AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు జనవరి 2016

క్రీడలు జనవరి 2016
ఆస్ట్రేలియన్ ఓపెన్
మహిళల సింగిల్స్:ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏడో సీడ్ కెర్బర్ డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. కెరీర్‌లోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఆడిన 28 ఏళ్ల కెర్బర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
పురుషుల సింగిల్స్: పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్.. రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2013, 2014, 2015లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆండీ ముర్రే ఐదోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.
మహిళల డబుల్స్: ప్రపంచ నెంబర్ వన్ జోడి సానియా మీర్జా-మార్టినా హింగిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకొంది. మెల్‌బోర్న్‌లో జనవరి 29న జరిగిన ఫైనల్లో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీని ఓడించి ఈ జోడీ చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు వరుసగా 36 విజయాలతో సానియా-హింగిస్ జోడి రికార్డు సృస్టించింది.
టీ20 సిరీస్‌లో టీం ఇండియా క్లీన్ స్వీప్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ గడ్డపై 1-4తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు తదనంతరం జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్‌లో అయినా సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌కు గురి కావడం 1877 తర్వాత ఇదే తొలిసారి. ఈ సిరీస్ విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
ఆసీస్‌పై సిరీస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు తొలి సిరీస్‌ను గెలుచుకొంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకొంది. మెల్‌బోర్న్‌లో జనవరి 29న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో నెగ్గి భారత మహిళా జట్టు టైటిల్ ఖాయం చేసుకొంది. సిడ్నీలో జనవరి 31న జరిగిన మూడో టీ20ని ఆస్ట్రేలియా గెలుచుకుంది. జులన్ గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ విజేత శ్రీకాంత్
సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ చాంపియన్‌గా అవతరించాడు. గత రెండేళ్లుగా రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. జనవరి 31న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా)పై గెలుపొందాడు. 2014, 2015లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ ఈసారి విజేత హోదాలో 9 వేల డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఐదో టైటిల్. ఇంతకుముందు శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్ (2013), చైనా ఓపెన్ (2014), స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ (2015) టైటిల్స్‌ను సాధించాడు.

ఫెడరర్ సరికొత్త రికార్డు
 స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పురుషుల సింగిల్స్ విభాగంలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2016 సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ ఈ ఘనత సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో మార్టినా నవ్రతిలోవా (అమెరికా) 306 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. 

చానెల్-2కు ఐసీసీ ఆడియో హక్కులుఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2023 వరకు తమ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి ఆడియో హక్కులను చానెల్-2 గ్రూప్‌నకు కట్టబెట్టింది. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2016 నుంచి 2023 వరకు 17 ఐసీసీ ఈవెంట్స్‌ను విశ్వవ్యాప్తంగా ఎఫ్‌ఎం, ఏఎంలలో ప్రసారం చేసే అధికారం చానెల్- 2కు మాత్రమే ఉంటుంది. 2016 జనవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ నుంచి భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు వీరి మధ్య ఒప్పందం ఉంటుంది. ఐసీసీ ప్రపంచ టీ20, చాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్‌ల ఆడియో లైవ్ కామెంటరీని ప్రసారం చేసే బాధ్యతను సబ్ లెసైన్సీ ద్వారా ఆయా దేశాల కంపెనీలకు చానెల్-2 అప్పగిస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు చందర్‌పాల్ వీడ్కోలువెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మన్, మాజీ కప్టెన్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 1994లో తొలి టెస్టు ఆడిన చందర్‌పాల్ 22 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు తన సేవలందించాడు. జట్టు తరఫున లారా తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో 51.37 సగటు సాధించాడు. ఆధునిక క్రికెట్‌లో రెండు దశాబ్దాలకు పైగా ఆటగాడిగా కొనసాగిన ఘనత సచిన్ టెండూల్కర్ తర్వాత 41 ఏళ్ల చందర్‌పాల్ కే దక్కుతుంది.
  • చందర్‌పాల్ మొత్తం 164 టెస్టుల్లో 30 శతకాలతో 11,867 పరుగులు చేశాడు. విండీస్ తరఫున లారా (11,953) అత్యధిక పరుగులు చేశాడు.
  • అత్యధిక స్కోరు 203 నాటౌట్.
  • 268 వన్డేల్లో 8,778 పరుగులు చేయగా, ఇందులో 11 సెంచరీలున్నాయి.
  • 22 టి20లు ఆడి 343 పరుగులు చేశాడు.

మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్బ్యాడ్మింటన్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను పి.వి.సింధు (భారత్) గెలుచుకుంది. పెనాంగ్‌లో జనవరి 24న జరిగిన ఫైనల్లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్‌లాండ్)ను సింధు ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా సింధుకు గుర్తింపు లభించింది. 2013లో తొలిసారి సింధు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇస్కందర్ జుల్కార్ నైన్ జైనుద్దీన్ (మలేసియా)ను ఓడించి, టైటిల్‌ను లీ చోంగ్‌వీ గెలుచుకున్నాడు. 

12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన గేల్మెల్‌బోర్న్‌లో జనవరి 18న జరిగిన బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ 12 బంతుల్లో 50 పరుగులు చేసి వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్ మెల్‌బోర్న్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్‌సింగ్ (భారత్) సాధించిన ప్రపంచ రికార్డును (12 బంతుల్లో 50 పరుగులు) గేల్ సమం చేశాడు. 

బిగ్‌బాష్ విజేత సిడ్నీ థండర్ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్ లీగ్ టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఐదో సీజన్ కప్‌ను సిడ్నీ థండర్ గెలుచుకుంది. జనవరి 24న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో మైక్ హస్సీ నాయకత్వంలోని సిడ్నీ థండర్.. మెల్‌బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఈ లీగ్ చరిత్రలో థండర్ తొలిసారి విజేతగా నిలిచింది. చాంపియన్ సిడ్నీ థండర్ జట్టుకు 4 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 4 లక్షలు), రన్నరప్ మెల్‌బోర్న్ స్టార్స్‌కు 2 లక్షల 60 వేల డాలర్లు (రూ. కోటీ 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
మహిళల టైటిల్ కూడా థండర్‌దే...
మొదటిసారి నిర్వహించిన మహిళల బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను కూడా సిడ్నీ థండర్ చేజిక్కించుకుంది. ఫైనల్లో థండర్.. సిడ్నీ సిక్సర్‌ను ఓడించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ వార్నర్ఆస్ట్రేలియా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ (అలెన్ బోర్డర్ మెడల్) అవార్డును ఓపెనర్ డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ టెస్టుల్లో, వన్డేల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించిన వార్నర్... ఓటింగ్‌లో కెప్టెన్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లను వెనక్కినెట్టాడు. వార్నర్‌కు 30 ఓట్లు రాగా, స్మిత్ (24), స్టార్క్ (18)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు ‘ఉత్తమ వన్డే ఆటగాడు’; ఆడమ్ వోజెస్‌కు ‘ఉత్తమ దేశవాళీ ఆటగాడు’ అవార్డులు లభించాయి. జనవరి 27న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ అవార్డులను ప్రకటించింది.

రియో ఒలింపిక్స్‌కు షూటర్ హీనా అర్హతభారత టాప్ షూటర్ హీనా సిద్ధూ.. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జనవరి 27న జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో హీనా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం గెలుచుకుంది. 8 మంది బరిలోకి దిగిన ఫైనల్స్‌లో భారత షూటర్ 199.4 పాయింట్లు సాధించింది. చైనీస్ తైపీకి చెందిన టియాన్ చియా చెన్ (198.1), గిమ్ యున్ మి (177.9) రజతం, కాంస్యం దక్కించుకున్నారు. భారత్ తరఫున షూటింగ్‌లో ఇది 9వ ఒలింపిక్ బెర్త్. 

సిడ్నీ ఓపెన్ టైటిల్ విజేతలుగా సానియా-హింగిస్ జోడి
 సానియా-హింగిస్ జోడీ సిడ్నీ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకొంది. ఈ జోడీ జనవరి 15న జరిగిన ఫైనల్లో కరోలిన్ గార్సియా- క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్)లను ఓడించింది. దీంతో పాటు జనవరి 14న జరిగిన సిడ్నీ ఓపెన్ సెమీ ఫైనల్స్ విజయంతో వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి సానియా-హింగిస్‌ల జోడి రికార్డు సృష్టించింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో మహిళల డబుల్స్‌లో 1994 తర్వాత అత్యధిక మ్యాచులు నెగ్గిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 1994లో గిగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికన్)-నటషా జ్వెరెవా (బెలారస్) జోడీ పేరిట వరుసగా 28 మ్యాచ్‌లు నెగ్గిన రికార్డు ఉంది. 
ఢిల్లీ ఏసర్స్‌కు పీబీఎల్ టైటిల్
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టైటిల్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు గెలుచుకొంది. న్యూఢిల్లీలో జనవరి 17న జరిగిన ఫైనల్లో ముంబై రాకెట్స్ జట్టును ఢిల్లీ ఏసర్స్ ఓడించింది.
భారత మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా విజయలక్ష్మి
జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లే భారత మహిళా క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన మహిళ ఎంపికయ్యారు. విజయనగరంలోని మహారాజా ఉమెన్స్ కళాశాలలో ఫిజికల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మిని మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జనవరి 16న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విజయలక్ష్మి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమెన్ వింగ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
చండీలాపై జీవిత కాల నిషేధం
ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. జనవరి 18న శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2013లో జరిగిన ఐపీఎల్ ఆరో సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు ఈ చర్య తీసుకుంది. 
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత యూపీ
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలుచుకుంది. జనవరి 20న ముంబైలో జరిగిన ఫైనల్లో యూపీ 38 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ఈ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలవడం ఇదే మొదటి సారి. రంజీ ట్రోఫీకి ఆడే టీంలే ఈ టి20 ట్రోఫీలో పాల్గొంటాయి. ఈ ట్రోఫీని తొలిసారి 2009-10 సీజన్‌లో నిర్వహించారు. సయ్యద్ ముస్తాక్ అలీ తొలి ట్రోఫీని ముంబై గెలుచుకుంది. బరోడా, గుజరాత్ చెరో రెండు సార్లు కైవసం చేసుకున్నాయి.

షూటింగ్‌లో అపూర్వీ ప్రపంచ రికార్డు
స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిక్స్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ అపూర్వీ చండీలా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జనవరి 6న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వీ 211.2 పాయింట్లతో స్వర్ణ పతకం నెగ్గింది. దీంతో 211 పాయింట్లతో యి సిలింగ్ (చైనా) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 10 మీటర్ల ట్రై సిరీస్ ఈవెంట్‌లో కూడా అపూర్వీ స్వర్ణపతకం గెలిచింది. టోర్నీలో ఉత్తమ ప్రదర్మన కనబరచిన అపూర్వీ షూటర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైంది.
చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొన్న వావ్రింకా
చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకొన్నాడు. చెన్నైలో జనవరి 9న జరిగిన ఫైనల్లో బోర్నా కోరిక్ (క్రొయేషియా)ను వావ్రింకా ఓడించాడు. దీంతో ఈ టైటిల్‌ను నాలుగుసార్లు నెగ్గడంతో పాటు వరుసగా మూడుసార్లు సాధించిన వ్యక్తిగా నిలిచాడు. 20 ఏళ్ల చెన్నై ఓపెన్ చరిత్రలో హ్యాట్రిక్ టైటిల్స్ సాధించిన తొలి వ్యక్తిగా వావ్రింకా రికార్డు నమోదు చేశాడు.
జూనియర్ ర్యాంకింగ్స్‌లో సిరిల్‌వర్మకు నెంబర్ వన్ స్థానం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) జనవరి 7న ప్రకటించిన జూనియర్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సిరిల్‌వర్మ మొదటి స్థానాన్ని దక్కించుకొన్నాడు. దీంతో ఆదిత్య జోషి (2014, జనవరి) తర్వాత నెంబర్ వన్ స్థానం పొందిన రెండో భారతీయుడిగా నిలిచాడు. 16 ఏళ్ల సిరిల్‌వర్మ గత ఏడాది నవంబర్‌లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. 
సానియా-మార్టినా జంటకు బ్రిస్బేన్ ఓపెన్ డబుల్స్ టైటిల్
బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్ ద్వయం విజేతగా నిలిచింది. జనవరి 9న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 45,990 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 76 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జోడీగా సానియా-హింగిస్‌లకిది వరుసగా ఆరో టైటిల్. 2015లో యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించిన సానియా-హింగిస్ ఈ ఏడాది ఆడిన తొలి టోర్నీలోనే విజేతగా నిలిచారు. 
సింగిల్స్ విజేతలు: బ్రిస్బేన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మిలోస్ రోనిక్ (కెనడా) గెలుచుకోగా.. మహిళల సింగిల్స్‌ను విక్టోరియా అజరెంకా (బెలారస్) సొంతం చేసుకుంది.
‘హాప్‌మన్’ విజేత ఆస్ట్రేలియా
ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా 17 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించింది. జనవరి 9న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా, ఉక్రెయిన్‌ను ఓడించింది. పురుషులు, మహిళలు కలిపి ఆడే ఈ టీమ్ ఈవెంట్‌లో చివరిసారి 1999లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఉక్రెయిన్‌తో ఫైనల్లో తొలుత మహిళల సింగిల్స్‌లో గావ్రిలోవా, స్విటోలినాపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిరియోస్, డొల్గోపొలోవ్‌పై గెలిచి 2-0తో జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. 
ఖతర్ ఓపెన్ విజేత జకోవిచ్
ఏటీపీ వరల్డ్ టూర్ 2016 సీజన్ ప్రారంభ టోర్నమెంట్ ‘ఖతర్ ఎక్జాన్‌మోబిల్ ఓపెన్’ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుపొందాడు. జకోవిచ్‌కు ఇది తొలి ఖతర్ ఓపెన్ టైటిల్ కాగా.. 60వ ఏటీపీ టైటిల్ విజయం. జనవరి 9న దోహాలో జరిగిన ఫైనల్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై జకోవిచ్ విజయం సాధించాడు. విజేతకు 201165 డాలర్ల (సుమారు రూ.1.34 కోట్లు) ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు.
ప్రపంచ రికార్డు సమం చేసిన సానియా-హింగిస్
తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాల ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 28వ విజయం సాధించిన ఈ ఇండో-స్విస్ ద్వయం 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన రికార్డును అందుకుంది. సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్‌లో భాగంగా జనవరి 13న జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది.

భారత్‌కు శాఫ్ కప్
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్‌ను భారత్ గెలుచుకొంది. తిరువనంతపురంలో జనవరి 3న జరిగిన ఫైనల్లో అఫ్గానిస్థాన్‌ను 2-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ ఈ కప్‌ను గెలుచుకోవటం ఇది పదోసారి. ఇప్పటి వరకు జరిగిన 11 శాఫ్ టోర్నమెంట్లలో భారత్ ఫైనల్‌కి చేరిన 7 సార్లు టైటిల్ గెలిచింది.

ఐసీసీ టెస్ట్ బౌలర్‌గా అశ్విన్2015 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నెంబర్ వన్ టెస్ట్ బౌలర్, ఆల్ రౌండర్‌గా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎన్నికయ్యాడు. అశ్విన్‌కు ముందు భారత్ నుంచి బిషన్ సింగ్ బేడీ 1973లో నెంబర్ వన్ బౌలర్ ర్యాంకును సాధించారు. అశ్విన్ 2015లో 9 టెస్టులు ఆడి 62 వికెట్లు పడగొట్డాడు.

గత 50 ఏళ్లలో లక్ష్మణ్‌దే ఉత్తమ ఇన్నింగ్స్ గత 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనగా వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు గుర్తింపు దక్కింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంది. 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అందుకే ఈఎస్‌పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే మెజారిటీ సభ్యులు ఓటేశారు. పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్, జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలను ఓట్ల ద్వారా ఎంపిక చేశారు. 1981లో ఆస్ట్రేలియాపై ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్) ప్రదర్శన రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా 50 ఉత్తమ ప్రదర్శనలలో బ్రియాన్ లారా (వెస్టిండీస్) ఆడిన ఇన్నింగ్స్ నాలుగు ఉన్నాయి. బోథమ్, రిచర్డ్స్ (వెస్టిండీస్)లవి మూడు ప్రదర్శనలు ఉన్నాయి. గవాస్కర్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌కు కూడా ఈ టాప్-50 ప్రదర్శన జాబితాలో చోటు దక్కింది. 

బీసీసీఐపై జస్టిస్ లోధా కమిటీ నివేదికబీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్ చట్టబద్ధం చేయాలని సూచించడం కమిటీ నుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు 2015 జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్‌లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదినలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదకను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది.
లోధా కమిటీ ప్రతిపాదనలు
  • 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు.
  • ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే.
  • ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి.
  • బీసీసీఐ అద్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ తర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు.
  • ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు.
  • సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి.
  • బెట్టింగ్‌ను చట్టబద్దం చేయడం

ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులతో ప్రపంచ రికార్డుఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఒకే ఇన్నింగ్స్‌లో వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ముంబై కుర్రాడు ప్రణవ్ ధనవాడే నిలిచాడు. ముంబై అండ్-16 స్కూల్ టోర్నమెంట్ భండారి కప్‌లో భాగంగా జనవరి 4, 5 తేదీల్లో జరిగిన రెండు రోజుల మ్యాచ్‌లో 15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు చేశాడు. ముంబై శివార్లలో థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 323 బంతులాడిన ప్రణవ్ 129 ఫోర్లు, 59 సిక్సర్లు బాదాడు. ఆర్య గురుకుల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన ప్రణవ్ తొలి రోజు 652 పరుగులతో అజేయంగా నిలిచి... చివరకు 1009 పరుగుల చేసి కూడా నాటౌట్‌గా నిలిచాడు. ప్రణవ్‌కు ముందు అత్యధిక పరుగుల రికార్డు ఆర్థర్ కొలిన్స్ పేరిట ఉండేది. 1899లో 13 ఏళ్ల వయసులో కొలిన్స్ 628 పరుగుల రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో క్లార్క్స్ హౌస్, నార్త్ టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.

షూటర్ అపూర్వీ ప్రపంచ రికార్డుభారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్‌ప్రి షూటింగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జనవరి 5న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వీ 211.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వీ 211 పాయింట్లతో యి సిలింగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రిడ్ స్టెఫెన్సన్ (స్వీడన్-207.6 పాయింట్లు), స్టిన్ నీల్సన్ (స్వీడన్-185 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు.

No comments:

Post a Comment