AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2014

వార్తల్లో వ్యక్తులు జూలై 2014
హర్యానా గవర్నర్‌గా కప్టన్ సింగ్
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కప్టన్ సింగ్ సోలంకి హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి జూలై 25న ప్రకటన వెలువడింది. జగన్నాథ్ పహాడియా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం
ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం సాధించినట్లు జూలై 22న ప్రకటించారు. ప్రత్యర్థి సుబియాంతోపై 8.4 మిలియన్ల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్టోబర్‌లో అధ్యక్ష పగ్గాలు చేపట్టే విడోడో ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. 
ఇరాక్ అధ్యక్షుడిగా పుఅద్ మాసుమ్
కుర్దు రాజకీయవేత్త పుఅద్ మాసుమ్ ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా జూలై 24న బాధ్యతలు చేపట్టారు. ఇరాక్ స్వతంత్ర కుర్దీస్ ప్రాంతానికి మొదటి ప్రధానిగా ఆయన పనిచేశారు. 
భారత్‌లో పర్యటించిన ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు 
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ జూలై 21 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక తోడ్పాటుతో తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సంద ర్శించారు.

సిరియా అధ్యక్షుడు అసాద్
సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసాద్ జూలై 16న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఏడేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. జూన్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 88.7శాతం ఓట్లతో అసాద్ విజయం సాధించారు. 
ఐఓసీ చైర్మన్‌గా బి.అశోక్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్‌గా బి. అశోక్ జూలై 16న బాధ్యతలు చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కమిటీ ఉత్తర్వులు జారీచేసింది.
చాందీ ప్రసాద్‌కు 2013 గాంధీ శాంతిబహుమతి
2013 సంవత్సరానికిగాను గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్‌కు జూలై 15న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. చాందీ ప్రసాద్ చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. కొండ ప్రాంతాల ప్రజలకు కొయ్య, గడ్డి సేకరణ, అడవులు అంతరించడం వల్ల తలెత్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే చట్టబద్ధమైన హక్కుల కోసం 1973లో చిప్కో ఉద్యమం చేపట్టారు. ఇందుకు ఆయనకు 1982లో రామన్ మెగసెసె అవార్డు లభించింది. 2005లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని 1995లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డును గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మార్పు కోసం కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు బహుకరిస్తారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రంతోపాటు కోటి రూపాయల నగదు అందజేస్తారు. 
రెహ్మాన్‌కు బర్క్‌లీ గౌరవ డాక్టరేట్
సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్‌కు అమెరికాకు చెందిన బర్క్‌లీ సంగీత కళాశాల గౌరవ డాక్టరేట్‌తో సత్కరిం చింది. ఈ గౌరవాన్ని రెహ్మాన్ అక్టోబర్ 24న అందుకోనున్నారు.
ఫిక్కీ సెక్రటరీ జనరల్‌కు బ్రిటన్ గౌరవ డాక్టరేట్ 
ఫిక్కీ సెక్రటరీ జనరల్ అల్విన్ దిదార్ సింగ్ బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి జూలై 16న గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. భారత్‌లో ఈ-కామర్స్‌కు సంబంధించి ఇది తొలి డాక్టరేట్. 
2014 ప్రేమ్ భాటియా అవార్డు
ప్రముఖ జర్నలిస్టు ప్రేమ్ భాటియా పేరుతో నెలకొల్పిన అవార్డుకు స్మితా గుప్తా (హిందూ), నితిన్ సేథ్ (బిజినెస్ స్టాండర్డ్) ఎంపికయ్యారు. రాజకీయ అంశాల రిపోర్టింగ్ విభాగం నుంచి స్మితాగుప్తా, పర్యావరణం అంశాల రిపోర్టింగ్‌లో నితిన్‌సేథ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా రామ్‌నాయక్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ జూలై 14న ఉత్తర్వులు జారీచేసింది. అలాగే గుజరాత్‌కు ఓమ్ ప్రకాశ్ కోహ్ల, పశ్చిమబెంగాల్‌కు కేసరినాథ్ త్రిపాఠి, చత్తీస్‌గఢ్‌కు బలరాందాస్ టాండన్, నాగాలాండ్‌కు పద్మనాభ ఆచార్యలు గవర్నర్లుగా నియమితులయ్యారు. పద్మనాభ ఆచార్యకు త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ జూలై 11న ఉత్తర్వులు జారీచేసింది. అండమాన్ నికోబార్‌దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అజయ్‌కుమార్‌సింగ్ పుదుచ్చేరి అదనపు బాధ్యతలను అప్పగించింది. 
అదనపు సొలిసిటర్ జనరల్‌గా పింకీ ఆనంద్
సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో నియమితులైన రెండో మహిళ. కాగా సుప్రీంకోర్టు నుంచి మహిళా అధికారి నియామకం కావడం ఇదే తొలిసారి. మొదటి మహిళా అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్. 
ఇక్రిశాట్ రాయబారులుగా స్వామినాథన్, సైనా
అంతర్జాతీయ మెట్ట పంటల, ఉష్ణమండల వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రాయబారులుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు. జూలై 14న సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డి దార్ గౌరవ ఇక్రిశాట్ అంబాసిడర్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డును వారికి అందజేశారు. 
ఐరాస గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎమ్మా 
ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ జూలై 8న నియమితులయ్యారు. ఈమె హ్యారీ పోటర్ సీక్వెల్ చిత్రాల్లో నటించారు. గుడ్ విల్ అంబాసిడర్‌గా యువతుల్లో సాధికారత, స్త్రీలకు పురుషులతో సమాన హోదా అంశాలపై ఆమె విస్తృత ప్రచారం చేయనున్నారు. 
కాలిఫోర్నియా వర్సిటీ సీఐఓగా భారతీయ మహిళ
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (డేవిస్)‘ ముఖ్య సమాచార కమిషనర్ (పీఐఓ)గా భారతీయ అమెరికన్ విజీ మురళి నియమితులయ్యారు. ఆమె కాలిఫోర్నియా వర్సిటీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తారు. ఉస్మానియా వర్సిటీ నుంచి 1977లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. 
సీఈఐబీ డైరక్టర్ జనరల్‌గా అర్చనా రంజన్
ఆర్థిక నేరాలను నియంత్రించే సంస్థలను సమన్వయపరిచే అత్యున్నతమైన కేంద్ర ఆర్థిక నిఘా సంస్థ (ిసీఈఐబీ ) డైరక్టర్ జనరల్‌గా అర్చనా రంజన్ నియమితులయ్యారు. 
1979 బ్యాచ్‌కు చెందిన అర్చనా రంజన్ ప్రస్తుతం రాజస్థాన్ ఆదాయపు పన్ను శాఖ ముఖ్య కమిషనర్‌గా ఉన్నారు.


ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి పర్యటన
ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ భారత పర్యటనలో జూలై 1న ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. పారిస్ సందర్శించవలసిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె ఆహ్వానాన్ని మోడీకి అందజేశారు.

ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ పర్యటనఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ భారత్‌లో 5 రోజులపాటు పర్యటించారు. శాండ్‌బర్గ్ ప్రధాని నరేంద్రమోడీని కలిసి సామాజిక మాధ్యమాల వినియోగంపై చర్చించారు. ఫేస్‌బుక్ సీఓఓ అయిన తర్వాత షెరిల్ తొలి విదేశీ పర్యటన ఇది. 

బెర్కిలీ న్యాయ వర్సిటీ డీన్‌గా సుజిత్ చౌదరికాలిఫోర్నియాలోని బెర్కిలీ న్యాయ విశ్వవిద్యాలయం డీన్‌గా క్రిస్టోఫర్ ఎడ్లీ స్థానంలో భారత సంతతికి చెందిన సుజిత్ చౌదరి జూలై 1న నియమితులయ్యారు. ఈ హోదాను అలంకరించిన తొలి భారతీయ సంతతి వ్యక్తి చౌదరి. ఢిల్లీలో జన్మించిన చౌదరి టొరంటో, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల నుంచి న్యాయవిద్యలో పట్టాలను పొందారు. 

మిజోరం గవర్నర్‌గా కమలా బెనివాల్ గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్‌ను మిజోరం గవర్నర్‌గా జూలై 6న నియమించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఆమె పదవీ కాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. కాగా ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వాకు గుజరాత్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు, త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

No comments:

Post a Comment