AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూన్ 2015

వార్తల్లో వ్యక్తులు జూన్ 2015
కేరళ ఆయుర్వేదం ప్రచారకర్తగా స్టెఫీగ్రాఫ్
కేరళ ఆయుర్వేదం గురించి ప్రచారం చేసేందుకు ప్రముఖ జర్మన్ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్‌ను కేరళ టూరిజం విభాగం ఎంపిక చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టూరిస్ట్ సర్క్యూట్స్‌లో ప్రచురణ, ఎలక్ట్రానిక్స్ మాధ్యమాల్లో ఆమె కేరళ ఆయుర్వేద విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రచారం చేస్తారు. ఇందుకు సంబంధించిన టూరిజం విభాగం ప్రతిపాదనకు కేరళ కేబినెట్ జూన్ 24న ఆమోదం తెలిపింది.
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్షుడిగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. బార్బడోస్‌లో జూన్ 25న జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో జహీర్ అబ్బాస్‌ను ఎన్నుకున్నారు. ఆయన ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగుతారు.
సిస్టర్ నిర్మల మృతి
మదర్ థెరిసా వారసురాలిగా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల జోషి(81) కోల్‌కతాలో జూన్ 23న మరణించారు. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం 1997, మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎంపికయ్యారు. నిర్మల జోషి నాటి బిహార్‌లోని రాంచీలో 1934లో జన్మించారు. ఆమెకు 2009లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ప్రస్తుతం మిషనరీస్ ఆఫ్ చారిటీకి సిస్టర్ మేరీ ప్రేమ నేతృత్వం వహిస్తున్నారు.
హాలీవుడ్ సంగీత దర్శకుడు హార్నర్ మృతి
హాలీవుడ్ సంగీత దర్శకుడు జేమ్స్ హార్నర్ (61) కాలిఫోర్నియాలో విమాన ప్రమాదంలో జూన్ 22న మరణించారు. టైటానిక్, అవతార్, అపోలో-13, బ్రేవ్ హార్ట్, అమేజింగ్ స్పైడర్‌మేన్ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలకు సంగీతం అందించారు.
గజల్ గాయకుడు విఠల్ రావు మృతి
ప్రముఖ గజల్ గాయకుడు పండిట్ శివపూర్కర్ విఠల్ రావు(88) హైదరాబాద్‌లో జూన్ 24న మరణించారు. అల్జీమర్స్ వ్యాధితో మతి స్థిమితం కోల్పోయి షిర్డీలో మే 29 నుంచి కనిపించకుండా పోయారు. ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో కనుగొన్నారు. విఠల్ రావు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన గాయకుడిగా పనిచేశారు. హిందీ, ఉర్దూ భాషల్లో గజల్స్ ఆలపించే ఆయన దేశ, విదేశాల్లో గాయకుడిగా మంచి పేరు గడించారు.
అత్యంత విలువైన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటులు
ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది ప్రముఖుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలకు చోటు దక్కింది. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ విడుదల చేసిన ‘సెలబ్రిటీ-100’ జాబితాలో అమెరికన్ బాక్సర్ ఫ్లోయ్‌డ్ మేవెదర్ రూ. 191 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు రూ. 21.36 కోట్ల ఆదాయంతో 71వ స్థానంలో నిలిచారు. రూ. 20.71 కోట్ల ఆదాయంతో అక్షయ్‌కుమార్ 76వ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ క్రికెటర్ మహేందర్‌సింగ్ ధోనీ రూ. 19.76 కోట్ల ఆదాయంతో 82 స్థానంలో నిలిచారు. 
ఆర్కేనగర్‌లో జయలలిత ఘన విజయం
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టలేదు. మహేంద్రన్‌కు కేవలం 9,710 ఓట్లు పోలయ్యాయి.
గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో శ్రీరంగం నియోజకవర్గం ఎమ్మెల్యే అర్హతను, ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. అదే కేసులో కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడడంతో గత నెల 23వ తేదీన ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సీఎం పదవిని చేపట్టిన ఆరునెలల్లో తిరిగి ఎన్నిక కావటం తప్పనిసరి కావటంతో ఆర్కేనగర్ ఎమ్మెల్యే పి. వెట్రివేల్‌చే రాజీనామా చేయించి జయ ఉప ఎన్నికకు వెళ్లారు.
రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు
అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రష్యాకు చెందిన గెన్నడీ పడాల్కా(57) రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) కమాండర్‌గానూ ఉన్న గెన్నడీ మొత్తం 803 రోజులు అంతరిక్షంలో గడిపి ఈ రికార్డు నెలకొల్పారని రష్యా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మాజీ సోవియట్ యూనియన్ కాలంలో సైనిక పైలట్‌గా శిక్షణ పొందిన గెన్నడీ 1998లో తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో తన ఐదో స్పేస్‌మిషన్‌లో కొనసాగుతున్న పడాల్కా ఈ ఏడాది సెప్టెంబర్‌లో భూమికి తిరిగి రానున్నారు. అప్పటికి ఆయన అంతరిక్షంలో 877 రోజులు పూర్తి చేసుకోనున్నారు. అంటే.. అప్పటికి దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయన అంతరిక్షంలో గడిపినట్లవుతుంది.

వాస్తు శిల్పి చార్లెస్ కొరియా మృతి 
ఆధునిక భారత రూప శిల్పిగా పేరుపొందిన వాస్తుశిల్పి చార్లెస్ కొరియా(84) ముంబైలో జూన్ 16న మరణించారు. అహ్మదాబాద్‌లో మహాత్మాగాంధీ సమాధి, మధ్యప్రదేశ్ శాసనసభ భవనానికి ఆయన రూపకల్పన చేశారు. నవీ ముంబై పట్టణానికి ముఖ్య వాస్తుశిల్పిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించడంలో సేవలందించారు. జాతీయ పట్టణాభివృద్ధి సంస్థ మొదటి చైర్మన్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌లో 1930, సెప్టెంబర్ 1న జన్మించిన కొరియాకు 1972లో పద్మశ్రీ, 2006లో పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. 
ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా అనిల్ రెడ్డి
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా వెన్నెం అనిల్ రెడ్డి ఎన్నికయ్యారు. 
‘ఆమ్నెస్టీ’ ఇండియా ఈడీగా ఆకార్ పటేల్
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పాత్రికేయుడు, రచయిత ఆకార్ పటేల్ మే 18న చేరారు. ఆ సంస్థ భారత కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహిస్తారు. సంస్థ ముఖ్య రాజకీయ సలహాదారుగా, వ్యూహకర్తగా, అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ఆకార్‌పటేల్.. ‘ఇండియా: లో ట్రస్ట్ సొసైటీ’ అనే పుస్తకంతో పాటు.. 2002 గుజరాత్ అల్లర్లపై ‘రైట్స్ అండ్ రాంగ్స్’ అనే నివేదికకు సహ రచయితగా ఉన్నారు. 
మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథి సిస్టర్ నిర్మల కన్నుమూత
 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి జూన్ 23న కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. మదర్ థెరిసా మరణించిన తర్వాత ఆరు నెలలకు 1997 మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎంపకయ్యారు. ఆమె వారసురాలిగా సిస్టర్ మేరీ ప్రేమను 2009 ఏప్రిల్‌లో కోల్‌కతాలో జరిగిన జనరల్ చాప్టర్ సమావేశంలో ఎన్నుకున్నారు. 
ప్రముఖ సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు కన్నుమూత
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృతాచార్యులు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) జూన్ 24న కన్ను మూశారు. ఆయన 200కి పైగా సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర గ్రంథాలను రచించారు. ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం అధిపతిగా, సంస్కృత అకాడమీ సంచాలకుడిగా, సంస్కృత భాషా ప్రచారక్ సమితి కులపతిగా సంస్కృత భాషాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. ‘వాల్మీకి రామాయణం’ను ఆయన తెలుగులోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో ఉన్న ఐనవెల్లిలో జన్మించిన రామచంద్రుడు6 దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 
కేరళ ఆయుర్వేదం ప్రచారకర్తగా స్టెఫీ గ్రాఫ్
టెన్నిస్ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ కేరళ ఆయుర్వేదం ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆ రాష్ట్రానికి జర్మనీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. దీంతో ఈ జర్మనీ క్రీడాకారిణిని కేరళ ప్రభుత్వం ప్రచారకర్తగా నియమించింది. కేరళ పర్యాటక శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘విసిట్ కేరళ’ పథకంలో భాగంగా స్టెఫీ గ్రాఫ్‌తో ఒప్పందం చేసుకోనున్నారు.

డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌గా టాలస్
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సెక్రటరీ జనరల్‌గా ఫిన్‌లాండ్‌కు చెందిన పెట్టెరి టాలస్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిన్‌లాండ్ వాతావరణ సంస్థ డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 2016 జనవరి 1 నుంచి ఆయన నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌కు చెందిన మైఖేల్ జరాఔద్ ఈ పదవిలో ఉన్నారు. ఈ పదవికి భారత్‌కు చెందిన శాస్త్రవేత్త శైలేష్ నాయక్ పోటీపడ్డారు.
ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య మృతి
ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య(86) అనారోగ్యంతో హైదరాబాద్‌లో జూన్ 8న మరణించారు. తెలంగాణ పోరాట యోధుడుగా, సాహితీవేత్తగా పేరుగాంచిన ఆయన 89 రచనలు చేశారు. మోదుగుపూలు, జానపదం లాంటి నవలలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. 1969 నాటి చిల్లర దేవుళ్లు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1928 ఆగస్టు 24న వరంగల్ జిల్లాలో జన్మించిన ఈయన నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం పోరాడారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చదవిన ఆయన సికింద్రాబాద్ మునిసిపల్ విభాగంలో సహాయ కమిషనర్‌గా పని చేశారు. 1960లో రచనలు ప్రారంభించారు. వేదాలను తెలుగులో రాశారు. శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను తెలుగులో అందించారు. ఆయన ఆత్మకథను ‘జీవనయానం’ పేరుతో తీసుకొచ్చారు.
కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కె.వి.చౌదరి
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా కె.వి.చౌదరి జూన్ 8న నియమితులయ్యారు. గతంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధిపతిగా పనిచేసిన చౌదరి 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి. సీవీసీ పదవికి ఐఏఎస్ అధికారిని కాకుండా వేరేవారిని నియమించడం 1964 తర్వాత ఇదే తొలిసారి.
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా విజయ్ శర్మ
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా విజయ్ శర్మ జూన్ 8న నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం సీఐసీలో కమిషనర్‌గా ఉన్నారు. సీనియర్ సభ్యుడైన శర్మను ప్రధాన కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శిగా ఉన్న సుధీర్ భార్గవను సమాచార కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. 
జాతీయ భద్రతా దళం డెరైక్టర్ జనరల్‌గా తాయల్ 
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా ఆర్.సి.తాయల్ జూన్ 8న నియమితులయ్యారు. ఈయన అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు.

డెలాయిట్ గ్లోబల్ సీఈఓగా పునిత్ రెన్‌జన్
 డెలాయిట్ గ్లోబల్ సీఈఓగా భారత సంతతికి చెందిన పునిత్ రెన్‌జన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి డెలాయిట్ సీఈఓగా నియమితులు కావడం ఇదే ప్రథమం.

No comments:

Post a Comment