AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు ఏప్రిల్ 2016

క్రీడలు ఏప్రిల్ 2016
వాడా జాబితాలో భారత్ స్థానం.. మూడు
2014లో డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఏప్రిల్ 27న విడుదల చేసిన జాబితాలో రష్యా మొదటి స్థానంలో, ఇటలీ రెండో స్థానంలో నిలిచాయి. భారత్ (96) మూడో స్థానంలో ఉంది. అథ్లెటిక్స్, బాడీబిల్డింగ్ క్రీడాకారులు డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎక్కువగా ఉన్నారు. 
ఉమెన్స్ స్క్వాష్ వరల్డ్ చాంపియన్‌షిప్
మహిళల స్క్వాష్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నౌర్ ఎల్ షెర్బినీ (ఈజిప్ట్) గెలుచుకుంది. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్స్‌లో లౌరా మస్సారో(ఇంగ్లండ్)ను ఓడించింది.

లారెస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా జకోవిచ్
ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పిలిచే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులను బెర్లిన్‌లో ఏప్రిల్ 18న ప్రదానం చేశారు.అవార్డు విజేతలు: స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్:నొవక్ జకోవిచ్ (టెన్నిస్). 
స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్: సెరెనా విలియమ్స్ (టెన్నిస్). 
బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: జోర్డాన్ స్పీథ్ (గోల్ఫ్). 
టీం ఆఫ్ ద ఇయర్: ఆల్ బ్లాక్స్ (రగ్భీ యూనియన్). 
లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: నికీ లాడా (ఫార్ములావన్).
బార్సిలోనా ఓపెన్ విజేత నాదల్
బార్సిలోనా ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 24న బార్సిలోనాలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కీ నిషికోరి (జపాన్)ను నాదల్ ఓడించాడు. నాదల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి. తాజా టైటిల్ విజయంతో క్లే కోర్టులపై 49 సార్లు టైటిల్ నెగ్గిన గిలెర్మో విలాస్ రికార్డును సమం చేశాడు. మొత్తంగా నాదల్‌కు ఇది 69వ సింగిల్స్ టైటిల్. 
రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ సందీప్ అర్హత
భారత రెజ్లర్ సందీప్ తోమర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగోలియాలో ఏప్రిల్ 24న జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్‌లో 57 కిలోల విభాగంలో సందీప్ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత పొందాడు. 
విండీస్ బోర్డుపై రూ. 280 కోట్ల నష్టపరిహారం రద్దు
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) చెల్లించాల్సిన దాదాపు రూ. 280 కోట్ల నష్టపరిహారంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది. 2014లో డ్వేన్ బ్రేవో నేతృత్వంలోని విండీస్ వన్డే జట్టు అర్ధాంతరంగా సిరీస్ నుంచి తప్పుకుని స్వదేశానికి పయనమైంది. దీంతో తాము భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, నష్టపరిహారంగా 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా బీసీసీఐ డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడా మొత్తాన్ని రద్దు చేసుకుంది. గత సిరీస్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను ఆడేందుకు 2017లో విండీస్ జట్టు భారత్‌కు రావడానికి అంగీకరించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
సాకేత్-జీవన్ జంటకు చైనా ఏటీపీ డబుల్స్ టైటిల్
టీఏసీ కప్ చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ద్వయం సాకేత్ మైనేని-జీవన్ నెదున్‌చెజియాన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలోని నాన్‌జింగ్ నగరంలో ఏప్రిల్ 25న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-జీవన్ ద్వయం డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. సాకేత్‌కు కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రచారకర్తగా మేరీకోమ్
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఏప్రిల్ 14న భారత బాక్సర్ మేరీకోమ్‌ను వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ప్రచారకర్తగా నియమించింది. మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణపతకాలను సాధించిన బాక్సర్. ఏప్రిల్ 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లోని ఆస్తానాలో బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది.
ఆస్ట్రేలియాకు అజ్లాన్ షా కప్
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇపో (మలేసియా)లో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. 33 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి. భారత్ ఐదుసార్లు గెలుపొందింది.
నాదల్‌కు మోంటె కార్లో మాస్టర్స్ టైటిల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ దాదాపు రెండేళ్ల తర్వాత మరోసారి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 17న ముగిసిన మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై నాదల్ విజయం సాధించాడు. తద్వారా ఈ టైటిల్‌ను తొమ్మిదోసారి తన ఖాతాలో జమ చేసుకున్నాడు. నాదల్ కెరీర్‌లో ఇది 100వ ఫైనల్ కావడం విశేషం. 29 ఏళ్ల నాదల్ ఈ టోర్నీని 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిదిసార్లు గెల్చుకున్నాడు. తాజా విజయంతో నాదల్ అత్యధికంగా 28 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను సాధించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) రికార్డును సమం చేశాడు.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ 
భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీపాకర్మాకర్ (త్రిపుర) రికార్డు నెలకొల్పారు. ఏప్రిల్ 17న రియో డి జనీరో (బ్రెజిల్)లోజరుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో వ్యక్తిగత మహిళల ఆల్‌రౌండ్ విభాగంలో కర్మాకర్ అర్హత సాధించారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో భారత్ నుంచి పురుషుల విభాగంలో 1952 (హెల్సింకి), 1956 (మెల్‌బోర్న్), 1964 (టోక్యో) ఒలింపిక్స్‌లో క్రీడాకారులు పాల్గొన్నారు.
రచనోక్‌కు సింగపూర్ ఓపెన్ టైటిల్
బ్యాడ్మింటన్ సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను రచనోక్ ఇంతనోన్ (థాయిలాండ్) గెలుచుకుంది. సింగపూర్‌లో ఏప్రిల్ 17న జరిగిన ఫైనల్లో సన్ యూ (చైనా)ను రచనోక్ ఓడించింది. సోన్ వాన్ హో (కొరియా)పై గెలిచి సోనీ ద్వి కుంకురో (ఇండోనేసియా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అందుకున్నాడు. మహిళల డబుల్స్ టైటిల్‌ను నిత్యా క్రిషిందా మహేశ్వరి, గ్రేసియా పోలి (ఇండోనేసియా), పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫు హీఫెంగ్, జాంగ్ సన్ (చైనా)లు గెలుచుకున్నారు.
ఎన్‌బీఏ దిగ్గజం బ్రయాంట్ రిటైర్మెంట్
నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. ఏప్రిల్ 14న స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు.
హాకీ చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో జీహెచ్‌ఎల్
అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్స్‌లో సమూల మార్పులు చేయబోతున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి గుడ్‌బై చెప్పి దాని స్థానంలో కొత్తగా ‘గ్లోబల్ హాకీ లీగ్ (జీహెచ్‌ఎల్)’ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) భావిస్తోంది. 2019లో ప్రవేశపెట్టనున్న ఈ లీగ్‌లో కేవలం ఏడు జట్లు మాత్రమే ఉంటాయని ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు లియోనాడ్రో నేగ్రి తెలిపారు. ‘కొత్త క్యాలెండర్‌లో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉండవు. అయితే తక్కువ ర్యాంక్ దేశాలకు అంతర్జాతీయ అనుభవం కోసం రౌండ్-1, 2 పోటీలను కొనసాగిస్తాం. ఇక చాంపియన్స్ ట్రోఫీని కూడా కొనసాగించం. ఒలింపిక్స్, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. 2021 తర్వాత జీహెచ్‌ఎల్‌లో తొమ్మిది జట్లు ఉంటాయి’ అని నేగ్రి పేర్కొన్నారు. 1978లో మొదలైన చాంపియన్స్ ట్రోఫీని ప్రతి ఏడాది కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే 2010లో హాకీ వరల్డ్ లీగ్ రావడంతో దీన్ని ద్వైవార్షిక ఈవెంట్‌గా మార్చారు. 
చైనా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత రోస్‌బర్గ్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఏప్రిల్ 17న జరిగిన చైనా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. దీంతో 2016 సీజన్‌లో వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా అతనికిది ఆరో టైటిల్. 2015లో చివరి మూడు రేసుల్లో (మెక్సికో, బ్రెజిల్, అబుదాబి గ్రాం డ్‌ప్రి) నెగ్గిన రోస్‌బర్గ్ ఈ ఏడాది జరిగిన తొలి మూడు రేసుల్లోనూ (ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా) టైటిల్ సాధించాడు. చివరి స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లెవిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానాన్ని సంపాదించాడు. వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... క్వియాట్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
పాక్ చీఫ్ సెలక్టర్‌గా ఇంజమామ్
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్‌ను నియమించారు. గతంలో పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన ఇంజమామ్ సెలక్టర్‌గా పనిచేయడం ఇదే తొలిసారి. 2016 డిసెంబర్ వరకు ఆయన అఫ్ఘానిస్తాన్ చీఫ్ కోచ్‌గా ఉండాల్సింది. కానీ పీసీబీ వినతి మేరకు పాకిస్తాన్ చీఫ్ కోచ్‌గా ఉండటానికి అంగీకరించారు.
హాంకాంగ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం
హాంకాంగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండున్నరేళ్లు నిషేధాన్ని విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడన్న ఆరోపణలతో ఐసీసీ 2015 నవంబర్ 4న అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఇర్ఫాన్‌ను సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతికి పాల్పడకపోయినా, ఆ విషయాన్ని ఏసీయూ దృష్టికి తీసుకురానందుకు నిషేధం పడింది.

నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్స్
నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సమీర్ వర్మ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 10న చంఢీగఢ్‌లో జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మను ఓడించి సమీర్ వర్మ టైటిల్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ప్రకాశ్ చోప్రా, అక్షయ్ దివాల్కర్‌ల జోడీ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను పి.సి తులసి, మహిళల డబుల్స్ టైటిల్‌ను సిక్కి రెడ్డి, ప్రద్న్య గాద్రెలు గెలుచుకున్నారు.
క్రికెట్ నుంచి జేమ్స్ టేలర్ రిటైర్మెంట్
ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ 26 ఏళ్ల చిన్న వయస్సులోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టేలర్ తెలిపాడు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఏప్రిల్ 12న నిర్వహించిన స్కానింగ్‌లో అతడి గుండె చాలా తీవ్ర పరి స్థితిలో ఉన్నట్టు తేలింది. ఇంగ్లండ్ తరఫున ఏడు టెస్టులు ఆడిన టేలర్ 312 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 887 పరుగులు సాధిం చాడు. ఇందులో ఓ శతకం ఉంది.
ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి తరలించాలని హైకోర్టు ఆదేశం
ఐపీఎల్-9 షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న బీసీసీఐని ఆదేశించింది. మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి ఎద్దడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు తరలించాలని సూచించింది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది. తరలింపునకు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్ని హామీలు ఇచ్చినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మ్యాచ్‌ల సందర్భంగా పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్‌జీఓ మూవ్‌మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కనడే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెండుసార్లు వాయిదా వేసింది. ఈలోగా ముంబైలో తొలి మ్యాచ్ కూడా జరిగిపోయింది. కానీ ఏప్రిల్ 13న జరిగిన సుదీర్ఘ విచారణలో కోర్టు మ్యాచ్‌లను తరలించడానికే మొగ్గు చూపింది. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌షిప్

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కెంటో మొమోటా (జపాన్), మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచనోక్ ఇంతనోన్ (థాయిలాండ్) గెలుచుకున్నారు.న్యూఢిల్లీలో ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్స్‌న్ (డెన్మార్క్)ను మొమోటా ఓడించాడు. లి లి జుయెరుయు (చైనా)ను ఓడించి ఇంతనోన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను గిడోన్ మార్కుస్ ఫెర్నాల్డీ, కెవిన్ సంజయా సుకములియో (ఇండోనేషియా), మహిళల డబుల్స్ టైటిల్‌ను మిసాకి మత్స్‌టోనో, అయకా తకాషాషి (జపాన్) గెలుచుకున్నారు.

టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ ఐసీసీ టి20 ప్రపంచకప్ 2016ను వెస్టిండీస్ జట్టు గెలుచుకుంది. ఏప్రిల్ 3న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దీంతో టి20 ఫార్మాట్‌లో రెండు సార్లు విశ్వవిజేతగా విండీస్ జట్టు నిలిచింది. అలాగే రెండుసార్లు వన్డే, రెండుసార్లు టి20 ప్రపంచకప్‌లను గెల్చుకున్న తొలి జట్టుగా వెస్టిండీస్ గుర్తింపు పొందింది. 66 బంతుల్లో 85 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విండీస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత ఆటగాడు విరాట్ కోహ్లి (5 మ్యాచ్‌ల్లో 273 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు.

మహిళల ప్రపంచకప్ విండీస్‌దే..ఐసీసీ టి20 మహిళల ప్రపంచకప్‌ను సైతం వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో విండీస్ మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలువగా, టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించిన స్టెఫానీ టేలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకుంది.

జొకోవిచ్, అజరెంకాలకు మియామి ఓపెన్ టైటిల్స్మియామి టెన్నిస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవోక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. తాజా విజయంతో జొకోవిచ్ ఈ టైటిల్‌ను వరుసగా మూడుసార్లు, మొత్తం మీద ఆరుసార్లు గెలుపొందాడు. దీంతో పాటు మొత్తం 28 మాస్టర్స్ టైటిల్స్‌ను నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వెత్లానా కుజెనెస్తోవా (రష్యా)ను ఓడించి విక్టోరియా అజరెంకా టైటిల్‌ను గెలుచుకుంది.

బహ్రెయిన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్బహ్రెయిన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 3న జరిగిన రేసులో రోస్‌బర్గ్ 57 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 34.696 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిలోనూ రోస్‌బర్గ్‌కు టైటిల్ లభించింది. మరో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ)కు రెండో స్థానం లభించింది.

ఆసియా చెస్ చాంపియన్ భారత్డిఫెండింగ్ చాంపియన్ చైనాను వెనక్కి నెట్టి భారత పురుషుల జట్టు ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించింది. అధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, కృష్ణన్ శశికిరణ్, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన భారత బృందం మొత్తం 17 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిది రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలో భారత్ ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈ టైటిల్‌ను భారత్ నెగ్గడం ఇది మూడోసారి. 2005, 2009లోనూ భారత్ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ రెండు టోర్నీల్లో చైనా పాల్గొనలేదు. ఈసారి చైనా పాల్గొన్నా 15 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

No comments:

Post a Comment