AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2014

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2014
ప్రపంచ సుందరి.. రోలిన్ స్ట్రాస్
మిస్ వరల్డ్-2014 కిరీటాన్ని మిస్ దక్షిణాఫ్రికా రోలిన్ స్ట్రాస్(22) దక్కించుకుంది. డిసెంబర్ 14న లండన్‌లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ఆమె విజయం సాధించింది. రోలిన్ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తోంది. రోలిన్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో హంగరీకి చెందిన కల్సర్, అమెరికా సుందరి సఫ్రిత్ నిలిచారు. భారత్ తరఫున ‘మిస్ వరల్డ్ 2014’లో పోటీపడిన ఢిల్లీకి చెందిన కోయల్ రాణా(21) టాప్ 10లోకి చేరుకోగలిగినా, టాప్-5లోకి చేరడంలో విఫలమైంది. కోయల్‌కు ఈ పోటీల్లో ‘బెస్ట్ డిజైనర్ అవార్డు’ దక్కింది. పోటీలో మొత్తం 121 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.
జపాన్ ప్రధానిగా మరోసారి అబే 
జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. ఆయన చేపట్టిన ‘అబేనామిక్స్’ ఆర్థిక విధానాలకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అయినా ఎన్నికల్లో అబే సునాయాసంగా విజయం సాధించారు. పార్లమెంటు ప్రతినిధుల సభలోని 475 సీట్లకు అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్‌డీపీ) మూడింట రెండొంతుల స్థానాలు గెలుచుకుంది. దేశ ఆర్థికాభివృద్ధికి అబే అనుసరించిన ఆర్థిక విధానాలను ‘అబేనామిక్స్’గా పేర్కొంటున్నారు.
మారిషస్ ప్రధానిగా అనిరుధ్ జగన్నాథ్
మారిషస్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అనిరుధ్ జగన్నాథ్(84) డిసెంబర్ 14న ప్రధానిగా నియమితులయ్యారు. జగన్నాథ్ నేతృత్వంలోని ‘లెపెప్’ కూటమి పార్లమెంటులోని మొత్తం 62 సీట్లకు 47 స్థానాలను గెలుచుకుంది. జగన్నాథ్ 1982-95, 2000-2003 మధ్య ప్రధానిగా, 2003-12 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు.
నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సత్యార్థి, మలాలా
బాలల హక్కుల కోసం పోరాడుతున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్(17) డిసెంబర్ 10న నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లొలో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో నోబెల్ కమిటీ చైర్మన్ తోబ్‌జోర్న్ జాగ్లండ్ ఇద్దరికీ అవార్డు అందించారు. బహుమతి కింద నోబెల్ బొమ్మ గల 175 గ్రాముల బంగారు పతకం, సుమారు రూ.6.1 కోట్ల నగదు బహుమతి ధ్రువీకరణపత్రం, నోబెల్ డిప్లొమా అందజేశారు. సత్యార్థి తన స్వచ్ఛంద సంస్థ బచ్‌పన్ బచావో ఆందోళన్ ద్వారా దేశ వ్యాప్తంగా 80 వేల మంది బాలకార్మికులను రక్షించి, పాఠశాలల్లో చేర్పించారు. మలాలా నోబెల్ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలు.
దాతృత్వంలో నెం.1 బఫెట్
వివిధ కార్యక్రమాల కోసం 2014లో అధికమొత్తంలో విరాళమిచ్చిన దాతల జాబితాలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఏకంగా 2.1 బిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ జాబితాను ‘వెల్త్- ఎక్స్’ రూపొందించింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్‌గా దినేశ్వర్ శర్మ
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినేశ్వర్ శర్మ డిసెంబర్ 13న నియమితులయ్యారు. 1979 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన శర్మ ప్రస్తుత డెరైక్టర్ సయ్యద్ అసిఫ్ ఇబ్రహీం స్థానంలో 2015, జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

ఏషియన్ ఆఫ్ ద ఇయర్‌గా నరేంద్ర మోదీ 
సింగపూర్‌కు చెందిన ద స్ట్రైట్ టైమ్స్ దినపత్రిక ప్రధాని నరేంద్ర మోదీకి ‘ఏషియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ప్రకటించింది. దేశాభ్యున్నతి పట్ల ప్రపంచ దేశాల్లో అంచనాలు పెంచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆసియాలో తనదైన ముద్ర వేయడంలో మోదీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని స్ట్రైట్ టైమ్స్ పత్రిక ప్రచురణ సంస్థ సింగపూర్ ప్రెస్ హోల్డింగ్ లిమిటెడ్ పేర్కొంది.అలాగే టైమ్ పత్రిక ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ ఏటి వ్యక్తిగా మోదీ నిలిచారు. 

సీబీఐ కొత్త డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హాసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డెరైక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా డిసెంబరు 3న బాధ్యతలు చేపట్టారు. 1979 బ్యాచ్‌కు చెందిన ఆయన బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లు ఈ హోదాలో కొనసాగుతారు. డిసెంబరు 2న ఉద్యోగ విర మణ చేసిన రంజిత్ సిన్హా స్థానంలో ఆయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తులతో కూడిన కొలీజియం అనిల్ కుమార్ సిన్హా పేరును సిఫార్సు చేసింది. 

మిస్ సుప్రనేషనల్ -2014 ఆశాభట్ మిస్ సుప్రనేషనల్ -2014 కిరీటాన్ని భారత యువతి ఆశాభట్ గెలుచుకున్నారు. దీంతో ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు. పోలండ్ రాజధాని వార్సాలో నిర్వహించిన ఈ పోటీల్లో 70 దేశాల అందగత్తెలను వెనక్కునెట్టి మిస్ సుప్రనేషనల్ టైటిల్‌ను ఆశాభట్ కైవసం చేసుకుంది. 

వికీపీడియా గ్రాంట్‌కు తెలుగు యువకుడువికీపీడియా గ్రాంట్‌కు పశ్చిమగోదావరి జిల్లా పోడూరుకు చెందిన బాసె కాశీవిశ్వనాథ్ ఎంపికయ్యారు. 2015 జనవరిలో ప్రకటించే గ్రాంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వందల ప్రతిపాదనల్లో ఏడింటిని ఎంపిక చేయగా వాటిలో భారత్ నుంచి విశ్వనాథ్ ప్రతిపాదన ఒకటి. ప్రాజెక్టులో భాగంగా ఆవిర్భావం నుంచి తెలుగు వారి సాహితీ చైతన్యం, రాజకీయోద్యమాలతో పెనవేసుకున్న గ్రంథాలయాల చరిత్ర, వాటితో అనుబంధం ఉన్న ముఖ్య వ్యక్తుల వివరాలను సేకరించి వికీపీడియాలో ఉచితంగా వాడుకునేలా చేరుస్తారు. 

జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ మృతిసుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ (100) కొచ్చిలో డిసెంబరు 4న మరణించారు. కేరళకు చెందిన కృష్ణయ్యర్ ఆ రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తిగా, 1973-1980లో సుప్రీం న్యాయమూర్తిగా వ్యవహరించారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ అనే పేరుతో ఆత్మకథ రాశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్‌కు ప్రత్యర్థిగా పోటీ చేశారు. 1999లో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. భారత న్యాయ వ్యవస్థకు భీష్మ పితామహుడుగా గుర్తింపు పొందారు.

No comments:

Post a Comment