AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2016

వార్తల్లో వ్యక్తులు మార్చి 2016
ఇంటెల్ సంస్థ మాజీ చైర్మన్ గ్రోవ్ మృతి
ఇంటెల్ సంస్థను ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ చిప్ సంస్థగా తీర్చిదిద్దిన ఆండ్రేవ్ గ్రోవ్ (76) మార్చి 22న అమెరికాలో మృతి చెందారు. 1968లో ఇంటెల్ సంస్థను ప్రారంభించిన తర్వాత ఆ సంస్థలో చేరిన తొలి వ్యక్తి గ్రోవ్. ఆయన పరిశోధనలు, ఉత్పత్తిలో పాల్గొనడంతో పాటు 2014 వరకు ఇంటెల్ చైర్మన్‌గా వ్యవహరించారు. టైమ్ పత్రిక 1997లో ఆండ్రేవ్ గ్రోవ్‌ను మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది.
బోస్నియా సెర్బె మాజీ నాయకుడు రాదోవన్ కరద్‌జిక్‌కు 40 ఏళ్లు శిక్ష
బోస్నియా సెర్బె మాజీ నాయకుడు రాదోవన్ కరద్‌జిక్‌కు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ మార్చి 24న 40 ఏళ్ల శిక్ష విధించింది. 1995లో సెర్బెనికా రాష్ట్రంలో జరిగిన 8,000 మంది ముస్లింల ఊచకోత ఘటన కు సంబంధించి కోర్టు కరద్‌జిక్‌ను నిందితునిగా తేల్చింది. 
ఆనందగజపతిరాజు కన్నుమూత
విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి ఆనంద గజపతిరాజు (66) మార్చి 26న కన్నుమూశారు. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆనంద్‌గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. 1950 జూలై 17న విజయనగరం మహారాజు పి.వి.జి.రాజు, కుసుమ గజపతి ప్రథమ సంతానంగా జన్మించిన ఈయనకు సోదరుడు అశోక్ గజపతిరాజు, సోదరి సునీతాదేవి ఉన్నారు. గ్వాలియర్‌లో స్కూల్ విద్యాభ్యాసం కొనసాగగా.. మద్రాస్ లయోలాలో కళాశాల, అమెరికా స్టెట్సన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. హ్యూమనిస్టిక్ స్టడీస్ అంశంలో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇంటర్ అమెరికన్ యూనివర్సిటీ 2003లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో ఆంధ్రా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ అందుకున్నారు. ‘రాజకీయ అర్థశాస్త్రంలో దారితప్పిన ఆలోచనలు’ అనే పుస్తకాన్ని 2014లో రాశారు.
‘గిన్నిస్’లో గాన కోకిల పి.సుశీల
ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 2016 జనవరి 28 నాటికి ధ్రువీకరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి ఆరుకు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారని గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు. 1952లో తమిళ చిత్రం ‘పెట్రతాయి’ (తెలుగులో ‘కన్నతల్లి’) ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన సుశీల ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ గీతాలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. ఈమెకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి. ఇప్పటికి ఐదు సార్లు ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఆమెను జాతీయ అవార్డులు వరించాయి.

అమెరికా ఐఎస్‌ఏ అధ్యక్షుడిగా భారత ప్రొ.టి.వి.పాల్
అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) 56వ అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ప్రొఫెసర్ టి.వి.పాల్ మార్చి 18న నియమితులయ్యారు. ఐఎస్‌ఏ అనేది మేధావులతో కూడిన ఓ ప్రతిష్టాత్మక సంఘం. కేరళకు చెందిన పాల్ ప్రస్తుతం మాంట్రియల్(కెనడా)లోని జేమ్స్ మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతి
ప్రముఖ షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్(77) మార్చి 16న కోల్‌కతాలో మరణించారు. హుస్సేన్ హిందూస్థానీ వాయిద్యం షెహనాయి వాయించడంలో బిస్మిల్లాఖాన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలను సాధించారు. ఆయనకు 2009లో సంగీత నాటక అకాడెమీ అవార్డు లభించింది.
మదర్ థెరిసాకు సెయింట్ హుడ్
మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ప్రకటించేందుకు వాటికన్ సిటీ మార్చి 15న ఆమోదం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4న అధికారికంగా ఆమెకు సెయింట్ హుడ్ హోదా ఇవ్వనున్నట్లు కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని సెయింట్‌గా ప్రకటించేందుకు రెండు అద్భుతాలు జరిగుండాలి. థెరిసా మహిమతో 1998లో బెంగాలీ గిరిజన మహిళ అనారోగ్యం నుంచి కోలుకోవడం, 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడిన సంఘటనలను సెయింట్ హుడ్ ప్రకటనకు పరిగణలోకి తీసుకున్నారు.

ప్రముఖ శాస్త్రవేత్త ఎం.వి.రావు మృతి
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి.రావు (88) మార్చి 8న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గోధుమ పంటపై 30 ఏళ్ల పాటు పరిశోధన చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వ్యవసాయ సంస్థ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వం 1986లో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి నూనె గింజల టెక్నాలజీ మిషన్‌కు డెరైక్టర్‌గా, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు. ఎం.వి. రావు సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, నర్‌మన్ ఈ బోర్‌లాగ్ పురస్కారాలు లభించాయి.
‘సిక్స్ మెషీన్’గా గేల్ జీవిత చరిత్ర
ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘సిక్స్ మెషీన్ - ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పేరుతో ఈ పుస్తకం జూన్ 2 నాటికి మార్కెట్లోకి వస్తుంది. కింగ్‌స్టన్ వీధుల్లో తిండి కోసం ఖాళీ బాటిళ్లు దొంగతనం చేసిన నాటినుంచి దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగే వరకు ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు ఇందులో ఉంటాయని గేల్ ప్రకటించాడు. 
కాన్‌బెర్రా వర్సిటీ వీసీగా భారతీయుడు
ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక కాన్‌బెర్రా యూనివర్సిటీ తదుపరి వైస్ చాన్స్‌లర్‌గా భారతీయ విద్యావేత్త హెచ్.దీప్ సైనీ (60) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ ఆఫ్ టోరంటో వైస్ ప్రెసిడెంట్‌గా, యూనివర్సిటీ ఆఫ్ టోరంటో మిస్సిసాగా క్యాంపస్ (కెనడా) ప్రిన్సిపల్‌గా ఉన్నారు. ప్లాంట్ ఫిజియాలజిస్ట్‌గా అంతర్జాతీయ స్థాయిలో దీప్ సైనీ ప్రఖ్యాతిగాంచారు. ప్రస్తుత వైస్ చాన్స్‌లర్ స్టీఫెన్ పార్కర్ వచ్చే జూలైలో రిటైరైన అనంతరం దీప్ సైనీ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. 
మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’
మదర్ థెరిసాను ‘సెయింట్’గా ప్రకటించేందుకు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4న అధికారికంగా సెయింట్‌హుడ్ ఇస్తామని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి మార్చి 15న పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో 45 ఏళ్ల పాటు పేదల సేవలో తరించిన మదర్ థెరిసా మరణించిన 19 ఏళ్ల అనంతరం సెయింట్ హోదా పొందనున్నారు. రోమ్‌లో జరిగే సెయింట్ హోదా ప్రకటన కార్యక్రమానికి ఆర్చిబిషప్ డిసౌజా, సిస్టర్ ప్రేమ హాజరవనున్నారు.

లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతి
లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా (68) మార్చి 4న గుండెపోటుతో ఢిల్లీలో మరణించారు. ఆయన 1996-98 మధ్య 11వ లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. 1988-90 మధ్యకాలంలో మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎంపికైన ఆయన ప్రస్తుతం తురా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ-మెయిల్ సృష్టికర్త రే టామ్లిన్సన్ మృతి
సమాచార ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలిచిన ఈ-మెయిల్ సృష్టికర్త రే టామ్లిన్సన్ (74) మార్చి 5న మరణించారు. అమెరికాకు చెందిన ఆయన 1971లో ఈ-మెయిల్‌ను కనుగొన్నారు. యూజర్, హోస్ట్‌ల మధ్య తేడాను గుర్తించేందుకు @ ను తొలిసారి వినియోగించారు. ఆయన రూపొందించిన ఈ-మెయిల్ అడ్రస్‌ను అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థ ఆర్పానెట్‌లో తొలిసారి వాడారు.
ప్రముఖ దర్శకుడు పి.కె. నాయర్ మృతి
ప్రముఖ దర్శకుడు, పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఏఐ) వ్యవస్థాపకుడు పి.కె నాయర్ (83) పుణెలో మార్చి 4న మరణించారు. 
కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి (72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 4న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగానూ పనిచేశారు. 1996, 1999, 2004లో సుజాతనగర్ ఎమ్మెల్యేగా, 2009, 2014లో పాలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సహకార, కార్మిక, ఉద్యానవన శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం రోశయ్య, కిరణ్ కేబినెట్‌లోనూ కొనసాగారు.
ఐఎంఎఫ్ ఈడీగా సునీల్ సభర్వాల్
స్వతంత్ర ఇన్వెస్టర్ సునీల్ సభర్వాల్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా సెనెట్ సునీల్ నియామకానికి ఆమోదం తెలిపింది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి పదవిని పొందటం ఇదే తొలిసారి. సునీల్ సభర్వాల్ ఇదివరకు యూరోపియన్ ఈ-కామర్స్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ ఒగాన్ బోర్డు చైర్మన్‌గా, జర్మనీకి చెందిన నెట్‌వర్క్ సర్వీసెస్ కంపెనీ ఈజీక్యాష్ కొనుగోలు విషయంలో వార్‌బర్గ్ పింకస్‌కు సలహాదారుడిగా, ఫస్ట్ డేటా కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఈ క్యాపిటల్ ఎగ్జిక్యూటి వ్‌గా పలు రకాల బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఓహియో యూనివర్సిటీ నుంచి బీఎస్ పట్టాను, లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంఎస్ పట్టాను పొందారు.
మలయాళ నటుడు కళాభవన్ మణి కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి (45) మార్చి 6న కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. తెలుగులో ‘జెమిని’, ‘ఎవడైతే నాకేంటి’, ‘నరసింహుడు’, ‘అర్జున్’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మణి కొంతకాలం ఆటోడ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1993లో మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నటునిగా నిలదొక్కుకుంటూనే జానపద గాయకునిగా, స్వరకర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. దాదాపు 200కుపైగా మలయాళ, తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మణి నటించారు. ‘వసంతియుమ్ లక్ష్మియుమ్ న్యానుమ్’ అనే మలయాళ చిత్రంలో చేసిన లీడ్ రోల్‌కుగాను మణి జాతీయ అవార్డు (స్పెషల్ జ్యూరీ కేటగిరీలో), కేరళ రాష్ట్ర అవార్డులను అందుకున్నారు.

బీబీబీ తొలి చైర్మన్‌గా వినోద్ రాయ్
 
బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) తొలి చైర్మన్‌గా కంప్ట్రోలర్ అండ్ జనరల్ (కాగ్) మాజీ అధిపతి వినోద్ రాయ్ నియమితులయ్యారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సినార్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీఎండీ అనిల్ ఖండేల్వాల్, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ మాజీ అధిపతి రూపా కుడ్వా సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిలతో సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. బ్యాంకుల డెరైక్టర్ల నియామకం, మొండి బకాయిలు, నిధుల సేకరణ, రుణగ్రస్తుల ఆస్తుల జప్తు వంటి అంశాల్లో బీబీబీ సలహాలు, సిఫార్సులు ఇస్తుంది.

No comments:

Post a Comment