AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2015

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2015
భారతీయ సంపన్నుల్లో ముకేశ్ అంబానీకి మొదటి స్థానం
సెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మందితో భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్‌‌బ్స మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 15.9 డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
పాక్‌లో భారత రాయబారిగా గౌతమ్
పాకిస్తాన్‌లో భారత రాయబారిగా గౌతమ్ బంబావాలే నియమితులయ్యారు. పాక్‌లో భారత రాయబారిగా ఉన్న టీసీఏ రాఘవన్ 2015 డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తున్నారు. రాఘవన్ స్థానంలో గౌతమ్ బాధ్యతలు చేపడతారు. అలాగే బ్రిటన్‌లో భారత రాయబారిగా నవతేజ్ సర్నా, చైనాలో భారత రాయబారిగా విజయ్ గోఖలే నియమితులయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్‌ను నియమించారు. 
ఒబామా సలహా మండలిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఓ ప్రధాన సలహామండలికి సభ్యులుగా ముగ్గురు భారతీయ అమెరికన్లను బరాక్ ఒబామా సిఫార్సు చేశారు. మొత్తం 14 మందిని సిఫార్సు చేయగా అందులో భారత సంతతికి చెందిన ప్రీతా బన్సల్, నిపున్ మెహతా, జస్జిత్ సింగ్ ఉన్నారు. మత పెద్దలు, లౌకికవాద నేతలు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే తాటిపైకి తేవడంపై ఈ సలహామండలి దృష్టిసారిస్తుంది. ప్రీతా బన్సల్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిపున్ మెహతా ‘సర్వీస్‌స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ‘సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా జస్జిత్ సింగ్ పనిచేస్తున్నారు.
మణిపూర్ గవర్నర్ కన్నుమూత
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ (73) సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. 2015 మే 16న మణిపూర్ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసి మణిపూర్‌కు బదిలీ అయ్యారు. ఉర్దూలో డాక్టరేట్ సాధించి పలు రచనలు చేశారు. 1977లో కాంగ్రెస్‌లో చేరి నాగ్‌పాడా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పలుసార్లు మంత్రిగానూ పనిచేశారు. అహ్మద్ మృతితో మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్‌కు మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
జార్ఖండ్ టూరిజం అంబాసిడర్‌గా ధోని
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జార్ఖండ్ పర్యాటక శాఖ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సెప్టెంబర్ 28న ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆన్ ఎక్స్‌ప్లోర్డ్ జార్ఖండ్ 2015’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘువర్‌దాస్ ధోనీని పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు చెప్పారు.

ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా పీవీ చంద్రన్
ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) అధ్యక్షుడిగా పీవీ చంద్రన్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 18న బెంగళూరులో జరిగిన సంస్థ 76వ వార్షిక సమావేశంలో ఆయనను 2015-16కుగాను ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘మాతృభూమి’ గ్రూపు సంస్థలకు ఎండీగా ఉన్న చంద్రన్.. కిందటేడాది ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. సోమేశ్ శర్మ(రాష్ట్రదూత్ సప్తాహిక్)ను ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, అఖిలా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) అనారోగ్యంతో సెప్టెంబరు 20న కోల్‌కతాలో మరణించారు. ఈ ఏడాది మార్చి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఆయన బీసీసీఐ (2001-2004), ఐసీసీ(1997-2000) అధ్యక్షులుగా సేవలందించారు. 1987, 1996 ప్రపంచకప్‌ల నిర్వహణలో దాల్మియా కీలకపాత్ర పోషించారు.
రచయిత్రి జాకీ కోలిన్స్ మృతి
ప్రముఖ బ్రిటన్ రచయిత్రి జాకీ కోలిన్స్ (77) లాస్ ఏంజిలెస్‌లో సెప్టెంబరు 20న మరణించారు. ఆమె రాసిన 30కి పైగా పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆమె 1968లో రాసిన మొదటి నవల ‘ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యారీడ్ మెన్’ బాగా ప్రాచుర్యం పొందింది. ద స్టడ్, రాక్‌స్టార్ ఆమె ఇతర ప్రముఖ నవలలు.
యూఎన్ అత్యుత్తమ సలహా సంఘంలో శ్రీధరన్
మెట్రో మేన్‌గా పేరుగాంచిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రధాన సలహాదారు శ్రీధరన్‌కు గొప్ప అవకాశం దక్కింది. ‘సస్టయినబుల్ ట్రాన్స్‌పోర్ట్’పై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి అత్యుత్తమ సలహా సంఘం సభ్యుడి పదవి ఆయనను వరించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు డీఎంఆర్‌సీ సెప్టెంబర్ 18న ఓ ప్రకటన విడుదల చేసింది. 
జయప్రదకు నవరస కళాభినేత్రి బిరుదు
ప్రముఖ సినీనటి జయప్రదకు నవరస కళాభినేత్రి బిరుదును టీఎస్సార్ లలిత కళాపరిషత్ ప్రదానం చేసింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 20న విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, జమునారాణిల చేతుల మీదుగా ఆమెకు బిరుదు అందజేశారు. జయప్రద ముంజేతికి స్వర్ణకంకణం తొడిగి, వీణను అందజేశారు.
గణిత శాస్త్రవేత్త ‘నల్లాన్’ కన్నుమూత
గణితశాస్త్రవేత్త ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభి రామాచార్యులు (82) సెప్టెంబర్ 19న వరంగల్ జిల్లా హన్మకొండలో కన్నుమూశారు. నడయాడే గణితశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా పిలిచే పట్టాభి రామాచార్యులు ఆర్‌ఈసీ(నేటి నిట్)లో గణితశాస్త్ర ఆచార్యులుగా పని చేశారు. గొప్పనటుడిగా సుపరిచితులు.పట్టాభిరామాచార్యులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు అగ్రహారంలో 1933 నవంబర్ 11న జన్మించారు. 1967లో ‘సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్-న్యూటోనియన్ ఫ్లుయిడ్, డైనమిక్స్’ అనే అంశంపై పరిశోధనా వ్యాసం సమర్పించి డాక్టరేట్ అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు ఐదు ఏళ్లు డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు.
ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్‌గా స్తుతి నారాయణ్ కక్కర్
రిటైర్డు ఐఏఎస్ అధికారిణి స్తుతి నారాయణ్ కక్కర్‌ను జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) చైర్‌పర్సన్‌గా కేంద్రం సెప్టెంబర్ 22న నియమించింది. ఇంతకుముందు స్తుతి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో కార్యదర్శిగా పనిచేశారు. 2014 అక్టోబర్‌లో కుశాల్ సింగ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయనప్పటి నుంచి దాదాపు ఏడాదిగా ఆపోస్టు ఖాళీగానే ఉంది. చిన్నారులకు సంబంధించిన విద్య, శిశు అభివృద్ధి, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం తదితర అంశాలపై ఈ కమిషన్ చర్యలు తీసుకుంటుంది.

శక్తిమంతమైన వ్యాపార మహిళల్లో ఇంద్రానూయి
ఫార్చ్యూన్ ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో భారత్ నుంచి పెప్సికో సీఈవో ఇంద్రానూయి ఒక్కరికే చోటు లభించింది. 50 మందితో సెప్టెంబరు 10న విడుదల చేసిన జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బారా మొదటి స్థానంలో నిలవగా, ఇంద్రా నూయి రెండో స్థానంలో నిలిచారు. 66.6 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాన్ని ఇంద్రానూయి నిర్వహిస్తున్నారు.
కె.జయరామన్‌కు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్ కె.జయరామన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా లభించింది. శాస్త్రవేత్తలకు కల్పించే ఈ అత్యున్నత గౌరవాన్ని కేంద్రం సెప్టెంబర్ 11న ప్రకటించింది. 
శక్తివంతమైన మహిళలుగా చందా, అరుంధతీ
ఆసియా, పసిఫిక్ దేశాల శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచ్చర్‌కు అగ్రస్థానం లభించింది. ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ 25 మందితో జాబితా రూపొందించింది.
నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడుగా రమేశ్ చంద్
నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపారు.
కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళ
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతికి చెందిన జగ్‌దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా నియమితులైన తొలి మహిళగా జగ్‌దీప్ గ్రేవాల్ నిలిచారు. భారత్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1988లో విండో క్లర్క్‌గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు.
సెప్టెంబర్ 10 అనుపమ్ ఖేర్ డే 
బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్‌కు అరుదైన గౌరవం లభించింది. సినిమా, నాటక రంగంలో ప్రపంచవ్యాప్త కృషికి గాను సెప్టెంబర్ 10ని అనుపమ్ ఖేర్ డేగా అమెరికాలోని లాస్‌వెగాస్ నగరం ప్రకటించింది. నాణ్యమైన వినోదం అందించిన అనుపమ్‌కు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు.
జర్మనీలో మేయర్‌గా భారత సంతతి వ్యక్తి
జర్మనీలోని బాన్ నగర మేయర్‌గా అశోక్ శ్రీధరన్ (49) ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవిని అలంకరించనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ) పార్టీ అభ్యర్థిగా ఈయన పోటీచేశారు.

సియాం కొత్త ప్రెసిడెంట్ వినోద్ దాసరి
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం) కొత్త ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎన్నికయ్యారు. కొత్త వైస్-ప్రెసిడెంట్‌గా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా, కొత్త కోశాధికారిగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ ఎన్నికయ్యారు. వాహన కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే దేశంలోనే అతిపెద్ద సంస్థ సియాం, పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. వాహన పరిశ్రమకు సంబంధించి నియమ, నిబంధనలను, విధానాల రూపకల్పనలో సంబంధిత వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 
సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి అత్యున్నత పదవి
భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి పొరుగుదేశం సింగపూర్‌లో గొప్ప గౌరవం దక్కింది. జేవై పిళ్లై (81) అనే భారత సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్‌లోని ఓరని సింగపూర్ మేనేజమెంట్ యూనివర్సిటీ (ఎస్‌ఎంయూ)కి చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొనసాగుతారు. అంతకుముందు చాన్స్‌లర్‌గా పనిచేసిన యాంగ్‌పంగ్‌హో నుంచి పిళ్లై బాధ్యతలు స్వీకరించినట్లు వర్సిటీ యాజ మాన్యం తెలిపింది. మలేసియా నుంచి సింగపూర్ విడిపోయిన తర్వాత ఆదేశం సాధించిన ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తుల్లో పిళ్లై కూడా ఒకరు. సింగపూర్ ఎక్సేంగ్‌కు ఏడాదిపాటు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్ కన్నుమూత
గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్ డిసౌజా(88) గుండెపోటుతో సెప్టెంబర్ 4, 2015వ తేదీన కన్నుమూశారు. స్వతహాగా వైద్యుడైన డిసౌజా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఈ పార్టీ నుంచే మూడు సార్లు (1993-1994, 1994-1998, 1998-1999) గోవా సీఎం పీఠాన్ని అధిష్టించారు. గతంలో గోవా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. 
‘నమామి గంగే’కు అమృతానందమయి రూ.100 కోట్ల విరాళం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు ప్రముఖ ఆద్యాత్మికవేత్త మాతా అమృతానందమయి రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. గంగా నదీ పరివాహక గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ప్రజారోగ్యం కోసం మాతా అమృతానందమయి మఠం 2010లో అమల భారతం క్యాంపెయిన్(ఏబీసీ)ని ప్రారంభించింది.
ఏబీసీ చైర్మన్‌గా శశిధర్ సిన్హా
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ఐపీజీ మీడియా బ్రాండ్స్ సీఈఓ శశిధర్ సిన్హా ఎన్నికయ్యారు. ఏఎస్‌సీఐ, ఎంఆర్‌యూసీ, ఆర్‌ఎస్‌సీఐ, యాడ్ క్లబ్ సంస్థల్లో కీలక పాత్ర పోషించే సిన్హా.. బార్క్ టెక్నికల్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఏబీసీ 67వ వార్షిక సమావేశంలో 2015-16 సంవత్సరానికి ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏబీసీ సెక్రటరీ జనరల్ హెచ్‌బీ మసానీ సెప్టెంబర్ 9న ప్రకటించారు. ‘ఈనాడు’కు చెందిన ఐ.వెంకట్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. 
గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి
ప్రతిష్టాత్మక అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సీఈవోగా భారత సంతతికి చెందిన మహేశ్ రామానుజం ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన రామానుజం యూఎస్‌జీబీసీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా, గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం యూఎస్‌జీబీసీ సీఈవోగా ఉన్న రిక్ ఫెడ్రిజ్జ్ స్థానాన్ని 2016 చివరలో రామానుజంతో భర్తీ చేస్తారు.
డీఆర్‌డీవోలో తొలి మహిళా డెరైక్టర్‌గా మంజుల
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి తొలి మహిళా డెరైక్టర్ జనరల్‌గా జె.మంజుల నియమితులయ్యారు. ప్రస్తుత డెరైక్టర్ జనరల్, ప్రముఖ శాస్త్రవేత్త కేడీ నాయక్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఆమె పట్టా పొందారు. అలాగే హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీలో 26 ఏళ్లకు పైగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె డిఫెన్స్ ఏవియానిక్స్ రీసెర్చ్ స్టాబ్లిష్‌మెంట్(డీఏఆర్‌ఈ) విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

కన్నడ సాహితీవేత్త కల్బుర్గి హత్య
ప్రముఖ కన్నడ పరిశోధకుడు, సాహితీవేత్త ఆచార్య మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి (77)ని ధార్వాడలో ఆగస్టు 30న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. మూఢ నమ్మకాలను గట్టిగా విమర్శించేవారు. దేవతా విగ్రహాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు.

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యునిసెఫ్‌కు గ్లోబల్ గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే తను యునిసెఫ్‌కు సెర్బియా అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా... ఇకపై ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. 28 ఏళ్ల ఈ ప్రపంచ నం.1 ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఫౌండేషన్ తరఫున పిల్లల కోసం ఎన్నో సామాజిక క్యార్యక్రమాలు చేపట్టాడు. యునిసెఫ్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ.

సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్సెయిల్ కొత్త చైర్మన్‌గా పీకే సింగ్ ఎంపికయ్యారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా ఉన్న పీకే సింగ్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈయన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా 2012లో పగ్గాలు చేపట్టారు. గతంలో సెయిల్ చైర్మన్‌గా సీ.ఎస్. వర్మ ఉండేవారు. జూన్ నెలలో ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను కొత్త చైర్మన్ నియామకం జరిగేంత వరకు స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ పర్యవే క్షించారు. 

ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని
 
రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

No comments:

Post a Comment