AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2015

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2015
అలనాటి అందాల తార సాధన కన్నుమూత
బాలీవుడ్ అందాల నటి సాధనా శివదాసాని (74) అనారోగ్యంతో డిసెంబర్ 25న ముంబైలో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 1941 సెప్టెంబర్ 2న సాధన పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన సమయంలో సాధన కుటుంబం పాకిస్తాన్ నుంచి ముంబయ్ వచ్చేశారు. రాజ్‌కపూర్ ‘శ్రీ 420’లోని ఒక పాటలో బాలనటిగా సాధన కాసేపు కనిపించారు. ఆ తర్వాత ఆమెకు ‘లవ్ ఇన్ సిమ్లా’ (1960)లో కథానాయికగా అవకాశం వచ్చింది. 1960, 70 దశకాల్లో తన నటనతో యువతను ఉర్రూతలూగించారు. సాధన నటించిన చిత్రాల్లో ‘వో కౌన్ థీ’ ఆమె కెరీర్‌కి కీలకంగా నిలిచింది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ‘గీతా మేరా నామ్’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 
పీబీఎల్ ప్రచారకర్తగా అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లీగ్‌కు సంబంధించిన అంశాలను, వ్యాఖ్యలను అక్షయ్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో అప్‌డేట్ చేస్తుంటారు. జనవరి 2 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. 
పోచంపల్లి పట్టుచీర సృష్టికర్త కన్నుమూత
పోచంపల్లి పట్టుచీర సృష్టికర్త కర్నాటి అనంతరాములు(85) డిసెంబర్ 26న కన్నుమూశారు. 1931లో జన్మించిన రాములు తన పదమూడో ఏటనే మగ్గాన్ని నేయడం మొదలు పెట్టాడు. 1955లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు చైర్మన్ కమలాబాయి చటోపాధ్యాయ పోచంపల్లిని సందర్శించి ఇక్కడి కాటన్ వస్త్రాలను చూసి ఇవే డిజైన్‌లను పట్టుపై నేయమని సూచించారు. అదే సంవత్సరం ఆప్కో వారు సిల్క్ చీరల డిజైన్‌లలో మెళకువలను నేర్పించడానికి కర్నాటి అనంతరాములును బెనారస్‌కు పంపించారు. అక్కడ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి 1956లో మొట్టమొదటి సారిగా పోచంపల్లి పట్టుచీరలను తయారు చేశారు. అప్పటి నుంచి పోచంపల్లి పట్టుచీరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 
మరాఠీ రచయిత మంగేశ్ పడ్గావ్‌కర్ కన్నుమూత
ప్రముఖ మరాఠీ రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మంగేశ్ పడ్గావ్‌కర్ డిసెంబర్ 30న కన్నుమూశారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా వెంగుర్లలో 1929లో జన్మించిన మంగేశ్... బాంబే వర్సిటీలో ఎంఏ చదివారు. రూయా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. అనేక మరాఠీ సినిమాలకు పాటలు రాశారు. 1983లో పుణే వర్సిటీ థీమ్ సాంగ్ అయిన ‘పుణ్యమయీ దే అమ్హా అక్షర్ వర్ధన్’ అనే పాట రాశారు. సాహిత్యరంగానికి చేసిన సేవలకుగాను 2012లో మంగేశ్‌కు పుణే వర్సిటీ ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం అందజేసింది. కబీర్, సూర్‌దాస్ కావ్యాలతోపాటు షేక్‌స్పియర్ రచించిన ‘జూలి యస్ సీజర్’, ‘రోమియో జూలియట్’ నాటకాలను ఆయన మరాఠీలోకి అనువదించారు. బైబిల్‌ను కూడా మరాఠీలోకి అనువదించారు. 2008లో ఆయన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.

సీబీడీటీ చైర్మన్‌గా ఏకే జైన్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఏకే జైన్ డిసెంబర్ 15న నియమితులయ్యారు. జైన్ 2016 జనవరి వరకు పదవిలో కొనసాగనున్నారు. 
ప్రధాన సమాచార కమిషనర్‌గా ఆర్కే మాథుర్
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా డిసెంబర్ 18న రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే మాథుర్ నియమితులయ్యారు. త్రిపుర కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథుర్ 65 ఏళ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు.
నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు మృతి
ప్రముఖ నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు (84) హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన తొలిసారి 1976లో రంగస్థల నటజీవితం మొదలు పెట్టారు. 100కుపైగా నాటకాల్లో నటించటంతో పాటు దర్శకత్వం వహించారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ నుంచి రెండు సార్లు ఉత్తమ నటుడి అవార్డుతో పాటు 1982లో సంగీత నాటక అకాడమీ పురస్కారం దక్కించుకున్నారు. 1970లో చాట్ల శ్రీరాములుకు లండన్‌లోని బ్రిటీష్ డ్రామా లీగ్ ప్రొడ్యూసర్ అండ్ టీచర్ పురస్కారం అందించింది. దీంతో పాటు ఆయన అనేక పుస్తకాలను రచించారు. 
మదర్ థెరిసా దైవదూత
భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూత(సెయింట్)గా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 4న రోమ్‌లో ఆమెకు అధికారికంగా ఈ హోదా ఇవ్వనున్నట్లు క్యాథలిక్ పత్రిక అవెనైర్ ప్రకటించింది. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో తుదశ్వాస విడిచారు. 
ప్రముఖ నటుడు రంగనాథ్ ఆత్మహత్య
ప్రముఖ తెలుగు సినీ నటుడు రంగనాథ్(66) డిసెంబర్ 19న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. 1949లో చెన్నైలో జన్మించిన రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్(టీసీ)గా పనిచేస్తూ సినిమాపై ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకుపైగా నటించారు. పలు టీవీ సీరియళ్లల్లోనూ కనిపించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్నారు. 
‘నిర్భయ’ కేసులో బాల నేరస్తుడు విడుదల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) డిసెంబర్ 20న బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. ఆ బాల నేరస్తుడిని సొంతప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పంపించకుండా.. అతడి కోరిక మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడ అతడిపై ఎలాంటి పోలీసు పర్యవేక్షణ ఉండదు. గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఈ ‘నిర్భయ’ దోషి విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాల నేరస్తుడి పునరావాసం కోసం రూ. 10 వేలు, కుట్టుమిషన్ అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత
తెలుగు చలన చిత్ర రంగానికి నిరుపమాన సేవలందించిన ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త శిలుకోటి కాశీ విశ్వనాథ్ (69) డిసెంబర్ 22న కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రైల్లో వస్తుండగా ఖమ్మం సమీపంలో డిసెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 1946లో విశాఖలో శిలుకోటి అప్పలస్వామి, బుచ్చయమ్మ దంపతులకు జన్మించిన కాశీ విశ్వనాథ్.. హైస్కూల్ స్థాయి నుంచే రంగస్థల నటుడిగా, నాటక ర చయితగా, దర్శకుడిగా.. యూనివర్సిటీ స్థాయిలో జాతీయ క్రీడాకారుడిగా రాణించారు. 1980లో సినీ రంగప్రవేశం చేశారు. ‘రామాయణంలో పిడకల వేట’ చిత్రంతో రచయితగా పరిచయమయ్యారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం’, ‘దొంగ కోళు’్ల, ‘ఖైదీ నం 786’ తదితర చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 124 చిత్రాలకు కథ, మాటలు అందించిన కాశీవిశ్వనాథ్.. 37 చిత్రాల్లో నటించారు.
పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ
మాజీ క్రికెటర్, పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సస్పెండ్ చేసింది. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా బహిరంగంగా ఆరోపణలు చేసి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ డిసెంబర్ 23న ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణమే సస్పెన్షన్ వర్తింస్తుందని పేర్కొంది. బిహార్‌లోని దర్భంగ స్థానం నుంచి లోక్‌సభకు ఆజాద్ 3 సార్లు ఎన్నికయ్యారు.

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ నిర్దోషిగా తీర్పు
పదమూడేళ్ల కిందటి హిట్ అండ్ రన్ (కారు ప్రమాదం) కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిర్దోషి అని బొంబాయి హైకోర్టు డిసెంబర్ 10న తీర్పుచెప్పింది. ట్రయల్ కోర్టు ఏడు నెలల క్రితం ఇదే కేసులో సల్మాన్‌కు విధించిన ఐదేళ్ల జైలు శిక్ష ఉత్తర్వులను రద్దుచేసింది. దుర్ఘటన సమయంలో సల్మాన్ ఆ కారును నడుపుతున్నట్లు, అపుడు ఆయన తాగి ఉన్నట్లు సందేహరహితంగా రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. అయితే 2002 సెప్టెంబరు 28వ తేదీ రాత్రి సల్మాన్ ఖాన్‌కు చెందిన తెల్లని టొయోటా లాండ్ క్రూజర్ కారు బాంద్రా ప్రాంతంలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలో వేగంగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడ నిద్రిస్తున్న వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. ఆ సమయంలో కారును సల్మాన్ నడుపుతున్నారనీ, అపుడు ఆయన తాగి ఉన్నారనేది అభియోగం.
26/11 కుట్రదారుడు హెడ్లీకి క్షమాభిక్ష
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 ఘటనలో కీలక నిందితుడు పాకిస్తానీ అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ముంబై కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో హెడ్లీ నేరాన్ని అంగీకరించి, అప్రూవర్‌గా మారి ఘటనకు సంబంధించిన పూర్తి, వాస్తవ వివరాలు వెల్లడిస్తానని తెలిపినందుకే క్షమాభిక్ష ప్రసాదించినట్లు న్యాయమూర్తి జీఏ సనప్ తెలిపారు. 2016 ఫిబ్రవరి 8న జరిగే విచారణలో హెడ్లీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుకు వాంగ్మూలం ఇవ్వనున్నాడు. హెడ్లీని విచారించాక ఈ ఘటనకు కుట్రపన్నిన, పాల్గొన్న మిగిలిన ఉగ్రవాదుల వివరాలు తెలుస్తాయని న్యాయమూర్తి తెలిపారు.
ఆదాయంలో షారుక్ నంబర్ వన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆదాయపరంగా భారత సెలబ్రెటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రకటించిన 100 మంది అత్యధిక సంపాదనపరులైన సెలబ్రిటీల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. షారుక్ రూ. 257.5 కోట్ల ఆదాయ అంచనాతో అగ్రస్థానంలో నిలవగా రూ. 202.75 కోట్ల ఆదాయ అంచనాతో సల్మాన్ రెండో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బచ్చన్ రూ. 112 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. టీం ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 119.33 కోట్లతో నాలుగో స్థానం, ఆమిర్‌ఖాన్ రూ. 104.25 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 10లోని ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అక్షయ్ కుమార్ (రూ. 127.83 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 104.78 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 40 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 59 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 74.5 కోట్లు) ఉన్నారు. సెలబ్రిటీల ఆదాయంతోపాటు వారి ఖ్యాతినీ పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. పన్ను చెల్లింపులకు ముందు ఉన్న సెలబ్రిటీల ఆదాయాన్ని, వారి ఖ్యాతి స్కోర్లను కలిపి ర్యాంకులను వెల్లడించారు. 
రైతు నేత శరద్ జోషీ కన్నుమూత
రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శరద్ జోషీ (81) డిసెంబర్ 12న పుణెలో అనారోగ్యంతో కన్నుమూశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా, జర్నలిస్ట్‌గా, వ్యవసాయదారుడిగా పేరుగడించిన జోషీ.. రైతులకు మద్దతు ధరపై దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. 1979లో రైతుల కోసం షేట్కారీ సంఘటన సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా రైతులను సంఘటితం చేశారు. ఆయన ఉల్లిరైతుల కోసం చేసిన ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాల్ని కదిలించింది. మహారాష్ట్రకు చెందిన జోషీ 2004-10 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ, శివసేన మద్దతుతో రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశంతో 1994లో స్వతంత్ర భారత్ అనే పార్టీని జోషీ స్థాపించారు. కేంద్ర వ్యవసాయ సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సేవలందించారు. షేట్కారీ మహిళా అగ్హదీని మహిళా హక్కుల కోసం పోరాడేందుకు స్థాపించారు. 
ఐఎస్‌ఎస్‌కు తొలిసారి బ్రిటిష్ వ్యోమగామి
తొలిసారిగా బ్రిటిష్ దేశానికి చెందిన వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) బయలుదేరి వెళ్లాడు. రష్యా వ్యోమగామి యూరీ మాలెన్‌చెకో, అమెరికాకు చెందిన నాసా వ్యోమగామి టిమ్ కోప్రాలతో కలసి టిమ్ పీక్ అనే బ్రిటన్ పౌరుడు డిసెంబర్ 15న కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయూజ్ టీఎంఏ-19ఎం రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అక్కడ ఈయన ఆరునెలల పాటు గడపనున్నారు. 
సీబీడీటీ కొత్త చైర్మన్‌గా ఏకే జైన్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా ఏజే జైన్ నియమితులయ్యారు. ఈయన 1978 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారి. అనితా కపూర్ పదవీ విరమణ (నవంబర్ 30) తర్వాత నుంచి ఏకే జైన్ సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన రెండు నెలలపాటు మాత్రమే పదవిలో కొనసాగనున్నారు. ఇక అనితా కపూర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను సంస్కరణల సలహాదారుగా నియమితులయ్యారు.

సుప్రీం సీజేగా ఠాకూర్ ప్రమాణం
సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తీరథ్‌సింగ్ ఠాకూర్ డిసెంబరు 3న ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పదవీ విరమణతో ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఠాకుర్ 2017, జనవరి 4 వరకు సీజేఐ(చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) గా కొనసాగనున్నారు.
ఏపీ సోలార్ కార్పొరేషన్ సీవోవోగా నాయుడు
ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్(సీవోవో)గా వీఎస్‌ఆర్ నాయుడు డిసెంబర్ 7న బాధ్యతలు స్వీకరించారు. 35 ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో సేవలందిస్తున్న ఆయన ట్రాన్స్‌కో జీఎం, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు.
టైమ్స్ పర్సన్ ఆఫ్‌ది ఇయర్‌గా మెర్కెల్
ప్రతిష్టాత్మక టైమ్ మేగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2015’గా జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. దీంతో దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళగా మెర్కెల్ గుర్తింపు పొందారు. ఆమె సమర్థ నాయకత్వం, సిరియా శరణార్థుల పట్ల ఆమె అనుసరించిన విధానం, ఐరోపా ఆర్థిక అంశాల విషయంలో ఆమె చూపిన చొరవలను టైమ్ మ్యాగజైన్ ప్రశంసించింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) చీఫ్ అబుర్ బకర్ అల్ బాగ్దాదీ ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్ కార్యకర్తలు, రౌహనీ, ఉబర్ సీఈఓ ట్రావిస్ కళానిక్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

తెలుగు ప్రొఫెసర్లకు జేసీ బోస్ ఫెలోషిప్
సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మాలి క్యూల్ మోడలింగ్ హెడ్ డాక్టర్ నరహరి శాస్త్రిలు ప్రఖ్యాత జగదీశ్ చంద్రబోస్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఈ మేరకు వారిని ఎంపిక చేసింది. శాస్త్ర పరిశోధనల్లో చేస్తున్న పరిశోధనలకు వీరికి ఈ గౌరవం దక్కింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిశోధనల్లో చంద్రశేఖర్ అపారమైన కృషి చేస్తున్నారు. ఇందుకుగానూ ఆయన ఇప్పటికే పలు అవార్డులు కూడా అందుకున్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్‌పై నరహరిశాస్త్రి కృషి చేశారు. 

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులుసీనియర్ పాత్రికేయులు వి.వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. 1991లో ఆంధ్రప్రభ యాజమాన్యం ఆయనను ఎడిటర్‌గా నియమించింది. జర్నలిజంలో అందించిన సేవలకు గాను తెలుగు యూనివర్శిటీ దీక్షితులును ఘనంగా సత్కరించించింది. మద్రాస్ తెలుగు అకాడెమీ.. ఖాసా సుబ్బారావు అవార్డును ఇచ్చి సత్కరించింది.

ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ భారీ విరాళం ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల కోసం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (31) భారీ విరాళాన్ని ప్రకటించారు. తండ్రి అయిన సందర్భంగా ఫేస్‌బుక్‌లోని 99 శాతం షేర్లను ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్లో 45 బిలియన్ డాలర్లు (దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు). ‘చాన్ జుకర్‌బర్గ్ ఇన్షియేటివ్’ పేరుతో మానవ వనరుల సామర్థ్యం పెంపు, అందరూ సమానమే అనే భావన పెంచే దిశగా.. ముందు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, అందరికీ సమాన హక్కుల కల్పన, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మార్క్ తెలిపారు. ఈ సందర్భంగా తర్వాతి తరం భవిష్యత్తుపై కంటున్న కలలతో మాక్స్ (కూతురు)కి జుకర్‌బర్గ్ దంపతులు ఓ లేఖ రాశారు.

డబ్ల్యూహెచ్‌ఓ భారత ప్రతినిధిగా హెంక్ బెకెడమ్ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) భారత ప్రతినిధిగా డాక్టర్ హెంక్ బెకెడమ్ నియమితులయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన బెకెడమ్ డబ్ల్యూహెచ్‌ఓలో 19 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. చైనా, ఈజిప్టులలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధిగా, మనీలాలోని డబ్ల్యూహెచ్‌ఓ పశ్చిమ పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయంలో హెల్త్ సెక్టార్ డెవలప్‌మెంట్ డెరైక్టర్‌గా, కాంబోడియాలో హెల్త్ సెక్టార్ రిఫార్మ్ ప్రాజెక్టుకు టీమ్ లీడర్‌గా పనిచేశారు.

No comments:

Post a Comment