AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు జనవరి 2016

అవార్డులు జనవరి 2016
112 మందికి పద్మ పురస్కారాలు
వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 112 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. 10 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 83 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరిలో 19 మంది మహిళలు ఉన్నారు. 10 మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వారికి అవార్డులు లభించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. పద్మవిభూషణ్ గ్రహీతలు..
యామినీ కృష్ణమూర్తి (నృత్యం)
రజనీకాంత్ (సినిమా)
గిరిజా దేవి (సంగీతం)
రామోజీరావు (జర్నలిజం)
శ్రీశ్రీ రవిశంకర్ (ఆధ్యాత్మికం)
డాక్టర్ విశ్వనాథన్ శాంత (వైద్యం)
జగ్‌మోహన్ (పౌర సంబంధాలు) 
డాక్టర్ వాసుదేవ అత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
అవినాశ్ దీక్షిత్ (సాహిత్యం, విద్య)
ధీరూభాయ్ అంబానీ(వాణిజ్యం, పరిశ్రమలు - మరణానంతరం)
తెలుగు వ్యక్తులు..
పద్మభూషణ్: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్; డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి; సైనా నెహ్వాల్; సానియా మీర్జా; డాక్టర్ ఏవీ రామారావు.
పద్మశ్రీ: కె.లక్ష్మీగౌడ్; ఎస్.ఎస్.రాజమౌళి; సునీతా కృష్ణన్; డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ; డాక్టర్. టి.వి.నారాయణ; డా. మన్నమ్ గోపీచంద్; డాక్టర్ అళ్ల గోపాలకృష్ణ గోఖలే. 
మోహన్‌నాథ్ గోస్వామికి అశోకచక్ర
ఉగ్రవాదులపై పోరులో అసువులుబాసిన అమర జవాను, భారత ఆర్మీ ప్రత్యేక దళాల కమాండో లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి కేంద్రం అత్యున్నత శౌర్య పురస్కారం అశోకచక్రను ప్రకటించింది. 2015లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తోటి జవాన్లను కాపాడే క్రమంలో గోస్వామి నేలకొరిగారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ శౌర్య పురస్కారాలను ప్రకటించింది.మిగతా ముఖ్యమైన శౌర్యపతకాల విజేతలు
కీర్తి చక్ర: సుబేదార్ మహేంద్ర సింగ్, సిపాయి జగదీశ్‌చంద్ (మరణానంతరం)
శౌర్య చక్ర: కల్నల్ సంతోశ్ యశ్వంత్ మహాదిక్ (మరణానంతరం), మేజర్ ప్రపుల్ కుమార్ భరద్వాజ్, మేజర్ అనురాగ్ కుమార్, మేజర్ సందీప్ యాదవ్, లెఫ్టినెంట్ హర్జీందర్ సింగ్, నాయక్ సతీశ్ కుమార్ (మరణానంతరం), నాయక్ ఖీమ్ సింగ్ మెహ్రా, సిపాయి ధర్మరామ్ (మరణానంతరం)
ముగ్గురు భారతీయులకు ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు
ముగ్గురు ప్రవాస భారతీయులకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ దక్కింది. వివిధ రంగాల్లో వీరు కనబరిచిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా మొత్తం 600 మంది సమాజ సేవకులకు పురస్కారాలు దక్కగా అందులో భారతీయులు ముగ్గురు ఉన్నారు. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీ (ఏఎన్‌యూ)లో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్, సౌత్‌వేల్స్‌లో నేత్రవైద్య నిపుణుడిగా పని చేస్తున్న జయచంద్ర, మెల్‌బోర్న్‌లో దంతవైద్యుడిగా సేవలందిస్తున్న సజీవ్ కోషీలను ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016కు గాను ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాలకు ఎంపిక చేసింది.

సాహస బాల రుచితకు గీతా చోప్రా అవార్డు
తెలంగాణలోని శివ్వంపేట్‌కు చెందిన రుచితకు ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డు దక్కింది. 8 ఏళ్ల ఈ చిన్నారి తెలంగాణలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు చిన్నారుల ఊపిరి నిలబెట్టడంలో ప్రదర్శించిన సాహసానికి ఈ అవార్డును దక్కించుకుంది. తెలంగాణకు చెందిన మరో చిన్నారి సాయికృష్ణ అఖిల్ కిలాంబికి కూడా జాతీయ సాహస బాలల పురస్కారం దక్కింది. మొత్తం 25 మందిలో ఇద్దరికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. తన నలుగురు మిత్రులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన గౌరవ్ సహస్రబుద్దెకు ప్రతిష్టాత్మక సాహస భారత్ అవార్డు దక్కింది. జనవరి 18న 25 మంది చిన్నారులకు (22 మంది బాలురు, ముగ్గురు బాలికలు) కేంద్రం జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించింది. పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 24న అందజేస్తారు.

ఇన్ఫోసిస్ మూర్తికి ఐసీఎస్‌ఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి ముంబైలో జనవరి 7న ఐసీఎస్‌ఐ 15వ జాతీయ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.రామదొరై చేతుల మీదుగా నారాయణ మూర్తి అవార్డును అందుకున్నారు.
ప్రియాంకకు పీపుల్స్ చాయిస్ అవార్డు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డునందుకున్న మొట్టమొదటి భారతీయ నటిగా ఆమె ఘనత సాధించారు. అమెరికన్ టీవీ సీరిస్ ‘క్వాంటికో’లో చూపిన ప్రతిభకుగాను ప్రియాంకను ఈ అవార్డు వరించింది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ చేతుల మీదుగా అవార్డునందుకుంది.
హైదరాబాద్ యువకుడికి యూకే ఫొటోగ్రఫీ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ శ్రీవారి భార్గవ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ అవార్డుకు భార్గవ ఎంపికయ్యారు. రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ లెసైన్సియేట్, అసోసియేట్, ఫెలో అనే మూడు విభాగాల్లో ఇచ్చే పురస్కారానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.
మహమూద్ అలీకి ‘ప్రపంచ శాంతి అవార్డు’
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి ప్రపంచ శాంతి, శ్రేయస్సు-2016 అవార్డు లభించింది. లండన్‌లోని ప్రపంచ శాంతి, శ్రేయస్సు ఫౌండేషన్ సంస్థ ప్రతి ఏటా శాంతి అవార్డులను బహూకరిస్తోంది. అందులో భాగంగా 2016 సంవత్సరానికి మహమూద్ అలీని ఎంపిక చేసింది. ఈ మేరకు జనవరి 11న హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మహమూద్ అలీకి ప్రపంచ శాంతి, శ్రేయస్సు ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ప్రిన్స్ మోహసిన్ అలీఖాన్ అవార్డును అందజేశారు.
మెస్సీకి ఐదోసారి బాలన్ డిఓర్ అవార్డు
ఫిఫా అందించే ప్రతిష్టాత్మక బాలన్ డిఓర్ (ఏడాది అత్యుత్తమ ఫుట్‌బాలర్) అవార్డును అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఐదోసారి అందుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో (2వ స్థానం), నెయ్‌మార్ (3వ స్థానం)ను వెనక్కినెట్టి 2015 ఏడాదికి గాను అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. 2015లో మెస్సీ 61 మ్యాచ్‌ల్లో 52 గోల్స్ చేయడంతోపాటు 26 గోల్స్ చేసే అవకాశాలు కల్పించాడు. ఇంతకుముందు రెండుసార్లు ఈ అవార్డును రొనాల్డో కైవసం చేసుకున్నాడు. 2010లో ఈ అవార్డును ఇవ్వడం మొదలుపెట్టగా ఇప్పటివరకు వీరిద్దరే గెలవడం విశేషం. మెస్సీ ఆడుతున్న క్లబ్ బార్సిలోనాకు కోచ్‌గా ఉన్న లూయిస్ ఎన్రీక్ అత్యుత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది అత్యుత్తమ మహిళా ఫుట్‌బాలర్ అవార్డును అమెరికా జట్టు కెప్టెన్ కార్లీ లాయిడ్ నెగ్గగా, మహిళల జట్టు ఉత్తమ కోచ్‌గా జిల్ ఎల్లీస్ నిలిచింది.
గూడ అంజయ్యకు కొమురం భీమ్ పురస్కారం
ప్రముఖ సినీ రచయిత గూడ అంజయ్యను ఈ ఏడాది(2016) కొమురం భీమ్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కొమురం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి, భారత్ కల్చరల్ అకాడెమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. సినీ, టీవీ పరిశ్రమలోని వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి గత ఐదేళ్లుగా ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సినీ దర్శకుడు సుద్దాల అశోక్ తేజ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు అల్లాణి శ్రీధర్, శిడాం అర్జున్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డు కింద రూ. 50,116 నగదు, జ్ఞాపిక, శాలువా, సన్మానపత్రం అందజేస్తారన్నారు.

ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు విక్రమ్ సారాబాయ్ అవార్డు
 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మాజీ డెరైక్టర్ ఎం.వై.ఎస్. ప్రసాద్‌కు విక్రమ్ సారాబాయ్ అవార్డు లభించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.. అంతరిక్ష శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును బహూకరిస్తుంది. మైసూర్‌లో జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రసాద్ అవార్డును అందుకున్నారు. 

శేఖర్‌గుప్తాకు తిలక్ జర్నలిజం అవార్డు2015 లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డుకు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. ఈ మేరకు బాలగంగాధర్ తిలక్ ఎడిటర్‌గా పనిచేసిన ‘ కేసరి’ పత్రిక ట్రస్టీ, ఎడిటర్ దీపక్ తిలక్ ప్రకటన చేశారు

బీసీసీఐ వార్షిక అవార్డులుభారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 2015 సంవత్సరానికి గానూ వార్షిక అవార్డులు ప్రకటించింది.
అవార్డు విజేతలు:కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ - సయ్యద్ కిర్మాణీ
పాలి ఉమ్రిగర్ (ఉత్తమ క్రికెటర్) అవార్డు - విరాట్ కోహ్లి
ఎం.ఎ.చిదంబరం (ఉత్తమ మహిళా క్రికెటర్)- మిథాలీ రాజ్
లాలా అమర్‌నాథ్ అవార్డు - జలజ్ సక్సేనా (రంజీల్లో బెస్ట్ ఆల్‌రౌండర్)
లాలా అమర్‌నాథ్ అవార్డు - దీపక్ హుడా (దేశవాళీ వన్డేల్లో బెస్ట్ ఆల్‌రౌండర్)
మాధవ్‌రావు సింధియా అవార్డు - రాబిన్ ఉతప్ప (రంజీల్లో అత్యధిక పరుగులు)
మాధవ్‌రావు సింధియా అవార్డు - వినయ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ (రంజీల్లో అత్యధిక వికెట్లు)
అండర్-23 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - అల్మాస్ షౌకత్ (యూపీ)
అండర్-19 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - అనుమోల్‌ప్రీత్ సింగ్ (పంజాబ్)
అండర్-16 ఉత్తమ క్రికెటర్ (ఎం.ఎ.చిదంబరం ట్రోఫీ) - శుభమ్ గిల్ (పంజాబ్)
ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్ - దేవికా దివ్య (మహారాష్ట్ర)
దేశవాళీల్లో ఉత్తమ అంపైర్ - ఓ నందన్, ఓవరాల్ ఉత్తమ ప్రదర్శన - కర్ణాటక స్టేట్ అసోసియేషన్ 

కె.రాఘవేంద్రరావుకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం‘అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందుకున్నారు. జనవరి 6న హైదరాబాద్‌లో ‘సాంస్కృతిక బంధు’ సారపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్రరావుకు ఈ అవార్డును అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆయనకు స్వర్ణకంకణం, స్వర్ణ కిరీటంతో పాటు పురస్కారాన్ని అందించారు.

No comments:

Post a Comment