AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జనవరి 2016

వార్తల్లో వ్యక్తులు జనవరి 2016
ఆర్మీ మాజీ చీఫ్ కేవీ కృష్ణారావు కన్నుమూత
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆర్మీ మాజీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ జనరల్ కేవీ కృష్ణారావు(92) జనవరి 30న కన్నుమూశారు. కొటికలపూడి వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1923 జనవరి 16న జన్మించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో సాధారణ సిపాయిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1981-83 మధ్య ఆర్మీ 14వ చీఫ్‌గా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్‌లలో పనిచేశారు. 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు.

ప్రముఖ పాత్రికేయుడు సేన్‌గుప్తా కన్నుమూత
ప్రముఖ దినపత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అరిందం సేన్‌గుప్తా(61) జనవరి 28న కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో పోరాడుతున్నారు. సేన్‌గుప్తా 1991లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో చేరారు. టైమ్స్‌గ్రూప్‌లో వివిధ స్థానాల్లో సుదీర్ఘకాలంపాటు ఆయన సేవలందించారు. రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై రాసిన కథనాలు ఆయనకు గుర్తింపునిచ్చాయి.

ప్రముఖ కవయిత్రి నాయని కృష్ణకుమారి కన్నుమూత
ప్రముఖ కవయిత్రి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి నాయని కృష్ణకుమారి (86) జనవరి 30న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె పరిశోధకురాలిగా, కవయిత్రిగా, విద్యావేత్తగా విశిష్ట సేవలందించారు. 18 ఏళ్ల వయసులోనే ఆంధ్రుల కథ అనే గ్రంథాన్ని వెలువరించారు. కృష్ణకుమారి రాశిన తొలి కవితా సంకలనం ‘అగ్నిపుత్రి’ 1978లో వెలువడింది.

నృత్యకళాకారిణి మృణాళిని మృతి
ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని సారాభాయి (97) అహ్మదాబాద్‌లో అనారోగ్యంతో జనవరి 21న మరణించారు. శాస్త్రీయ నృత్యం ద్వారా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఆమె కృషిచేశారు. 300కు పైగా డ్యాన్స్ డ్రామాలకు నృత్యదర్శకత్వం వహించారు. భారత అంతరిక్ష పరిశోధనల పితామహుడు విక్రం సారాభాయిని 1942లో వివాహమాడారు. 1948లో అహ్మదాబాద్‌లో నృత్యం, డ్రామా, సంగీత అకాడమీని స్థాపించారు. ఆమెకు 1992లో పద్మభూషణ్ అవార్డు లభించింది. 
బిహార్ సీఎం నితీశ్ సలహాదారుగా ప్రశాంత్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నియమితులయ్యారు. కిశోర్‌ను సీఎంకు ప్రణాళిక, కార్యక్రమ అమలు సలహాదారుగా నియమించినట్లు రాష్ట్ర కేబినెట్ కోఆర్డినేషన్ కమిటీ జనవరి 22న నోటిషికేషన్ వెలువరించింది. ప్రస్తుత హోదాలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో కిశోర్ కీలకభూమిక పోషించనున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కిశోర్.. 2015 చివరలో జరిగిన బిహార్ ఎన్నికల్లో నితీశ్ విజయానికి దోహదపడ్డారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యూహకర్తగా కిశోర్ వ్యవహరించారు. 
బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి అమిత్ షా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడిగా అమిత్ షా రెండో దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 మేలో రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్‌లో చేరడంతో ఆయన స్థానంలో మధ్యలో షా తొలిసారి పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఇప్పుడు పూర్తికాలంపాటు అంటే మరో మూడేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అమిత్ షా పార్టీని బలోపేతం చేశారని, మూడు కోట్ల కంటే తక్కువగా ఉన్న సభ్యత్వాలను 11 కోట్ల వరకు తీసుకెళ్లారని పార్టీ పేర్కొంది.
ప్రముఖ మలయాళ నటి కల్పన మృతి
ప్రముఖ మలయాళ సినీ నటి కల్పనా రంజని(50) జనవరి 25న గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. అక్కినేని నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ‘ఊపిరి’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. ప్రముఖ నటి ఊర్వశికి కల్పనా రంజని సోదరి. 1980ల్లో సినీ రంగ ప్రవేశం చేసిన కల్పన 300కుపైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. 2012లో ‘ఎస్‌జాన్ తనిచెల్ల’ అనే మలయాళ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. కమల్‌హాసన్ నటించిన ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అధ్యయనానికి ఏర్పాటైన ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సభ్యునిగా నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కార్నే కూడా దీనిలో సభ్యునిగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకర్లు, విధాన నిర్ణేతలు ఉన్నారు. ఈ మేరకు జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యూఈఎఫ్ జనవరి 26న ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్ర, ఆర్థిక రెగ్యులేటరీ సంస్కరణలు వంటి అంశాలపై డబ్ల్యూఈఎఫ్ చర్చిస్తుంది. తమ సమగ్ర అధ్యయన నివేదికను ఈ బృందం 2017 జనవరిలో జరిగే డబ్ల్యూఈఎఫ్ 47వ వార్షిక సదస్సులో సమర్పిస్తుంది.

సిక్కిం మాజీ గవర్నర్ రామారావు మృతి
భారతీయ జనతా పార్టీ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు అనారోగ్యంతో జనవరి 17న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966, 72, 78, 84లలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 2002-2005 మధ్య సిక్కిం గవర్నర్‌గా పనిచేశారు.
టాటా మోటార్స్ సీఈవోగా బషెక్
టాటా మోటార్స్ కొత్త సీఈవో, ఎండీగా ఎయిర్‌బస్ మాజీ సీవోవో అయిన గ్యుంటర్ బషెక్ (55) నియమితులయ్యారు. ఫిబ్రవరి 15 నుంచి బాధ్యతలు చేపట్టనున్న బషెక్ భారత్, దక్షిణ కొరియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారని టాటా మోటార్స్ తెలిపింది. 2014 జనవరి 26న కార్ల్ స్లిమ్ మరణం తర్వాత టాటా మోటార్స్ ఎండీ స్థానం ఖాళీగానే ఉంది. 
ప్రపంచ కురువృద్ధుడి మృతి
జపాన్‌కు చెందిన ప్రపంచ కురువృద్ధుడు యసుటారో కొయిడే(112) జనవరి 19న మరణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్‌లో గతేడాది చోటు దక్కించుకున్న కొయిడే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొయిడే 1903 మార్చిలో జన్మించారు. ఇంతకు ముందు సకారి మొమొయ్(112) పేరిట ఈ రికార్డు ఉండగా, ఆయన 2015 ఆగస్టులో మృతి చెందడంతో కొయిడేను అతిపెద్ద వయస్కుడిగా అధికారులు గుర్తించారు.

ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ బాధ్యతల స్వీకరణ
పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ టీవీ నటుడు, బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ జనవరి 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థతో ఏమాత్రం సంబంధంలేని చౌహాన్‌ను ఈ పదవిలో నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న ఎఫ్‌టీఐఐలోని కొందరు విద్యార్థులు... ఆయన్ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. 2015 జూన్‌లో చౌహాన్‌ను కేంద్రం ఈ పదవిలో నియమించగా అప్పటి నుంచీ విద్యార్థులు నిరసనగళం వినిపిస్తూనే ఉన్నారు.
ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా పవన్ కపూర్
ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా 1990 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి పవన్ కపూర్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం జనవరి 7న ప్రకటించింది. ఆయన ప్రస్తుతం మాపుటోలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఈ ఏడాది భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.
భారతీయ దాతల జాబితాలో అజీజ్ ప్రేమ్‌జీకి అగ్రస్థానం
విద్యారంగం అభివృద్ధికి ఏకంగా రూ.27,514 కోట్లు విరాళమిచ్చిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ(70) వరుసగా మూడో ఏడాది కూడా భారతీయ దానకర్ణుల్లో అగ్రస్థానంలో నిలిచారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. భారత్‌లో అత్యధికంగా విరాళాలిచ్చే వారికి ర్యాంకులనిచ్చే హురున్ ఇండియా తాజా జాబితాను విడుదల చేసింది. అజీమ్ ప్రేమ్‌జీ స్థాపించిన ఫౌండేషన్ ఎనిమిది రాష్ట్రాల్లో మూడున్నర లక్షలకుపైగా పాఠశాలలను నిర్వహిస్తూ విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తోంది. ఈ జాబితా లో ద్వితీయ స్థానంలో ఉన్న నీలేకని కుటుంబం విద్య, పౌర విధానం, పట్టణప్రాంత పాలన అభివృద్ధికి రూ.2,404 కోట్లు విరాళమిచ్చింది. విద్య, సామాజిక అభివృద్ధి, వాణిజ్యదక్షత పెంపునకు నారాయణ మూర్తి కుటుంబం రూ.1,322 కోట్లు అందించింది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత) ఇదే జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి ఆయన రూ.345 కోట్లు విరాళమిచ్చారు. రూ.10 కోట్లకు పైగా దానమిచ్చిన వారు 2014లో 50 మంది ఉండగా, 2015లో ఈ సంఖ్య 36కు తగ్గిపోయింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి(32) రూ.35 కోట్లు విరాళం అందించడం ద్వారా ఈ జాబితాలో పిన్న వయస్కునిగా నిలిచారు. రూ.96 కోట్లు దానం చేసిన పల్లోంజీ మిస్త్రీ (86) ఈ జాబితాలో వయోధికుడు.
శని సింగనాపూర్ ఆలయ చైర్‌పర్సన్‌గా మహిళ
మహారాష్ట్రలోని ప్రఖ్యాత శని సింగనాపూర్ ఆలయ బోర్డు చైర్‌పర్సన్‌గా అనితా సేథే అనే మహిళ నియమితులయ్యారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయానికి ఒక మహిళకు బోర్డు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. బోర్డు సభ్యుల్లో ఈమెతోపాటు మరో మహిళ ఉంది. ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం. దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగి ఆలయంలో సంప్రోక్షణ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళకు బోర్డు సారథ్య బాధ్యతలను అప్పగించడం గమనార్హం.
ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బిన్నీ బన్సల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సల్ కొత్త సీఈవోగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇకపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. బిన్నీ ఇప్పటిదాకా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సీవోవో) ఉన్నారు. ఈకార్ట్, కామర్స్, మింత్రా తదితర వ్యాపార విభాగాలన్నీ కూడా ఇక నుంచి బిన్నీ బన్సల్ పర్యవేక్షణలో ఉంటాయి. మరోవైపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సచిన్ బన్సల్.. కంపెనీకి వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తారు.
సీసీఐ చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రి
వాణిజ్య గుత్తాధి పత్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్‌గా దేవేందర్ కుమార్ సిక్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన సీసీఐకి మూడవ చైర్మన్. ఇప్పటి వరకు సీసీఐ చీఫ్‌గా వ్యవహరించిన అశోక్ చావ్లా జనవరి 7న పదవీ విరమణ చేశారు. అశోక్ చావ్లాకు ముందు సీసీఐ చైర్మన్‌గా ధనేంద్ర కుమార్ ఉన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జనవరి 11న సిక్రిచే ప్రమాణస్వీకారం చేయించారు. 
కోల్‌కతాలో పాక్ గాయకుడు గులాం అలీ కచేరీ
పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం అలీ జనవరి 12న కోల్‌కతాలో కచేరీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కచేరీకి వేలాది మంది హాజరయ్యారు. 2015 అక్టోబర్‌లో ముంబైలో గులాం అలీ కచేరీని ఏర్పాటు చేసినప్పటికీ.. దానిని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించటంతో ఆ కార్యక్రమం రద్దయింది. పాక్ నుంచి భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాదం నిలిచిపోయే వరకూ.. ఆ దేశానికి చెందిన ఏ కళాకారుడినీ ముంబైలో ప్రదర్శన ఇవ్వబోమని అప్పుడు శివసేన హెచ్చరించింది. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతాలో అలీ కచేరీని నిర్వహించింది. 
ప్రజాకవి అద్దేపల్లి కన్నుమూత
ప్రపంచీకరణ దుష్ర్పభావాలపై కలమెత్తిన ‘ప్రజాకవి’, ప్రముఖ సాహిత్య విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు(80) కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ జనవరి 13న తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన అద్దేపల్లి అక్కడే పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నారు. తర్వాత తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1960-62లో పూర్తిచేశారు. ‘అభ్యుదయ విప్లవ కవిత్వాలు-సిద్ధాంతాలు-శిల్పరీతులు’ అంశంపై పీహెచ్‌డీ పట్టా పొందారు. తెలుగు ఉపాధ్యాయునిగా పశ్చిమగోదావరి జిల్లాలో 1970 వరకు పనిచేశారు. తర్వాత ఎంఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగం రావడంతో కాకినాడ వచ్చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాకినాడలోనే ఉండిపోయారు. కళాశాల విద్యాభ్యాసం రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యానికి ప్రీతిపాత్రుడైపోయారు అద్దేపల్లి. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలగంగాధర తిలక్ ఆయన ఆరాధ్య కవులు. ఒకవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే మరోవైపు తన సాహితీ వ్యాసంగాన్ని అద్దేపల్లి కొనసాగించారు. జాషువా, శ్రీశ్రీ, కుందుర్తి లాంటి కవులపై విమర్శన గ్రంథాలు ప్రచురించారు. ‘శ్రీశ్రీ కవితాప్రస్థానం’ పేరుతో శ్రీశ్రీపై వెలువరించిన తొలి విమర్శన గ్రంథం అద్దేపల్లిదే కావడం గమనార్హం.
1971 యుద్ధ హీరో జాకోబ్ మృతి
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాక్ పరాజయానికి బాటలు వేసిన రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎఫ్‌ఆర్ జాకోబ్(92) జనవరి 13న కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1971 యుద్ధంలో పాక్ దళాలు నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లొంగిపోవడానికి కారకులుగా జాకోబ్ ప్రసిద్ధులు. జాకోబ్ మృతికి సంతాపం తెలుపుతూ.. ‘లెఫ్ట్‌నెంట్ జనరల్ జాకోబ్‌కు నివాళి. కీలక సమయాల్లో ఆయన అందించిన నిరుపమాన సేవలకు దేశం సదా ఆయనకు రుణపడి ఉంటుంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

సీపీఐ సీనియర్ నేత బర్దన్ మృతి
 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సీనియర్ నాయకులు ఎబీ బర్దన్ (91) జనవరి 2న న్యూఢిల్లీలో మరణించారు. బర్దన్ 1996 నుంచి 2012 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1957లో నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బర్దన్ కార్మిక నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

అద్నాన్ సమీకి భారత పౌరసత్వం పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు జనవరి 1 నుంచి అద్నాన్ సమీకి భారత పౌరసత్వం లభించింది. పాక్‌లోని లాహోర్‌లో జన్మించిన అద్నాన్ 2001 నుంచి వీసాపై భారత్‌ను సందర్శిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా భారత్‌లోనే నివసిస్తున్నారు. 

సీఐసీగా మాథూర్ ప్రమాణస్వీకారంకేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఆర్కే మాథూర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. త్రిపుర కేడర్‌కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథూర్ గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన రానున్న మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.

ఎస్‌ఎంఈ చాంబర్స్ సలహాదారుగా అజయ్‌కుమార్ అగర్వాల్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఎంఈ చాంబర్స్‌కు సలహాదారుగా ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ డెరైక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ముంబై కేంద్రంగా 45 వేల ఎస్‌ఎంఈ సంస్థలు సభ్యులుగా 22 ఏళ్ల నుంచి ఎస్‌ఎంఈ చాంబర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్‌ఎంఈ)ను పటిష్టం చేయడం, మంచి వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్‌ఎంఈ చాంబర్స్ తగిన ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన అజయ్ కుమార్ అగర్వాల్... ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డ్‌ను, యూనిటీ తదితర అవార్డులను అందుకున్నారు.

సిరాజ్‌కు ఎన్‌జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌కు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జనవరి 4న విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరాజ్‌కు గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టరు అల్లూరి పద్మరాజు ప్రదానం చేశారు. సిరాజ్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తూ మార్కెట్ల బలోపేతంతోనే వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని, ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవంతో ఆహారోత్పత్తి పెరిగినా ఆహార సరఫరా సరైన రీతిలో జరగడం లేదన్నారు. 2030 నాటికి దేశ జనాభా 145 కోట్లకు చేరవచ్చని, అప్పటికి 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు, 32 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. 

విప్రో సీఈవోగా అబిద్ అలీదిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్‌వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ ఫిబ్రవరి నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ నుంచి నీముచ్‌వాలా విప్రోలో తన కెరీర్‌ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు. ఈయన గ్లోబల్ ఇన్‌ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్‌గా ఉన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తొలిసారిగా ఓ మహిళా వైస్ చాన్సలర్ నియమితులయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న లూయిస్ రిచర్డ్‌సన్(56) ఈ ఘనత సాధించారు. జనవరి 1న ఆమె ఆక్స్‌ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐర్లాండ్‌లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్‌మోర్‌లో ఆమె జన్మించారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్‌డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అందులోనే రాడ్‌క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్‌గా పనిచేశారు. 2009లో బ్రిటన్‌లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.

No comments:

Post a Comment