AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2012

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2012
వార్తల్లో వ్యక్తులుమంత్రిగా జానారెడ్డి రికార్డుఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం మంత్రిగా కొనసాగి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి రికార్డు నెలకొల్పారు. ఆగస్టు 24 నాటికి ఆయన మంత్రిగా 14 సంవత్సరాలు 11 నెలలు పదవీ కాలాన్ని చేసుకున్నారు. దీంతో 14 సంవత్సరాల 10 నెలల 28 రోజులు మంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డును అధిగమించారు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. జానారెడ్డి ఎన్టీఆర్ హయాంలో ఆపద్ధర్మంతో కలిపి మూడు పర్యాయాలు..1983, 1984, 1985లలో(6 ఏళ్ల రెండు రోజులు) మంత్రిగా పని చేశారు. తర్వాత 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో నాలుగో దఫా రెండేళ్ల రెండు నెలల నాలుగు రోజుల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతిచంద్రుడిపై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(82) ఆగస్టు 25న అమెరికాలోని సిన్‌సిటీలో మరణించారు. 1969 జూలై 20న అపోలో 11 వ్యోమనౌక ద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టారు. ఈయనతోపాటు చంద్రమండల యాత్రకు వెళ్లిన బృందంలో ఎడ్విన్ ఆల్ట్రిన్, మైకేల్ కాలిన్స్ ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ట్రిన్‌లు మూడు గంటలపాటు చంద్రుడిపై గడిపారు. నమూనాలు సేకరించి ఫోటోలు తీసారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు.
గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
మిస్ వరల్డ్ వెన్ జియా యూచైనాకు చెందిన వెన్ జియా యూ (23) 2012 ప్రపంచ సుందరిగాఎంపిక య్యారు. ఆగస్టు 18న ఓర్డోస్ (చైనా)లో జరిగిన పోటీలో వెన్‌జియా యూ విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి రన్నరప్‌గా సోఫీ మౌల్డ్స్(వేల్స్), రెండో రన్నరప్‌గా జెస్సికా కహావటి (ఆస్ట్రేలియా) నిలిచారు. భారత్‌కు చెందిన వాన్యా మిశ్రాకు ఆరో స్థానం దక్కింది. చైనాకు ఈ టైటిల్ రావడం ఇది రెండో సారి. 2007లో ఆ దేశానికి చెందిన జాంగ్ జిలిన్ మిస్ వరల్డ్ కిరీటం ద క్కించుకుంది.
కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతికేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (67) ఆగస్టు 14న చెన్నైలో కాలేయ వ్యాధితో మరణించారు. 1980లో తొలిసారి లాతూర్ స్థానం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన రెండు స్లారు (1999-2003, 2004-08 మధ్య కాలంలో) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2009 నుంచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
చిత్రకారుడు కాపు రాజయ్య మృతిప్రముఖ చిత్రకారుడు కళారత్న కాపు రాజయ్య (83) ఆగస్ట్ 20న మెదక్ జిల్లా సిద్ధిపేటలో మరణించారు. డ్రాయింగ్ టీచర్‌గా ఎందరికో తర్ఫీదునిచ్చిన రాజయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 1990లో ఆయన కల్లుగీత కార్మికుల జీవితంపై రూపొందించిన చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. 
1990లో కేంద్ర అకాడెమీ పురస్కారం 2000లో రాష్ర్ట ప్రభుత్వ హంస పురస్కారంతో పాటు అనేక సత్కారాలు ఆయన పొందారు.
మన్మోహన్ రికార్డుభారతదేశ 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆగస్ట్ 15న ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఎర్రకోటపై ఎక్కువ సార్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించారు. మన్మోహన్ 2004 ఆగస్ట్ 15న తొలి సారిగా ఎర్రకోటపై జెండా ఎగరవేశారు. మన్మోహన్ కంటే ముందు ఆ పదవిలో ఉన్న బీజేపీ నేత వాజ్‌పేయి ఆరు సార్లు జాతీయ పతాకావిష్కరణ చేశారు.
 
లోక్‌సభ నాయకుడిగా ‘షిండే’కేంద్ర హోం మంత్రిగా కొత్తగా నియమితులైన సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ నాయకుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, షిండేని లోక్‌సభ నాయకుడిగా నామినేట్ చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆగస్టు 3న ప్రకటించారు. లోక్‌సభ నాయకుడిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో షిండేని నియమించారు.

No comments:

Post a Comment