AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జనవరి 2015

వార్తల్లో వ్యక్తులు జనవరి 2015
భారత విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్
 అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జనవరి 28న నిర్ణయం తీసుకుంది. 1977 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన జైశంకర్ రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.
సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా శేఖర్‌సేన్
కేంద్ర సంగీత నాటక అకాడమీ నూతన చైర్మన్‌గా ప్రముఖ సంగీతకారుడు, నాటక దర్శకుడు శేఖర్‌సేన్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి సంబంధించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ జనవరి 28న ఉత్తర్వులిచ్చింది.
హెచ్‌ఏఎల్ చైర్మన్‌గా తెలుగు వ్యక్తి
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి టి.సువర్ణ రాజు(56) జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన ఆర్‌కే త్యాగి స్థానంలో ఆయన నియమితులయ్యారు. టెక్నాలజీ దిగ్గజంగా, విజ్ఞాన ఖనిగా హాల్ సంస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తానని సువర్ణ రాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని పి.వేమవరం రాజు స్వగ్రామం.
సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా దుర్గా ప్రసాద్
కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కె.దుర్గాప్రసాద్ జనవరి 29న బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆయన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ప్రత్యేక భద్రతా దళం (ఎస్‌పీజీ) డెరైక్టర్‌గా పనిచేశారు.
ఐటీబీపీ డీజీగా కృష్ణ చౌదరి
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కృష్ణ చౌదరి జనవరి 30న నియమితులయ్యారు. కృష్ణ చౌదరి 1979 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. 1962, అక్టోబర్ 24న ఏర్పడిన ఐటీబీపీ.. దేశ సరిహద్దుల వద్ద భద్రతా విధులను నిర్వహిస్తోంది.

విశ్వసుందరిగా పౌలీనా వేగా
కొలంబియాకు చెందిన 22 ఏళ్ల పౌలీనా వేగా మిస్ యూనివర్స్ 2014గా ఎన్నికైంది. జనవరి 26న జరిగిన ఫైనల్స్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 80 మందికిపైగా పోటీదారులను వెనక్కునెట్టి వేగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో మిస్‌యూనివర్స్ 63 ఎడిషన్ పోటీలను నిర్వహించారు. భారత్‌కు చెందిన నయోనితా ఈ పోటీల్లో టాప్ టెన్‌లోకి అర్హత సాధించలేకపోయింది. ఈ పోటీల్లో రన్నరప్స్‌గా మిస్ అమెరికా నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కూషా, మిస్ జమైకా కాసి ఫెన్నెల్, మిస్ నెదర్లాండ్స్ యాస్మిన్ వర్హెజీన్‌లు నిలిచారు.
ఐరాస శాంతిస్థాపన ప్యానెల్‌లో సరస్వతీ మీనన్
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్‌లో భారత సామాజికవేత్త సరస్వతి మీనన్‌ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండి, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది.
ఆర్‌కే లక్ష్మణ్ కన్నుమూత
‘కామన్ మ్యాన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్(94) జనవరి 26న పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్‌లో జన్మించారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడ్ ఇట్’ శీర్షికతో కామన్ మ్యాన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. లక్ష్మణ్ ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.

బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.కె.సిన్హా
బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా హిందూ మతానికి చెందిన జస్టిస్ సురేందర్ కుమార్ సిన్హా (64) జనవరి 13న ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్‌లో అత్యున్నత న్యాయమూర్తి హోదా హిందూ మత వ్యక్తికి లభించడం ఇదే తొలిసారి. సిన్హా ఈ హోదాలో మూడేళ్లకు పైగా కొనసాగుతారు.
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా హెచ్‌ఎస్ బ్రహ్మ
భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా హరిశంకర్ బ్రహ్మ జనవరి 16న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన వీఎస్ సంపత్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో బ్రహ్మ నియమితులయ్యారు. ఈ హోదాలో కొనసాగేందుకు గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు.
కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్‌గా పహ్లాజ్ నిహలానీ
కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్‌పర్సన్‌గా చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ జనవరి 19న నియమితులయ్యారు. లీలా శాంసన్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో నిహలానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. తొమ్మిది మంది కొత్త సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరిలో తెలుగు నటి జీవిత ఉన్నారు.
గవర్నర్ ఆఫ్ ద ఇయర్‌గా రఘురామ్ రాజన్
భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌కు గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును జనవరి 12న ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక సుస్థిరతను తీసుకురావడం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్లలో మరింత పోటీ తత్వాన్ని పెంచడంలో కృషి చేసినందుకు రాజన్‌ను అవార్డుకు ఎంపిక చేసినట్లు జర్నల్ ప్రకటించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త చైర్మన్‌గా శ్రీవాస్తవ
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా జనవరి 16న అనుపమ్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు లేదా 60 ఏళ్ల వయసు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. శ్రీవాస్తవ 1981 బ్యాచ్ ఇండియన్ టెలికం సర్వీస్ (ఐటీఎస్) అధికారి.

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ప్రచారకర్త అమితాబ్
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జనవరి 6న వెల్లడించారు.
ఇస్రో చీఫ్‌గా కిరణ్‌కుమార్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఆయన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డెరైక్టర్‌గా పని చేశారు. కర్ణాటకకు చెందిన కిరణ్ 1975లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ ప్రయోగాల్లో కీలక భూమిక పోషించారు. భాస్కర ఉపగ్రహం విజయవంతం కావడంలోనూ ఆయన పాత్ర కీలకం.
ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లారీ పేజ్
ఫార్చ్యూన్ మ్యాగజైన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (2014)గా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నిలిచారు. ఈ జాబితా (టాప్ 50)లో భారత సంతతి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. వారు.. మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్, సీఈఓ అజయ్ సింగ్ బంగా (28వ స్థానం), మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (38వ స్థానం), హర్మన్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్, సీఈఓ దినేశ్ సి. పలివాల్ (42వ స్థానం).
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పాల్
ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరో గవర్నర్‌గా కృష్ణ కాంత్ పాల్ జనవరి 8న ప్రమాణస్వీకారం చేశారు. అజీజ్ ఖురేషి స్థానంలో పాల్ బాధ్యతలు స్వీకరించారు. పాల్ మాజీ ఐపీఎస్ అధికారి. జనవరి 10న మిజోరం గవర్నర్‌గా అజీజ్ ఖురేషి బాధ్యతలు చేపట్టారు.
ఎంవైఎస్ ప్రసాద్‌కు సారాభాయ్ అవార్డు
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌ను విక్రమ్ సారాభాయ్ స్మారక అవార్డుకు ఎంపిక చేసినట్టు ఇస్రో జనవరి 10న ప్రకటించింది. ఇటీవల ముంబైలో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో 2014-15 సంవత్సరానికిగాను షార్ డెరైక్టర్ ప్రసాద్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును ఇస్రో చైర్మన్లు ప్రొఫెసర్ సతీష్ ధవన్, డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్ రాధాకృష్ణన్‌తోపాటు డీఆర్‌డీవో శాస్త్రవేత్త వీకే సారస్వత్ అందుకున్నారు.
‘నీతి ఆయోగ్’ సీఈఓగా సింధుశ్రీ
ప్రణాళిక సంఘం స్థానంలో ఇటీవల ఏర్పాటుచేసిన నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు సీఈఓగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్‌ను నియమించారు. సింధుశ్రీని నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జనవరి 10న వెల్లడించింది. ఇప్పటిదాకా ఆమె ప్రణాళిక సంఘం కార్యదర్శిగా పనిచేశారు.

‘సింగరేణి’ సీఎండీగా శ్రీధర్:
సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది.

ఆర్థికసంఘం చైర్మన్‌గా కాంతారావుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగో ఆర్థిక సంఘాన్ని జనవరి 5న ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎంఎల్ కాంతారావు, సభ్య కార్యదర్శిగా రిటైర్డు పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సి.వెంకటేశ్వరరావును నియమించింది.

శాఖాహార ప్రముఖులుగా మోదీ, రేఖజంతు హక్కుల సంస్థ పెటా-ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, సినీ నటి రేఖలను హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీలుగా ఎంపిక చేసింది. వేలాది మంది ఓటింగ్ ద్వారా వీరిని ఎంపిక చేసినట్లు డిసెంబర్ 30న ప్రకటించింది. ఎప్పుడూ లేని విధంగా 2014లో మోదీ, రేఖల వల్ల శాఖాహారానికి మంచి ప్రచారం లభించినట్లు తెలిపింది.

రైల్వే బోర్డు చైర్మన్‌గా ఏకే మిట్టల్రేల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా ఏకే మిట్టల్ 2014, డిసెంబర్ 31న నియమితులయ్యారు. అరుణేంద్ర కుమార్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. మిట్టల్ రైల్వే బోర్డులో మెంబర్ స్టాఫ్‌గా విధులు నిర్వహించారు.

ఇస్రో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్ పదవీకాలం 2014, డిసెంబర్ 31తో ముగిసింది. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్‌ను నియమించారు. ఈయన బెంగళూరులోని ఎర్త్ అండ్ సైన్స్ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఐఎన్‌ఎస్ అధ్యక్షునిగా కిరణ్ బీ వదోదరియాఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షునిగా గుజరాతీ పత్రిక సంభావ్ మెట్రోకు చెందిన కిరణ్ బీ వదోదరియా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఐఎన్‌ఎస్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2014-15 సంవత్సరానికి ఆయన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ద స్టేట్స్‌మన్ పత్రికకు చెందిన రవీంద్రకుమార్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. గృహలక్ష్మి పత్రికకు చెందిన పీవీ చంద్రన్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా.. రాష్ట్రదూత్‌కు చెందిన సోమేశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

ప్రముఖ పాత్రికేయుడు వర్గీస్ కన్నుమూతప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87) 2014, డిసెంబర్ 30న గుర్గావ్‌లో అస్వస్థతతో మరణించారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు.

డీజీసీఏ సారథిగా సత్యవతి బాధ్యతలుడెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త చీఫ్‌గా ఎం.సత్యవతి జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ నియమితులు కావడం ఇదే ప్రథమం. ప్రభాత్ కుమార్ స్థానంలో వచ్చిన 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ పదవికి ముందు ఆమె పౌర విమానయాన శాఖకు అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు.

రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఒబామాభారత్ రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన పర్యటనను వైట్‌హౌజ్ జనవరి 5న ఖరారు చేసింది. భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కావడం గమనార్హం. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మోదీ-ఒబామా చర్చలు జరపనున్నారు.

No comments:

Post a Comment