AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2016

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2016
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్ రెండోసారి ఆగస్టు 24న ఎంపికయ్యారు. కిమ్ తొలి విడత పదవీ కాలంలో దారిద్య్ర నిర్మూలన, వాతావరణ మార్పులకు సంబంధించి విశేష కృషి చేశారని అమెరికా ఆర్థికశాఖ మంత్రి జాకోబ్ జే లూ పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రచారకర్తగా ఐశ్వర్యాదనుష్ 
 ఐక్యరాజ్య సమితి (ఐరాస) దక్షిణాది మహిళా సంక్షేమ ప్రచారకర్తగా రజనీకాంత్ కూతురు, ధనుష్ సతీమణి ఐశ్వర్యా ధనుష్ ఎంపికయ్యారు. ఈమె మహిళా హక్కులు, వారిపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు. 2014లో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, 2015లో బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రచార కర్తలుగా ఉన్నారు.
డాక్టర్ శ్రీధర్ రెడ్డికి రాష్ట్రపతి బంగారు పతకం
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ చైర్మన్‌గా డాక్టర్ ఎ.శ్రీధర్‌రెడ్డిని రెడ్‌క్రాస్ సొసైటీ అత్యున్నత పురస్కారమైన ‘రాష్ట్రపతి బంగారు పతకం’ వరించింది. గత పదిహేనేళ్లుగా వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2009లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి ఆరు గంటల్లో 8 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొమ్మిదిసార్లు బంగారు పతకాలు, 2010లో ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, పదిసార్లు ఏపీ ప్రభుత్వ సేవా అవార్డులు అందుకున్నారు.
అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా ఎమ్బా గోథీ
ఇండోనేసియాకి చెందిన ఎమ్బా గోథీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్లు జీవించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. సెంట్రల్ జావా ప్రాంతంలోని స్రజెన్‌కు చెందిన ఈయన రికార్డుల ప్రకారం 1870 డిసెంబర్ 31న జన్మించారు. దీని ప్రకారం గోథీ వయసు 145 ఏళ్లు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా ఫ్రాన్స్‌కి చెందిన జెన్నీ కాల్మెట్(122) పేరిట ఉన్న రికార్డును తిరిగి రాయనున్నారు. గోథీ తోబుట్టువులు, భార్యలు, పిల్లలు అందరూ ఇప్పటికే మరణించగా, ప్రస్తుతం మనవలు, మనవరాళ్లతో కలసి ఉంటున్నారు.
గంగానదిలో 550 కిలోమీటర్లు ఈదనున్న శ్రద్ధా శుక్లా
గంగానదిలో 550 కి.మీ ఈది రికార్డు సృష్టిస్తానని 11 ఏళ్ల చిన్నారి శ్రద్ధా శుక్లా సాహసానికి సిద్ధమైంది. కాన్పూర్ నుంచి వారణాసి వరకు 10 రోజుల్లో 550 కిలోమీటర్లు ఈదాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్‌లోని మసక్రే ఘాట్ నుంచి ఆగస్టు 28న సాహసయాత్రను ప్రారంభించిన శ్రద్ధా తొలిరోజే 100 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది.
రచయిత్రి సచ్‌దేవ్‌కు సరస్వతీ సమ్మాన్ ప్రదానం
ప్రముఖ డోగ్రీ రచయిత్రి పద్మా సచ్‌దేవ్‌కు ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ (2015)ను ఆగస్టు 29న ఢిల్లీలో ప్రదానం చేశారు. స్వీయ చరిత్ర చిత్‌ఛటేకు ఆమె ఈ పురస్కారాన్ని పొందారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ పురస్కారం కింద పద్మా సచ్‌దేవ్‌కు రూ.15 లక్షల నగదు, ప్రశంసపత్రాన్ని అందించారు. బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డులను అందిస్తోంది.

పంజాబ్, అసోం, మణిపూర్‌లకు కొత్త గవర్నర్లు
మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి నజ్మా హైప్తుల్లా మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాజస్తాన్‌కు చెందిన వీపీ సింగ్ బద్నోర్‌ను పంజాబ్‌కు, ‘ది హితవాద’ దినపత్రిక ఎండీ బన్వారీలాల్ పురోహిత్‌ను అస్సాం గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ జగదీశ్ ముఖికి అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.
కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీగా వీఎస్‌ఆర్ మూర్తి
భారత సముద్ర తీర రక్షణ దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్‌ఆర్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం తాలూకా ఉంగుటూరులో జన్మించిన మూర్తి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1984లో కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. 2009లో ఫ్లాగ్ ర్యాంక్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2012లో అండమాన్, నికోబార్ రీజియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్‌గా, 2014లో నార్త్ ఈస్ట్ రీజియన్ కమాండెంట్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ‘బెస్ట్ షిప్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి కోస్ట్ గార్డ్ పతకం (విశిష్ట సేవ), 2003లో కోస్ట్ గార్డ్ పతకం (శౌర్యం) అందుకున్నారు.
మహారాష్ట్రలో గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని డోంజా గ్రామాన్ని క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు. 2011 గణాంకాల ప్రకారం డోంజా గ్రామంలో 582 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి 899:1000గా ఉంది. ఈ గ్రామంలో 72.17 శాతం మంది అక్షరాస్యులు. గ్రామాలను సామాజికంగా, సాంస్కృతికంగా ప్రగతి పథంలో నడిపించడానికి 2014, అక్టోబరులో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్ ఇది వరకే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టం రాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ఆగస్టు 21న నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హోదాలో ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీతో ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పూర్తవుతుండటంతో అదే రోజు ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ... గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడవ వ్యక్తి పటేల్.

52 సంవత్సరాల పటేల్, 1963 అక్టోబర్ 28న జన్మించారు. యేల్ యూనివర్సిటీ నుంచి 1990లో ఆర్థికరంగంలో డాక్టరేట్ తీసుకున్నారు. అంతక్రితం 1986లో ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చేశారు. 1990-1995 మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో పనిచేసిన ఆయన, అమెరికా, భారత్, బహమాస్, మయన్మార్ ఆర్థిక అంశాలను పర్యవేక్షించారు.
మిస్ ఆసియా - 2016గా త్రిక్సియా మారి
ఆగస్టు 19న కొచ్చిలో నిర్వహించిన మిస్ ఆసియా-2016 పోటీలో ఫిలిప్పీన్ యువతి త్రిక్సియా మారి విజేతగా నిలించింది. రన్నరప్‌గా బెలారస్ యువతి యుగేనియా వసీయవా నిలవగా, తృతీయ స్థానంలో భారత్‌కు చెందిన అంకితా కరాట్ నిలిచింది.

అశోక చక్ర, శౌర్య చక్ర, సేవా పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాహస పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 14న పకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 14 శౌర్య చక్ర, 63 సేన పతకాలు, రెండు నావికా సేన, రెండు వాయు సేన, 948 రాష్ట్రాల పోలీసులకు ఇచ్చే అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి.

2015 మే 27న కశ్మీర్‌లో అక్రమంగా భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి తర్వాత ప్రాణాలర్పించిన హవల్దార్ హంగ్‌పాన్‌కు ఆర్మీ అత్యున్నత పీస్‌టైమ్ అవార్డు అశోక చక్ర అవార్డు దక్కింది. 

పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో మరణించిన ఎన్‌ఎస్‌జీ బాంబు నిర్వీర్య దళం చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్య చక్ర పురస్కారం లభించింది. 2016 జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో గ్రనేడ్లను నిర్వీర్యం చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మొత్తం 82 మంది రక్షణ, పారామిలిటరీ సిబ్బందికి సాహస పురస్కారాలు లభించాయి.

గతేడాది ఆగస్టులో కశ్మీర్‌లో ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న లాబ్రడార్ శునకం మాన్సీని ‘మెన్షన్ ఆఫ్ డిశ్పాచెస్’ సర్టిఫికెట్‌తో గౌరవించారు.
ఏపీకి 16 సేవా పతకాలువిధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించినందుకు పోలీసులకు ఇచ్చే సేవా పతకాల్లో ఏపీకి 16 పతకాలు దక్కాయి. ఇందులో రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 2, అత్యుత్తమ సేవా పతకాలు 14 ఉన్నాయి. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇంటలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేస్తున్న పీవీ రాధాకృష్ణ, ఆక్టోపస్‌లో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న బి.చిట్టిబాబు ఎంపికయ్యారు. 
తెలంగాణకు 26 పథకాలుతెలంగాణ రాష్ట్రానికి రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శౌర్య పోలీసు పతకాలు కలిపి మొత్తం 24 పతకాలు లభించాయి. వీటితో పాటు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి.

2016 ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిదిని పట్టుకునేందుకు శ్రీనివాసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు శౌర్యచక్ర ప్రకటించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు ప్రకటించారు.
శౌర్యచక్ర1. కె.శ్రీనివాసులు (కానిస్టేబుల్, నిఘా విభాగం)రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు1. దూదేకుల సిద్దయ్య (సబ్ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ)
2. నాగరాజు (కానిస్టేబుల్, నల్లగొండ)
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం1 రాజీవ్ రతన్, డిజి, ఫైర్ సర్వీసెస్
అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో ఫుల్ ఆత్మహత్య
అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో ఫుల్ ఆగస్టు 9న ఇటానగర్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా కలిఖో ఫుల్ సీఎం పదవి నుంచి వైదొలిగారు.
కవి, విమర్శకులు ఆవంత్స సోమసుందర్ మృతి
ప్రముఖ అభ్యుదయ తెలుగు కవి, విమర్శకులు ఆవంత్స సోమసుందర్ ఆగస్టు 12న కాకినాడలో మరణించారు. కవి, కథకుడు, అనువాదకుడిగా తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆయన 75 పుస్తకాలను రచించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా ఆయన రాసిన వజ్రాయుధం ఆవంత్స రచనల్లో ముఖ్యమైంది. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1979లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతిని అందుకున్నారు.

1924 నవంబరు 18న జన్మించిన సోమసుందర్తన 66 ఏళ్ల సాహిత్య జీవితంలో సుమారు 140 గ్రంథాలు రచించారు. 1942లో కమ్యూనిస్టు పార్టీలో చేరి పలు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
ఆవంత్స పొందిన అవార్డులు
1980లో ‘కృష్ణశాస్త్రి కవితాత్మ’కు రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు
1977లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, గురజాడ అప్పారావు అవార్డులు
2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఆత్మ గౌరవ పురస్కారం
2008లో కళారత్న పురస్కారం
2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం
యాంత్రిక్స్-దేవాస్ ఛార్జ్‌షీట్‌లో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ పేరు
యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్‌తోపాటు పలువురిపై సీబీఐ ఆగస్టు 10న ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2005లో బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీమీడియాతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కొత్త శాటిలైట్లను తయారుచేసి, వాటి వినియోగానికి ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను లీజుకు ఇచ్చేందుకు దేవాస్.. యాంత్రిక్స్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే రేడియో తరంగాల కోసం ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీంట్లో మాధవన్ నాయర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
‘ది జిహాదిస్ట్ త్రెట్ టు ఇండియా’ పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ రచయిత, అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు తుఫైల్ అహ్మద్ రచించిన ‘ది జిహాదిస్ట్ త్రెట్ టు ఇండియా ’ పుస్తకాన్ని ‘సోషల్ కాజ్’ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 14న ఆవిష్కరించారు. అమాయకుల ప్రాణాలు తీస్తూ వికృత చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించలేదని, కొన్ని ఉర్దూ మీడియా సంస్థలు పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 
రవీనాకు ‘ఫాగ్’ సత్కారం
ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను బాలికల సాధికారత కోసం కృషి చేసినందుకుగాను ‘ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్’(ఫాగ్) వేడుకల్లో సత్కరించారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో లోని, సిలికాన్ వ్యాలీలో జరిగిన వేడుకల్లో ఈ ఏడాది స్త్రీ సాధికారత, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందకుగాను రవీనాకు ఈ సత్కారం లభించింది. రవీనా తన 21వ ఏటనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు.

గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ 
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆగస్టు 7న ప్రమాణస్వీకారం చేశారు. విజయ్ రూపానీ 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 
సద్భావన పురస్కారానికి ఎంపికైన శుభ ముద్గల్
సామాజిక సామరస్యం, శాంతి వ్యాప్తికి కృషి చేసినందుకు గాయని శుభ ముద్గల్‌కు 23వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని ఆగస్టు 5న ప్రకటించారు. రాజీవ్ గాంధీ జయంతి రోజు (ఆగస్టు 20)న అందించే ఈ పురస్కారం కింద విజేతకు రూ.10 లక్షలు అందజేస్తారు.
ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎన్నికయ్యారు. ఆగస్టు 4న జరిగిన ఐఓసీ వరల్డ్ 129వ సమావేశం ఆమెను సభ్యురాలిగా ఎంపిక చేసింది. దీంతో ఐఓసీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా నీతా గుర్తింపు పొందారు. 
‘మా’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా మాధురీ దీక్షిత్
తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మా (MAA-&-Mothers absolute affection) ప్రచారానికి సినీనటి మాధురీ దీక్షిత్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. యునిసెఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆగస్టు 5న ఢిల్లీలో ప్రారంభించారు.
నిరశన దీక్షను విరమించిన ఇరోం షర్మిల
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44) 16 ఏళ్లుగా చేస్తున్న నిరశన దీక్షను ఆగస్టు 9న విరమించారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(AFSPA) రద్దు కోసం తాను మణిపూర్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని ప్రకటించారు. ఏఎఫ్‌ఎస్‌పీఏను వ్యతిరేకిస్తూ.. 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్షను చేపట్టారు. ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన నిరశన ఇదే. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రికి వెలుపల జైలుగా మార్చిన గదిలోనే షర్మిల దీక్ష విరమించారు.
అరుణాచల్ మాజీ సీఎం కలిఖో పుల్ ఆత్మహత్య
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆగస్టు 9న ఇటానగర్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని కనిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా 4 నెలలకే సీఎం పదవిని కోల్పోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్ 2015 చివర్లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై పలువురు ఎమ్మెల్యేలతో కలసి తిరుగుబాటు చేశారు. దీంతో నబమ్ టుకీ ప్రభుత్వం రద్దయింది. 2015 డిసెంబర్ 9న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో 20 మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో అరుణాచల్ సీఎంగా పుల్ 2016 ఫిబ్రవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో తిరిగి టుకీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పుల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించనున్న ఇరోమ్ షర్మిల

16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించనున్నట్లు ఇరోమ్ షర్మిల (44) జూలై 26న ఇంఫాల్‌లో ప్రకటించారు. మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని కోరుతూ 2000, నవంబర్ 5న ప్రారంభించిన దీక్షను ఆగస్టు 9న విరమించనున్నట్లు ఆమె తెలిపారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఎత్తేయాలనే తన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తన లక్ష్య సాధనకు రాజకీయాల్ని మార్గంగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ దిశగా 2017లో జరగనున్న మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు ఇరోమ్ ప్రకటించారు. వివాహం చేసుకుంటానని తెలిపారు.

గుజరాత్ సీఎం ఆనందీబెన్ రాజీనామా
గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీ బెన్ తన పదవికి ఆగస్టు 3న రాజీనామా చేశారు. వయోభారం వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ లో 75వ ఏట అడుగుపెడుతున్న తన స్థానంలో కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment