AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు డిసెంబరు 2015

క్రీడలు డిసెంబరు 2015
ప్రొ రెజ్లింగ్ చాంపియన్ ముంబై గరుడ
ముంబై గరుడ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ 2015లో చాంపియన్‌గా అవతరించింది. డిసెంబర్ 27న జరిగిన ఫైనల్లో ముంబై గరుడ.. హరియాణా హ్యామర్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై గరుడ నెగ్గింది. మహిళల విభాగంలో ఒడునాయో అడుకురోయె (ముంబై గరుడ), వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్)... పురుషుల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ (బెంగళూరు యోధాస్) ‘ఉత్తమ రెజ్లర్’ పురస్కారాలు గెలుచుకున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ విజేత గుజరాత్
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి గుజరాత్ కైవసం చేసుకుంది. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు డిసెంబర్ 28న జరిగిన ఫైనల్లో 139 పరుగుల ఆధిక్యంతో ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించింది. 2010-11 సీజన్‌లో గుజరాత్ రన్నరప్‌గా నిలిచినా... ఈసారి మాత్రం విజేతగా నిలిచి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (119 బంతుల్లో 105; 10 ఫోర్లు) సెంచరీ సాధించాడు.

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత పురుషుల జట్టు స్వర్ణపతకం సాధించింది. మహిళల విభాగంలో సింగపూర్ స్వర్ణపతకం గెలుచుకోగా భారత మహిళల జట్టుకు రజతపతకం దక్కింది. మిక్సిడ్ డబుల్ విభాగంలో భారత్ స్వర్ణ, రజత పతకాలను సాధించింది. సూరత్‌లో డిసెంబర్ 21న ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 15 పతకాలు గెలుచుకోగా అందులో 3 స్వర్ణ, 5 రజత, 7 కాంస్య పతకాలున్నాయి.

ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేతగా చెన్నైయిన్ జట్టుఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌లో చెన్నైయిన్ జట్టు విజేతగా నిలిచింది. గోవాలో డిసెంబర్ 20న జరిగిన ఫైనల్లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను చెన్నైయిన్ జట్టు ఓడించింది.

సింగపూర్ ఓపెన్ విజేత అభయ్
భారత జూనియర్ స్క్వాష్ ఆటగాడు అభయ్ సింగ్ 2015వ సంవత్సరంలో రెండో అంతర్జాతీయ టోర్నీని గెలుపొందాడు. ఓల్డ్ చాంగ్ కీ సింగపూర్ స్క్వాష్ ఓపెన్‌లో డిసెంబర్ 20న జరిగిన అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో అభయ్.. అల్విన్ చాయ్(మలేసియా)ను చిత్తుగా ఓడించాడు. దీంతో ఓవరాల్‌గా 2015లో ఏడో టైటిల్‌ను 17 ఏళ్ల అభయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

సుమీత్, మనూ జంటకు మెక్సికో ఓపెన్ టైటిల్హెదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెక్సికో సిటీలో డిసెంబర్ 20న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-మనూ అత్రి ద్వయం, బొదిన్ ఇసారా-నిపిత్‌ఫోన్ పువాంగ్‌పెచ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన సుమీత్ జోడీకి 3,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 61 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 

బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ ఫిఫా ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో వీరిద్దరు ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన రాదని ఆదేశించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. అలాగే బ్లాటర్‌పై 50 వేల డాలర్లు, ప్లాటినిపై 80 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానాగా విధించారు. దీంతో 79 ఏళ్ల ప్లాటిని కెరీర్ పూర్తిగా ముగిసినట్టే. 2011లో ప్లాటినికి 2 మిలియన్ల డాలర్లను బ్లాటర్ చెల్లించడం ఈ వివాదానికి మూల కారణం.

‘చాంపియన్స్’గా సానియా, హింగిస్ జోడి
 సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడిని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబుల్స్ వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ కలిసి మహిళల డబుల్స్‌లో 2015లో అత్యద్భుత విజయాలు సాధించారు. హింగిస్‌కు గతం (2000)లో సింగిల్స్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనుభవముంది. 2015 మార్చిలో సానియా, హింగిస్ కలిసి డబుల్స్ ఆడడం ప్రారంభించి రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఏడు ఇతర టైటిళ్లు సాధించారు. యూఎస్ ఓపెన్ నుంచి తమ చివరి 22 మ్యాచ్‌ల్లో వీరికి ఓటమనేది లేదు. ఈ క్రమంలో గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యుటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌ను 55-7తో ముగించారు. మరోవైపు పురుషుల, మహిళల సింగిల్స్ వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్ ఐదోసారి, సెరెనా విలియమ్స్ ఆరోసారి ఎంపికయ్యారు.

2019లో ఏపీలో జాతీయ క్రీడలు
 జాతీయ క్రీడలకు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2019లో జరిగే 37వ జాతీయ క్రీడలను ఏపీలో నిర్వహించడానికి జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అంగీకరించింది. గువాహటిలో డిసెంబర్ 23న జరిగిన ఐఓఏ సమావేశంలో ఈ మేరుకు నిర్ణయం తీసుకున్నారని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి 2019లో జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లో జరగాల్సి ఉంది. అయితే తాము ప్రస్తుతం ఆ క్రీడలను నిర్వహించే పరిస్థితిలో లేమని ఆ రాష్ట్రం ఇటీవల తెలిపింది. దీంతో తాజాగా ఐఓఏ సమావేశంలో బిడ్‌లను పిలిచారు.

ఐసీసీ వార్షిక అవార్డులు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డులను ప్రకటించింది. 2015 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకున్నాడు. అలాగే ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ పురస్కారం కూడా అతనికే దక్కింది. వన్డేల్లో ‘ఉత్తమ క్రికెటర్’ అవార్డును దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వరుసగా రెండో ఏడాది కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు 2010లో కూడా ఏబీకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ టి20 క్రికెటర్ పురస్కారం డు ప్లెసిస్‌కు లభించింది. అవార్డుల ఎంపిక కోసం ఐసీసీ 18 సెప్టెంబర్ 2014 నుంచి 13 సెప్టెంబర్ 2015 వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. ఇంగ్లండ్ అంపైర్ కెటిల్‌బొరో వరుసగా మూడో ఏడాది ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నారు.
అవార్డుల విజేతలు
  • అత్యుత్తమ క్రికెటర్ - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ టెస్టు క్రికెటర్ - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ వన్డే ఆటగాడు - ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
  • ఉత్తమ మహిళా వన్డే క్రికెటర్ - మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ టి20 ఆటగాడు - డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా)
  • ఉత్తమ మహిళా టి20 క్రికెటర్ - స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)
  • ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జోష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
  • అసోసియేట్, అఫిలియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - కుర్రమ్ ఖాన్ (యూఏఈ)
  • స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు - బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)
  • ఉత్తమ అంపైర్ - డేవిడ్ కెటిల్‌బొరో (ఇంగ్లండ్)

బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్
బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కెంటో మొమొటా గెలుచుకొన్నాడు. డిసెంబర్ 13 జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సల్‌సన్ (డెన్మార్క్)ను మొమొటా ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వాంగ్ యిహాన్ (చైనా)ను ఓడించి నోజోమి ఒకుహార (జపాన్) గెలుచుకొంది.
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు డిసెంబర్ 13న (ముంబై) ముగిసింది. ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మను ఓడించి సమీర్ వర్మ గెలుచుకొన్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను వన్నవాత్ అంపున్ సువాన్ - టిన్ ఇస్రియాతే జోడి దక్కించుకొంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోన్‌పావీ చోచువాంగ్ గెలుచుకోగా, మహిళల డబుల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన చలాద్ చలమ్‌చాయ్, మ్యూన్‌వాంగ్‌ల జోడి సాధించింది.
దక్షిణాసియా క్రీడల మస్కట్‌గా ‘టిఖోర్’
దక్షిణాసియా క్రీడల మస్కట్ లోగో ‘టిఖోర్’ను కేంద్ర యువజన, క్రీడా శాఖామంత్రి శర్బానంద సోనోవాల్ డిసెంబర్ 13న గువహటిలో ఆవిష్కరించారు. ఈ క్రీడలు 2016, ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు గువహటి, షిల్లాంగ్‌లలో జరగనున్నాయి. ఇందులో ఎనిమిది దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 23 ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఈ క్రీడలు చివరిసారి బంగ్లాదేశ్‌లో (2010) జరగగా.. భారత్ అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ల ర్యాంకింగ్స్
అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ల ర్యాంకింగ్స్ జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 15న విడుదల చేసింది. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. అలాగే మరో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాప్-5లో నిలిచాడు. బ్యాట్స్‌మెన్ విభాగంలో అగ్రస్థానంలో జో రూట్ (886), ఆ తర్వాత డివిలియర్స్ (881), కేన్ విలియమ్సన్ (878) ఉన్నారు. బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ (875) తొలి స్థానంలో, అశ్విన్ (871) రెండో స్థానంలో, జడేజా (789) ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా సెరెనా
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ 2015 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. 2015లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గడమే కాకుండా ఆడిన 56 మ్యాచ్‌ల్లో 53 నెగ్గి తన టాప్ ర్యాంకును వరుసగా రెండో ఏడాది నిలుపుకుంది. దీంతో ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మేగజైన్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
పుణేకు ధోని.. రాజ్‌కోట్‌కు రైనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్‌లు కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనిని... సంజీవ్ గోయెంకాకు చెందిన పుణే ఫ్రాంచైజీ తీసుకుంది. సురేశ్ రైనాను ఇంటెక్స్ మొబైల్స్‌కు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. సస్పెన్షన్ వేటు పడిన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీల ఆటగాళ్ల కోసం డిసెంబర్ 15న ఐపీఎల్ డ్రాఫ్ట్‌ను ఏర్పాటుచేశారు. 50 మంది క్రికెటర్లు ఉన్న ఈ డ్రాఫ్ట్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చెరో రూ. 39 కోట్లు ఖర్చు చేసి ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకున్నాయి. పుణే.. ధోని, రహానే, అశ్విన్, స్టీవెన్ స్మిత్, డుప్లెసిస్‌లను తీసుకోగా, రాజ్‌కోట్.. రైనా, జడేజా, మెక్‌కల్లమ్, ఫాల్క్‌నర్, బ్రావోలను తీసుకుంది.

రుత్మిక శివానికి బంగ్లాదేశ్ ఓపెన్ టైటిల్
బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రుత్మిక శివాని గెలుచుకొంది. ఢాకాలో డిసెంబరు 5న జరిగిన ఫైనల్లో ఐరిస్ వాంగ్ (అమెరికా)పై శివాని విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సమీర్ వర్మను ఓడించి సాయి ప్రణీత్ గెలుచుకున్నాడు.
దక్షిణాఫ్రికా-భారత్ టెస్ట్ సిరీస్
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఫ్రీడం ట్రోఫీ టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ గెలుచుకుంది. న్యూఢిల్లీలో డిసెంబరు 7న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 337 పరుగుల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. తాజా సిరీస్ విజయంతో భారత్ ఐసీసీ ర్యాంకింగ్‌ల్లో రెండో స్థానానికి చేరింది. సిరీస్‌లో 31 వికెట్లు తీసిన అశ్విన్(భారత్)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అశ్విన్‌కు ఇది 5వ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక టెస్ట్ వర్షం కారణంగా రద్దయింది.
శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం
ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పురుషుల 51 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. శ్యామ్ కుమార్ సెమీఫైనల్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మతోవ్ చేతిలో ఓడిపోయాడు.
వరల్డ్ హాకీ లీగ్ టైటిల్
రాయ్‌పూర్‌లో జరిగిన వరల్డ్ హాకీ లీగ్ టోర్నమెంట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా చేజిక్కించుకొంది. డిసెంబరు 6న జరిగిన ఫైనల్లో బెల్జియంపై ఆస్ట్రేలియా గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌ను ఓడించి భారత్ (మూడో స్థానం) కాంస్య పతకం సాధించింది. దీంతో 1982 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రపంచ స్థాయి పోటీలో భారత్ పతకం సాధించింది. 
సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్
చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్‌లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ 22-21తో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో హింగిస్‌కు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్, సాకేత్‌కు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డు దక్కాయి. విజేత పంజాబ్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ హైదరాబాద్ ఏసెస్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.
ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ
ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తో గెలుపొందాడు. హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. డిసెంబర్ 6న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్.. టామీ చేతిలో ఓడిపోయాడు.
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన తరుణంలో ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితితో సంజీవ్ గోయెంకాకు చెందిన ‘న్యూ రైజింగ్ కన్సార్టియం’ (మైనస్ రూ. 16 కోట్లు) పుణే ఫ్రాంచైజీని దక్కించుకోగా, ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ రూ. 10 కోట్లు) రాజ్‌కోట్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. మొత్తం ఐదు కంపెనీలు పోటీపడగా రివర్స్ బిడ్డింగ్ పద్ధతి ద్వారా బీసీసీఐ కనీస ధర (రూ. 40 కోట్లు) కంటే అతి తక్కువగా కోట్ చేసిన ఈ రెండు సంస్థలు ప్రాంచైజీలను దక్కించుకున్నాయి.

ఉత్తమ అథ్లెట్స్‌గా ఈటన్, దిబాబా
2015 సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్‌గా అమెరికా డెకాథ్లెట్ యాష్టన్ ఈటన్... ఇథియోపియా రన్నర్ గెన్‌జెబె దిబాబా ఎంపికయ్యారు. డెకాథ్లెట్ విభాగంలో ప్రపంచ ఉత్తమ అథ్లెట్‌గా నిలిచిన తొలి పురుషుడిగా ఈటన్ నిలిచాడు. ఇతను 2015 ఆగస్టులో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో డెకాథ్లాన్‌లో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల విభాగంలో నిలకడగా రాణించిన గెన్‌జెబె దిబాబా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించింది. ఈ విభాగంలో ఆమె పేరిటే ప్రపంచ రికార్డు ఉంది.

వెస్టిండీస్ స్పిన్నర్ నరైన్‌పై వేటుసందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. ఇక నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. బంతులు విసిరేటప్పుడు నరైన్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని లాబోర్గ్‌లోని ఐసీసీ అక్రిడేటెడ్ ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో తేలింది. ఐసీసీ ఆర్టికల్ 6.1 ప్రకారం ఇది బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంకావడంతో సస్పెన్షన్ విధించింది. అయితే బౌలింగ్ యాక్షన్‌ను సరి చేసుకున్న తర్వాత నిబంధన 2.4 ప్రకారం తనను మరోసారి పరీక్షించాలని నరైన్ ఐసీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కెయిన్స్ నిర్దోషి
 
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌ను నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కెయిన్స్‌తో పాటు అతని స్నేహితుడు ఫిచ్ హాలండ్‌ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. 2010లో లలిత్ మోడి చేసిన ఒక ట్వీట్‌తో ఈ కేసు మొదలయింది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని మోడీ ట్వీట్ చేశారు. దీనికి ఆగ్రహించిన కెయిన్స్ 2012లో కోర్టును ఆశ్రయించారు. కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు ఐసీసీ కూడా 2013లో ప్రకటించింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు కెయిన్స్‌ను నిర్దోషిగా తేల్చింది.

No comments:

Post a Comment