AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు జూలై 2016

క్రీడలు జూలై 2016
జర్మనీ ఫుట్‌బాల్ కెప్టెన్ స్చ్వీన్‌స్టీగర్ వీడ్కోలు
జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు బాస్టియన్ స్చ్వీన్‌స్టీగర్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 31 ఏళ్ల స్చ్వీన్‌స్టీగర్ నాయకత్వంలో జర్మనీ జట్టు జూలైలో జరిగిన యూరో చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించింది. ఇటీవలే సెర్బియా టెన్నిస్ స్టార్ అనా ఇవనోవిచ్‌ను పెళ్లాడిన ఈ మాంచెస్టర్ యునెటైడ్ క్లబ్ ఆటగాడు తన కెరీర్‌లో జర్మనీ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్ చేశాడు. 2014 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన స్చ్వీన్‌స్టీగర్ 2006, 2010 ప్రపంచకప్‌లలో కూడా పాల్గొన్నాడు. 
ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్
ప్రొ కబడ్డీ సీజన్-4 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. దీంతో రెండోసారి టైటిల్ చేజిక్కించుకున్న తొలి జట్టుగా పట్నా నిలిచింది. జూలై 31న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పైరేట్స్ 37-29 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన పైరేట్స్‌కు రూ. 1 కోటి, రన్నరప్ జైపూర్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్ వరకు దూసుకొచ్చిన తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ చేతిలో 35-40తో ఓడి నాలుగో స్థానంలో నిలిచింది.అవార్డులు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు: పర్‌దీప్ నర్వాల్ (పట్నా) రూ. 10 లక్షలు
డిఫెండర్ ఆఫ్ ది టోర్నీ: ఫజల్ అత్రాచల్ (పట్నా) రూ. 5 లక్షలు
రైడర్ ఆఫ్ ది టోర్నీ: రాహుల్ చౌదరి (టైటాన్స్) రూ. 5 లక్షలు
రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీ: అజయ్ కుమార్ (జైపూర్) రూ. 1 లక్ష
ప్రొ కబడ్డీ మహిళల విజేత స్ట్రామ్ క్వీన్స్
తొలిసారి నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్ మహిళల టోర్నీలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. జూలై 31న జరిగిన ఫైనల్లో క్వీన్స్ 24-23 పాయింట్ల తేడాతో ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. 
జర్మన్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
జర్మన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. దీంతో హామిల్టన్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 సీజన్‌లో హామిల్టన్‌కిది ఆరో టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలెట్టిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ 217 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.


టెస్టుల్లో కోహ్లి తొలి డబుల్ సెంచరీ
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు.అంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి 283 బంతుల్లో 200 పరుగులు సాధించాడు. దీంతో విదేశీ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అత్యధిక స్కోరు రికార్డు అజారుద్దీన్ (192) పేరిట ఉండేది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడు కోహ్లి.
అండర్-20 అథ్లెటిక్స్‌లో నీరజ్ ప్రపంచ రికార్డు 
వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించాడు. పోలండ్‌లో జూలై 24న జరిగిన ఈవెంట్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల నీరజ్.. జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 84.69 మీటర్లతో జిగిస్ ముండ్స్ సిర్మాయిన్(లాత్వియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును నీరజ్ బ్రేక్ చేశాడు. సీనియర్ లేదా జూనియర్ విభాగంలో భారత అథ్లెట్ ప్రపంచ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. నీరజ్‌కు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించింది.
హంగే రి గ్రాండ్ ప్రి టైటిల్ విజేత హామిల్టన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ హంగేరి గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 24న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు.
100 మీటర్ల హర్డిల్స్‌లో కెండ్రా హ్యారిసన్ ప్రపంచ రికార్డు
అమెరికా క్రీడాకారిని కెండ్రా హ్యారిసన్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.28 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును ఆమె బద్దలుకొట్టింది. హ్యారిసన్ 12.20 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. లండన్ డైమండ్ లీగ్ అంతర్జాతీయ మీట్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. దీంతో 1988లో యోర్డొంకా డొంకోవా (బల్గేరియా-12.21 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు తెరమరుగైంది.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కినట్లు జులై 27న ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మహిళల క్రి కెట్ జట్టు కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఫిడే గ్రాండ్ ప్రి విజేతగా హారిక
ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. చెంగ్డూ (చైనా)లో జూలై 14న ముగిసిన టోర్నమెంటులో హారిక స్వర్ణ పతకం గెలుచుకోగా, కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది.
విజేందర్‌సింగ్‌కు డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ టైటిల్
భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ బ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో జూలై 16న కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్‌లో విజేందర్ విజయం సాధించాడు. దీంతో విజేందర్ ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరాడు.

యూరో కప్‌ను గెలుచుకొన్న పోర్చుగల్
 పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తొలిసారి యూరోకప్‌ను గెలుచుకొంది. జూలై 10న పారిస్‌లో జరిగిన ఫైనల్లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఫ్రాన్స్‌ను 1-0 తేడాతో ఓడించింది. దీంతో ఫ్రాన్స్ జట్టుపై పోర్చుగల్ 41 ఏళ్ల తర్వాత విజయం సాధించినట్లైంది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎడెర్ ఏకైక గోల్ సాధించాడు. 

అవార్డులు: గోల్డెన్ బాల్ అవార్డు (ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్)తో పాటు గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్-6 గోల్స్) అవార్డును ఆంటోని గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్) దక్కించుకున్నాడు. మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1984లో) తర్వాత ఒకే యూరో టోర్నీలో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు.

వింబుల్డన్ చాంపియన్‌షిప్
  • వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే (బ్రిటన్) గెలుచుకొన్నాడు. లండన్‌లో జూలై 10న జరిగిన ఫైనల్లో మిలోస్ రోనిచ్ (కెనడా)ను ముర్రే ఓడించాడు.
  • మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫైనల్లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. సెరెనాకు ఇది 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. దీంతో స్టెఫీగ్రాఫ్ రికార్డును సెరెనా సమం చేసింది.
  • పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన పైరీ హెర్బెర్ట్, నికోలస్ మహుట్ జంట గెలుచుకుంది.
  • మహిళల డబుల్స్ టైటిల్‌ను సెరెనా, వీనస్ విలియమ్స్ (అమెరికా) జంట గెలుచుకుంది. ఫైనల్లో విలియమ్స్ జంట యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీని ఓడించింది. సెరెనా-వీనస్ జంటకిది 14వ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
  • మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను హెన్రి కాంటినెన్ (ఫిన్‌లాండ్), హెథర్ వాట్సన్ (బ్రిటన్) జంట సొంతం చేసుకుంది.

హామిల్టన్‌కు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. స్పీల్‌బర్గ్‌లో జూలై 3న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా మ్యాక్ వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో, రైకోనెన్ మూడో స్థానంలో నిలిచారు.

కెనడా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాయి ప్రణీత్ కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సాయి ప్రణీత్ (భారత్) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూలై 4న కాల్గరీ (కెనడా)లో జరిగిన ఫైనల్లో లీ హ్యున్‌ను సాయి ప్రణీత్ ఓడించాడు. కెరీర్‌లో ప్రణీత్‌కు ఇది తొలి గ్రాండ్ ప్రి టైటిల్. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్‌రెడ్డి-మను అత్రిల జోడి గెలుచుకుంది.

సెరెనా 300వ గ్రాండ్‌స్లామ్ విజయంఅమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ విజయాన్ని నమోదు చేసింది. జూలై 3న జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో అన్నికా బేక్ (జర్మనీ)పై విజయం సాధించింది. ఫలితంగా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ‘ఓపెన్ ఎరా’లో మార్టినా నవ్రోతిలోవా (అమెరికా) 306 విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది. 34 ఏళ్ల సెరెనాకు వింబుల్డన్‌లో ఇది 82వ విజయం కాగా, ఏడో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఆమె... స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ద్యుతీ బృందం జాతీయ రికార్డుకజకిస్థాన్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణిలు కొత్త జాతీయ రికార్డును సృష్టించారు. జూలై 4న జరిగిన మహిళల 4x100మీ. రిలేను ద్యుతీచంద్, శ్రాబణి నందా, హెచ్.ఎం. జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన బృందం 43.32 సెకన్లలో ముగించి రజత పతకాన్ని సాధించింది. దీంతో గతంలో తమ పేరిటే ఉన్న 44.03సెకన్ల జాతీయ రికార్డును అధిగమించింది. 42.92 సెకన్లలో లక్ష్యదూరాన్ని చేరుకున్న కజకిస్థాన్ బృందం పసిడి పతకాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత పురుషుల బృందం 39.90 సెకన్లలో 4x100మీ. రిలేను పూర్తి చేసి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది.

No comments:

Post a Comment