AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2015

వార్తల్లో వ్యక్తులు జూలై 2015
టెరీ డీజీ పచౌరీ తొలగింపు
ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టీఈఆర్‌ఐ) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీని తొలగిస్తూ ఆ సంస్థ పాలకమండలి జూలై 23న బెంగళూరులో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడుగా పచౌరీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పచౌరీ స్థానంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్‌ను టెరీ పాలక మండలి నియమించింది.
విప్లవ రచయిత చలసాని మృతి
విప్లవ రచయితల సంఘం(విరసం) సహ వ్యవస్థాపకుడు, రచయిత చలసాని ప్రసాద్ (83) విశాఖపట్నంలో జూలై 25న మరణించారు. విప్లవ రచనలు, కవితలతో ఆయన సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు అరెస్టయ్యారు. శ్రీశ్రీ, రంగనాయకమ్మ, రావి శాస్త్రి వంటి అనేకమంది సాహితీవేత్తలకు ఆయన అత్యంత సన్నిహితుడు.
భారత మాజీ రాష్ట్రపతి కలాం అస్తమయం
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం (84) షిల్లాంగ్‌లో జూలై 27న మరణించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో లివబుల్ ప్లానెట్ అనే అంశంపై ఉపన్యసిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. ఆయన్ను సమీపంలోని బెథనీ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ కలాం 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక 1960లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో చేపట్టిన క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అగ్ని, పృథ్వీ క్షిపణుల రూపకల్పనకు కృషిచేశారు. దీంతో ఆయన మిసైల్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు. 2002 జూలై 25 నుంచి 2007 జూలై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయనకు 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న, 1997లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు, 1998లో వీర్ సావర్కర్ అవార్డు లభించాయి.
ట్రాయ్ చైర్మన్‌గా ఆర్.ఎస్.శర్మ
ఐటీ శాఖ కార్యదర్శి రామ్ సేవక్ శర్మ (ఆర్.ఎస్.శర్మ)ను టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1978 బ్యాచ్‌కు చెందిన శర్మ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఆధార్ ప్రాజెక్ట్ అమలు, డిజిటల్ ఇండియా తదితర వాటిలో కీలక పాత్ర పోషించారు. రాహుల్ ఖుల్లర్ పదవీ విరమణ చేసిన దగ్గరి నుంచి (మే 14) ట్రాయ్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

గాయకుడు రామకృష్ణ మృతి
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ (68) అనారోగ్యంతో హైదరాబాద్‌లో జూలై 17న మరణించారు. ఆయన సుమారు 200 చిత్రాల్లో అయిదు వేలకుపైగా పాటలు పాడారు. సినీగీతాలనే కాకుండా అనేక భక్తి గీతాలను ఆలపించారు. 
నేషనల్ బుక్ ట్రస్టు డెరైక్టర్‌గా రీటా చౌధరీ
నేషనల్ బుక్ ట్రస్టు(ఎన్‌బీటీ) డెరైక్టర్‌గా సాహిత్య అకాడమీ అవార్డు విజేత, అస్సాం బీజేపీ నేత చంద్రమోహన్ పటోవరీ భార్య రీటా చౌధరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్‌బీటీ డెరైక్టర్‌గా ఉన్న ఎంఏ సికందర్ గతేడాది ఆగస్టులో పదవీవిరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. రీటా నియామకానికి జూలై 16న మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆంగ్లం, హిందీ, ఇతర భాషల్లో మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు, పుస్తకాలను ముద్రించి తక్కువ ధరలకు అందించేందుకు ఎన్‌బీటీని కేంద్రం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1957లో స్థాపించింది.
నాల్కో సీఎండీగా టి.కె. చాంద్
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) విశాఖ స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(కమర్షియల్) టి.కె.చాంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు జూలై 21న కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఒడిశాకు చెందిన చాంద్... 1983లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో డెప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) స్థాయికి చేరారు. అదే సంవత్సరంలో విశాఖ ఉక్కు నుంచి కోల్ ఇండియా లిమిటెడ్‌కు డెరైక్టర్ (పర్సనల్)గా బదిలీ అయి వెళ్లారు.

జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత
ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు నీలం గణేశ్‌చారి(68) అనారోగ్యంతో కన్నుమూశారు. చుట్టూ చుక్కలు చూడు.. నడుమ చంద్రున్ని చూడు.., కోడిపాయే లచ్చమ్మది.. కోడి పుంజుపాయే లచ్చమ్మది, రావు రావు సమ్మక్క.. రావే నా తల్లి సమ్మక్క.., జిల్లేలమ్మ జిట్టా వంటి ప్రఖ్యాతిగాంచిన జానపద గీతాలను గణేశ్‌చారి ఆలపించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ల్లో తెలంగాణ జానపదాన్ని వినిపించిన మొట్టమొదటి గాయకుడు ఆయనే. యాకత్‌పుర బ్రాహ్మణ వాడి నీలం నర్సింహ, బాలమ్మలకు గణేశ్‌చారి జన్మించారు. 1966లో ఆయన జానపదాలు పాడటం ప్రారంభించారు. అప్పటి నుంచి లాల్‌దర్వాజ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరల్లో జానపద గీతాలు ఆలపించేవాడు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన హెచ్‌ఎంటీ బేరింగ్స్‌లో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గణేశ్‌చారి గాయపడ్డాడు.
అంగారక యాత్రకు సునీతా విలియమ్స్ ఎంపిక
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2030లో చేపట్టే మానవసహిత అంగారక యాత్రకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(49)తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అక్కడి నుంచి అంగారకుడి వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే వాణిజ్య యాత్రలకు రవాణా సేవలు అందించేందుకు వారికి శిక్షణ ఇస్తారు.
పర్వతారోహణలో గ్రాండ్‌స్లామ్ సాధించిన కవలలు
భారత్‌కు చెందిన కవలలు తాషి, నుంగ్షి మాలిక్ (24) లు పర్వతారోహకుల గ్రాండ్‌స్లామ్ సాధించారు. ఆఫ్రికాలో టాంజానియాలోని 5895 మీటర్ల ఎత్తై కిలిమంజారో పర్వతాన్ని వారు అధిరోహించడంతో గ్రాండ్‌స్లామ్ పూర్తయింది. ఇప్పటికే వారు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తై శిఖరాలన్నింటినీ అధిరోహించడాన్ని పర్వతారోహకుల గ్రాండ్‌స్లామ్ అంటారు. ఇదివరకు దక్షిణాసియాలో ఈ గ్రాండ్‌స్లామ్‌ను భారత్‌కు చెందిన మాజీ నావికాదళ అధికారి సత్యబ్రత్ దామ్ సాధించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్(87) కన్నుమూశారు. 1,200కు పైగా చిత్రాలకు స్వరాలందించిన ఎంఎస్ హృద్రోగ సమస్యతో జూలై 14న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1951 నుండి 1981 వరకు తన సినీ సంగీత ప్రవాహంలో తమిళులను ఓలలాడించిన ఆయన, 1928 జూన్ 24న కేరళలోని పాల్‌ఘాట్ సమీపంలోని ఎలపుల్లిలో జన్మించారు. 13 ఏళ్లకే వేదికపై కచ్చేరీలు నిర్వహించారు. టీకే రామమూర్తితో కలిసి విశ్వనాథన్-రామమూర్తి పేరుతో 700 చిత్రాలకు సంగీతం అందించారు. ఎంజీ రామచంద్రన్ నటించిన జెనోవా చిత్రం ఎంఎస్ వేరుగా సంగీతం అందించిన తొలిచిత్రం. తమిళంతోపాటూ తెలుగు, కన్నడ, హిందీ కలుపుకుని మరో 500 చిత్రాలకు సంగీతం అందించారు. అక్కినేని నటించిన దేవదాసు చిత్రంలోని జగమేమాయ పాటకు స్వరకల్పన చేసింది ఆయనే. ‘మరోచరిత్ర’, ‘అంతులేని కథ’ వంటి అనేక చిత్రాలు ఆయన స్వరప్రవాహం నుంచి జాలువారినవే.

మహిళా మోర్చా ఇన్‌చార్జిగా పురందేశ్వరి
బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జిగా దివంగత ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల కో-ఇన్‌చార్జి పదవి కూడా ఆమెను వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సిద్ధార్థ్ నాథ్‌సింగ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా కృష్ణదాస్ కొనసాగనున్నారు.

బెజవాడ యువకుడి గిన్నిస్ రికార్డు రక్తదానం కోసం వెబ్‌సైట్‌ని ప్రారంభించి వేలాదిమందితో రక్తదానం చేయించినందుకు విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి మామిడి సాయి ఆకాష్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.
రెండేళ్ల కిందట అతడు పదిహేనేళ్ల వయస్సులో రక్తదానానికి ప్రోత్సహించేందుకు www.motherbloodbank.com పేరుతో ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ప్రారంభింపచేశాడు. ఆ సైట్‌లో డోనర్స్‌గా 1,75,000 మందిని చేర్పించడంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్ 21న దేశం మొత్తం మీద 18 నగరాల్లో 1,02,015 మందితో బ్లడ్ డోనేషన్ క్యాంప్ చేసినందుకుగాను గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

‘అంతర్జాతీయ భారతీయుడు’గా యూకే ఎన్నారై‘అంతర్జాతీయ భారతీయుడు’ అవార్డుకు వ్యాపార, విద్యా రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన ప్రముఖ ఎన్నారై లార్డ్ కరణ్ బల్మోరియ ఎంపికయ్యారు. జులై 5న లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంగ్లండ్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ వీరేందర్ పౌల్ ఈ అవార్డును బల్మోరియకు ప్రదానం చేశారు. బల్మోరియ కోబ్రా బీర్ కంపెనీ వ్యవస్థాపకుడు.

ఏఐఐబీ తొలి ప్రెసిడెంట్‌గా జిన్ లికున్బీజింగ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు తొలి ప్రెసిడెంట్‌గా చైనా మాజీ ఆర్థికమంత్రి జిన్ లికున్ ఎంపికయ్యారు. 65 సంవత్సరాల జిన్ ప్రస్తుతం ఏఐఐబీ ఏర్పాటుకు సంబంధించి కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటిర్మ్ మల్టిలేటరల్ సెక్రటేరియట్‌లో సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నారు. రెండో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఉన్న భారత్... వైస్ ప్రెసిడెంట్‌ను ఎంపికచేసే అవకాశం ఉంది.

ప్రపంచ కురువృద్ధుడి కన్నుమూతప్రపంచంలోనే అతి ఎక్కువ వయసు గల పురుషునిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన జపాన్‌కు చెందిన సకారీ మమోయి మృతి చెందారు. ప్రస్తుతం అతని వయసు 112 ఏళ్లు. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని సైతమా నగరంలో నివసించే సకారీని అతి పెద్ద వయసు గల పురుషునిగా గిన్నిస్‌బుక్ గతేడాది ఆగస్ట్‌లో గుర్తించింది.

ఢిల్లీ హోంశాఖ కార్యదర్శిగా నందన్ సహాయ్ నియామకంసీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ నందన్ సహాయ్‌ను హోం శాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సహాయ్ నియామకంతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మధ్య వివాదానికి తెరపడినట్లైంది.

ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఇరాఅంగవైకల్యాన్ని జయించి సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2014లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇరా సింఘాల్‌ను అంగవైకల్యం ఉన్నవారి అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రచారకర్తగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ బుధవారం ఇక్కడ ఇరా సింఘాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవికలురకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సింఘాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని తెలిపారు.

No comments:

Post a Comment