AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2016

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2016
రియో ఒలింపిక్స్‌లో భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సల్మాన్
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సల్మాన్ ఖాన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏప్రిల్ 22న ప్రకటించింది. బాలీవుడ్ నటుడిని ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడం ఇదే తొలిసారి.
చైనా సర్వసైన్యాధిపతిగా జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికార పరిధి విస్తరణలో భాగంగా ఏప్రిల్ 20న సర్వసైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జిన్‌పింగ్ ఇప్పటికే అధికార కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, సైన్యాన్ని నియంత్రించే కేంద్ర సైనిక కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
రాజ్యసభకు ఆరుగురిని నామినేట్ చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 22న ఆరుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో బీజేపీ నేతలు సుబ్రమణ్యంస్వామి, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూలతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో గతంలో ఉన్న జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) సభ్యుడిగా ఉన్న నరేంద్ర జాదవ్‌కూ చోటిచ్చింది. వీరితోపాటు మలయాళ నటుడు సురేశ్ గోపి, జర్నలిస్ట్ స్వపన్ దాస్‌గుప్తా, బాక్సర్ మేరీ కోమ్‌లను కొత్తగా రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసింది. మోదీ ప్రభుత్వం సిఫార్సుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధరంగాల నుంచి ఈ ఆరుగురిని ఎగువ సభకు నామినేట్ చేశారు. సాహిత్యం, సైన్స్, క్రీడలు, కళ, సామాజిక సేవా రంగాలకు సంబంధించి వీరిని నామినేట్ చేశారు. 
విజయ్ మాల్యా పాస్‌పోర్టు రద్దు
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన ఆ సంస్థ యజమాని విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఏప్రిల్ 24న భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
జేకేఎల్‌ఎఫ్ నేత అమానుల్లా ఖాన్ మృతి
కశ్మీర్ వేర్పాటు వాది, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్) వ్యవస్థాపక సభ్యుడు అమానుల్లా ఖాన్(82) ఏప్రిల్ 26న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో కన్నుమూశారు. కశ్మీర్ వేర్పాటువాది సజ్జద్ ఘనీలోన్.. ఖాన్‌కు అల్లుడు. 1971లో భారత్ నుంచి లాహోర్‌కు వెళ్లే ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్, 80వ దశకం మధ్యలో బ్రిటన్‌లో భారత దౌత్యవేత్త హత్యల్లో ఖాన్ సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. 1977లో ఖాన్ జేకేఎల్‌ఎఫ్‌ను స్థాపించారు. స్వతంత్ర కశ్మీర్‌పై ‘ఫ్రీ కశ్మీర్’, ‘మై ఆటోబయోగ్రఫీ’ పుస్తకాలను రాశారు.

జుకర్‌బర్గ్‌కు డొమైన్ అమ్మిన అమల్ అగస్టిన్
కొచ్చిలోని కేఎంఈఏ కాలేజీలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న అమల్ అగస్టిన్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌కు డొమైన్‌ను అమ్మాడు. అమల్ అగస్టిన్‌కు డొమైన్‌లను రిజిస్టర్ చేసే అలవాటు ఉంది. దీంట్లో భాగంగా జుకర్‌బర్గ్ కూతురు మాక్జిమ పేరు మీద maxchanzuckerberg.org పేరుతో వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేశాడు. అయితే కూతురు పేరుమీద వెబ్‌సైట్ ఓపెన్ చేద్దామనుకున్న జుకర్‌బర్గ్‌కు అది అందుబాటులో లేదని తెలిసింది. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ హక్కులు అమ్మాలంటూ ఫేస్‌బుక్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఐకానిక్ కేపిటల్ సంస్థ ప్రతి నిధులు అమల్‌ను సంప్రదించగా కేవలం 700 డాలర్లకే (రూ.46,655) ఇచ్చేశాడు.
పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ పేరు
పశ్చిమబెంగాల్‌లోని పనాగఢ్ ఎయిర్ బేస్ పేరును అర్జన్ సింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌గా మార్చారు. అర్జన్ ఏప్రిల్ 15న 97 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆయన జన్మదినోత్సవ వేడుకల్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చీఫ్ అరూప్ రాహా ఈ ప్రకటన చేశారు. బతికుండగా ఓ వ్యక్తి పేరును ఎయిర్ బేస్‌కు పెట్టడం ఇదే తొలిసారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న ల్యాలాపూర్‌లో జన్మించారు (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్). 1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగారు. 1965 నాటి యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు.

మిస్ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ
ఢిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ ఎఫ్‌బీబీ ఫెమినా ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. ఏప్రిల్ 9న ఢిల్లీలో జరిగిన వేడుకల్లో సినీ, ప్యాషన్ రంగ ప్రముఖుల మధ్య షారుఖ్ ఖాన్ అవార్డులను ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సుశ్రుతీ కృష్ణా ఫస్ట్ రన్నరప్‌గా, లక్నోకి చెందిన పంఖురి గిద్వానీ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఇండియాగా ఎంపికైన ప్రియదర్శిని ‘మిస్ వరల్డ్ 2016’ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించనుంది.
జేడీయూ చీఫ్‌గా నితీశ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏప్రిల్ 10న జనతాదళ్ (యునెటైడ్) పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్‌ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శరద్ యాదవ్ 2006 నుంచి మూడుసార్లు జేడీ (యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగోసారి ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన విముఖత చూపారు.

వియత్నాం అధ్యక్షుడిగా ట్రాన్ దయ్ క్వాంగ్
 
వియత్నాం అధ్యక్షుడిగా జాతీయ భద్రతా దళం అధిపతి ట్రాయ్ దయ్ క్వాంగ్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు 91.5 శాతం ఓట్లు లభించాయి. ఆ దేశ ప్రధాని గుయెన్ తన్ డుంగ్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

ప్రముఖ ఆర్కిటెక్ట్ జహా హదిద్ మృతిప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ జహా హదిద్ మార్చి 31న మియామిలో మరణించారు. ఇరాక్-బ్రిటీష్ ఆర్టిటెక్ట్ హదిద్ ప్రపంచ వ్యాప్తంగా అనేక భవనాలను రూపొందించారు. వాటిలో లండన్ ఒలంపిక్ ఆక్వాటిక్ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఆర్కిటెక్చర్‌లో నోబుల్ ప్రైజ్‌గా భావించే ప్రిట్జ్‌కర్ ప్రైజ్‌ను (2004లో) అందుకున్న తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పి.సుశీలప్రముఖ నేపథ్య గాయని పి.సుశీలకు అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దీనికి సంబంధించిన ధ్రువ పత్రాన్ని ఆమెకు మార్చి 29న అందజేశారు. పి.సుశీల ఆరుకు పైగా భాషల్లో 17,695 పాటలు పాడినట్లు అందులో పేర్కొన్నారు.

సీజేఐ ఠాకూర్‌కు గౌరవ డాక్టరేట్భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్. ఠాకూర్‌కు ఏప్రిల్ 2న జమ్మూ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవంలో ఆయనకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా డాక్టరేట్‌ను అందించారు. ‘తొలి డాక్టరేట్‌ను లక్నోలో తీసుకున్నాను. ఈ రెండో డాక్టరేట్‌ను నేను చదువుకున్న వర్సిటీ నుంచి అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత 46 ఏళ్లలో ఈ వర్సిటీ ఎంతోమంది విద్యావేత్తలను, జడ్జీలను అందించింది’ అని ఠాకూర్ చెప్పారు.

ఐస్‌లాండ్ ప్రధాని రాజీనామాఐస్‌ల్యాండ్ ప్రధాన మంత్రి సిగ్ముందర్ గన్లాగ్సన్ తన భార్య అన్నా సిగుర్లాగ్ పేరిట విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనం వెనకేశారని పనామా పత్రాలు బయటపెట్టిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ దేశాల్లో పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పలువురు దేశాధ్యక్షులు, ప్రధానుల పేర్లు ఇందులో వెలుగుచూడడంతో ఆ దేశాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాగ్రహం పెల్లుబికడంతో సిగ్ముందర్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఏప్రిల్ 4న వేలాది మంది ప్రజలు పార్లమెంట్ చెంత ఆందోళనకు దిగారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని పన్నులు చెల్లించానని వివరణ ఇచ్చుకున్నా ప్రజలు శాంతించలేదు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏప్రిల్ 5న రాజీనామా చేశారు.

నాస్కామ్ చైర్మన్‌గా సీపీ గుర్నానీప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా క్వాత్రో గ్లోబల్ సర్వీసెస్ సీఎండీ రమణ్ రాయ్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు.

వెస్టిండీస్ కెప్టెన్ సామీకిఅరుదైన గౌరవంవెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ సామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా పేరు మారుస్తున్నామని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు. అలాగే ఇదే దేశానికి చెందిన మరో ఆటగాడు జాన్సన్ చార్లెస్ పేరును ఒక స్టాండ్‌కు పెట్టనున్నారు.

No comments:

Post a Comment