AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2015

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2015
అమెరికన్ సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి
అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి (37) ఏప్రిల్ 23న బాధ్యతలు చేపట్టారు. ఆయనతో అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడు వివేక్. తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా. ప్రజా ఆరోగ్య విషయాలకు సంబంధించిన పాలనలో సర్జన్ జనరల్ అత్యున్నత పదవి. దీనికి 2013 నవంబర్‌లో వివేక్ మూర్తిని ఒబామా నామినేట్ చేశారు.
టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధ్యక్షుడిగా చదలవాడ కృష్ణమూర్తి (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)ని నియమించారు. ఈ మేరకు ఏప్రిల్ 27న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ కాలపరిమితి ఏడాదిపాటు ఉంటుంది. టీటీడీ సభ్యులు: నీతా అంబానీ, బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలితకుమారి, రవి నారాయణ్, శ్యాంసుందర్ శివాజీ, వై.శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వరరావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకుల సత్యనారాయణ, భానుప్రకాశ్, కె.రాఘవేంద్రరావు (దర్శకుడు), దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్‌యాదవ్, తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రారెడ్డి, గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, కృష్ణమూర్తి (తమిళనాడు)లను నియమించనున్నారు.
ఐఎస్‌ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీ హతం
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్’ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ మరణించాడు. ఇరాన్ రేడియో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇటీవలే అమెరికా బలగాలు జరిపిన దాడిలో బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. సిరియా సరిహద్దుల్లోని అల్‌బాజ్ జిల్లాలో అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో గాయాలపాలైన బాగ్దాదీ మరణించినట్లు ఇరాన్ రేడియో వెల్లడించింది. అతడి తలకు అమెరికా ఇప్పటికే రూ.65 కోట్ల వెల కట్టింది. బాగ్దాదీ చివరిసారిగా గతేడాది జూలైలో బాగ్దాద్‌లోని ఓ మసీదులో ప్రసంగించాడు. ఆ తర్వాత ఎప్పుడూ బయట కనిపించలేదు. ఇస్లామిక్ రాజ్య స్థాపన అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఐఎస్‌ఐఎస్‌ను బాగ్దాదీ స్థాపించాడు. అయితే.. అమెరికా మాత్రం బాగ్దాదీ మరణించిన విషయాన్ని నమ్మబోమని తెలిపింది. అతడి మృతదేహాన్ని చూసేవరకు ఈ కథనాలను విశ్వసించబోమని పేర్కొంది.

నోబెల్ బహుమతి గ్రహీత గుంటర్ గ్రాస్ మృతి
జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, రచయిత, కవి, నాటక రచయిత గుంటర్ గ్రాస్ (87) లూబెక్‌లో ఏప్రిల్ 13న మరణించారు. 1959లో ‘ద టిన్ డ్రమ్’ నవల ఆయనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టింది. తర్వాత క్యాట్ అండ్ మౌస్, డాక్ ఇయర్స్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. 1999లో ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.
ఒడిశా మాజీ సీఎం మృతి
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్ జానకీ వల్లభ్ పట్నాయక్ ఏప్రిల్ 21న మరణించారు. తిరుపతిలో రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమానికి హాజరైన ఆయన తీవ్ర గుండెనొప్పితో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జేబీ పట్నాయక్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఆయన ఒడిశాకు 14 ఏళ్లు సీఎంగా పరిపాలించారు. కేంద్ర మంత్రిగా, అసోం గవర్నర్‌గా ఆయన పనిచేశారు.
నాదెళ్లకు ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు
తెలుగుబిడ్డ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘చాంపియన్ ఆఫ్ ఛేంజ్’ అవార్డు అందించే యోచనలో ఉన్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. 
ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీలో తెచ్చిన మార్పులకు గాను నాదెళ్లకు ఈ అవార్డును అంద జేయనున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికాలో పనిచేసే తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 15రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రకటించింది. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు. 
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ
అమెరికాలోని మహానగరమైన న్యూయార్క్ క్రిమినల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన మహిళ నియమితులయ్యారు. చెన్నైలో పుట్టిన రాజరాజేశ్వరి (43) ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆమె రిచ్‌మండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేస్తున్నారు. క్రిమినల్ కోర్టు జడ్జిగా ఆమెను మేయర్ బిల్ డి బ్లాసినో నియమించారు. మంగళవారం ఆమె లాంఛనంగా విధులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊహించిన దానికి కంటే పెద్ద పదవి తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నూయార్క్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు పురుషులు జడ్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక మహిళ అలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.
సీఈసీగా నసీమ్ జైదీ బాధ్యతల స్వీకారం
భారత ఎన్నికల సంఘం నూతన ప్రధానాధికారి (సీఈసీ) నసీమ్ జైదీ నియమితులయ్యారు.. దేశ 20వ సీఈసీగా ఏప్రిల్ 19న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న హరి శంకర్ బ్రహ్మ పదవీకాలం ముగియడంతో ఏప్రిల్ 18నరిటైర్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ 2012 ఆగస్టులో ఎన్నికల కమిషన్‌గా నియమితులయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్(ఐఐఎఫ్)లో బిజినెస్ ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. బయో కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. 2017 జూలై (అప్పటికి ఆయనకు 65 ఏళ్లు నిండుతాయి) వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు.

నాస్కామ్ చైర్మన్‌గా బీవీఆర్ మోహన్‌రెడ్డి
ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి 2015-16 సంవత్సరానికి గాను సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా బుధవారం ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఆర్.చంద్రశేఖరన్ ఉన్నారు. ఏప్రిల్ 9న మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా.. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఎంపికయ్యారు. 100 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. 
మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి(74) ఏప్రిల్ 8న కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడలో 1942 ఆగస్టు 1న జన్మించిన ఆయన ఇంజినీరింగ్ (బీఈ) చదువుకున్నారు. కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రివర్గాల్లో పని చేశారు. 
హెచ్‌సీయూ చాన్సలర్‌గా రంగరాజన్
భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నూతన చాన్సలర్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు చాన్సలర్‌గా వ్యవహరించిన ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు పదవీ కాలం పూర్తి కావడంతో 11వ చాన్సలర్‌గా సి.రంగరాజన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. రంగరాజన్ గతంలో ప్రధాని ఆర్థిక సలహా సంఘం చైర్మన్‌గా, ఏపీ గవర్నర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చైర్మన్‌గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షులుగా పనిచేశారు. హెచ్‌సీయూలోని సీఆర్ రావు స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 
బాబా రాందేవ్‌కు కేబినెట్ హోదా
బాబా రాందేవ్‌కు హరియాణా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిం ది. యోగా, ఆయుర్వేదాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్‌గా నియమితుడైన బాబా రాందేవ్‌కు కేబినెట్ మంత్రికి సమాన హోదా కల్పించాలని ఏప్రిల్ 13న హర్యానా మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ మంత్రికి సమాన హోదా ఇచ్చినప్పటికీ.. కేబినెట్ మంత్రి పొందే వేతన సౌకర్యాలు రాందేవ్ పొందలేరు, ప్రొటోకాల్ సౌకర్యాలు మాత్రం పొందుతారు.
వైమానిక దళ మాజీ అధిపతి మూల్గాంకర్ మృతి
వైమానిక దళ మాజీ అధిపతి (ఎయిర్ చీఫ్ మార్షల్) హృషీకేష్ మూల్గాంకర్ (95) పుణెలో ఏప్రిల్ 10న మరణించారు. ఆయన 1976-78 వరకు వైమానిక దళ అధిపతిగా పనిచేశారు. దాదాపు 67 రకాల విమానాలు నడిపిన అనుభవం ఆయనకుంది. 1941లో జపాన్ సైన్యంతో పోరాడారు. 1948లో కశ్మీర్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రదానం చేసింది.
సీఈసీగా నసీం జైదీ
ఎన్నికల కమిషనర్ నసీం జైదీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత సీఈసీ హరిశంకర్ బ్రహ్మ ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేస్తారని, జైదీ ఆ తర్వాతి రోజు బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. జైదీ తనకు 65 ఏళ్లు వచ్చేవరకు అంటే 2017 జూలైవరకు పదవిలో కొనసాగుతారు. ఎన్నికల కమిషనర్లలో అత్యంత సీనియర్‌కు పదోన్నతి కల్పించే సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం ఆయన్ను సీఈసీని చేసింది.
సత్యం దోషులకు జైలు శిక్ష
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ఏప్రిల్ 9న 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. తీవ్రమైన ఆర్థిక నేరం:నిందితులపై నేరం రుజువైనట్లుగా తొలుత న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నేరాల్లో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు అపరిమితమైన జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు. శిక్ష కాలపరిమితి విధింపుపై దోషుల అభిప్రాయాలను అడిగారు. ‘‘శిక్షకాలంపై దోషుల అభిప్రాయాలను విన్నాక.. కేసులోని వాస్తవాలు, పరిస్థితులు, నేరం తీవ్రత చూశాక ఇది చాలా లోతైన కుట్రతో కూడిన ఆర్థిక నేరమని నేను భావిస్తున్నా. ఈ కుట్రవల్ల మదుపుదారులు దారుణంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. ప్రొబేషనర్స్ ఆఫ్ అఫెండర్స్ యాక్టును పరిగణలోకి తీసుకొని శిక్షా కాలంపై ఉదాసీనత చూపించాల్సిన నేరం కాదిది. ధనుంజయ్ ఛటర్జీ అలియాస్ ధన వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా... నేరగాళ్లపై తీర్పులు వెలువరించేటప్పుడు సమాజం వేదనను అర్థం చేసుకొని దానికి తగ్గ శిక్ష వేయడమే కోర్టుల ప్రతిస్పందనగా భావించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి 
 
పర్వతారోహకుడు మల్లె మస్తాన్ బాబు (40) అర్జెంటినా, చీలీ మధ్యనున్న ఆండీస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.

No comments:

Post a Comment