AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు జూన్ 2016

క్రీడలు జూన్ 2016
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమిస్తున్నట్లు బీసీసీఐ జూన్ 23న ప్రకటించింది. కుంబ్లే ఏడాది పాటు కోచ్ పదవిలో కొనసాగనున్నారు. 
కోపా అమెరికా చాంపియన్ చిలీ
ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ విజేతగా వరుసగా రెండోసారి చిలీ నిలిచింది. జూన్ 27న జరిగిన ఫైనల్లో అర్జెంటీనాపై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో చిలీ విజయం సాధించింది. 2015 కోపా అమెరికా కప్ ఫైనల్లో కూడా అర్జెంటీనాపై పెనాల్టీ షూటౌట్‌లోనే నెగ్గి చిలీ చాంపియన్‌గా నిలిచింది. అర్జెంటీనా చివరిగా 1993లో కోపా అమెరికా కప్‌ను నెగ్గింది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ రిటైర్మెంట్
అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. జూన్ 27న చిలీతో జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం మెస్సీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా పరాజయం చెందడంతో మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన మెస్సీ.. దేశం తరఫున 11 ఏళ్లు ఆడాడు. 2005లో అర్జెంటీనా జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ మొత్తం 113 మ్యాచ్‌లలో 55 గోల్స్ చేశాడు. అర్జెంటీనా నుంచి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా మెస్సీ చరిత్రకెక్కాడు.
రియో ఒలింపిక్స్‌కు ద్యుతీ చంద్ ఎంపిక
రియో ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగుకు ఒడిశాకు చెందిన అథ్లెట్ ద్యుతీ చంద్ అర్హత సాధించింది. కొసనోవ్ మెమోరియల్ మీట్‌లో జూన్ 25న జరిగిన మహిళల 100 మీటర్ల హీట్స్‌ను 11.30 సెకన్లలో ముగించి ద్యుతీ రియో బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 36 ఏళ్ల తర్వాత భారత్ తరఫున 100 మీటర్ల పరుగులో బరిలోకి దిగుతున్న క్రీడాకారిణిగా ద్యుతి నిలిచింది. భారత్ నుంచి చివరిసారిగా పీటీ ఉష 1980 మాస్కో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల రేసులో బరిలోకి దిగింది. 
అఫ్ఘాన్ క్రికెట్ చీఫ్ కోచ్‌గా రాజ్‌పుత్
భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అఫ్ఘానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైనట్లు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) వెల్లడించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన లాల్‌చంద్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 110 మ్యాచ్‌ల్లో 7988 పరుగులు చేశారు. 2007లో తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

జింబాబ్వేపై టి20 సిరీస్ గెలిచిన భారత్
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్‌ను జింబాబ్వే గెలిచిన్పటికీ.. తరవాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 6 వికెట్లు తీసిన బరీందర్ శ్రాన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జింబాబ్వే పర్యటన ముగిసే నాటికి మూడు ఫార్మాట్‌లలో కలిపి మహేంద్రసింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 324. నంబర్‌వన్ స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (324) రికార్డును ధోని సమం చేశాడు.
హారికకు యురేసియన్ బ్లిట్జ్ కప్ 
అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్ యురేసియన్ బ్లిట్జ్ కప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక స్వర్ణం సాధించింది. కజకిస్తాన్ రాజధాని అల్మాటీలో జూన్ 19న ముగిసిన టోర్నమెంట్‌లో హారిక మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు రజతం
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో అతాను దాస్-దీపక కుమారిల జోడీకి రజత పతకం లభించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత్ జట్టుకు నాలుగో స్థానం దక్కింది.
హాకీ చాంపియన్స్ ట్రోఫీ రన్నరప్‌గా భారత జట్టు
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. లండన్‌లో జూన్ 18న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. 38 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత్..రజత పతకాన్ని దక్కించుకుంది.
రోస్‌బర్గ్‌కు యూరోపియన్ గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెస్ డ్రైవర్ రోస్‌బర్గ్ ఫార్ములావన్ యూరోపియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. బాకు (అజర్‌బైజాన్)లో జూన్ 19న జరిగిన ఫైనల్లో రోస్‌బర్గ్ టైటిల్ సాధించాడు.

సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్
సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ (బ్యాడ్మింటన్) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. సిడ్నీలో జూన్ 12న జరిగిన ఫైనల్లో సున్ యు (చైనా)పై విజయం సాధించింది. సైనాకు 56,250 డాలర్ల (రూ.37 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఆమెకిది రెండోసారి. 2014లో తొలిసారి సైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హన్స్ క్రిస్టిన్ విట్టింగస్ (డెన్మార్క్), మహిళల డబుల్స్ టైటిల్‌ను బావో ఇగ్జిన్, చెన్ క్వింగ్‌చెన్ (చైనా), పురుషుల డబుల్స్ టైటిల్‌ను మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్, కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా)లు గెలుచుకున్నారు.

టెన్నిస్ క్రీడాకారిణి షరపోవాపై రెండేళ్ల నిషేధండోపింగ్‌లో పట్టుబడ్డ రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాపై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూన్ 8న రెండేళ్ల నిషేధం విధించింది. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు తేలింది.

అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ వన్డే క్రికెట్ చరిత్రలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా లోకేశ్ రాహుల్ నిలిచాడు. జూన్ 11న జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 115 బంతుల్లో 100 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది.

కెనడా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత హామిల్టన్ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కెనడా గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2016 ఫార్ములావన్ సీజన్‌లోని తొలి ఐదు రేసుల్లో విఫలమైన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తాజాగా వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. మే 25న జరిగిన మొనాకో గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన ఈ బ్రిటన్ డ్రైవర్... జూన్ 13న జరిగిన కెనడా గ్రాండ్ ప్రిలోనూ టైటిల్ సాధించాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... బొటాస్ (విలియమ్స్)కు మూడో స్థానం లభించింది.

జింబాబ్వేపై భారత్ క్లీన్‌స్వీప్జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో జింబాబ్వే గడ్డపై భారత జట్టు వరుసగా మూడో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌గా ముగించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిచిన జట్టుగా ధోని సేన కొత్త రికార్డు సాధించింది. మొదటి మ్యాచ్‌లో 8, రెండో మ్యాచ్‌లో 9, మూడో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాలు నమోదుచేసింది. మొత్తం సిరీస్‌లో జింబాబ్వే 126 ఓవర్లలో 30 వికెట్లు కోల్పోయి 417 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరోవైపు వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని (107), అలన్ బోర్డర్‌తో సమంగా రెండో స్థానంలో నిలిచాడు. పాంటింగ్ (165) మొదటి స్థానంలో ఉన్నాడు.


ఫ్రెంచ్ ఓపెన్
పురుషుల సింగిల్స్:నొవాక్ జొకోవిచ్(సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పారిస్‌లో జూన్ 5న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్)ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్.
 మహిళల సింగిల్స్: మహిళల సింగిల్స్ టైటిల్‌ను గార్బిన్ ముగురుజా (స్పెయిన్) గెలుచుకుంది. ముగురుజా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. ఆమెకిది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్ (భారత్)- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు గెలుచుకున్నారు. జూన్ 3న జరిగిన ఫైనల్లో వీరు సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)లను ఓడించారు.
మహిళల డబుల్స్: కరోలిన్ గార్సియా-క్రిస్టినా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)లు మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
పురుషుల డబుల్స్: పురుషుల డబుల్స్ టైటిల్‌ను మార్క్ లోపెజ్-ఫెలిసియానొ లోపెజ్ (స్పెయిన్) జోడీ గెలుచుకుంది.
షరపోవాపై రెండేళ్ల నిషేధం
డోపింగ్‌లో పట్టుబడ్డ రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూన్ 8న రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ వాడినట్లు తేలింది. తర్వాత ఫిబ్రవరిలో పోటీలు లేని సమయంలోనూ జరిపిన పరీక్షలోనూ ఇదే ఫలితం రావడంతో సస్పెన్షన్ వేటు పడింది. షరపోవా మోసం చేయాలని ప్రయత్నించకపోయినా బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించిందని కేసును విచారించిన త్రిసభ్య ప్యానెల్ అభిప్రాయపడింది.

10 వేల పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా కుక్ రికార్డు
 ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్.. టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం కుక్ వయసు 31 ఏళ్ల 157 రోజులు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (31 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. అలాగే టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా కుక్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 12 మంది ఆటగాళ్లు పదివేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.

10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ నెగ్గిన తొలి ప్లేయర్‌గా జకోవిచ్ రికార్డుటెన్నిస్ చరిత్రలో 10 కోట్ల డాలర్ల (రూ. 674 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించిన తొలి క్రీడాకారుడిగా సెర్బియా ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 9 కోట్ల 96 లక్షల 73 వేల 404 డాలర్ల ప్రైజ్‌మనీతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో అతని ఖాతాలో అదనంగా 3 లక్షల 27 వేల 471 డాలర్లు జమయ్యాయి. దాంతో జొకోవిచ్ కెరీర్ ప్రైజ్‌మనీ 10 కోట్ల 875 డాలర్లకు చేరింది. ఓవరాల్ కెరీర్ ప్రైజ్‌మనీ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్-9 కోట్ల 80 లక్షల 11 వేల 727 డాలర్లు), రాఫెల్ నాదల్ (స్పెయిన్-7 కోట్ల 82 లక్షల 23 వేల 403 డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

No comments:

Post a Comment