AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూన్ 2016

వార్తల్లో వ్యక్తులు జూన్ 2016
ఐస్‌ల్యాండ్ అధ్యక్ష ఎన్నికల్లో జొహాన్నెసన్ విజయం
ఐస్‌ల్యాండ్ అధ్యక్ష ఎన్నికల్లో గుడ్ని జొహాన్నెసన్ విజయం సాధించారు. 20 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న ఒలాఫుర్ రాగ్నర్ స్థానంలో జొహాన్నెసన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. 
‘ఖేలో ఇండియా’ సభ్యులుగా గోపీచంద్, అంజూ
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతక విజేత అంజూ బాబీ జార్జిలను ‘ఖేలో ఇండియా’లో సభ్యులుగా నియమించారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు.
నాగాలాండ్ రెబల్ నేత ఇసాక్ మృతి
ఈశాన్యంలో 30 ఏళ్లపాటు తన తిరుగుబాటుతో రక్తపాతం సృష్టించిన నాగా మిలిటెంట్ లీడర్ ఇసాక్ చైషి స్వూ (87) మరణించారు. ఏడాదిగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇసాక్.. జూన్ 28న తుదిశ్వాస విడిచారు. నాగాలాండ్‌లోని జున్హెబొటో జిల్లా ఇసాక్ స్వస్థలం. ఆయన సుమీ తెగకు చెందిన వ్యక్తి. నేషనల్ కౌన్సిల్(ఎన్‌ఎన్‌సీ)లో 1950లో చేరిన ఇసాక్.. 1980లో కౌన్సెల్ చీలిక వరకు పలు హోదాల్లో పనిచేశారు. నాగాలాండ్‌లో శాంతి నెలకొల్పేందుకు ఎన్‌ఎన్‌సీ, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒడంబడికను వ్యతిరేకిస్తూ 1980లో ఇసాక్, తుయింగలెంగ్ ముయివాతో కలసి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్‌ను ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌ను దేశం నుంచి వేరుచేయాలన్నది వీరి డిమాండ్. 1997లో సంధికి అంగీకరించిన ఇసాక్ గ్రూపు.. అప్పటి నుంచి కేంద్రంతో చర్చలు జరుపుతోంది. 2015 ఆగస్టులో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ తదితరుల సమక్షంలో శాంతి ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసింది.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విశ్వనాథన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎన్.ఎస్. విశ్వనాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న హెచ్.ఆర్.ఖాన్ స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారు. ప్రస్తుతం విశ్వనాథన్ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ల నియామకం సాధారణంగా ఆర్‌బీఐ గవర్నర్ అధ్యక్షతన గల కమిటీ ద్వారా జరుగుతాయి. కానీ విశ్వనాథన్ నియామకం మాత్రం తొలిసారిగా క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ ఎంపిక ద్వారా జరిగింది.

రోమ్ మేయర్‌గా విర్జినియా రగ్గి ఎన్నిక
రోమ్ నగర మేయర్‌గా ఫైవ్‌స్టార్ మూమెంట్ పార్టీ కీలక నేత విర్జినియా రగ్గి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. జూన్ 20న వెల్లడైన రోమ్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఫైవ్‌స్టార్ మూవ్‌మెంట్ పార్టీ 55 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించింది.
భారత వైమానిక దళంలోకి ముగ్గురు మహిళా పైలట్లు
దేశంలో తొలిసారిగా యుద్ధ విమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు..అవని చతుర్వేది (మధ్యప్రదేశ్), మోహనా సింగ్ (రాజస్థాన్), భావనా కాంత్ (బీహార్)లు వైమానిక దళంలో చేరారు. హైదరాబాద్‌లో జూన్ 18న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా వీరు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు తొలిసారిగా యుద్ధ విమానాలను నడపనున్నారు.
ఐఎఫ్‌జే ఉపాధ్యక్షురాలిగా సబీనా
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఉపాధ్యక్షురాలిగా సబీనా ఇంద్రజిత్ ఎన్నికయ్యారు. సబీనా సీనియర్ జర్నలిస్టు పార్లమెంటేరియన్ ఇంద్రజిత్ కూతురు. ప్రస్తుతం ఆమె ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజెన్సీ అధిపతిగా ఉన్నారు. ఆసియా నుంచి ఐఎఫ్‌జే కీలక పదవిని పొందిన మొదటి జర్నలిస్టుగా ఘనత సాధించారు. ఐఎఫ్‌జే అధ్యక్షుడిగా బెల్జియంకు చెందిన ఫిలిప్‌లెరుథ్, సీనియర్ ఉపాధ్యక్షుడిగా మొరాకోకు చెందిన యూనుస్ ఎంజాహెద్, ఉపాధ్యక్షుడిగా జర్మనీకి చెందిన క్రెబిచ్, కోశాధికారిగా ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ బౌమెల్హ ఎన్నికయ్యారు. 
నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూత
కన్యాశుల్కం గిరీశం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రముఖ రంగస్థల, సినీనటుడు జేవీ రమణమూర్తి(83) కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా క్యాన్సర్ (సామస్సెల్ కాన్షినోమా)తో బాధపడుతున్న ఆయన జూన్ 22న తుదిశ్వాస విడిచారు. నటుడు సోమయాజులుకు రమణమూర్తి స్వయానా సోదరుడు. రమణమూర్తి 1933 మే 20న విజయనగరం జిల్లాలో జన్మించారు. నటరాజ కళాసమితిని స్థాపించి 42 ఏళ్ల పాటు దాదాపు వెయ్యిసార్లకు పైగా గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. 1957లో సినీరంగంలోకి ప్రవేశించి దాదాపు 200 లకుపైగా చిత్రాల్లో నటించారు.

ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా మృతి
తొలితరం పాత్రికేయులు, కాలమిస్ట్ ఇందర్ మల్హోత్రా (86) జూన్ 11న న్యూఢిల్లీలో మరణించారు. ఆయన.. ది స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది గార్డియన్ పత్రికల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాశారు. 
మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడికి జైలు శిక్ష
మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2015 సెప్టెంబర్‌లో స్పీడ్ బోటులో బాంబు పెట్టి అబ్దుల్లాను చంపేందుకు అదీబ్ కుట్ర పన్నినట్టు రుజువైంది. అదీబ్‌తోపాటు ఆయన బాడీగార్డులు ఇద్దరిని కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడింది. జూన్ 9న తీర్పు వెలువరించిన న్యాయస్థానం 10న శిక్షను ఖరారు చేసింది. 
యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పీటర్ థామ్సన్
ఐక్యరాజ్యసమితికి సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ) అధ్యక్షుడిగా పీటర్ థామ్సన్ నియమితులయ్యారు. దాదాపు 193 దేశాల సభ్యత్వంగల ఈ అంతర్జాతీయ సంస్థకు అతి చిన్న ద్వీపం అయిన ఫిజీకి చెందిన థామ్సన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ స్థానంలో ఆయన కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు జూన్ 14న జరిగిన ఎన్నికల్లో ఫిజీకి చెందిన పీటర్ థామ్సన్ విజయం సాధించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ 94 ఓట్లు పోలయ్యాయి. ఆయనతోపాటు ఈ పదవికి పోటీపడిన సిప్రస్‌కు చెందిన ఆండ్రియాస్ మావ్‌రోయిన్నిస్‌కి 90 ఓట్లు వచ్చాయి.

బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ కన్నుమూత
బాక్సింగ్ యోధుడు మహ్మద్ అలీ (74) శ్వాసకోస సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ జూన్ 3న లాస్‌ఏంజెల్స్‌లో మరణించారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలిన అలీ.. రికార్డు స్థాయిలో 56 విజయాలు సాధించడంతో పాటు కేవలం ఐదు పరాజయాలతో కెరీర్‌ను ముగించారు. 1981లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
స్వచ్ఛ సాథీ ప్రచారకర్తగా దియా మీర్జా
స్వచ్ఛ భారత్ అనుబంధ యువత కార్యక్రమం స్వచ్ఛ సాథీకి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియా మీర్జా జూన్ 6న నియమితులయ్యారు. ఆమె ప్రచారకర్తగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం తోపాటు స్ఫూర్తినిచ్చే వీడియోల ద్వారా స్కూలు విద్యార్థులను చైతన్యపరచనున్నారు.
‘మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత
భారత్‌లో బాడీ బిల్డింగ్‌కు పెద్దగా ప్రాముఖ్యం లేని పాత రోజుల్లోనే అంతర్జాతీయ వేదికపై సంచలనాలు సృష్టించిన మిస్టర్ యూనివర్స్ మనోహర్ ఐచ్ (104) జూన్ 5న కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కోల్‌తాలోని బగుయాటిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1950లో 36 ఏళ్ల వయసులో మనోహర్ తొలిసారి ‘మిస్టర్ హెర్క్యులస్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1951లో ఏకంగా ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్నా... రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. చివరకు 1952లో ‘జాతీయ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ యూనివర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను సాధించి భారత్ తరఫున రెండో ‘మిస్టర్ యూనివర్స్’గా రికార్డులకెక్కారు. దీంతో అతని సైజ్‌ను బట్టి ‘పాకెట్ హెర్క్యులస్’గా నామకరణం చేశారు. ఎందుకంటే ఆయన ఎత్తు 4 అడుగుల 11 అంగుళాలు.
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జూన్ 6న పుదుచ్చేరిలోని గాంధీ థిడాల్‌లోనారాయ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణం చేయించారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు
ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలిచారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. హిందుస్థాన్ టైమ్స్‌ను ప్రచురించే హెచ్‌టీ మీడియాకు శోభన చైర్‌పర్సన్, ఈడీగా వ్యవహరిస్తున్నారు. జాబితాలో మొట్టమొదటి స్థానంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఉండగా ఆ తరువాతి రెండు స్థానాల్లో వరసగా అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్, ఫెడరల్ రిజర్స్ చీఫ్ జానెట్ యెలెన్ నిలిచారు. ఈ జాబితాలో ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ (7వ స్థానం), మిషెల్ ఒబామా (13), పెప్సికో సీఈవో ఇంద్రా నూయి (14) ఉన్నారు.

యూపీఎస్‌సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ
 
వివాదాస్పద మాజీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సభ్యుడిగా నియమించారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. బస్సీ గతంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. యూపీఎస్‌సీలో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసుల ఉద్యోగాలను యూపీఎస్‌సీ భర్తీ చేస్తుంది.

No comments:

Post a Comment