లాస్థాయిలో భోండ్వే చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు వికలాంగుల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేశాయి. ఉత్తమ జిల్లాల కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం హోషంగాబాద్‌ను ఎంపిక చేసింది. సంకేత్ 51 మంది వికలాంగులకు సామూహిక వివాహం జరిపించారు. వారికి ఆధార్ కార్డులిప్పించారు. రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
పసునూరి రవీందర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెలంగాణ రచయిత పసునూరి రవీందర్ అందుకున్నారు. నవంబర్ 18న న్యూఢిల్లీలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చేతుల మీదుగా అవార్డును, రూ.50 వేల నగదు, తామ్రపత్రాన్ని రవీందర్ అందుకున్నారు. తెలంగాణ దళిత కథల సంకలనం ‘ఔట్ ఆఫ్ కవరేజి ఏరియా’కు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

పండిట్ శివకుమార్ శర్మకు బిర్లా అవార్డు
సంతూర్ మేస్ట్రో పండిట్ శివకుమార్ శర్మ ఈ ఏడాది ‘ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కార్’కు ఎంపికయ్యారు. హిందుస్తానీ సంగీతంలో జీవిత సాఫల్య పురస్కారానికి ఆయనను ఎంపికచేశారు. ‘ఆదిత్య విక్రమ్ బిర్లా కళాకిరణ్’ అవార్డులకు ప్రముఖ సారంగి ప్లేయర్ మురద్ అలీ ఖాన్, తబలా విద్యాంసులు సత్యజిత్ తల్వాల్కర్‌లు ఎంపికయ్యారు. షెహనాయ్ కళాకారులైన ఇద్దరు సోదరులు సంజీవ్ శంకర్, అశ్వినీ శంకర్‌లకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. నవంబర్ 7న ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్ రావు విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. 
తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
ఇండియా టుడే సంస్థ ఇచ్చే ‘బెస్ట్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ఉత్తమ సమ్మిళిత అభివృద్ధి)’ అవార్డు తెలంగాణ రాష్ట్రానికి లభించింది. నవంబర్ 6న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా మంత్రి కె.తారక రామారావు ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో సమాజంలోని అన్ని వర్గాలను సమ్మిళితం చేస్తూ ముందుకు వెళ్లడాన్ని గుర్తించి ఈ అవార్డును అందచేశారు.
ఏపీ ట్రాన్స్‌కో సీఎండీకి ఉత్తమ బ్యూరోక్రాట్ అవార్డు 
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సీఎండీ కె విజయానంద్ ఉత్తమ బ్యూరోక్రాట్ అవార్డు అందుకున్నారు. అత్యుత్తమ సామర్థ్యం గల సంస్థలుగా ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలకూ అవార్డులు దక్కాయి. ఢిల్లీకి చెందిన జాతీయ సంస్థ ఎనర్షియా ఈ అవార్డులను ప్రకటించింది. న్యూఢిల్లీలో నవంబర్ 6న జరిగిన ఓ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్యామ్‌జాజు చేతుల మీదుగా ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ ఈ అవార్డులను అందుకున్నారు. 2014-15లో దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలపై ఎనర్షియా అధ్యయనం చేసింది. విద్యుత్ అవసరాలకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించడం, కొత్త ప్రాజెక్టులకు నిధులు సేకరించడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు ముందున్నాయి.
లైబీరియన్ బాలుడికి ప్రతిష్టాత్మక అవార్డు
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిల్డ్రన్ పీస్ ప్రైజ్‌ను 2015 సంవత్సరానికి గాను ఆఫ్రికాలోని లైబీరియాకు చెందిన బాలుడు అందుకున్నాడు. చిన్నారులపై హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు గాను పదిహేడేళ్ల అబ్రహం కీతాను ఈ అవార్డు వరించింది. 2011లో నోబెల్ శాంతి బహుమతి పొందిన లైబీరియా వాసి లేమాహ్ బోవి చేతుల మీదుగా నవంబర్ 9న అబ్రహం ఈ అవార్డును అందుకున్నాడు. చిన్నారులపై హింసను వ్యతిరేకిస్తూ అబ్రహం పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగించాడు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారాలు
 
గ్రామీణ జర్నలిజంలో అసాధారణ ప్రతిభ చాటుకున్న ఐఏఎన్‌ఎస్ త్రిపుర బ్యూరో చీఫ్ సుజిత్ చక్రవర్తి.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళకు చెందిన మాతృభూమి పత్రిక వినయ్‌మాథ్యూతో కలసి ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో మిడ్ డే పత్రిక రిపోర్టర్ శరద్‌వ్యాస్, సింగిల్ న్యూస్ పిక్చర్ కేటగిరీలో పీటీఐ ఫొటోగ్రాఫర్ షబాజ్ ఖాన్‌లకు అవార్డులు దక్కనున్నాయి. ఫొటో ఫీచర్ కేటగిరీ అవార్డు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తషికి ద క్కింది. కార్టూన్లు, కేరికేచర్ విభాగంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్టూనిస్టు సీఆర్ శశికుమార్... బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్ ప్రెస్‌డేని పురస్కరించుకుని నవంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వీరికి అవార్డులను అందజేస్తారు.

No comments:

Post a Comment