AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

చరిత్రలో ఈ నెల సెప్టెంబరు 2017

చరిత్రలో ఈ నెల సెప్టెంబరు 2017
చరిత్రలో ఈ నెల సెప్టెంబరు 2017
అంతర్జాతీయం
ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కెన్యా కఠినచట్టం 
 పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ కెన్యా ప్రపంచంలోకెల్లా కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆ దేశంలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, విక్రయం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. నిబంధనలను ఉల్లంఘించిన వారు 4 ఏళ్ల జైలు శిక్ష లేదా 40 వేల డాలర్ల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కఠినమైన చట్టం 
ఎప్పుడు : ఆగస్టు 2017
ఎవరు : కెన్యా 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం

భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు 
రెల్వే రంగంలో సహకారానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే.. నల్లధనం, పన్ను ఎగవేతల నిర్మూలనకు పరస్పర సహకారం కొనసాగించాలని భారత్, స్విట్జర్లాండ్‌లు నిర్ణయించాయి. ఇందుకు ఉన్న అన్ని మార్గాలను మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : రైల్వే రంగంలో సహకారానికి సంబంధించి 

పాక్‌కు 25.5 కోట్ల డాలర్ల యూఎస్ సాయం
పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,600 కోట్లు) విలువైన మిలిటరీ సాయాన్ని అందించనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 30న తెలియజేసింది. అయితే పాకిస్తాన్‌లో తలదాచుకొంటూ అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సైనికులపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ సాయం అందుతుందని షరతు విధించింది. ఉగ్రవాదులపై పాకిస్తాన్ సమర్థవంతంగా పోరాడిందా లేదా అనే విషయాన్ని విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ నిర్ధారిస్తారనీ, పాక్ పనితీరుతో ఆయన సంతృప్తి చెందితేనే 25.5 కోట్ల డాలర్ల నిధులు విడుదలవుతాయని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల మిలిటరీ సాయం 
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అమెరికా 

3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం చేసుకున్న అమెరికా 
అమెరికా-రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్‌ల్లోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా సెప్టెంబర్ 2న స్వాధీనం చేసుకుంది. గత నెలలో తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిని రష్యా సగానికి పైగా తగ్గించింది. దీనికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యకలాపాలకు రష్యా ఈ కార్యాలయాలను ఇకపై ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భద్రత, నిర్వహణ సహా ఈ మూడు కార్యాలయాలూ పూర్తి స్థాయిలో తమ అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : అమెరికా ప్రభుత్వం 
ఎక్కడ : అమెరికాలో 

‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. ఎన్‌డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. ఎన్‌డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రాజెక్టు ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)

మయన్మార్ నుంచి బంగ్లాకు రోహింగ్యా శరణార్థులు
మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే(ఆగస్టు 21-సెప్టెంబర్ 1) దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది. 
బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు.. భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 4న కేంద్రాన్ని ఆదేశించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంగ్లాదేశ్‌కు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు 
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : మయన్మార్ నుంచి 
ఎందుకు : మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల

జియామెన్‌లో 9వ బ్రిక్స్ సదస్సు 
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కింది. చైనాలోని జియామెన్‌లో సెప్టెంబర్ 3 - 5 వరకు జరిగిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) సదస్సు డిక్లరేషన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా ఉగ్రసంస్థలపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. పాక్ పేరెత్తకుండానే.. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. సమావేశాల ముగింపు సందర్భంగా 43 పేజీల జియామెన్ డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాగా.. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై చర్చ జరగటం ఇదే తొలిసారి. 
ఉగ్రవాదంపై ఆందోళన 
బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదం అంశాన్ని మోదీ లెవనెత్తారు. దీనికి ఇతర నేతల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో వారు కూడా మోదీ ప్రతిపాదనను సమర్థించారు. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ (ఈటీఐఎమ్), ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తెహ్రికే తాలిబాన్, హిజ్బుత్ తహ్రీర్ వంటి సంస్థలు శాంతికి విఘాతం కల్పించటంపై బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు తుర్కిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఈటీఐఎమ్ చేస్తున్న విధ్వంసంపై ప్రత్యేకంగా చర్చించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లనున్నట్లు సభ్య దేశాలు పేర్కొన్నాయి.
సాంప్రదాయ వైద్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని కూడా సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎబోలా, హెచ్‌ఐవీ, క్షయ, మలేరియాతోపాటుగా ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది.
ఉత్తరకొరియా అణుపరీక్షలపైనా బ్రిక్స్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీ ప్రసంగం 
ప్రపంచంలోని ఓపెన్ ఎకానమీల్లో ఒకటిగా భారత్ వేగంగా పరిణామం చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిందని వెల్లడించారు. చెల్లింపులు, లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చేలా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు స్థానికంగా తయారీని ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారిగా 40 శాతానికి చేరాయని.. 2016-17లో రూ.3.86 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని మోదీ వెల్లడించారు. పేదరిక నిర్మూలనతోపాటుగా వైద్యం, పారిశుద్ధ్యం నైపుణ్యం, ఆహార భద్రత, లింగ సమానత, విద్యుత్, విద్య రంగాలపై భారత్ మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు.
సౌరశక్తి వినియోగాన్ని పెంచే ఎజెండాతో అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)ని మరింత బలోపేతం చేసే విషయంలో బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
బ్రిక్స్ దేశాలకూ రేటింగ్ ఏజెన్సీ
ఇప్పటిదాకా క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్‌ఏ (క్రెడిట్ రేటింగ్) మార్కెట్లో ఎస్‌అండ్‌పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికావే. 
నాలుగు ఒప్పందాలు ..
సదస్సు సందర్భంగా బ్రిక్స్ కూటమిలో భారత్ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017-2020), బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. 
బ్రిక్స్ దేశాల గణాంకాలు..
ఆర్థికాభివృద్ధిలో బ్రిక్స్ దేశాల వాటా 50 శాతం.
ప్రపంచ జనాభాలో 42.58 శాతం మంది బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు.
బ్రిక్స్ దేశాల విస్తీర్ణం 26.6 శాతం.
2015 నాటి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా 22.53 శాతం.
అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వాటా 14.91 శాతం.
ప్రపంచ బ్యాంకులో ఓటింగ్ హక్కులు - 13.24 శాతం.

అక్రమ వలసదారులుగా అమెరికాలోని స్వాప్నికులు
చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారిని అమెరికాలో స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. ట్రంప్ తాజా నిర్ణయంతో 7 వేల మంది భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన, సరైన అనుమతి పత్రాల్లేని 8 లక్షల మందిపై ప్రభావం పడనుంది. స్వాప్నికుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉంది. 
డ్రీమర్లు అమెరికాలోనే నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు చట్టపరంగా వెసులుబాటు కల్పిస్తూ ఒబామా 2012 ‘బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా (డీఏసీఏ)’ సహాయ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తాజాగా ట్రంప్ ఈ కార్యక్రమాన్నే రద్దు చేశారు. దీంతో వారంతా అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వాప్నికులను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ నిర్ణయం 
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికాలో 

జాతీయం
యుద్ధ విధుల్లోకి ఆర్మీ సివిల్ సిబ్బంది 
సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ఆర్మీలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 30న వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్మీలో సివిల్ విధులు నిర్వహిస్తున్న 57,000 మంది అధికారులు, జూనియర్ కమిషన్‌‌డ అధికారులను యుద్ధ విధుల్లోకి తీసుకోనున్నారు. 
ఆర్మీలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకత్కర్ కమిటీ సమర్పించిన నివేదికలోని 99 సిఫార్సుల్లో 65 అంశాలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 2019, డిసెంబర్ 31 నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 39 సైనిక క్షేత్రాలను దశల వారీగా మూసివేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

పశ్చిమబెంగాల్ గోవిందోభాగ్ వరికి జీఐ గుర్తింపు 
 పశ్చిమబెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో పండే గోవిందోభాగ్ రకం వరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ మేరకు ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ (GIR) ఆగస్టు 30న ప్రకటించింది. గోబిందోభాగ్ రకం వరికి జీఐ ట్యాగ్ కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2015లో జీఐఆర్‌కు దరఖాస్తు చేసింది.
ఉత్పత్తి, తయారీ పరంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ప్రత్యేక గుర్తింపు సాధించిన ఉత్పత్తులకు జీఐఆర్ జీఐ ట్యాగ్ ఇస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోవిందోభాగ్ వరికి జీఐ ట్యాగ్
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : జీఐఆర్
ఎక్కడ : బుర్ద్వాన్, పశ్చిమబెంగాల్ 

బోఫోర్స్‌పై పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోఫోర్స్ కుంభకోణం కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 30 తర్వాత కేసు విచారణ చేపట్టనుంది.
విచారణలో భాగంగా 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోదీ.. హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్‌తో పాటు బోఫోర్స్ కంపెనీపై అభియోగాలను కొట్టేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 90 రోజుల గడువులోగా అప్పీలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో 2005 అక్టోబర్ 18న బీజేపీ సీనియర్ నేత అజయ్ కుమార్ అగర్వాల్ సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
బోఫోర్స్ కుంభకోణం నేపథ్యం
400 అత్యాధునిక తుపాకుల సరఫరా కోసం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కోసం భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు బోఫోర్స్ భారీ ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించింది. దీంతో 1990 జనవరిలో సీబీఐ అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్ ఆర్డ్‌బో, మధ్యవర్తి విన్ చద్దా, హిందూజా సోదరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బోఫోర్స్ కుంభకోణం కేసు పునర్విచారణకు అంగీకారం 
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : సుప్రీంకోర్టు

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ 
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా ప్రమోషన్ లభించగా.. కొత్తగా తొమ్మిది మంది సహాయ మంత్రులుగా సెప్టెంబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు మొత్తం మంత్రుల సంఖ్య 75(మోదీ కాకుండా)కి చేరింది.
కొత్తగా ప్రమోషన్ పొందిన మంత్రుల్లో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్‌కు పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి.. పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖలు దక్కాయి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. 
కేబినెట్ హోదా పొందిన మంత్రులు 
నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ 
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి 
పీయూష్ గోయల్ - రైల్వే శాఖ 
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాలు 
కొత్త మంత్రుల శాఖలు 
రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక శక్తి (స్వతంత్ర) 
హర్‌దీప్ సింగ్ పురీ - గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి (స్వతంత్ర) 
అల్ఫోన్‌‌స కణ్ణాంథనం - పర్యాటకం, ఎలక్ట్రానిక్స్ (స్వతంత్ర) 
అశ్విని కుమార్ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం (సహాయ) 
వీరేంద్ర కుమార్ - మహిళా, శిశు సంక్షేమ శాఖ (సహాయ) 
సత్యపాల్ సింగ్ - మానవ వనరుల అభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, నదుల అభివృద్ధి (సహాయ) 
గజేంద్ర షెకావత్ - వ్యవసాయం, రైతు సంక్షేమం (సహాయ) 
శివ ప్రతాప్ శుక్లా - ఆర్థిక శాఖ (సహాయ)
అనంత్‌కుమార్ హెగ్డే - నైపుణ్యాభివృద్ధి (సహాయ)

పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు 
దేశంలో, విదేశాల్లో భారతీయుల నల్లధనం వివరాలపై మూడు అధ్యయన నివేదికల్ని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. నల్లధనం వివరాల అంచనా బాధ్యతల్ని యూపీఏ హయాంలో మూడు సంస్థలకు అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్‌‌స అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ ఫరీదాబాద్‌లు నల్లధనం లెక్కల్ని రూపొందించి 2013, 2014ల్లో ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదికల్నే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం పంపింది. భారత్‌లో నల్లధనంపై ప్రభుత్వం తరఫున ఇంతవరకూ అధికారిక నివేదికల్లేవు. 
అమెరికా సంస్థ జీఎఫ్‌ఐ అధ్యయనం ప్రకారం 2005-14 మధ్య రూ.48.28 లక్షల కోట్ల నల్లధనం భారత్‌లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ-ఢీల్లీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్-ఫరీదాబాద్

నల్లధనంపై ఎలాంటి సమాచారం లేదు : ఆర్‌బీఐ
పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా చలామణీ నుంచి ఎంత మేర నల్లధనం తొలగిపోయింది అనే విషయంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదే విధంగా లెక్కల్లో చూపని ఎంత ధనం చట్టబద్ధంగా ఖాతాల్లోకి వచ్చిందన్న వివరాలు లేవని పేర్కొంది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుపై స్థాయీ సంఘం లేవనెత్తిన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ తాజాగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లోకి జమయిన పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15.28 లక్షల కోట్లు ఉంటుందని, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం 
73 రోజులుగా భారత్-చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్య, ఇతర సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 5న సమావేశమైన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని నిర్ణయించారు. 
నిర్మాణాత్మక సంబంధాలపై.. 
భారత్-చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ-జిన్‌పింగ్ చర్చించారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం 
ఎప్పుడు : సెప్టెంబర్ 5 
ఎవరు : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా 

‘క్రీమీలేయర్’లోకి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు 
ఓబీసీల్లోని సంపన్న వర్గమైన క్రీమీలేయర్ పరిధి విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లోని కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయి. దీనివల్ల ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు. 

రాష్ట్రీయం 
లక్ష్మణ్‌రెడ్డికి పీఎస్‌టీయూ కీర్తి పురస్కారం 
 పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఏటా అందజేసే కీర్తి పురస్కారానికి జన చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఆగస్టు 31న జరిగిన కార్యక్రమంలో ఆయన కీర్తి పురస్కారం-2016ని అందుకున్నారు. హేతువాదం గురించి విసృ్తతంగా ప్రచారం చేసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : లకా్ష్మరెడ్డికి కీర్తి పురస్కారం - 2016 
ఎప్పుడు : ఆగస్టు 31 
ఎవరు : శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ఎక్కడ : హైదరాబాద్ 
ఎందుకు : హేతువాదంపై విస్తృత ప్రచారం చేసినందుకుగాను 

అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సీఎం అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం నిర్ణయించింది. నాలుగు, ఐదు, తొమ్మిది జోన్లలో మొత్తం రూ. 6,900 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా కల్పించాలని భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలని సీఎం ఆదేశించారు. 
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్: మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మొదట కొంత శాతం నిధులను కేటాయించి.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయడం 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ 
ఎప్పుడు : ఆగస్టు 30 
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు 

తెలంగాణలో 2 ఏళ్లలో 1,990 రైతు ఆత్మహత్యలు 
రాష్ట్రంలో 2015లో 1,358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నివారణ చర్యలు, మైనారిటీల అభివృద్ధ్ది, యువత ఉపాధికి చర్యలు, విద్యుత్ రంగంలో మార్పులు తదితరాల పరిశీలనకు చైర్మన్ సతీశ్ చంద్ర మిశ్రా, హుసేన్ దల్వాయి, మహ్మద్ నదీమ్ ఉల్ హక్, లాల్‌సింగ్ వడోదిన్, మధుసూదన్ మిస్త్రీ, విప్లవ్ ఠాకూర్‌లతో కూడిన రాజ్యసభ హామీల అమలు కమిటీ ఆగస్టు 31న రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో భేటీ అయిన సీఎస్ ఎస్పీ సింగ్.. రైతు ఆత్మహత్యల వివరాలు, ఆ రైతు కుటుంబాలకు పరిహారమివ్వడంతో పాటు పలు విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2 ఏళ్లలో 1,990 మంది రైతుల ఆత్మహత్యలు 
ఎవరు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ 
ఎక్కడ : తెలంగాణలో 
ఎందుకు : రాజ్యసభ హామీల అమలు కమిటీకి వెల్లడి 

ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు 
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య రూ. 3 వేల కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఆగస్టు 31న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇరు ప్రభుత్వాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా, ఆక్వా కల్చర్ వంటి రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియా పెట్టుబడులు పెడుతుంది. రెండు ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలపై గతంలోనే ఒప్పందం కుదిరింది. 
ఒప్పందాలివి.. 
ఏపీలో ప్రపంచ స్థాయి మైనింగ్ ఇన్సిస్టిట్యూట్ ఏర్పాటుకు కర్టిన్ యూనివర్సిటీ సంసిద్ధత.
ఖనిజ వనరులను జియోలాజికల్ మ్యాపింగ్ చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సంస్థ అంగీకారం.
తిరుపతిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న రోడ్డు మార్గంలో కేఎస్‌ఐ గ్లోబల్ సంస్థ రోలర్ సేఫ్టీ బ్యారియర్ ఏర్పాటు.
ఆచార్య ఎన్జీ రంగా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీల మధ్య మెట్ట వ్యవసాయంలో పరిశోధనకు ఒప్పందం.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు 
ఎప్పుడు : ఆగస్టు 31 
ఎందుకు : గనులు, సాంకేతికత, వైద్య, విద్యా తదితర రంగాల్లో పెట్టుబడులకు

తెలంగాణలో 45 లక్షల మంది రైతులు 
రాష్ట్రంలోని 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాల భూమి ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ భూములకు సంబంధించి చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదిక వివరాలను ఆగస్టు 31న వెల్లడించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..
రాష్ట్రంలో గ్రామాలు 10,733. వాటిలో వెయి్య ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న గ్రామాల సంఖ్య 5,976.
వెయ్యి ఎకరాల లోపు ఉన్న గ్రామాల్లో 13.91 లక్షల మంది రైతులు. వారి వద్ద 30.43 లక్షల ఎకరాల భూమి.
1,001 నుంచి 2 వేల ఎకరాల లోపున్న గ్రామాల్లోనే అత్యధికంగా 43.65 లక్షల ఎకరాల భూమి ఉంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణలో రైతుల సంఖ్య 45 లక్షలు 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : రైతు సమగ్ర సర్వే నివేదిక 

జ్యోతి సురేఖకు కోటి నజరానా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. కోటి నజరానాను ప్రకటించారు. ఇటీవల ‘అర్జున’ అవార్డును అందుకున్న సురేఖ, ఆగస్టు 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ఆయన నగదు ప్రోత్సాహకంతో పాటు విజయవాడలో 500 గజాల ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జ్యోతి సురేఖకు రూ. కోటి ప్రోత్సాహం 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు 
ఎందుకు : అర్జున అవార్డు అందుకున్నందుకు గాను

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 48 డివిజన్లకు (మొత్తం 50) ఆగస్టు 29న జరిగిన ఎన్నికల లెక్కింపు సెప్టెంబర్ 1న ముగిసింది. దీనిలో టీడీపీ 32 స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10, బీజేపీ మూడు సీట్లు గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా దక్కలేదు. కోర్టు వివాదం వల్ల రెండు డివిజన్లకు ఎన్నికలు జరగలేదు.
ఎన్నికల ఫలితాలు
పార్టీ
గెలుపొందిన స్థానాలు
టీడీపీ
32
వైకాపా
10
బీజేపీ
3
స్వతంత్రులు
3
మొత్తం
48
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎక్కడ : కాకినాడ, తూర్పుగోదావరి 

ఏపీ ప్రాజెక్టులకు నాబార్డు రూ.1,516.78 కోట్ల రుణం
ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ఈ ఏడాదికి రూ.1,516.78 కోట్లను నాబార్డు ద్వారా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానమంత్రి కృషి సంఛాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద ఆరు ప్రాజెక్టులు- గుండ్లకమ్మ, పుష్కర, ముసురుమిల్లి, తాడిపూడి, తారకరామతీర్థ సాగరం, ఎర్ర కాలువలకు రూ.537.42 కోట్లు (కేంద్రప్రభుత్వ వాటా రూ.389.57 కోట్లు, రాష్ట్ర వాటా రూ.147.85 కోట్లు)ను నాబార్డు ద్వారా విడుదల చేయడానికి అంగీకరించింది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇచ్చే రూ.147.85 కోట్లను ఆరుశాతం వడ్డీపై నాబార్డు రుణం రూపంలో సమకూర్చుతుంది. 
నాబార్డు వద్ద దీర్ఘకాలిక నీటిపారుదల నిధి(ఎల్‌టీఐఎఫ్) పేరిట ఏర్పాటు చేసిన నిధుల కింద పోలవరం ప్రాజెక్టుకు రూ.979.36 కోట్లను విడుదల చేసేందుకూ కేంద్రం అంగీకారం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.1,516.78 కోట్లు 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సెప్టెంబర్ 3న తెలిపింది. 
స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్ గవర్నెన్‌‌స మ్యాప్‌ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కె.తారకరామారావుకు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : స్కోచ్ సంస్థ 
ఎందుకు : సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు

తెలంగాణలో గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్
గ్రీన్‌హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్ (పూల మొక్కల పెంపకం) సాగుకు కూడా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) సెప్టెంబర్ 4న స్పష్టం చేసింది. ఈ మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పరిధిలోకి ఈ కేటగిరీలను చేర్చింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్రీన్‌హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్‌కు ఉచిత విద్యుత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 4 
ఎవరు : టీఎస్‌ఈఆర్సీ
ఎక్కడ : తెలంగాణలో 

మిస్ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ
‘మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్- 2017’ అందాల పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ విజేతగా నిలిచింది. భారతీయ సంతతి యువతి ఈ పోటీలో నెగ్గడం ఇది రెండోసారి. 25ఏళ్ల శ్రీశుభ ప్రస్తుతం జోహన్నస్‌బర్గ్‌లో ఓ ప్రముఖ బ్యాంకులో 18నెలల నుంచి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. అందాల పోటీలో తుదిపోరు సందర్భంగా ఓ పాటకు ఈమె చేసిన నృత్యం జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : అడ్డేపల్లి శ్రీశుభ 

సుజల స్రవంతి తొలిదశకు పరిపాలన అనుమతి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. తొలి దశ అంచనా వ్యయాన్ని రూ. 2,022.20 కోట్లకు పెంచుతూ సెప్టెంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీల గోదావరి జలాలను తరలించి విశాఖ జిల్లాలో నిర్మించే పెదపూడి రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎక రాలకు సాగునీళ్లందించాలని నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సుజల స్రవంతి తొలిదశకు పరిపాలన అనుమతి 
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎందుకు : గోదావరి జలాలను తరలించేందుకు 

చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదు: కేంద్ర హోంశాఖ
వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 4న తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదు 
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కేంద్ర హోంశాఖ 
ఎందుకు : జర్మనీ పౌరుడు అయినందున 

‘నల్సార్’లో ఐఐఎల్ సమావేశం 
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ లా (ఐఐఎల్) 78వ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో సెప్టెంబర్ 3న ప్రారంభించారు. ఇందులో దాదాపు 60 దేశాల న్యాయకోవిదులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు మన దేశంలో జరగడం ఇదే తొలిసారి.

ఆర్థికం
రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి : ఆర్‌బీఐ 
 నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ.1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను ఆగస్టు 30న విడుదల చేసిన ఆర్‌బీఐ.. నోట్ల రద్దు తదనంతర ఫలితాలను ఇందులో వివరించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..
రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు.
నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో 98.6% నోట్లు బ్యాంకుల్లో జమకాగా కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదు.
కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు భారీగా పెరిగింది. 2015-16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016-17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది.
చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ.
ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకులకు తిరిగొచ్చిన 99 శాతం రద్దయిన నోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

2017-18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతం
2017-18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి- మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. ఈ మేరకు ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం(CSO) ఆగస్టు 31న విడుదల చేసింది. జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6 శాతంగా నమోదైందని వెల్లడించింది. 
గతేడాది ఇదే కాలంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : కేంద్ర గణాంకాల కార్యాలయం 

ఆధార్-పాన్ అనుసంధానం గడువు పెంపు 
ఆధార్-పాన్ అనుసంధానం గడువుని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 31న ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చింది.
పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఆగస్ట్ 31తో ముగిసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆధార్ - పాన్ అనుసంధానం గడువు పెంపు 
ఎప్పుడు : డిసెంబర్ 31 వరకు 
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 

వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాలని భావిస్తోంది. అలాగే.. 2016లో నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. 
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలం
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆగస్టు 31న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ- సీ 39 రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. భారత్‌కు సొంత దిక్సూచి వ్యవస్థను సమకూర్చడంలో భాగంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మోసుకెళ్లిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయింది. ఉష్ణకవచం (హీట్ షీల్డ్) రాకెట్ నుంచి వేరుపడకపోవడంతో దానిలో ఉన్న ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లలేదనీ, నాలుగో దశలోనే ఇరుక్కుపోయిందని ఇస్రో వెల్లడించింది. 
కాగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు సంక్షిప్త రూపమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం వైఫల్యం చెందడం గత 24 ఏళ్లలో ఇదే తొలిసారి. పీఎస్‌ఎల్‌వీ చరిత్రలోనే రెండోసారి. 1993 సెప్టెంబరు 20న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-డీ1 అనే రాకెట్ ఐఆర్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లడంలో తొలిసారి విఫలమైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ - 39 ప్రయోగం విఫలం 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఇస్రో 
ఎక్కడ : శ్రీహరికోట, నెల్లూరు

ఆరోసారి అణు పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా 
ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా సెప్టెంబర్ 3న ప్రకటించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హైడ్రోజన్ బాంబుని పరీక్షించిన ఉత్తర కొరియా 
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎక్కడ : ఉత్తర కొరియాలో 

అతి భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
మన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కంటే దాదాపు లక్ష రెట్లు ఎక్కువ పరిమాణాన్ని ఇది కలిగి ఉంటుందని తెలిపారు. ఇది మన పాలపుంత కేంద్ర భాగంలో ఉన్న విష వాయువుల సమూహం వెనుక దాక్కుని ఉందన్నారు. మన గెలాక్సీలోని ‘సాజిటేరియస్ ఏ’ అనే కృష్ణ బిలం ఇప్పటివరకు అత్యంత పెద్దది. అయితే, ప్రస్తుతం కనుగొన్న ఈ కృష్ణబిలం రెండో అతిపెద్దది అయి్య ఉండవచ్చని భావిస్తున్నారు. మన పాలపుంత కేంద్ర భాగానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కృష్ణబిలం ఉంది. ఇది దాదాపు 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణబిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయి.

క్రీడలు
ప్రపంచ బాక్సింగ్‌లో గౌరవ్ బిధురికి కాంస్యం
 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన భారత బాక్సర్ గౌరవ్ బిధురి కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు హాంబర్గ్‌లో జరిగిన సెమీఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : భారత బాక్సర్ గౌరవ్ బిధురికి కాంస్యం 
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ

మొయినుద్దౌలా గోల్ట్‌కప్ విజేత హెచ్‌సీఏ ఎలెవన్
ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను హెచ్‌సీఏ ఎలెవన్ దక్కించుకుంది. ఆగస్టు 31న ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మొయినుద్దౌలా గోల్ట్‌కప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : విజేత హెచ్‌సీఏ ఎలెవన్ 
ఎందుకు : ఫైనల్లో ఎయిరిండియాపై విజయం 

ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్ 
ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు సెప్టెంబర్ 3న జరిగిన ఫైనల్ రేసులో 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు ఒకాన్ ఆరో స్థానంలో, మరో డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 
20 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెటెల్ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా.. బొటాస్ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇటలీ గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

శ్రీలంకతో వన్డే సీరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ 
శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్‌ను భారత్ 5 - 0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న కొలంబోలో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్లతో గెలుపొందింది. భారత బౌలర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ (30 సెంచరీలు) సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 
శ్రీలంకతో ఇటీవల జరిగిన మూడు టెస్టుల సీరీస్‌ను కూడా భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 

స్టంపింగ్‌లలో ధోని వరల్డ్ రికార్డు
భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. లంక ఆటగాడు అకిల దనంజయను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో ధోని వంద స్టంపింగ్‌ల రికార్డును సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డులెక్కాడు. తద్వారా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర పేరిట ఉన్న 99 స్టంపింగ్‌ల రికార్డును ధోని అధిగమించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వన్డేల్లో వంద స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : మహేంద్ర సింగ్ ధోని 
ఎక్కడ : కొలంబో
ఎందుకు : శ్రీలంకతో జరిగిన ఐదవ వన్డేలో

స్టార్ ఇండియాకు ఐపీఎల్ ప్రసార హక్కులు 
ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. వేలంలో స్టార్ ఇండియా-సోనీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. చివరికి టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులనూ స్టార్ ఇండియా కై వసం చేసుకుంది. ఈ ఒప్పందం 2018 నుంచి 2022 వరకు ఉంటుంది. 
2008లో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ.8,200 కోట్ల్ల ఒప్పందం చేసుకుంది. 2015లో నోవి డిజిటల్ మూడేళ్లకు రూ.302.2 కోట్లతో డిజిటల్ హక్కులను గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐపీఎల్ ప్రసార హక్కులు 
ఎప్పుడు : 2018-2022 
ఎవరు : స్టార్ ఇండియా 
ఎందుకు : రూ. 16,347.50 కోట్లకు సొంతం

అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ అధికారిక గీతం ఆవిష్కరణ 
ఈ ఏడాది అక్టోబరులో భారత్ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌నకు సంబంధించి అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ‘కర్‌కే దిక్లా దే గోల్’ అనే పేరుతో ఉన్న ఈ గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రచించగా... ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్స్ సునిధి చౌహాన్, నీతి మోహన్, బాబుల్ సుప్రియో, షాన్, పాపోన్, మికాలు పాడారు. 
ఈ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దృశ్యాలతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే వివిధ రాష్ట్రాల వేషధారణ, నృత్యంతో కళాకారులు అలరిస్తారు. సింగర్ షాన్, బాబుల్ సుప్రియో, బైచుంగ్ భూటియాతో పాటు చివర్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నమస్కారం పెడుతూ కనిపిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ అధికారిక గీతం ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 4 
ఎవరు : రచన - అమితాబ్ భట్టాచార్య, సంగీత దర్శకత్వం - ప్రీతమ్ 

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సంతోషికి రజతం 
ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి రజతం సాధించింది. సెప్టెంబర్ 5న జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్‌లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలిచింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.

అవార్డులు
తమిళనాడు పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 
 తమిళనాడు కీచన్‌కుప్పం గ్రామంలోని పంచాయితీ యూనియన్ మిడిల్ స్కూల్‌కు 2017 సంవత్సరానికిగాను స్వచ్ఛ విద్యాలయ పురస్కారం లభించింది. నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్‌‌స ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్ ప్రాక్టిసెస్ కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. సురక్షిత తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, వ్యక్తిగత శుభ్రత వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని పాఠశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. 
2004 డిసెంబరు 26న సంభవించిన సునామీకి ఈ పాఠశాల నేలమట్టమైంది. అలాంటి పాఠశాల ఇప్పుడు సకల సౌకర్యాల స్మార్ట్ స్కూల్‌గా అవతరించి అవార్డును అందుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : కీచన్‌కుప్పం పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్
ఎక్కడ : తమిళనాడు 
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో

యునెస్కో అక్షరాస్యత పురస్కారాలు
ప్రపంచ అక్షరాస్యతకు ఉత్తమంగా, నవ కల్పనలతో కృషి చేసినవారికి యునెస్కో ఇచ్చే ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్‌లను ఈ ఏడాదికి ఆగస్టు 30న ప్రకటించారు. వీటిని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజు (సెప్టెంబర్ 8న) అందజేస్తారు. ఈ బహుమతులను రెండు కేటగిరీల కింద ఇస్తారు. ఒకటి.. చైనా తోడ్పాటుతో అందజేసే ‘కన్‌ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ’. రెండోది.. దక్షిణ కొరియా సహకారంతో ప్రదానం చేసే ‘కింగ్ సెజోంగ్ లిటరసీ ప్రైజ్’. మొదటి బహుమతిని గ్రామీణ ప్రజలకు లబ్దిచేకూర్చే ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లని యువత, మహిళలు, బాలికలకు తోడ్పడే ప్రాజెక్టులకు అందజేస్తారు. ఈ ప్రైజ్ కొలంబియాకు చెందిన అడల్ట్ టికో ప్రోగ్రామ్; పాకిస్థాన్‌కు చెందిన సిటిజన్స్ ఫౌండేషన్; దక్షిణ కొరియాకు చెందిన ఫున్‌ద్జా ప్రాజెక్టుకు లభించింది. రెండో బహుమతిని మాతృభాషా అక్షరాస్యత విద్యా కార్యక్రమాలకు అందజేస్తారు. దీనికి ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్’, జోర్డాన్‌కు చెందిన ‘ఉయ్ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్’ సంయుక్తంగా ఎంపికయ్యాయి. అవార్డు గ్రహీతలకు మెడల్‌తోపాటు రూ.12.8 లక్షల నగదు బహూకరిస్తారు. ఈ ప్రైజ్‌లను 1967 నుంచి అందజేస్తున్నారు.

వార్తల్లో వ్యక్తులు
మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియాగా నితాశా బిశ్వాస్ 
మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా తొలి టైటిల్‌ను కోల్‌కత్తాకు చెందిన ట్రాన్స్ ఉమెన్ నితాశా బిశ్వాస్ దక్కించుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆగస్టు 28న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. 2018లో థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌క్వీన్ పోటీల్లో నితాశా భారత్ తరపున పాల్గొననుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా - 2017
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : నితాశా బిశ్వాస్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

కొత్త కాగ్ రాజీవ్ మహర్షి 
నూతన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా రాజీవ్ మహర్షి ఆగస్టు 31న నియమితులయ్యారు. ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఆగస్టు 30న పదవీ విరమణ చేశారు. రాజీవ్ 1978 బ్యాచ్ రాజస్తాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. ఆ తర్వాత రాజీవ్ మహర్షి బాధ్యతలు చేపడతారు. 
డిప్యూటీ కాగ్‌లుగా అశ్వినీ అత్రి, అనితా పట్నాయక్, రంజన్ కుమార్ ఘోష్‌లు నియమితులయ్యారు. రాజీవ్ మహర్షి స్థానంలో కేంద్ర హోంశాఖ కొత్త కార్యదర్శిగా రాజీవ్ గౌబా బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన గౌబా రెండేళ్లపాటు హోం శాఖ కార్యదర్శిగా ఉంటారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొత్త కాగ్ రాజీవ్ మహర్షి
ఎప్పుడు : ఆగస్టు 31 
ఎందుకు : సెప్టెంబర్ 24తో ముగియనున్న ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీకాలం

ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగిపై చార్జిషీట్
యూపీఏ-2 హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిపై సీబీఐ సెప్టెంబర్ 1న చార్జిషీట్ దాఖలు చేసింది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి త్యాగి రూ.450 కోట్లు ముడుపులు తీసుకున్నారని చార్జిషీట్‌లో పేర్కొంది. వీవీఐపీ హెలికాప్టర్లు ప్రయాణించాల్సిన ఎత్తును 6,000 నుంచి 4,500 మీటర్లకు తగ్గించేలా నిబంధనలు మార్చేందుకు త్యాగి ఒప్పుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. చార్జిషీట్‌లో త్యాగితో పాటు ఆయన బంధువు సంజీవ్ అలియాస్ జూలీ, మాజీ ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్, అడ్వొకేట్ గౌతమ్ ఖైతాన్‌ను నిందితులుగా పేర్కొంది
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఏఎఫ్ మాజీ చీఫ్‌పై సీబీఐ చార్జిషీట్
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎస్పీ త్యాగి
ఎందుకు : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో

కోల్ ఇండియా సీఎండీగా గోపాల్ సింగ్
ప్రపంచ అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీ ‘కోల్ ఇండియా’ తాత్కాలిక సీఎండీగా సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) చీఫ్ గోపాల్ సింగ్ నియమితులయ్యారు. సుతీర్థ భట్టాచార్య ఆగస్ట్ 31న పదవీ విరమణ చేయండతో సింగ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. సీసీఎల్ కోల్ ఇండియా అనుబంధ సంస్థ. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కోల్ ఇండియా కొత్త సీఎండీ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 1 
ఎవరు : గోపాల్ సింగ్
ఎందుకు : సుతీర్థ భట్టాచార్య ఆగస్ట్ 31న పదవీ విరమణ చేసినందుకు

న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ న్యూజిలాండ్‌లో ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా ఎంపికైంది. న్యూజిలాండ్‌లోని విద్యాసంస్థల్లో చేరేలా విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, ప్రచారం కల్పించడం కృతి సనన్ విధులు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా సెప్టెంబర్ 1న ప్రకటించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : కృతి సనన్
ఎందుకు : విదేశీయులు న్యూజిలాండ్‌లో చేరేలా ప్రచారం కల్పించేందుకు

భారత హాకీ కోచ్ ఓల్ట్‌మన్స్ కు ఉద్వాసన 
భారత హాకీ జట్టు కోచ్ పదవి నుంచి రోలంట్ ఓల్ట్‌మన్స్ ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) తప్పించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2న హెచ్‌ఐ వెల్లడించింది. ప్రస్తుత హై పెర్ఫార్మెన్‌‌స డెరైక్టర్ డేవిడ్ జాన్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. పూర్తిస్థాయి కోచ్ నియామకం జరిగే వరకు ఆయన సీనియర్ జట్టు కోచ్‌గా పనిచేస్తారని హెచ్‌ఐ తెలిపింది. 
హాలెండ్‌కు చెందిన ఓల్ట్‌మన్‌‌స తొలుత 2013లో హై పెర్ఫార్మెన్‌‌స డెరైక్టర్‌గా చేరారు. అనంతరం 2015 జూలైలో కోచ్‌గా నియమితులయ్యారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత హాకీ కోచ్ పదవి నుంచి ఓల్ట్‌మన్స్ తొలగింపు 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : హాకీ ఇండియా 

నోవార్టిస్ సీఈవోగా వసంత్ నరసింహన్
స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజం నొవార్టిస్ సీఈవోగా ప్రవాస భారతీయుడు వసంత్ నరసింహన్ నియమితులయ్యారు. 2018 ఫిబ్రవరి 1న ఆయన బాధ్యతలు చేపడతారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న జోసెఫ్ జిమెనెజ్ అప్పటికి సీఈవోగా వైదొలుగుతారు. నరసింహన్ (41) ప్రస్తుతం నోవార్టిస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, ఔషధాభివృద్ధి విభాగం గ్లోబల్ హెడ్‌గా పనిచేస్తున్నారు. 
నొవార్టిస్ మార్కెట్ విలువ 216 బిలియన్ డాలర్లు. సంస్థలో 1,19,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నోవార్టీస్ కొత్త సీఈవో
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : వసంత్ నరసింహన్ 
ఎందుకు : 2018 ఫిబ్రవరి 1న బాధ్యతలు చేపట్టనున్న వసంత్ 

ముషారఫ్.. పరారీలో ఉన్న నేరస్తుడు
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ‘పరారీలో ఉన్న నేరస్తుడి’గా ప్రకటించింది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆగస్టు 31న తీర్పు చెప్పింది. భుట్టో 2007 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు.

"ఐ డూ వాట్ ఐ డూ" పుస్తకావిష్కరణ
 ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ 5న చెన్నైలో జరిగింది. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్‌కి అపరిమితమైన సామర్ధ్యముందని, అయితే సాధించడానికి ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ తిరగడం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : "ఐ డూ వాట్ ఐ డూ" పుస్తకావిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : రచయిత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 
ఎక్కడ : చెన్నైలో 

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌కుమార్
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌కుమార్ సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పనగరియా ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం రాజీవ్‌ను నియమించింది.

అంతర్జాతీయం
టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2018
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018 వివరాలను సెప్టెంబర్ 6న ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, విదేశీ విద్యార్థుల శాతం, బాల, బాలికల నిష్పత్తి, బోధన, పరిశోధన, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ ప్రకారం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3వ స్థానంలో ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకులివ్వగా మన దేశంలోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స గతేడాది 201-250 మధ్య స్థానంలో నిలవగా, ఈసారి 250-300 మధ్య ర్యాంకుకు పడిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ 801-1000 స్థానంలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : టైమ్స్ 
ఎక్కడ : తొలి స్థానంలో ఆక్‌్రఫర్డ్ యూనివర్సిటీ 

2040 నాటికి ఫ్రాన్స్‌లో చమురుఉత్పత్తులపై నిషేధం 
భూతాపాన్ని తగ్గించేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 2040 నాటికి దేశంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తి నిషేధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఇందుకోసం కొత్త బిల్లును తీసుకురానుంది. ఇప్పటికే చమురు తవ్వకాల అనుమతులకు సంబంధించిన లెసైన్‌‌సలను రెన్యువల్ చేయకూడదని ముసాయిదా బిల్లులో పేర్కొన్న ఫ్రాన్‌‌స.. చట్టాన్ని చేసి, అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే చమురు, గ్యాస్ ఉత్పత్తిని నిషేధించే తొలి దేశంగా ఫ్రాన్‌‌స నిలిచిపోనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2040 నాటికి చమురు ఉత్పత్తులపై నిషేధం 
ఎవరు : ఫ్రాన్స్ 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, భూతాపాన్ని తగ్గించేందుకు

పాక్‌కు చెందిన హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం 
పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హబీబ్ బ్యాంక్ లిమిటెడ్(హెచ్‌బీఎల్) న్యూయార్క్ శాఖను మూసివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కట్టడికి నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో పాటు హబీబ్ బ్యాంకుపై 225 మిలియన్ డాలర్ల(రూ.14,385 కోట్లు) జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. 2006 ఒప్పందం ప్రకారం లోపాలను సరిదిద్దుకోవడానికి పలు అవకాశాలు ఇచ్చినప్పటికి హబీబ్ బ్యాంకు వాటిని వినియోగించుకోలేదని డీఎఫ్‌ఎస్ సూపరింటెండెంట్ మారియావుల్లో తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అమెరికా ప్రభుత్వం 
ఎందుకు : అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు కారణంగా 

ఫ్లోరిడాలో పెను విధ్వంసం సృష్టించిన 'ఇర్మా' 
హరికేన్ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 10న ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా ధాటికి ఆ రాష్ట్ర తూర్పు తీరంలో ఊహించని స్థాయిలో ఆస్తినష్టం చోటుచేసుకుంది. హరికేన్ ప్రభావం ఫ్లోరిడాతో పాటు జార్జియా, అలబామా, దక్షిణ, ఉత్తర కరోలినాల్లో కనిపించింది. 
హార్వీ.. ఇర్మా.. ఎందుకీ పేర్లు? 

అంతర్జాతీయం
42 వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు
అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్‌లో ఉన్న 6.7 బిలియన్ డాలర్ల(రూ.42 వేల కోట్లు) విలువైన ఆస్తుల్ని ఆ దేశ ప్రభుత్వం సీజ్ చేసింది. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ మెయిల్ కథనం ప్రకారం దావూద్‌కు వార్విక్‌షైర్‌లో ఒక హోటల్, బ్రిటన్ మిడ్‌లాండ్ ప్రాంతంలో నివాస సముదాయాలున్నాయి. 2015లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దావూద్ ఆస్తుల వివరాల జాబితాను అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్‌కు అందచేశారు. ఆ జాబితాలో లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దావూద్, అతని సన్నిహితుల పేరిట ఇళ్లు, ఫ్లాట్స్, హోటల్స్ వివరాలు ఉన్నాయి. 

సింగపూర్ అధ్యక్షురాలిగా హలీమా 
 ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ సింగపూర్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఒక మహిళ దేశ అత్యున్నత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. నలుగురు ప్రత్యర్థులూ అర్హత ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో.. ఓటింగ్ లేకుండానే ఆమె ఎన్నికయ్యారు. 
63 ఏళ్ల హలీమా సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా, అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున రెండు దశాబ్దాలు ఎంపీగా కొనసాగారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : హలీమా యాకూబ్
ఎక్కడ : సింగపూర్ 

చైనాలో బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ మూసివేత 
క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద బిట్‌కాయిన్ ఎక్స్చేంజీల్లో ఒకటైన బీటీసీచైనా (బిట్‌కాయిన్ చైనా) మూతపడనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 30 నుంచి తమ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 4న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక పత్రం విడుదల చేసిన దరిమిలా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బీటీసీచైనా మూసివేత 
ఎక్కడ : చైనాలో 
ఎవరు : బిట్‌కాయిన్ చైనా సంస్థ 
ఎందుకు : క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో

అమెరికాతో పోటీ పడటమేతమ లక్ష్యం: ఉత్తర కొరియా 
సైనిక సంపత్తి విషయంలో అమెరికాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సెప్టెంబర్ 16న ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి 
సాయుధ సిబ్బంది వాహకాలు
2,500
యుద్ధ ట్యాంకులు
4,060
ఆర్టిల్లరీ, ఎయిర్ డిఫెన్‌‌స గన్‌‌స
32,100
సైన్యం
10, 20,000
యుద్ధ విమానాలు
545
హెలికాప్టర్లు
286
ప్రధాన యుద్ధ నౌకలు
3
తీరప్రాంత గస్తీ నౌకలు
383
ల్యాండిగ్‌క్రాఫ్ట్+హోవర్ క్రాఫ్ట్
267
జలాంతర్గాములు
70

నేపాల్ సరిహద్దుకు చైనా రోడ్డు 
నేపాల్ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి G - 318ని, టిబెట్‌లోని షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన 40 కిలో మీటర్ల పొడవైన రోడ్డును చైనా సెప్టెంబర్ 18న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని పౌర అవసరాలతోపాటు మిలిటరీ సేవలకు కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ రహదారి ద్వారా దక్షిణాసియా ప్రాంతాల్లోకి చేరుకోవడానికి చైనాకు సులభమవుతుంది. టిబెట్ రాజధాని లాస, షిగాసే నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు సమాంతరంగా కొత్త రోడ్డు మార్గం ఉంది. జీ 318 రహదారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరి నుంచే వెళ్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నేపాల్ సరిహద్దు నుంచి షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన రోడ్డు ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : చైనా

దక్షిణ కొరియా, జపాన్‌తో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
దక్షిణ కొరియా, జపాన్‌తో సంయుక్తంగా అమెరికా సైనిక బలగాలు సెప్టెంబర్ 18న శక్తిమంతమైన అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్ సమీప ప్రాంతాల మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు బీ-1బీలు, నాలుగు ఎఫ్-35బీ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా బలగాలకు చెందిన నాలుగు ఎఫ్-15కే యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 
జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించిన మూడు రోజుల తర్వాత అమెరికా ఈ విన్యాసాలు నిర్వహించింది

ఐరాస వేదికగా ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరిక
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ఉత్తర కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని తేల్చిచెప్పారు. 
భూమండలంపై ఏ దేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ వంటి అణ్వాయుధాలు, మిసైళ్లు కలిగిన నేరస్తులుండరని ట్రంప్ అన్నారు. కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా సంబోధించారు. రాకెట్ మ్యాన్ ఆత్మహత్య మిషన్‌లో ఉన్నారని ట్రంప్ హెచ్చరించారు. 
ఉగ్రసాయాన్ని ఉపేక్షించం 
ఈ ప్రసంగంలోనే పరోక్షంగా పాకిస్తాన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి సాయం చేస్తున్న దేశాలను గుర్తించి వారిని బాధ్యులుగా చేయాలన్నారు. గత నెలలో పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానుకోవాలంటూ ట్రంప్ నేరుగా తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియాకు హెచ్చరిక
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : ఐరాస వేదికగా 
ఎందుకు : ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షల నేపథ్యంలో

హెచ్-1బీ వీసా ప్రక్రియను పునరుద్ధరించిన అమెరికా 
ఐదు నెలల కిందట అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్-1బీ వర్క్ వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసింది. తిరిగి సెప్టెంబర్ 18న దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించింది. ఈ మేరకు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించినట్టు ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరానికి 65 వేల వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హెచ్ - 1బీ వీసా ప్రక్రియ పునరుద్ధరణ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18 
ఎవరు : అమెరికా 

జాతీయం 
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన 
 ముంబయి - అహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ఇందులో 468 కిలోమీటర్లు ఉపరితల రైల్వే మార్గం కాగా 27 కిలోమీటర్లు గొట్టపు మార్గం. ఇది సముద్రగర్భం గుండా సాగుతుంది. 
ప్రాజెక్టు ముఖ్యాంశాలు.. 
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ.1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.88,000 కోట్లను కేవలం 0.1 శాతం వడ్డీకి జపాన్ రుణంగా అందిస్తోంది. ఈ రుణం మొత్తాన్ని 50 సంవత్సరాల్లో తీర్చాలి.
ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 825 హెక్టార్ల భూమిని ఇప్పటికే సేకరించారు. ఈ మార్గంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ 508 కిలోమీటర్ల గమ్యాన్ని కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకుంటుంది.
ఈ మార్గంలో నడిపేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 4 రైళ్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. నిర్వహణ కోసం 4 వేల మంది భారతీయులకు రానున్న మూడేళ్లలో శిక్షణ ఇస్తారు. ఇప్పటికే భారతీయ రైల్వేకు చెందిన 300 మంది ప్రస్తుతం జపాన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
2020 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 20 వేల మందికి ఉపాధి దక్కుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి శంకుస్థాపన 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే 
ఎక్కడ : అహ్మదాబాద్ 

గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్‌కు 103వ స్థానం 
గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్-2017లో భారత్ 103 స్థానంలో నిలిచింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సెప్టెంబర్ 13న ఈ నివేదికను విడుదల చేసింది. జాబితాలో నార్వే తొలి స్థానాన్ని దక్కించుకోగా.. ఫిన్‌లాండ్ రెండు, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 
బ్రిక్స్ దేశాల పరంగా చూస్తే ఈ నివేదికలో భారత్‌దే అట్టడుగు స్థానం. 
గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్-2016లో భారత్ 105వ ర్యాంకులో నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం 
ఎక్కడ : 103వ స్థానంలో భారత్ 

రోహింగ్యాలకు సాయం కోసం ఆపరేషన్ ఇన్‌సానియత్ 
మయన్మార్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కు భారీగా వస్తోన్న రోహింగ్యా శరణార్థులకు సాయం అందించేందుకు భారత్ 'ఆపరేషన్ ఇన్‌సానియత్' చేపట్టింది. ఇందులో భాగంగా రోహింగ్యా శరణార్థుల కోసం ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులు, దోమ తెరలను సరఫరా చేస్తుంది. అలాగే.. బంగ్లాదేశ్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆపరేషన్ ఇన్‌సానియత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : బంగ్లాదేశ్‌లో 
ఎందుకు : రోహింగ్యా శరణార్థుల సహాయార్థం 

‘స్వచ్ఛత హీ సేవ’ ప్రారంభించిన రాష్ట్రపతి 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌కు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛత హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచారం కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 2 వరకూ సాగే ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈశ్వరీ గంజ్ గ్రామంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. గ్రామాన్ని బహిర్భూమి రహితంగా మార్చేందుకు ఈశ్వరీగంజ్ గ్రామస్తులు చూపిన చొరవను రాష్ట్రపతి ప్రశంసించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వచ్ఛత హీ సేవ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎక్కడ : ఈశ్వరీ గంజ్ గ్రామం, ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : స్వచ్ఛభారత్‌కు 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 

సర్దార్ సరోవర్ ఆనకట్టను ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
గుజరాత్‌లోని దభోయ్ సమీపంలో కెవాదియా వద్ద నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్టను సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం.. ఆనకట్టను జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం 1980లోనే ప్రారంభించినా.. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్యాం ఎత్తు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. ఎత్తు పెంచిన ఆనకట్టనే తాజాగా మోదీ ప్రారంభించారు. 
ప్రయోజనాలివి... 
సర్దార్ సరోవర్ ఆనకట్టతో గుజరాత్‌లో 131 పట్టణ ప్రాంతాలు, 9,633 గ్రామాల (గుజరాత్‌లోని మొత్తం గ్రామాల్లో ఇది 53 శాతం)కు తాగునీరు లభిస్తుంది.
గుజరాత్‌లో మొత్తం 15 జిల్లాల్లోని 3,112 గ్రామాల్లోని 18.54 లక్షల హెక్టార్ల ఎకరాలకు సాగునీరు.
గుజరాత్‌తోపాటు రాజస్తాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జలోర్‌లో 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సర్దార్ సరోవర్ ఆనకట్ట ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : దభోయ్, గుజరాత్ 

రోహింగ్యాలతో జాతీయ భద్రతకు ముప్పు: కేంద్రం 
భారత్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యా ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రోహింగ్యాల వలసలపై సెప్టెంబర్ 18న కేంద్రం.. కోర్టు రిజిస్ట్రీకి సమగ్ర అఫిడవిట్‌ను సమర్పించింది. ప్రస్తుతం భారత్‌లోని రోహింగ్యా శరణార్థుల్లో కొందరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు ఐసిస్, లష్కరే తోయిబా, అల్‌కాయిదా తదితర ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని, వారు భారత్‌లోనే ఉంటే జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని విన్నవించింది. 
ఐక్యరాజ్యసమితి 1951 శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న నిబంధనలు తమకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలరీత్యా విధానపరమైన నిర్ణయాల ద్వారా రోహింగ్యాలను మయన్మార్‌కు తిప్పిపంపడానికి అనుమతించాలని సుప్రీంకోర్టుని కోరింది. 


గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 
దేశంలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య 17 లక్షలకు పైగానే ఉంది. ఇటీవల విడుదలైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 ఈ విషయాలను వెల్లడిస్తోంది. 2016లో దేశంలో మరణాలకు కారణమవుతున్న పది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అందులో గుండె సంబంధిత వ్యాధులు తొలి స్థానంలో ఉన్నాయి. 2005లో కూడా గుండె సంబంధిత వ్యాధులదే ఫస్ట్ ప్లేస్. 
నివేదికలోని వివరాలు..
గుండె సంబంధిత వ్యాధుల వల్ల 2016లో దేశంలో 17 లక్షల మంది మరణించారు. 2005తో పోలిస్తే ఈ సంఖ్య 53 శాతం పెరిగింది.
దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో గుండె సంబంధిత వ్యాధులు 17.8 శాతం ఉన్నాయి.
డయేరియా వల్ల మరణాల సంఖ్య 2005తో పోలిస్తే 26 శాతం పెరిగింది. 2016లో 7,78,000 డయేరియా మరణాలు నమోదయ్యాయి.
2016లో రెండో ప్రధాన కారణమైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వల్ల దేశంలో 8,48,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
నాలుగో ప్రధాన కారణమైన పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల వల్ల 2016లో 6,94,000 మంది మరణించారు.
నెలలు నిండకుండా పుట్టిన శిశు మరణాల సంఖ్య 2005తో పోలిస్తే 2016లో 43.6 శాతం తగ్గి 1,44,000గా నమోదైంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 
ఎప్పుడు : సెప్టెంబర్ 19 
ఎక్కడ : భారత్‌లో 

చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం 
1960ల్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్‌లకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్‌లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్‌కు వలస వచ్చారు. అప్పుడు వారు 5 వేల మంది దాకా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్‌లో 

కావేరి పుష్కరాలు 
కావేరి నది పుష్కరాలు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యాయి. ఇవి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 

ద్వైపాక్షికం 
భారత్ - జపాన్ మధ్య 15 ఒప్పందాలు
 భారత్ - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 14న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌర అణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 

రాష్ట్రీయం
వంశధార జలాల వివాదంపై తుది తీర్పు 
వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ వంశధార జలాల వివాద పరిష్కార న్యాయస్థానం(వీడబ్ల్యూడీటీ) సెప్టెంబర్ 13న తుది తీర్పు వెలువరించింది. కాట్రగడ్డ సైడ్ వియర్ (మత్తడి- అడ్డుగోడ), నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మొహమ్మద్‌లతో కూడిన ధర్మాసనం 14 క్లాజులతో కూడిన ఆరు పేజీల తీర్పును వెలువరించింది. 
వంశధార జలాలు చెరిసగం
గొట్టా బ్యారేజ్ వద్ద వంశధారలో అందుబాటులో ఉండే నదీ జలాలు 115 టీఎంసీలుగా ట్రిబ్యునల్ నిర్ధారించింది. రెండు రాష్ట్రాల మధ్య సెప్టెంబరు 30, 1962న కుదిరిన ఒప్పందం మేరకు వంశధార జలాల్లో చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయించింది.
నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు అప్పగించాలని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది.
కాట్రగడ్డ సైడ్ వియర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి 8 టీఎంసీలు మళ్లించే దాకా గానీ లేదా నవంబర్ 30వరకూ గానీ తెరిచి ఉంచాలని.. డిసెంబర్ 1న మూసివేయాలంటూ షరతు విధించింది. నేరడి బ్యారేజి పూర్తయిన తరువాత కాట్రగడ్డ సైడ్ వియర్‌ను తొలగించాలని స్పష్టంచేసింది.
ఈ తీర్పు అమలుకు వంశధార నదీ యాజమాన్య బోర్డు (వీఎంఆర్‌బీ)ని ఏర్పాటు చేయాలని సూచించింది.

తెలంగాణలో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళన
 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 100 రోజులపాటు ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,343 బృందాలు పనిచేస్తాయి. 
ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇచ్చేవి : 
1) ఆన్‌లైన్-1బీ ప్రతి
2) రశీదు
3) మార్పుచేర్పుల ప్రతిపాదన పత్రం.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎక్కడ : తెలంగాణలో 

తెలంగాణలో దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు 
పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. '1962' టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ సంచార పశు వైద్యశా లలను సంప్రదించవచ్చు. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరేలా రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎక్కడ : తెలంగాణలో 
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

తెలంగాణ-ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి నివేదిక
తెలంగాణ రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది. ఈ మేరకు అసోచామ్ ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘తెలంగాణ-ఆర్థికవృద్ధి,పెట్టుబడుల పురోగతి’ పేరుతో ఒక నివేదికను సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం పెట్టుబడుల సమీకరణలో గత ఐదేళ్లలో తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. అలాగే.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి రూ.3.3 లక్షల కోట్ల దేశ, విదేశీ పెట్టుబడులు వస్తే... 2016-17లో రూ.5.9 లక్షల కోట్లు వచ్చాయి. 
నివేదికలోని ప్రధాన అంశాలు
ఐదేళ్ల వ్యవధిలో పెట్టుబడుల సాధనలో జాతీయ వృద్ధి రేటు 27 శాతంగా నమోదుకాగా... తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకున్నా.. 68.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే వ్యవధిలో జాతీయ సగటు వృద్ధి 20.8 శాతం మాత్రమే.
గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.177 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అందులో 3.3 శాతం వాటాను నిలుపుకుంది.
పెట్టుబడుల సమీకరణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. 2012తో పోలిస్తే 2017 నాటికి తెలంగాణ 79 శాతం వృద్ధి సాధిస్తే.. ఆంధ్రప్రదేశ్ 50.8 శాతం, కేరళ 18.9 శాతం, తమిళనాడు 11.2 శాతం, కర్ణాటక 0.2 శాతం వృద్ధి సాధించాయి.
2017లో తెలంగాణ ప్రాంత ఆర్థికవృద్ధి రేటు 8.5 శాతానికి చేరింది. ఇదే వ్యవధిలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
తెలంగాణలో 55 శాతం మంది జనాభా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ-ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి నివేదిక 
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : అసోచామ్

2017-18 తొలి త్రైమాసికంలో ఏపీ వృద్ధి రేటు 11.72 శాతం 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపని ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15న వెల్లడించారు. ఈ వృద్ధి రేటులో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో హర్యానా తొలి స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 11.72 శాతం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 

విశాఖపట్నంలో ప్రాంతీయ పర్యావరణ సదస్సు
జాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు విశాఖలో సంయుక్తంగా ప్రాంతీయ పర్యావరణ సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లోని మైదాన ప్రాంతంలో 2029 సంవత్సరం నాటికి 50 శాతం పచ్చదనం నింపుతామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం పచ్చదనం మాత్రమే ఉందన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రాంతీయ పర్యావరణ సదస్సు 
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్, ఏపీ - తెలంగాణ కాలుష్య నియంత్రణ మండళ్లు 
ఎక్కడ : విశాఖపట్నంలో 

తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ సదారాం 
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి నియమి తులయ్యారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపాదించగా.. సెప్టెంబర్ 15న గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 
ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : రాజ సదారాం 

డిసెంబర్‌లో తెలుగు మహాసభలు 
హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించను న్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. 

ఆర్థికం 
బ్రాండ్జ్ ఇండియా నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 
 దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ మేరకు దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్‌‌జ ఇండియా టాప్ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్ మిల్‌వర్డ్ బ్రౌన్ సంస్థలు సెప్టెంబర్ 14న ప్రకటించాయి. 
ఈ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని నాలుగేళ్ల నుంచి కాపాడుకుంటు వస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. 2014 నుంచి తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. కాగా కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్‌‌స జియో 11వ స్థానం సంపాదించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రాండ్జ్ ఇండియా టాప్ 50 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : మొదటి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ 
ఎక్కడ : భారత్‌లో 

జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు 
విదేశీ మారక నిల్వలు జీవిత కాల గరిష్ఠానికి చేరాయి. గత వారం నిల్వలు 398.122 బిలయన్ డాలర్లతో పోలిస్తే, ఈ వారం 2.604 బిలియన్ డాలర్లు పెరిగి 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న తాజా గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 2.568 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 376.209 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల్లో మార్పులు లేకుండా 20.691 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 
విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరడం వల్ల, ఏడాది పాటు మన దిగుమతులకు సరిపోతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 400.726 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 

10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17 
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

బీపీసీఎల్‌కు మహారత్న హోదా 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న ‘మహారత్న’ హోదా ప్రకటించింది. నవరత్న కంపెనీ అయి ఉండి గత మూడేళ్లలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.25,000 కోట్లకుపైగా సగటు వార్షిక టర్నోవర్ నమోదు చేసిన వాటికి ఈ హోదా ఇస్తారు. గత మూడేళ్లలో రూ.15,000 కోట్ల సగటు నికర విలువ, రూ.5000 కోట్ల సగటు వార్షిక నికర లాభం ఆర్జించి ఉండాలి. మహారత్న హోదా వచ్చిన ప్రభుత్వ కంపెనీలకు రూ.1000-5000 కోట్ల వరకు పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవ డానికి స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా ఉన్నవాటికి ఈ పరిమితి రూ.1000 కోట్లు. 

సుస్థిర ఆరోగ్య లక్ష్యాల సాధనలో128వ స్థానం 
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని ఆరోగ్య సంబంధ గమ్యాలను చేరుకోవడంలో భారత్ వెనకబడుతోందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక సెప్టెంబర్ 12న తెలిపింది. ఈ లక్ష్యాలను 2030లోగా చేరుకోవాలి. ఈ దిశగా సాధించిన ప్రగతిలో వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, హెపటైటిస్-బి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల్లో బాగా వెనకబడిందని వివరించింది. 1990-2014లోని ధోరణులను విశ్లేషిస్తూ వాషింగ్టన్ వర్సిటీ అనుబంధ సంస్థ జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్’ పేర్కొంది. 180 దేశాలకు సంబంధించి 2030 నాటికి ఉండబోయే పరిస్థితిపై అంచనాలు రూపొందించింది. 

సైన్స్ అండ్ టెక్నాలజీ 
నాసా ఉపగ్రహంతో మలేరియా నివారణ చర్యలు 
 ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ప్రాణాంతక మలేరియా వ్యాధిని అరికట్టడానికి అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనుగొన్నారు. నాసా అభివృద్ధి పరిచిన భూపర్యవేక్షక ఉపగ్రహాన్ని ఉపయోగించి ఏ ఏ ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందో తెలుసుకొని ముందుగానే నివారణ చర్యలు చేపట్టవచ్చని వెల్లడించారు. 
మలేరియా ప్రభావిత ప్రాంతాల గణాంకాలను సేకరించి.. తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు దోమల మందు చల్లడం, దోమ తెరలు అందజేయడం, ప్రజల్లో అవగాహనా తేవడానికి ఈ ఉపగ్రహ విధానం ఉపయోగపడుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నాసా ఉపగ్రహంతో మలేరియాను నివారించే విధానం 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 
ఎక్కడ : అమెరికాలో 

మరోసారి జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి 
జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ప్యాంగ్‌యాంగ్ నుంచి సెప్టెంబర్ 15న ఈ క్షిపణిని ప్రయోగించింది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో.. 3,700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిందని దక్షిణకొరియా రక్షణ శాఖ వెల్లడించింది. మూడు వారాల క్రితం జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. అలాగే ఈ నెలలో మరోసారి అణుపరీక్షలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కొత్తగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. 

శనిగ్రహంపై ముగిసిన స్పేస్‌క్రాఫ్ట్ కస్సీని ప్రస్థానం 
శనిగ్రహానికి(సాటర్న్) సంబంధించిన వివరాలను, విశేషాలను అద్భుత చిత్రాల రూపంలో అందించిన కస్సీని అంతరిక్ష నౌక 20 ఏళ్ల ప్రస్థానం సెప్టెంబర్ 15తో ముగిసింది. ఈ మేరకు కస్సీని ప్రస్థానానికి ముగింపునిచ్చేందుకు నాసా శాస్త్రవేత్తలు దానిని శనిగ్రహ వాతావరణంలోకి పంపించి, దానికదే మండిపోయేలా చేశారు. 
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనిగ్రహ సమాచార సేకరణ కోసం ఈ నౌకను 1997 అక్టోబర్‌లో ప్రయోగించింది. జూలై 2004 నుంచి 2017 సెప్టెంబర్ వరకు కస్సీని 4.5 లక్షల చిత్రాలను, 635 గిగాబైట్ల సమాచారాన్ని పంపించింది. ఆ వివరాలు ముఖ్యంగా శనిగ్రహానికి, ఆ గ్రహానికి చెందిన 62 ఉపగ్రహాలకు సంబంధించినవి. 

‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం 
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే-బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజుల పాటు జరిగిన ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ సెప్టెంబర్ 15న ప్రకటించింది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అస్త్ర క్షిపణి పరీక్షలు విజయవంతం 
ఎప్పుడు : సెప్టెంబర్ 11 - 14 
ఎవరు : రక్షణ శాఖ 
ఎక్కడ : చాందీపూర్ తీరం, ఒడిశా 
ఎందుకు : గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే-బీవీఆర్‌ఏఏఎమ్ 

మూడో శతాబ్దంలోనే భారత్‌లో సున్నా 
గణితంలో ఎంతో కీలకమైన సున్నాను భారతీయులు మూడో శతాబ్దంలోనే విరివిగా వినియోగించారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. అవిభక్త భారత్‌లోని బక్షాలి గ్రామంలో(ఇప్పటి పాకిస్తాన్‌లో ఉంది) 1881లో ఓ పొలంలో దొరికిన రాతప్రతిని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. 
ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 9వ శతాబ్దానికి చెందిన ఓ దేవాలయం గోడలపై ఉన్న సున్నాయే ప్రాచీనమని భావించినట్లు పరిశోధనలో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మార్కస్ డు సౌటోయ్ వెల్లడించారు. గతంలో పరిశోధకులు బక్షాలి రాతప్రతిని 8 నుంచి 12వ శతాబ్ద కాలానికి చెందినదిగా భావించినట్లు పేర్కొన్నారు. 

గూగుల్ ‘తేజ్’ సేవలు ప్రారంభం 
డిజిటల్ చెల్లింపుల కోసం టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంస్థ రూపొందించిన ‘తేజ్’ యాప్‌ని సెప్టెంబర్ 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఇది కేవలం భారత మార్కెట్ కోసమే తీసుకొచ్చిన యాప్ అని, ఎలక్ట్రానిక్ చెల్లింపులను మరింత భద్రంగా సులభంగా నిర్వహించడమే తేజ్ లక్ష్యమని గూగుల్ పేర్కొంది. 
కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యాప్‌లోకి బ్యాలన్స్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా.. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. 
తేజ్ సేవలకు గాను గూగుల్ యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న 50 బ్యాంకుల కస్టమర్లు తేజ్ సేవలు వినియోగించుకోవచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిజిటల్ చెల్లింపుల యాప్ తేజ్ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : గూగుల్ 
ఎక్కడ : భారత్‌లో

డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన మహీంద్రా 
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎంఅండ్ఎం) దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని వచ్చే ఏడాది దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇక 20 హెచ్‌పీ- 100 హెచ్‌పీ శ్రేణిలోని ట్రాక్టర్లలోనూ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : మహింద్రా అండ్ మహింద్రా 

క్రీడలు
152 మంది 'టాప్' అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు 
 టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మంది అథ్లెట్లకు ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున ‘పాకెట్‌మనీ’గా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. 2017 సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 'టాప్' అథ్లెట్లకు నెలకు రూ. 50 వేల పాకెట్‌మనీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 1 నుంచి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు

ఐటీఎఫ్ మహిళ టోర్నీలో ప్రాంజల జోడీకి టైటిల్ 
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, భారత్‌కే చెందిన జీల్ దేశాయ్ ద్వయం డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫెనల్లో ప్రాంజల-జీల్ దేశాయ్ ద్వయం 6-2, 7-5తో రుతుజా భోస్లే (భారత్)-అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొందింది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. 
డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6-4, 2-6, 7-5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : డబుల్స్ విజేత ప్రాంజల, జీల్ దేశాయి 

10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

కొరియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధు
దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు సొంతం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22-20, 11-21, 21-18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
సింధు కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధు 
ఎక్కడ : సియోల్, దక్షిణకొరియా 

సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ 
సింగపూర్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడీస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 17న జరిగిన రేసుని హామిల్టన్ 2 గంటల 45 ని.008 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం పొందగా, వాల్టెరి బొటాస్ (మెర్సిడెజ్) మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఐదు, ఈస్టెబన్ ఒకాన్ పదో స్థానం సాధించారు.
ఈ సీజన్ గ్రాండ్ ప్రీలలో హామిల్టన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం. ఇంతకముందు ఇటలీ, బెల్జియం గ్రాండ్‌ప్రిలలోను హామిల్టన్ విజేతగా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింగపూర్ గ్రాండ్ ప్రీ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : టైటిల్ విజేత లూయిస్ హామిల్టన్ 
ఎక్కడ : సింగపూర్ 

ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణాలు
ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్‌‌ట్స క్రీడల్లో సెప్టెంబర్ 19న భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్... మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాలను సొంతం చేసుకోగా... బెల్ట్ రెజ్లింగ్‌లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మణన్ 8 నిమిషాల 2.30 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. చిత్ర 4 నిమిషాల 27.77 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. బెల్ట్ రెజ్లింగ్ 70 కేజీల విభాగం సెమీఫైనల్లో అనామిరదోవ్ (తుర్క్‌మెనిస్తాన్) చేతిలో ధర్మేందర్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడలు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎక్కడ : అష్గబాత్, తుర్క్‌మెనిస్తాన్ 

వార్తల్లో వ్యక్తులు
ట్రంప్ డిప్యూటీ అసిస్టెంట్‌గా భారత సంతత వ్యక్తి 
 భారత సంతతి వ్యక్తి రాజ్ షా(32) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్ సెప్టెంబర్ 13న ప్రకటించింది. సమాచార డెరైక్టర్‌గా హోప్ హిక్స్‌ను నియమించినట్లు పేర్కొంది. రిపబ్లికన్ నేషనల్ కమిటీలో పరిశోధన విభాగానికి నేతృత్వం వహించిన షా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్‌గా భారత సంతతి వ్యక్తి 
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రాజ్ షా 
ఎక్కడ : అమెరికా 

ఏబీసీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ
దేశంలోని పత్రికల సర్క్యు లేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌‌స (ఏబీసీ) చైర్మన్‌గా కోకకోలా సంస్థ ఆగ్నేయాసియా రీజియన్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017-18 సంవత్సరానికిగాను ఆయన ఈ పదవిలో ఉంటారు. 
వ్యూహాత్మక ప్రణాళికలు, విక్రయాలు, మార్కెటింగ్ ఆపరేషన్లలో 23 ఏళ్లకుపైగా అనుభవమున్న దేబబ్రత.. దేశంలో కోకకోలా సంస్థ విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ముంబై సమాచార్ పత్రికకు చెందిన హర్మూస్‌జీ ఎన్ కమా, ఏబీసీ సచివాలయం సెక్రటరీ జనరల్‌గా హర్మూజ్ మాసాని ఎన్నికయ్యారు. 
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్‌ను 1948లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యలేషన్స్‌కు కొత్త చైర్మన్ 
ఎప్పుడు : 2017-18 సంవత్సరానికి 
ఎవరు : దేబబ్రత ముఖర్జీ 

ఐఎన్‌ఎస్ అధ్యక్షురాలిగా అకిల ఉరంకర్
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షురాలిగా 2017-18 ఏడాదికిగానూ బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికకు చెందిన అకిల ఉరంకర్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 15న బెంగళూరులో జరిగిన ఐఎన్‌ఎస్ 78వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సొసైటీ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనోరమకు), ఉపాధ్యక్షుడిగా శైలేష్ గుప్తా (మిడ్-డే), జనరల్ సెక్రటరీగా ఎస్పీ కౌర్, గౌరవ ట్రెజరర్‌గా శరత్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) సభ్యుడిగా ‘సాక్షి’ మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్ డెరైక్టర్ కె. రాజప్రసాద్ రెడ్డి (కేఆర్‌పీ రెడ్డి) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 41 మందిని ఎన్నుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఎన్‌ఎస్ నూతన కార్యవర్గం 
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అధ్యక్షురాలిగా అకిల ఉరంకర్ 

ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌లో సురేశ్ చిట్టూరి
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) వైస్ చైర్మన్‌గా శ్రీనివాసా ఫామ్స్ ఎండీ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఈ పదవి పొందిన రెండో వ్యక్తిగా రికార్డు స్థాపించారు. ఐఈసీ బోర్డులో తొలిసారిగా దేశం నుంచి వెంకటేశ్వర హ్యాచరీస్ వ్యవస్థాపకులు బి.వి.రావు 1992-93లో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా కోడిగుడ్ల పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఈసీలో 80 దేశాల నుంచి సభ్యులు ఉన్నారు. ఉత్పత్తి, పోషకాహారం, విక్రయం వంటి అంశాల్లో ఆధునిక అభివృద్ధి సమాచారాన్ని వీరు ఇచ్చిపుచ్చుకుంటారు.

భారత వాయుసేన మార్షల్ అర్జన్ సింగ్ కన్నుమూత 
1965 భారత్-పాక్ యుద్ధ వీరుడు, భారత వాయుసేన (ఐఏఎఫ్) మార్షల్ అర్జన్ సింగ్(98) సెప్టెంబర్ 16న ఢిల్లీలో కన్నుమూశారు. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ స్థాయి అయిన ఫైవ్ స్టార్ ర్యాంకుకు ప్రమోటైన ఏకైక అధికారి అర్జన్ సింగ్. ఆయన రిటైర్మెంట్ తర్వాత దౌత్యవేత్తగా భారత్‌కు సేవలందించారు. 
అర్జన్ సింగ్ 1964 నుంచి 1969 వరకు ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగారు. ఐఏఎఫ్‌ను ప్రపంచ వైమానిక బలగాల్లో ఒక సమర్థవంతమైన వ్యవస్థగా, నాలుగో అతిపెద్ద వైమానిక శక్తిగా మలచిన ఘనత ఆయనదే. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి రిటైర్మెంట్ వరకు 60కి పైగా వివిధ యుద్ధ, సైనిక రవాణా విమానాలను ఆయన నడిపారు. 1965 భారత్-పాక్‌లో యుద్ధంలో.. పాకిస్తాన్ చేపట్టిన ‘ఆపరేషన్ గ్రాండ్‌శ్లామ్’ను తిప్పికొట్టంలో అర్జన్ సింగ్ పాత్ర అత్యంత కీలకం. ఇందుకుగానూ 1965లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్‌తో గౌరవించింది. 
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాను ఆక్రమించుకున్న జపాన్ సేనలపై సింగ్ నేతృత్వంలోని భారత వాయుసేన భీకర దాడులు చేసింది. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్’ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ పైలట్ కూడా ఆయనే. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఏఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

స్కొలాస్టిక్ కిడ్ రిపోర్టర్ లుగా భారతీయులు
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక స్కొలాస్టిక్‌కు కిడ్ రిపోర్టర్లుగా ముగ్గురు భారతీయ చిన్నారులు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 44 మందిని ఎంపికచేశారు. ఈ జాబితాలో ఢిల్లీకి చెందిన అనన్యా చోప్రా, కోల్‌కతాకు చెందిన రూప్‌కథా రాయ్, బెంగళూరుకు చెందిన సాకేత్ దేవులపల్లిలకు చోటు దక్కింది. వీరంతా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రీడలు, వినోదం సహా పలు కార్యక్రమాలను రిపోర్టు చేయనున్నారు. వీరు సేకరించిన వార్తలు, కథనాలను సంస్థ వెబ్‌సైట్ సహా స్కొలాస్టిక్ క్లాస్‌రూమ్ మేగజైన్ల్లలో ప్రచురిస్తారు. 
గతేడాది రిపోర్టర్లుగా ఎంపికై న చిన్నారులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సహా పలు కార్యక్రమాలను రిపోర్ట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్కొలాస్టిక్ కిడ్ రిపోర్టర్లుగా 44 మంది చిన్నారులు 
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : భారత్ నుంచి ముగ్గురు ఎంపిక. రూప్‌కథా రాయ్, సాకేత్ దేవులపల్లి, అనన్యా చోప్రా.

ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకు కేంద్ర న్యాయశాఖ ఆరుగురు న్యాయమూర్తులను నియమించింది. ఈ మేరకు న్యాయమూర్తులు దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్‌ల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపారు. వీరిలో సోమయాజులు విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా, మిగతా ఐదుగురు ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు. ఓ జిల్లా కోర్టు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం మన హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నియామకాలతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. హైకోర్టులో ఇంకా 28 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు నియామకం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18 
ఎవరు : కేంద్ర న్యాయశాఖ 
ఎక్కడ : హైదరాబాద్ 
ఎందుకు : హైకోర్టులో 33కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య 

ఎన్‌ఐఏ కొత్త చీఫ్‌గా వైసీ మోదీ 
ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కొత్త డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 మే 31 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 
1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన మోదీ ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డెరైక్టర్‌గా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో వైసీ మోదీ కూడా సభ్యునిగా ఉన్నారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో నరోదా పటియ, నరోదాగామ్, గుల్బర్గ్ సొసైటీ కేసులను వైసీ మోదీ దర్యాప్తు చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త డెరైక్టర్ జనరల్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 18 
ఎవరు : వైసీ మోదీ 
ఎందుకు : పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ 

ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా రజనీకాంత్ మిశ్రా 
ఇండో-నేపాల్ సరిహద్దుల్లో గస్తీ కాసే సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రా నియమితులయ్యారు. 1984 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మిశ్రా ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్)లో అదనపు డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా 2019 ఆగస్టు 31 వరకూ కొనసాగుతారు. 
ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అర్చనా రామసుందరం సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. అనంతరం రజనీకాంత్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సశస్త్ర సీమా బల్ కొత్త డెరైక్టర్ జనరల్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 18 
ఎవరు : రజనీకాంత్ మిశ్రా 
ఎందుకు : సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డెరైక్టర్ జనరల్ అర్చనా రామసుందరం 

ప్రపంచంలో అత్యంత వృద్ధ మనిషి కన్నుమూత 
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మనిషిగా గుర్తింపు పొందిన వయోలెట్ మోసె బ్రౌన్ 117 ఏళ్ల వయసులో మరణించింది. తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆమె సెప్టెంబర్ 15న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 
1900, మార్చి 10న బ్రిటిష్ పాలనలోని జమైకాలో బ్రౌన్ జన్మించారు. 2015లో బ్రౌన్ 115వ పుట్టిన రోజు సందర్భంగా బ్రిటన్ రెండో ఎలిజబెత్ రాణి ఆమె గౌరవార్థం ఓ లేఖను పంపారు. ఈ ఏడాది జూలై 27న 117 ఏళ్ల 139 రోజుల బ్రౌన్ పేరును గిన్నిస్ బుక్ అత్యంత వృద్ధ మహిళగా తమ రికార్డులో నమోదు చేసింది. బ్రౌన్ మరణంతో జపాన్‌కు చెందిన నబీ తాజిమా(117 ఏళ్ల 46 రోజులు) అత్యంత వృద్ధ మనిషిగా నిలుస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో అత్యంత వృద్ధ మనిషి వయోలెట్ మోసె బ్రౌన్ కన్నుమూత 
ఎప్పుడు : సెప్టెంబర్ 19 
ఎక్కడ : జమైకా 

పీపీ రావుకన్నుమూత 
రాజ్యాంగ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పావని పరమేశ్వరరావు (పీపీ రావు) సెప్టెంబర్ 13న మరణించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన.. న్యాయ విభాగంలో 50 ఏళ్ల పాటు సేవలందించారు. దీనికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2010 మార్చిలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 

అవార్డులు 
స్వాతిలక్రాకు హాంపరీ లీడర్ షిప్ అవార్డు 
హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (నేరాలు), షీ-టీమ్స్ వ్యవస్థాపక ఇన్‌చార్జి స్వాతి లక్రాకు హాంపరీ లీడర్ షిప్ అవార్డు దక్కింది. భారత్ తరఫున ఆమెను అమెరికన్ కాన్సులేట్ నామినేట్ చేసింది. మొత్తం పది దేశాల నుంచి ఎంట్రీలు రాగా.. భారత్ నుంచి స్వాతితో పాటు మరొ కరు మాత్రమే ఉన్నారు. హార్వర్డ్ వర్సిటీలో నెల పాటు జరిగే ఓరియెంటేషన్ ప్రోగామ్ తర్వాత అవార్డును ప్రదానం చేయనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వాతి లక్రాకు హాంపరీ లీడర్‌షిప్ అవార్డు 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : అమెరికా 

‘స్వచ్ఛత’ అవార్డులు ప్రదానం చేసిన కేంద్రం 
దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్‌ను పెంచడంలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ.. స్వచ్ఛత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసింది. జిల్లాల్లో స్వచ్ఛతకు పెద్దపీటవేస్తూ ఆదర్శ గ్రామాలను రూపొందించినందుకుగానూ వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వరుసగా మూడు, నాలుగు ర్యాంకులతో అవార్డులు అందుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని శంభునిపల్లి, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాలను స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కలెక్టర్లకు ఈ అవార్డులు దక్కాయి. అలాగే సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో గుంటూరు కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వచ్ఛత అవార్డులు - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : స్వచ్ఛత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు 

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్ 
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ సంస్థ ‘రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్-2017’ను ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల విభాగంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఈ అవార్డ్ లభించింది. సెప్టెంబర్ 19న ఢిల్లీలో నిర్వహించనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకుంటారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రెన్యువబుల్ ఎనర్జీ అవార్డ్ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : ఎర్నెస్ట్ అండ్ యంగ్ 
ఎందుకు : పునరుత్పాదక ఇంధన వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నందుకుగాను 

హడ్కో చైర్మన్ రవికాంత్‌కు రాజభాష అవార్డు 
హడ్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం.రవికాంత్‌కు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. ఈ మేరకు సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రవికాంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హిందీ భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాజభాష కీర్తి పురస్కారం - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : ఐఏఎస్ డాక్టర్ ఎం.రవికాంత్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : హిందీ భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా 

రాజమౌళికి ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు- 2017 
ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు - 2017కి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సెప్టెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళి అవార్డు అందుకున్నారు. సన్మాన పత్రం, చెక్కును తెలంగాణ సీఎం కేసీఆర్ అందజేశారు. 
సినిమా రంగానికి విశేష సేవలు అందించిన వారికి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ అవార్డుని అందజేస్తుంది. లతా మంగేష్కర్, దేవ్ ఆనంద్, షబానా అజ్మీ, వైజయంతి మాల, అంజిలి దేవి, కే బాలచందర్, ష్యామ్ బెనగల్, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని గతంలో ఈ అవార్డుని అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 17 
ఎవరు : ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 
ఎక్కడ : హైదరాబాద్‌లో

అంతర్జాతీయం
పర్యావరణ పరిరక్షణకు డికాప్రియో విరాళం
పపంచవ్యాప్తంగా ఉన్న 100కుపైగా పర్యావరణ పరిరక్షణ సంస్థలకు 20 మిలియన్ డాలర్లను గ్రాంటుగా అందజేయనున్నట్లు హాలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో ప్రకటించారు. భూ సంరక్షణ, సముద్ర జలాలు, జీవుల పరిరక్షణ, అడవులను కాపాడుకోవడం, అంతరించిపోతున్న జీవులను రక్షించుకోవడంతోపాటు అత్యవసరంగా నివారించాల్సిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను ఉపయోగించాలని ఆయన సూచించారు. 
1998లోనే పర్యావరణ పరిరక్షణ కోసం ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన ఈ హాలీవుడ్ నటుడు.. అప్పటి నుంచి ఏదో ఓ రూపంలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పర్యావరణ పరిరక్షణకు 20 మిలియన్ డాలర్ల గ్రాంటు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : హలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో

గూగుల్‌కి చేతికి హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం
తైవాన్‌కి చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు గూగుల్‌కి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. 
ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్ చేర్చుకుంటుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్ పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హెచ్‌టీసీలో కొంత భాగాన్ని కొనుగోలు చేయనున్న గూగుల్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎందుకు : మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు

ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ లెక్కించనున్న నేపాల్ 
 ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును తిరిగి లెక్కిస్తామని నేపాల్ తెలిపింది. 2015లో హిమాలయాల్లో సంభవించిన భీకర భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా భారత సర్వే విభాగం 1955లో ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా నిర్ధారించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తు మళ్లీ లెక్కింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నేపాల్ 
ఎందుకు : ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందన్న నివేదికల నేపథ్యంలో 

అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం
అణు ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒడంబడికకు 50 దేశాల ఆమోదం లభించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో ఆయా దేశాలు ఒడంబడికపై సంతకం చేశాయి. దీంతో.. 90 రోజుల ఇది అమల్లోకి వస్తుంది. ఈ ఒడంబడికపై సంతకం చేసిన తొలి దేశం బ్రెజిల్.
అణు ఆయుధాల ఉత్పత్తి, ప్రయోగం, పరిశోధన, కొనుగోలు, విక్రయం, నిల్వలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది జూలై 7న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 122 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. నెదర్లాండ్స్ వ్యతిరేకించింది. అయితే.. ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగి ఉన్న దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లు.. ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 

బుల్లెట్ రైళ్ల వేగాన్ని 350 కి.మీ.కు పెంచిన చైనా
బుల్లెట్ రైళ్ల వేగాన్ని చైనా మళ్లీ గంటకు 350 కిలోమీటర్లకు పెంచింది. 2008లో ఇదే వేగంతో చైనా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే.. 2011, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించడంతో.. వేగమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయంతో అపట్లో రైళ్ల వేగాన్ని 300 కిలోమీటర్లకు కుదించారు. అదే సమయంలో జపాన్ వంటి దేశాలు తమ వేగాన్ని పెంచి, సురక్షిత ప్రయాణానికి చిరునామాగా మారుతున్న తరుణంలో.. చైనా కూడా తమ సామర్థ్యాన్ని గరిష్టస్థాయికి పెంచుకునేందుకు గత కొన్నినెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 20న బీజింగ్ నుంచి బయల్దేరిన ఫ్యూజింగ్ బుల్లెట్ రైలు 1,318 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై నగరాన్ని కేవలం 4 గంటల 28 నిమిషాల్లో చేరుకుంది. అంటే గంటకు 350 గరిష్ట వేగాన్ని అందుకుంది.

సామాజిక సేవ కోసం జుకర్‌బర్గ్ భారీ విరాళం 
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా 12 బిలియన్ డాలర్లు (రూ.76,800 కోట్ల డాలర్లు) సమీకరించనున్నట్టు వెల్లడించారు. ఈ నిధులను ఆరోగ్యం, విద్యా రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. ఇందుకోసం రానున్న 18 నెలల్లో 3.5 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు షేర్లను విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఫేస్‌బుక్ వాటాలకు ఇప్పుడు చాలా విలువ ఉందని, తన వాటాలో స్వల్ప మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం కేటాయించనున్నాని ఆయన వెల్లడించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సామాజిక సేవ కోసం 12 బిలియన్ డాలర్ల విరాళం 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : మార్క్ జుకర్‌బర్గ్ 
ఎందుకు : కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా 

ప్లాట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితా
దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్‌‌స ఇండస్ట్రీస్.. ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్ సంస్థ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో గతేడాది 14వ స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సారి 7వ స్థానానికి చేరింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. మొత్తంగా... 2017 ర్యాంకింగ్‌‌సలో 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 
అమెరికన్ సంస్థ ఎక్సాన్ మొబిల్ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్‌ప్రోమ్ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జర్మనీకి చెందిన ఇ.ఆన్ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాలో మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్

జర్మనీ చాన్స్‌లర్ పదవికి అర్హత పొందిన మెర్కెల్ 
జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు సెప్టెంబర్ 24న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)-క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది. దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్‌డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్‌డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ-సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జర్మనీ దిగువ సభ బుందేస్టాగ్ ఎన్నికల ఫలితాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్‌కు 33 శాతం ఓట్లు
ఎక్కడ : జర్మనీలో
ఎందుకు : వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందిన మెర్కెల్ 

ఉత్తర కొరియాపైనా ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రావెల్ బ్యాన్ జాబితాలోకి కొత్తగా ఉత్తర కొరియా సహా మూడు దేశాలను చేర్చారు. ఆరు ముస్లిం దేశాల (లిబియా, సూడాన్, ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా) ప్రజలకు అమెరికాలోకి ప్రవేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో నిషేధ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ ఆజ్ఞల గడువు సెప్టెంబర్ 24తో ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్తగా మరో మూడు దేశాలపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సూడాన్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. క్షిపణి, అణు పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాతోపాటు, వెనిజులా, చాద్ దేశాలపై కూడా ఆయన తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో ప్రస్తుతం అమెరికా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న మొత్తం దేశాల సంఖ్య 8కి చేరింది.

ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితా 
అమెరికాకు వెలుపల అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. వీరిద్దరు బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్‌కే సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్ మూడో స్థానంలో నిలిచారు. 
అమెరికాలోని అత్యంత శక్తిమంతమైన మహిళల పేరిట ఫార్చ్యూన్ ప్రకటించిన మరో జాబితాలో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్ హేవ్సన్ మూడో స్థానంలో నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా, అమెరికా వెలుపుల శక్తిమంతమైన మహిళల జాబితా 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : పార్చ్యూన్ 

జాతీయం
సహకార సమ్మేళన్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 
మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్ మాధవ్‌రావ్ ఇనామ్‌దార్ శతజయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో నిర్వహించిన "సహకార సమ్మేళన్"లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇనామ్‌దార్‌పై రాసిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించిన మోదీ.. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపుచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా రైతులకు సహాయం చేయాలని సహకార సంఘాలను కోరారు. తేనెటీగల పెంపకం, ఫార్మా రంగంలో మంచి డిమాండ్ ఉన్న సముద్రపు నాచు (సీవీడ్) పెంపకం వంటి కొత్త వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టేలా వారిని ప్రోత్సహించాలన్నారు. 
1979లో ముంబై కేంద్రంగా ‘సహకార భారతి’ని స్థాపించిన ఇనామ్‌దార్.. సహకార సంఘాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సహకార సమ్మేళన్
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్ మాధవ్ రావ్ ఇనామ్‌దార్ శతజయంతి సందర్భంగా

పీఐబీకి పత్రికల సర్క్యులేషన్ బాధ్యతలు 
Current Affairs దేశవ్యాప్తంగా పత్రికల సర్క్యులేషన్‌ను నిర్ధారించే బాధ్యతను ఇకపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు అప్పగిస్తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ) ఈ బాధ్యతలు నిర్వర్తించేది. ఇప్పటికే పలువురు పీఐబీ అధికారులను ఇందుకోసం నియమిస్తూ సెప్టెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు పత్రికల సర్య్కులేషన్ బాధ్యతలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ

ఖేలో ఇండియా పథకానికి కేబినెట్ ఆమోదం 
గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన వసతులు, చేయూతనందించేందుకు పునర్ వ్యవస్థీకరించిన ఖేలో ఇండియా పథకానికి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 21న ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వెయ్యి మంది అథ్లెట్లకు ఏటా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తారు. అలాగే... దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 విశ్వవిద్యాలయాలను క్రీడా రత్నాల వేదికలుగా తీర్చిదిద్దుతారు. 
2017-18, 2019-20లలో ఈ కార్యక్రమానికి రూ.1,756 కోట్లు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖేలో ఇండియా పథకానికి ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు, ప్రోత్సాహం కోసం 

న్యూఢిల్లీలో ఐఏఏ కొత్త క్యాంపస్ ప్రారంభం 
న్యూఢిల్లీలో అత్యాధునిక హంగులు, సౌకర్యాలతో నిర్మించిన ఇండియన్ ఏవియేషన్ అకాడమీ(ఐఏఏ) కొత్త క్యాంపస్‌ను పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సెప్టెంబర్ 21న ప్రారంభించారు. NIAMAR(National Institute of Aviation Management and research Society) విధానంలో భాగంగా 2010 జూలై 22న ఐఏఏను ఏర్పాటు చేశారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ, పరిశోధన, కన్సల్టేషన్ వంటి సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండియన్ ఏవియేషన్ అకాడమీ కొత్త క్యాంపస్ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు
ఎక్కడ : న్యూఢిల్లీలో 

వారణాసిలో 14 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు బలువా, సామనే ఘాట్‌ల వద్ద రూ. 189 కోట్ల విలువైన రెండు వంతెనల్ని ప్రారంభించారు. జల్ అంబులెన్‌‌స (గంగానదిపై అంబులెన్‌‌స సేవలు), జల్ శవ్ వాహన్(గంగా నదిపై మృతదేహాల్ని తీసుకెళ్లే బోట్) సేవల్ని వీడియో లింక్ ద్వారా ప్రారంభించి వారణాసి నగరానికి అంకితం చేశారు. తుల్సీ మానస్ మందిర్‌లో రామాయణ్‌పై తపాలా బిళ్లను విడుదల చేశారు. వారణాసిలో దాదాపు రూ. 300 కోట్లతో నిర్మించిన దీన్‌దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే వారణాసి నుంచి గుజరాత్‌లోని వడోదర, సూరత్‌లకు వెళ్లే మహామనా ఎక్స్‌ప్రెస్ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్ 

మూడేళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్ కార్యక్రమం 
ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేందుకే మన్ కీ బాత్ కార్యక్రమమని, తన సొంత అభిప్రాయాలు చెప్పేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న ‘మన్ కీ బాత్’ 36వ మాసాంతపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు చేరువయ్యేందుకే నిర్వహిస్తున్నామని చెప్పారు. 30 నిమిషాల ప్రసంగంలో.. సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు, మీడియా నిపుణులు, విశ్వ విద్యాలయాలు మన్ కీ బాత్‌పై విశ్లేషణలు చేసి.. దాని సానుకూలతలు, ప్రతికూలతల్ని ప్రచారం చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మూడేళ్ల పూర్తిచేసుకున్న మన్ కీ బాత్ కార్యక్రమం 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 

నగరాల్లో ఆరోగ్యంపై జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం
దేశంలోని నగరాల్లో ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహం.. ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రోజువారీ అవసరాల కంటే తక్కువ మోతాదులో పోషకాలు, విటమిన్లు తీసుకుంటుండటం ఈ పరిస్థితికి కారణం కావచ్చని పేర్కొంది. ఈ మేరకు 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.72 లక్షల మందిపై చేసిన అధ్యయనం నివేదికను ఇటీవల విడుదల చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంద ర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై ఈ అధ్యయనం నిర్వహించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలోని నగరవాసుల ఆరోగ్యం, పౌష్టికతపై అధ్యయనం 
ఎప్పుడు : 2015-16
ఎవరు : జాతీయ పోషకాహార సంస్థ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 

భారత్‌లో 2020 కల్లా 5జీ టెక్నాలజీ 
దేశంలో 2020 నాటికి 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా సెప్టెంబర్ 26న వెల్లడించారు. 3జీ, 4జీ టెక్నాలజీల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ప్రభుత్వం చేజార్చుకుందని, కానీ 5జీ ప్రమాణాలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని మంత్రి చెప్పారు. తద్వారా దేశీయంగా 50 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోడవంపై కేంద్రం దృష్టి సారించింది. 
ఈ మేరకు ఏర్పాటైన 5జీ ఇండియా 2020 ఫోరంలో టెలికం విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్, ఐటీ కార్యదర్శి అజయ్ కుమార్ సాహ్నీ, శాస్త్ర..సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్ శర్మతో పాటు టెక్నాలజీ నిపుణులు ఉంటారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2020 నాటికి 5జీ టెక్నాలజీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌లో 

ప్రవాసుల కోసం మదద్ వెబ్‌సైట్
గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు వారధిగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ద్వైపాక్షికం
భారత్‌ను ఎదుర్కొనేందుకే అణ్యాయుధాలు : పాక్
అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. సెప్టెంబర్ 21న జరిగిన ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్‌‌స భేటీలో మాట్లాడారు. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని(cold start doctrine) ఎదుర్కొనేందుకే ఈ అణ్వాయుధాలను రూపొందించామని వెల్లడించారు. 
పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం. 

ఐరాస వేదికగా పాక్‌పై భారత్ మండిపాటు 
 ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టైస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది. 

భద్రత కౌన్సిల్‌లో భారత సభ్యత్వానికి భూటాన్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రత కౌన్సిల్‌లో జీ - 4 దేశాలకు (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) శాశ్వత సభ్యత్వానికి భూటాన్ మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్‌గే ఈ మేరకు జీ - 4 దేశాలకు శాశ్వత సభ్య కల్పించాలని కోరారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలోను సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. 
పోర్చుగీస్ ప్రధాని ఆంటోని లూయిస్ డా కోస్టా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం: భారత్ 
అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్ మాటిస్ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్ చర్చించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అఫ్గనిస్తాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు స్పష్టం చేసిన భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎక్కడ : భారత్, అమెరికా రక్షణ మంత్రుల సమావేశంలో 

రాష్ట్రీయం
కేటీఆర్‌కు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆహ్వానం 
సెప్టెంబర్ 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్-2017 సమావేశానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. కేంద్ర కమ్యూనికేషన్‌‌స శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ మేరకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తొలిసారిగా కేంద్రం నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మొబైల్ కాంగ్రెస్‌లో ‘‘సస్టైనబుల్- వైఫై’’అనే అంశంపై ప్రసంగించాలని కోరారు. అలాగే.. ఇంటింటికీ ఇంటర్నెట్ ప్రాజెక్టు, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్‌‌స, ఈ-హెల్త్, ఈ-విద్యా వంటి అంశాలపైన మంత్రి ఈ సమావేశంలో ప్రసంగిస్తారు.

హైదరాబాద్‌లో జాతీయ విత్తన పరిశోధనా కేంద్రం
దక్షిణ భారతదేశ అవసరాల నిమిత్తం హైదరాబాద్‌లో జాతీయ విత్తన పరిశోధనా సంస్థ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) టాస్క్‌ఫోర్స్ రెండో సమావేశంలో నిర్ణయించారు. ఓఈసీడీ ధ్రువీకరణ సిబ్బంది నైపుణ్య సామర్థ్య పెంపుదల కేందాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. అలాగే... దేశీయ విత్తన ధ్రువీకరణను ఒకే పద్ధతిన చేపట్టాలని.. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో 8 రోజుల పాటు అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హైదరాబాద్‌లో జాతీయ విత్తన పరిశోధనా కేంద్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఓఈసీడీ

తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 
 తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,55,000గా పేర్కొంది. 
గాజువాక ఫస్ట్.. రంపచోడవరం లాస్ట్ 
తలసరి ఆదాయంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి తొలి పది స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజవర్గాలు.. అలాగే చివరి పది స్థానాల్లో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
తలసరి ఆదాయంలో తొలి పది నియోజకవర్గాలు
నియోజకవర్గం
జిల్లా
తలసరి ఆదాయం(రూ.)
ర్యాంకు
గాజువాక
విశాఖపట్నం
2,13,963
1
యలమంచిలి
విశాఖపట్నం
1,97,283
2
కైకలూరు
కృష్ణా
1,90,225
3
విశాఖ సౌత్
విశాఖపట్నం
1,84,466
4
విశాఖ వెస్ట్
విశాఖపట్నం
1,74,183
5
కాకినాడ సిటీ
తూర్పుగోదావరి
1,72,172
6
అవనిగడ్డ
కృష్ణా
1,71,884
7
గుంటూరు వెస్ట్
గుంటూరు
1,70,175
8
సంతనూతలపాడు
ప్రకాశం
1,69,029
9
కావలి
నెల్లూరు
1,68,246
10

తలసరి ఆదాయంలో చివరి పది నియోజవర్గాలు
నియోజకవర్గం జిల్లా తలసరి ఆదాయం(రూ.) ర్యాంకు
రంపచోడవరం తూర్పుగోదావరి 51,652 175
మడకశిర అనంతపురం 53,092 174
పిఠాపురం తూర్పుగోదావరి 56, 997 173
అరకు విశాఖపట్నం 60,716 172
ఇచ్ఛాపురం శ్రీకాకుళం 64,003 171
నర్సారావుపేట గుంటూరు 66,640 170
కురుపాం విజయనగరం 66,695 169
పాడేరు విశాఖపట్నం 67,586 168
ఉరవకొండ అనంతపురం 68,249 167
పాలకొండ శ్రీకాకుళం 68,499 166

జాతీయ స్థాయిలో..
తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో హర్యాణా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్నాయి.
రాష్ట్రం 2014-15 2015-16 2016-17
హర్యాణా 1,48,485 1,62,034 1,80,174
మహారాష్ట్ర 1,32,341 1,47,399 -----
కేరళ 1,35,337 1,47,190 -----
కర్ణాటక 1,29,823 1,42,906 1,57,474
గుజరాత్ 1,27,017 1,41,504 ------
తెలంగాణ 1,24,058 1,37,955 1,55,612
తమిళనాడు 1,28,385 1,37,837 1,53,263
పంజాబ్ 1,08,897 1,19,261 1,28,821
ఆంధ్రప్రదేశ్ 93,699 1,08,163 1,22,376

టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ .. బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సెప్టెంబర్ 22న ప్రకటించింది. ఈ ఏడాదిగాను భారతీయ రైల్వే ప్రకటించిన రైల్వే స్టేషన్ ల ర్యాంకింగ్స్‌లోను విశాఖపట్నం స్టేషన్ ఏ1 క్యాటగిరీలో ఉత్తమ స్వచ్ఛ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ స్టేషన్‌గా విశాఖపట్నం రైల్వేస్టేషన్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ

తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1 విజేత శివ బాలాజీ
తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1లో 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. ఈ మేరకు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 24న శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలుగు బిగ్‌బాస్ సీజన్ వన్
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : విజేత శివబాలాజీ
ఎక్కడ : మా టీవీ 

ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు 
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గిరిజన సలహా మండలి ఏర్పాటు 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 

స్వచ్ఛ దర్పన్‌లో తొలి స్థానంలో జగిత్యాల, సిరిసిల్ల
స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్రం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ పథకంలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, సిరిసిల్ల జిలాల్లు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం స్వచ్ఛదర్పన్ పథకం కింద దేశంలో 7 రాష్ట్రాలకు స్థానం కల్పించగా.. ఇందులో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా మొదటి ర్యాంకులు పొందాయి. జగిత్యాల జిల్లాకు కేంద్రం పెర్ఫార్‌మెన్‌‌సపై మొదటి కేటగిరీలో 50 మార్కులు, అవగాహనపై రెండో కేటగిరీలో 15 మార్కులు, పారదర్శకత్వం కింద టాయిలెట్స్‌ను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసే మూడో కేటగిరీలో 25 మార్కులు కేటాయించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వచ్ఛ దర్పన్ ర్యాంకింగ్స్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : తొలి స్థానంలో జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎందుకు : స్వచ్ఛభారత్‌లో భాగంగా 

ఆర్థికం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
 దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్‌ఎస్‌ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించింది. 
2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. రూ.6-12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్‌ఎస్‌ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12-18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపు
ఎప్పుడు : 2019 వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం 

"సౌభాగ్య" పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని (ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తారు. 
‘సౌభాగ్య’ పథకం వివరాలు 
ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 16,320 కోట్లు..
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకు రూ. 14,025 కోట్లు
పట్టణాల్లో విద్యుదీకరణకు రూ. 2,295 కోట్లు
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు.
సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ)- 2011 సమాచారం ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎస్‌ఈసీసీ కిందకు రాని వారికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేకపోతే ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే వారి నుంచి 500 రూపాయల్ని 10 వాయిదాల్లో విద్యుత్ బిల్లుల ద్వారా డిస్కంలు వసూలు చేస్తాయి.
గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ) ఈ పథకానికి దేశమంతా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌభాగ్య పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు

బాలకార్మిక రహిత సమాజానికి ‘పెన్సిల్’
బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ‘పెన్సిల్’ అనే పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. ప్లాట్‌ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ దీని పూర్తి పేరు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజ స్థాపనకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, పౌరుల భాగస్వాములయ్యేందుకు ఈ ఫోరం వేదిక అవుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ, ఫిర్యాదు విభాగం, జిల్లా యంత్రాంగ సమన్వయం, తదితర వ్యవస్థలు ఇందులో ఉంటాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెన్సిల్ పోర్టల్ ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 

సైన్స్ అండ్ టెక్నాలజీ
ఏరోసాల్ రూపొందించిన వారికి నాసా నజరానా 
అతి తక్కువ ఖర్చుతో, తేలికై న ఏరోసాల్ సెన్సార్‌ను రూపొందించిన వారికి లక్ష డాలర్లను నజరానాగా అందజేస్తామని నాసా ప్రకటించింది. ఈ మేరకు రాబర్ట్ వుడ్ జాన్సన్‌‌స ఫౌండేషన్‌తో కలిసి ఎర్త అండ్ స్పేస్ ఎయిర్ ప్రైజ్ కాంపిటీషన్‌ను ప్రకటించింది.
గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఎయిర్ పార్టికల్స్‌ను గుర్తించి, అడ్డుకునే సెన్సార్లే.. ఏరోసాల్స్. వీటిని రూపొందించినట్లయితే భూమిపైన జీవించేవారితోపాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వ్యోమగాములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ సెన్సార్ల రూపకల్పనకు నాసా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏరోసాల్ రూపొందించిన వారికి లక్ష డాలర్లు నజరానా 
ఎప్పుడు : సెప్టెంబర్ 20 
ఎవరు : నాసా 
ఎందుకు : గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఎయిర్ పార్టికల్స్‌ను గుర్తించి, అడ్డుకునే సెన్సార్ల రూపకల్పనకు

హిమాచల్‌ప్రదేశ్‌లో దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ ప్రారంభం
 పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్‌ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రారంభించింది. మనాలి - రోహ్‌తంగ్ మధ్య ఉన్న 51 కిలోమీటర్ల మార్గంలో ఈ బస్సు సేవలను ప్రారంభించింది. అలాగే.. త్వరలో కులు ప్రాంతంలో 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను ఈ తరహా బస్సులను అందుబాటులోకి తేనుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : మనాలి - రోహ్‌తంగ్ మధ్య
ఎందుకు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా 

ఇరాన్ ఖోరంషాహ్ర్ క్షిపణి పరీక్ష సక్సెస్
అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ సెప్టెంబర్ 23న మధ్య శ్రేణి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఖోరంషాహ్ర్ అనే ఈ క్షిపణిని ఇరాన్ సైనిక కవాతులో ప్రదర్శించింది. 2,000 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదనీ, బహుళ సంఖ్యలో వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. 
ఇరాన్ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. 2015లో ఇరాన్‌కు, ఇతర ప్రధాన దేశాలకు అణు పరీక్షల నిషేధంపై ఒప్పందం కుదిరింది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనా, రష్యా, యూరోపియన్ కూటమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2025 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర పరీక్షలు జరపకుండా ఇరాన్‌పై ఆంక్షలున్నాయి. క్షిపణి పరీక్షలను జరిపితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖోరంషాహ్ర్ క్షిపణి పరీక్ష సక్సెస్
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఇరాన్

పాక్ యాంటి - షిప్ క్షిపణి పరీక్ష విజయవంతం
గగనతలం నుంచి సముద్ర ఉపరితలంపైకి ప్రయోగించే యాంటి-షిప్ క్షిపణిని పాకిస్తాన్ నౌకాదళం సెప్టెంబర్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఇందుకోసం సీ కింగ్ హెలికాప్టర్లను పాక్ వినియోగించింది. పాకిస్తాన్ గతేడాది బ్రిటన్ నుంచి ఏడు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయగా అవి ఈ సంవత్సరం మేలో దాయాది దేశానికి అందుబాటులోకి వచ్చాయి. హెలికాప్టర్ నుంచి ప్రయోగించే ఈ క్షిపణితో సముద్ర జలాల్లో ఉన్న నౌకలు, ఇతర లక్ష్యాలను చేదించవచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యాంటి - షిప్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : పాకిస్తాన్ 

క్రీడలు
బెల్జియం ఓపెన్ చాంప్ వైష్ణవి 
 బెల్జియం ఓపెన్ అండర్-19 మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వైష్ణవి రెడ్డి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్లో రెండోసీడ్ వైష్ణవి 21-19, 17-21, 21-12తో టాప్ సీడ్, వివియన్ సందోర్ఘాజీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. 
మరోవైపు ఇథియోపియా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్-రామచంద్రన్ శ్లోక్ జోడీ విజేతగా నిలిచింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్ జంట ఫైనల్లో 21-6, 21-19తో జోర్డాన్‌కు చెందిన బహర్డీన్ అహ్మద్-మహ్మద్ నసీర్‌లపై అలవోక విజయం సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బెల్జియం ఓపెన్ అండర్ - 19 చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : విజేత భారత ప్లేయర్ వైష్ణవి రెడ్డి

‘పద్మభూషణ్’కు ధోని పేరుని నామినేట్ చేసిన బీసీసీఐ
దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ధోని వన్డేల్లో దాదాపు పది వేల పరుగులు చేయడంతోపాటు 90 టెస్టులు ఆడాడు. 
గతంలో కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, దేవధర్, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్, రాజా భళీంద్ర సింగ్, విజయ ఆనంద్ ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పద్మభూషణ్‌కు ధోని పేరు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : నామినేట్ చేసిన బీసీసీఐ

‘పద్మభూషణ్’కు పీవీ సింధు పేరు ప్రతిపాదన 
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును కేంద్ర క్రీడా శాఖ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం ప్రతిపాదించింది. 2015లోనే ఆమె పద్మశ్రీ పురస్కారం పొందింది. 
వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2013, 2014) సింధు కాంస్యాలు సాధించింది. 2016లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లను గెలుచుకుంది. 2017 ఆగస్టులో గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం.. సెప్టెంబర్‌లో కొరియా ఓపెన్ రూపంలో కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మూడుసార్లు మకావు ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు ప్రతిపాదన
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ

జపాన్ ఓపెన్ విజేతలు మరిన్, అక్సెల్‌సన్
జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో కరోలినా మరిన్ (స్పెయిన్), విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) విజేతలుగా నిలిచారు. సెప్టెంబర్ 24న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఐదోసీడ్, మరిన్ 23-21, 21-12తో డిఫెండింగ్ చాంపియన్, ఆరోసీడ్ హే బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. 
పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, మూడోసీడ్, అక్సెల్‌సన్ 21-14, 19-21, 21-14తో ప్రపంచ మాజీ నం.1, ఏడోసీడ్, లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. 
పురుషుల డబుల్స్ విభాగంలో మూడోసీడ్, ఇండోనేసియా ద్వయం, మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్-కెవిన్ సంజయ విజేతలుగా నిలిచింది. మహిళల డబుల్స్‌లో స్థానిక ద్వయం, టాప్‌సీడ్, మిసాకి మతుటొమో-అయాకా తకహషి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చైనీస్ జోడీ, వాంగ్ యిల్వ్-హువాంగ్ డోంగ్‌పిన్ విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 24 
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత -కరోలినా మరిన్, పురుషుల సింగిల్స్ విజేత విక్టర్ అక్సెల్‌సన్

ఆసియా ఇండోర్ క్రీడల్లో సౌరవ్ కొఠారికి స్వర్ణం 
ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ సౌరవ్ కొఠారి స్వర్ణం సాధించాడు. సెప్టెంబర్ 25న జరిగిన బిలియర్డ్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ కొఠారి 3-1 (100-80, 101-0, 29-101, 101-88) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ ప్రప్‌రుట్ చైతనాసకున్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) విభాగంలో భారత్‌కిది తొలి పతకం.
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో విష్ణువర్ధన్-ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7-5, 4-6, 2-6తో నటనన్ కద్‌చాపనాన్-నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : బిలియర్డ్స్‌ల్రో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారికి స్వర్ణం 

మిథాలీరాజ్‌పై బయోపిక్
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్ (మిల్కాసింగ్‌పై), మేరీకామ్ సినిమాలు వచ్చాయి. మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతోంది. వన్డేల్లో 6 వేల పరుగులతో పాటు వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఖ్యాతికెక్కింది. అలాగే 2005, 2017 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టును ఫైనల్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా నిలిచింది.
బాలీవుడ్‌లో ఇప్పటికే అథ్లెట్ మిల్కాసింగ్, బాక్సర్ మేరీకామ్, క్రికెటర్లు ధోని, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్‌లపై చిత్రాలు రాగా... బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా నెహ్వాల్, మహిళా క్రికెటర్ జులన్ గోస్వామిలపై చిత్రాలు కూడా వరుసలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌పై బయోపిక్
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : వయాకామ్ 18 మోషన్

ఆసియా ఇండోర్ క్రీడల్లో విష్ణు-జయ్‌కి స్వర్ణం 
ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 26న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-విజయ్ నటరాజన్ (భారత్) ద్వయం 6-3, 6-4తో డెనిస్ యెవ్‌సెయెవ్-తిముర్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా-ప్రార్థన తొంబారే (భారత్) జోడీకి రజత పతకం లభించింది. ఫైనల్లో అంకిత-ప్రార్థన జంట 6-3, 3-6, 6-7 (5/7)తో తమాచాన్-వరుణ్య (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో విష్ణువర్దన్ - విజయ్ నటరాజన్‌కు స్వర్ణం

అవార్డులు
జన్నా ముస్తఫాకు యూఎన్ నన్సెన్ రెఫ్యూజీ అవార్డు
 నైజీరియాకు చెందిన సామాజిక వేత్త జన్నా ముస్తఫా.. యూఎన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR) నుంచి నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017(Nansen Refugees Award)కు ఎంపికయ్యారు. బోకో హారం బాధితులను చైతన్య పరచడం, బాలల హక్కుల సంరక్షణ కోసం చేసిన కృషిగాను ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
చిన్నారులను, ముఖ్యంగా బాలికలను మానవ బాంబులుగా ఉపయోగించే నైజీరియా తీవ్రవాద సంస్థే.. బోకో హారం. ఈ సంస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన జన్నా ముస్తఫా.. బాధిత ప్రజలకు అండగా నిలబడ్డారు. 
శరణార్థులు, నిర్వాసితులకు సహాయం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, బృందానికి UNHCR ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. నార్వేకు చెందిన నోబెల్ శాంతి బహుమతి విజేత ఫ్రిడోఫ్ నన్సెన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని 1954 నుంచి అందజేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎన్ నన్సెన్ రెఫ్యూజీ అవార్డు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : జన్నా ముస్తఫా
ఎక్కడ : నైజీరియా
ఎందుకు : బోకో హారం బాధితులకు అండగా నిలిచినందుకు గాను 

ఆస్కార్ బరిలో న్యూటన్ 
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రేసులో రాజ్‌కుమార్ రావు నటించిన ఇండియన్ మూవీ ‘న్యూటన్’ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో సెలక్ట్ అయింది. ఈ కేటగిరిలో భారత్ నుంచి దాదాపు 26 సినిమాలు రేసులో నిలవగా, చివరికి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూటన్‌ని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీకి హెడ్‌గా ఉన్న తెలుగు నిర్మాత సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక చేశారు. 
చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే న్యూటన్ చిత్రం. మావోయిస్టులు దాడి చేస్తారని తెలిసినా... ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాలన్న లక్ష్యంతో రాజ్‌కుమార్‌రావు పాత్ర చేసే ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి మనీష్ ముంద్ర కథని అందించారు. పంకజ్ త్రిపాఠీ, అంజలి పాటిల్, రఘువీర్ యాదవ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆస్కార్ బరిలో భారత చిత్రం న్యూటన్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ
ఎందుకు : ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో

భారత లాయర్‌కు ‘స్విడిష్ రైట్స్’ అవార్డు 
భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కోలిన్ గొన్జాల్వేస్ స్వీడన్ దేశం అందించే ప్రతిష్టాత్మక ‘రైట్ లైవ్లీహుడ్’ అవార్డుకు ఎంపికయ్యారు. గొన్జాల్వేస్ మానవ హక్కుల రక్షణ కోసం ఎంతో పాటుపడ్డారు. ఈ క్రమంలో ‘హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ అనే పేరుతో ఒక సంస్థను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఎంతో మంది ప్రజలకు న్యాయ సంబంధిత సలహాలను ఉచితంగా అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన గొన్జాల్వేస్‌తో పాటు అజెర్‌బైజాన్ దేశానికి చెందిన ఖదిజా ఇస్మాయిలోవా, అమెరికా దేశస్థుడైన రాబర్ట్ బిలొట్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ప్రకటించిన మూడు లక్షల డాలర్ల (సుమారు రూ. 19 కోట్ల 64 లక్షలు)ను ఈ ముగ్గురికి అందించనున్నారు. 
అంతర్జాతీయ సమస్యలపై పోరాడుతున్న వారికి 1980 నుంచి స్వీడన్ ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తోంది. ఈ అవార్డును ‘ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్’ అని కూడా పిలుస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వీడిష్ రైట్స్ అవార్డు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కోలిన్ గొన్జాల్వేస్
ఎక్కడ : స్వీడన్‌లో 

వార్తల్లో వ్యక్తులు
ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా పార్థసారథి
 దేశంలో విత్తన ధ్రువీకరణకు ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో జరిగిన ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ రెండో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
దేశంలోనే మొదటిసారిగా 4,200 క్వింటాళ్లకు పైగా విత్తనాలను తెలంగాణ నుంచి సూడాన్, ఈజిప్ట్, ఫిలిప్పీన్‌‌స మొదలగు దేశాలకు ఓఈసీడీ ధ్రువీకరణ విత్తనాలు ఎగుమతి కావటాన్ని ప్రత్యేకంగా సమావేశంలో ప్రశంసించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓఈసీడీ టాస్క్‌ఫోర్స్ వైస్ చైర్మన్‌గా పార్థసారథి 
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్

ఫోర్బ్స్ ‘గ్రేటెస్ట్ బిజినెస్ మైండ్స్’లో ముగ్గురు భారతీయులు
వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు. 
శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్‌షైర్ హత్‌వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఉన్నారు. కొత్త ఆవిష్కరణలతో ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. 
ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్‌తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఫోర్బ్స్ 
ఎక్కడ : ప్రపంచ్యవాప్తంగా 
ఎందుకు : ఫోర్బ్స్ మ్యాగజైన్ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని

ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ కన్నుమూత 
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. కార్టూనిస్టుగా విశేష సేవలందించిన ఆయన దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మోహన్.. ఉదయం, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు. ఎంతోమందిని కార్టూనిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం.

ఐఓసీలో ‘ఐబా’ ప్రతినిధిగా మేరీకోమ్ 
ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మణిపూర్ స్టార్ బాక్సర్ గతేడాది ‘ఐబా’ లెజెండ్‌‌స అవార్డు అందుకుంది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె... నవంబర్ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే ఎనిమిదో ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్‌లో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. 


అయితే వియత్నాంలో నవంబర్ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీకోమ్ ఎంపికై తే అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్ ప్రతినిధిగా మేరీకోమ్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ

72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో సుష్మా ప్రసంగం
భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో సెప్టెంబర్ 23న సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 72వ ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఐరాస
ఎక్కడ : న్యూయార్క్

నూతన కాగ్‌గా రాజీవ్ మహర్షి ప్రమాణ స్వీకారం
కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్ మహర్షి(62) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా సెప్టెంబర్ 25న బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2013 మే 23 నుంచి 2017 సెప్టెంబర్ 22 వరకు శశికాంత్ శర్మ కాగ్‌గా ఉన్నారు. 
1978 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన మహర్షి కాగ్‌గా ఆరేళ్ల పాటు లేదా 65 ఏళ్లు పూర్తయ్యేవరకు కొనసాగుతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నూతన కాగ్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : రాజీవ్ మహర్షి 

హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా-2017
హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా-2017లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన టాప్ స్థానాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా ఆరోసారి. అలాగే హురుణ్ గ్లోబల్ జాబితాలో అంబానీ ఏకంగా తొలిసారి టాప్- 15లోకి చేరారు. రిలయన్‌‌స ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు మార్కెట్లో ర్యాలీ జరపడం వల్ల అంబానీ సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది(అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50% ఎక్కువ). 
పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173% వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది. దీంతో ఈయన 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 
ముంబైలోనే ఎక్కువ : నివేదిక ప్రకారం ముంబైలో 182 మంది సంపన్నులు ఉన్నారు. తర్వాతి స్థానంలో న్యూఢిల్లీ (117), బెంగళూరు (51) ఉన్నాయి. 26 మందితో అహ్మదాబాద్ నగరం కూడా ఈ సారి టాప్-5లో స్థానం దక్కించుకుంది. చెన్నై (22), కాన్పూర్ (11) తొలిసారి టాప్-10లోకి వచ్చాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 25 
ఎవరు : అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ 
ఎక్కడ : భారత్‌లో 

సత్య నాదెళ్ల ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకం ఆవిష్కరణ 
‘హిట్ రిఫ్రెష్’ పేరుతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రచించిన పుస్తకాన్ని సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. అమెరికాలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ - 2017 సదస్సులో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్లాట్‌ఫాం సాంకేతికతల్లో విండోస్, ఆండ్రాయిడ్, ఫేస్‌బుక్‌తో ఆధార్ వ్యవస్థ పోటీపడుతోందంటూ సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ సాంకేతికత, డిజిటల్ యుగం వైపుకు అడుగులేస్తుండటం శుభపరిణామమని ‘హిట్ రిఫ్రెష్’లో రాశారు. డిజిటల్ చెల్లింపులను పెంచడానికి తెచ్చిన ‘ఇండియాస్టాక్’ను మెచ్చుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హిట్ రిఫ్రెష్ పుస్తకం ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రచయిత సత్య నాదెళ్ల 

ఓఎన్‌జీసీ చైర్మన్‌గా శశి శంకర్
దేశీ దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి సంస్థ ‘ఓఎన్‌జీసీ’ కొత్త చైర్మన్, ఎండీగా శశి శంకర్ నియమితులయ్యారు. ఈయన 2021 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఓఎన్‌జీసీలో డెరైక్టర్‌గా (టెక్నికల్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) ఉన్న శశి శంకర్‌ను అదే సంస్థ సీఎండీగా పదోన్నతి కల్పిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన రిటైర్మెంట్ పొందే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా పదవిలో కొనసాగుతారని పేర్కొంది. 
శశి శంకర్ (56 ఏళ్లు) అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు చేపడతారు. ఈయన దినేశ్ కె ష్రాఫ్ స్థానాన్ని భర్తీ చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓఎన్‌జీసీ కొత్త చైర్మన్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : శశి శంకర్

అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీకాలం పొడిగింపు
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీ కాలం అక్టోబర్ 16తో ముగియనున్న నేపథ్యంలో 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 23న పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యన్ 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు.

ప్రపంచ రక్షకుడు పెట్రోవ్ కన్నుమూత
అమెరికాతో అణు యుద్ధాన్ని నివారించి ప్రపంచ రక్షకుడిగా పేరొందిన సోవియెట్ యూనియన్ సైనికాధికారి స్టానిస్లావ్ పెట్రోవ్.. మే 19న మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. 1983 సెప్టెంబర్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మాస్కోకి దక్షిణాన ఒక రహస్య కమాండ్ కేంద్రంలో పెట్రోవ్ విధులు నిర్వర్తిస్తుండగా అమెరికా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఒక హెచ్చరిక సంకేతం మోగింది. అయితే అది తప్పుడు సంకేతమని ఆయన భావించారు. ఆ హెచ్చరిక నిజమైనదేనని పెట్రోవ్ నమ్మి ఉన్నతాధికారులకు తెలియజేసి ఉంటే సోవియట్ నాయకత్వం ప్రతీకార దాడులకు ఆదేశించి ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాకే పెట్రోవ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

No comments:

Post a Comment