AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు నవంబరు 2015

క్రీడలు నవంబరు 2015
బ్రిటన్‌కు డేవిస్ కప్
ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ గెలుచుకుంది. గెంట్(బెల్జియం)లో నవంబరు 29న జరిగిన ఫైనల్లో బెల్జియంను ఓడించింది. బ్రిటన్ 77 ఏళ్ల తర్వాత ఈ విజయం సాధించింది.
తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ మైదానంలో జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసింది (నవంబర్ 28-29). 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను వాడారు.
రోస్‌బర్గ్‌కు అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్
అబుదాబిలో నవంబరు 29న ముగిసిన రేసులో ఫార్ములా వన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ సాధించారు. ఇదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం లభించింది.
హారికకు ప్రపంచ చెస్ ఆన్‌లైన్ టైటిల్
భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆన్‌లైన్లో చెస్ టోర్నీ నిర్వహించటం ఇదే తొలిసారి. ఇటలీలోని రోమ్‌లో నిర్వహించిన ఈ టోర్నీ నవంబరు 27న ముగిసింది. నానా జాగ్నిడ్జ్ (జార్జియా)కు రెండో స్థానం లభించింది.
పి.వి.సింధుకు మకావు ఓపెన్
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. ఆమె మకావులో నవంబరు 29న జరిగిన ఫైనల్లో మితాని మినత్సు (జపాన్)ను ఓడించింది. సింధు ఈ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకొని, హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.

ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. నవంబర్ 23న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను జకోవిచ్ ఓడించాడు. ఈ టైటిల్‌ను జకోవిచ్ వరుసగా నాలుగోసారి, మొత్తం మీద ఐదో సారి సాధించాడు. టోర్నీ 46 ఏళ్ల చరిత్రలో వరుసగా నాలుగు సార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన తొలి ఆటగాడిగా జకోవిచ్ రికార్డు సృష్టించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట.. రోహన్ బోపన్న(భారత్), ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీని ఓడించి గెలుచుకుంది.
స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్ విజేత పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను బెంగుళూరుకు చెందిన పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. నవంబర్ 21న హర్గాడా (ఈజిప్ట్)లో జరిగిన ఫైనల్లో జావో జిన్‌టాంగ్ (చైనా)పై అద్వానీ విజయం సాధించాడు. ప్రపంచ స్నూకర్ టైటిల్ నెగ్గడం అద్వానీకిది రెండోసారి. ఓవరాల్‌గా ‘క్యూ స్పోర్ట్స్’లో 15వ సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
హాంకాంగ్ ఓపెన్ టైటిల్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్‌వీ (మలేసియా) గెలుచుకున్నాడు. నవంబరు 22న కౌలూన్ (హాంకాంగ్)లో జరిగిన ఫైనల్లో తియాన్ హువీ (చైనా)ను ఓడించాడు. ఇది చోంగ్‌వీకి కెరీర్‌లో 60వ సింగిల్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్(స్పెయిన్) దక్కించుకుంది. ఫైనల్లో నొజోమీ ఒకుహారా(జపాన్)ను ఓడించింది. 
ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్
ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. నవంబర్ 22న క్వాంటన్(మలేసియా)లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇందులో భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం మూడోసారి. 2004, 2008లో కూడా ఈ టైటిల్‌ను సాధించింది. 
రష్యా డోపింగ్ ఏజెన్సీపై నిషేధం
రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) నిషేధం విధించింది. ఇప్పటికే రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా ఈసారి రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీపై వేటు పడింది. నిబంధనలకు అనుగుణంగా ఈ ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. వాడా కోరిన ఆటగాళ్ల శాంపిల్స్‌ను నాశనం చేయడంలో ఆర్‌యూఎస్‌ఏడీఏ కీలక పాత్ర పోషించింది.

రోస్‌బర్గ్‌కు బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్
బ్రెజిల్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ గెలుచుకొన్నాడు. నవంబర్ 16న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటి స్థానం దక్కించుకోగా, మరో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సిరిల్‌కు రజతం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన యువ ఆటగాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ రజత పతకం సాధించాడు. దీంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో బాలుర సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పెరూ రాజధాని లిమాలో నవంబర్ 15న జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సిరిల్ వర్మ.. ఆరో సీడ్ చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. సిరిల్ వర్మ హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీ శిక్షణ పొందుతున్నాడు.
చైనా ఓపెన్ విజేతగా లీ జురుయ్
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లీ జురుయ్ (చైనా) గెలుచుకొంది. నవంబర్ 15న జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్‌ను జురుయ్ ఓడించింది. దీంతో సైనా రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వార్న్ వారియర్స్‌కు ఆల్‌స్టార్స్ సిరీస్
క్రికెట్ టీ-ట్వంటీ ఆల్‌స్టార్స్ సిరీస్‌ను వార్న్ వారియర్స్ గెలుచుకొంది. వార్న్ వారియర్స్ టీం నవంబర్ 15న లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన మూడో టీ-ట్వంటీ మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ టీంను ఓడించి 3-0 తో సిరీస్‌ను సొంతం చేసుకొంది.
రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం
అంతర్జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా రష్యాపై వేటు పడింది. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) నివేదిక ఆధారంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఏకగ్రీవంగా ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని సైతం రష్యా అథ్లెట్‌లు కోల్పోయారు. ప్రభుత్వ అనుమతితోనే విచ్చలవిడిగా రష్యా క్రీడాకారులు డోపింగ్‌కు పాల్పడుతున్నారని వాడా నివేదిక తెలిపింది. దీంతో 2016 వరల్డ్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్స్‌కు రష్యా ఆతిథ్యం కోల్పోనుంది.
క్రికెట్‌కు మిచెల్ జాన్సన్ వీడ్కోలు
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు జాన్సన్ ప్రకటించాడు. క్వీన్స్‌లాండ్ తరఫున 2001లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన జాన్సన్... 2007లో ఆసీస్ తరఫున తొలి టెస్టు ఆడాడు. 73 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్ 28.40 సగటుతో 313 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున ‘ఆల్‌టైమ్ టెస్టు వికెట్ల జాబితా’ లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. లిల్లీ (355), మెక్‌గ్రాత్ (563), వార్న్ (708) ఇతనికంటే ముందున్నారు.

చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అగ్రస్థానం
మొత్తం 11 పతకాలతో ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రీస్‌లో నవంబరు 6న ముగిసిన పోటీలో అయిదు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలను భారత్ సాధించింది. 2006 తర్వాత భారత్ 11 పతకాలు సాధించటం ఇదే తొలిసారి. ఇరాన్, బల్గేరియాలు రెండు స్వర్ణాలు చొప్పున సాధించి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
క్రికెట్ సెలక్షన్ కమిటీలో ఎంఎస్‌కే ప్రసాద్
భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో భారత మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ నియమితులయ్యారు. సౌత్‌జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్‌కు చోటు లభించింది. భారత్ తరఫున ప్రసాద్ ఆరు టెస్టులు, 17 వన్డే మ్యాచ్‌లు ఆడారు.
భారత్‌కు బహ్రెయిన్ బ్యాడ్మింటన్ టైటిల్
బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సమీర్‌వర్మ (భారత్) గెలుచుకున్నాడు. 2015, నవంబరు 8న జరిగిన ఫైనల్లో జీ లియాంగ్ డెరెక్ (సింగపూర్)ను సమీర్ వర్మ ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో శైలి రాణే (భారత్)ను ఓడించి, నిచాపోన్ జిందాపోల్ (థాయిలాండ్) గెలుచుకుంది. 
‘ఆసియా ఆర్చరీ’లో భారత్‌కు స్వర్ణ పతకాలు
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ ఈవెంట్ వ్యక్తిగత మహిళల విభాగంలో వెన్నం జ్యోతి టైటిల్ సాధించింది. పురుషుల విభాగంలో రజత్ చౌహాన్ టైటిల్ సాధించాడు. బ్యాంకాక్ (థాయిలాండ్)లో నవంబరు 7న జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ, అఫ్సాని షఫిఎలావిజిని ఓడించింది. రజత్ చౌహాన్.. థాయిలాండ్‌కు చెందిన చోయ్ యాంగ్ హీని ఓడించాడు. భారత్‌కు పురుషుల టీం విభాగంలో స్వర్ణం, మహిళల టీం విభాగంలో రజతం దక్కాయి. పురుషుల టీం విభాగంలో దక్షిణ కొరియాను భారత్ ఓడించగా, మహిళల టీం విభాగంలో భారత్‌ను దక్షిణ కొరియా ఓడించింది.
రంజీల్లో వసీమ్ జాఫర్ పరుగుల రికార్డు
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్.. రంజీ ట్రోఫీ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాఫర్... ప్రస్తుతం విదర్భ జట్టు తరఫున ఆడుతున్నాడు. బెంగాల్ జట్టుతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో జాఫర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 1996-97 సీజన్‌లో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన జాఫర్ ఇప్పటివరకు 126 మ్యాచ్‌లు ఆడి 10,002 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 229 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 51 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 17,088 పరుగులు చేశాడు.
ఆరు స్టేడియంలకు టెస్టు హోదా
దేశంలోని ఆరు క్రికెట్ స్టేడియంలకు కొత్తగా టెస్టు హోదాను ప్రకటించారు. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంతో పాటు పుణే, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాల, రాంచీ స్టేడియంలు కూడా టెస్టు వేదికలు కానున్నాయి. వైజాగ్‌లో ఇప్పటివరకు ఐదు వన్డేలు జరిగాయి. ఏసీఏ కార్యదర్శి, బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయిన గోకరాజు గంగరాజు టూర్ ప్రోగ్రామ్ అండ్ ఫిక్స్‌చర్స్ కమిటీ చైర్మన్‌గా కూడా ఎంపికయ్యారు.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా (భారత్)- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చాంపియన్‌షిప్‌ను రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్ 1న సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ ఎనిమిదో సీడ్ గార్బిన్ ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని ఓడించింది. 
  • గ్రాండ్ స్లామ్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గడం సానియాకిది రెండోసారి. గతేడాది కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా ఈ టైటిల్‌ను సాధించగా... ఈసారి హింగిస్‌తో టైటిల్‌ను నిలబెట్టుకుంది.
  • ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా.. ఈ ఏడాది 10వ టైటిల్. హింగిస్‌తో కలిసి తొమ్మిదోది. సానియా-హింగిస్ జంట ఈ ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్, చార్ల్స్‌టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ ఓపెన్, వుహాన్ ఓపెన్, బీజింగ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది. సిడ్నీ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది.
  • మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్‌లో ఇది 50వ డబుల్స్ టైటిల్. తద్వారా మహిళల టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 16వ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది.

సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) నిలిచింది. ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రద్వాన్‌స్కా ఐదో ర్యాంకర్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 26 ఏళ్ల రద్వాన్‌స్కా కెరీర్‌లో ఇది 17వ సింగిల్స్ టైటిల్. 

బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20టి20 ఫార్మాట్‌లో తొలిసారిగా ఆసియా కప్ జరుగబోతోంది. 2016 ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అర్హత పోటీలో నెగ్గిన యూఏఈ ఐదో జట్టుగా బరిలోకి దిగనుంది. మరోవైపు 2018లో జరిగే ఆసియా వన్డే కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

బాసెల్ ఓపెన్ విజేత ఫెడరర్బాసెల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ విజేతగా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై మూడున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. నవంబర్ 1న జరిగిన ఫైనల్లో నాదల్‌ను ఓడించిన ఫెడరర్.. తన కెరీర్‌లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 2012లో ఏప్రిల్‌లో ఇండియన్ వెల్స్ ఓపెన్ సెమీఫైనల్లో చివరిసారి నాదల్‌పై ఫెడరర్ గెలిచాడు. ఆ తర్వాత నాదల్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఫెడరర్‌కు ఓటమి ఎదురైంది. తాజా విజయంతో ఫెడరర్ ఐదోసారి ఒకే టోర్నీని ఏడు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఫెడరర్ తన కెరీర్‌లో హాలె ఓపెన్ టోర్నీ టైటిల్‌ను 8 సార్లు నెగ్గగా... వింబుల్డన్, సిన్సినాటి ఓపెన్, బాసెల్, దుబాయ్ ఓపెన్‌లను ఏడుసార్లు చొప్పున సాధించాడు. 

జాతీయ సీనియర్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం జాతీయ సీనియర్ (ఎలైట్) మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. చాంపియన్‌షిప్ ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీలు) విభాగంలో జరీన్ విజేతగా నిలిచింది. అసోంలోని గువహటిలో జరిగిన ఫైనల్లో జరీన్.. వన్‌లాల్ దువాతి (మిజోరాం)ను ఓడించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల జరీన్ సెమీఫైనల్లో జాహ్నవి (రైల్వేస్)ను ఓడించింది. 

మెక్సికో గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ఫార్ములా వన్ రేస్ ‘మెక్సికో గ్రాండ్ ప్రి’లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఇప్పటికే ‘ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను ఖాయం చేసుకున్న లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. 23 ఏళ్ల తర్వాత నవంబర్ 2న మళ్లీ మెక్సికోలో ఫార్ములావన్ రేసు జరిగింది. ఈ రేసును లక్షా 40 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు. 2015 సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది నాలుగో టైటిల్ కాగా... కెరీర్‌లో 12వది.

ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ రాజీనామాఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి దాని ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)గా పని చేసిన సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2న తన రాజీనామా పత్రాన్ని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు అందించారు. దీనిని వెంటనే ఆమోదిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రామన్ హస్తం ఉందని గతంలో ముద్గల్ కమిటీ తేల్చింది.

టెస్టులకు షోయబ్ మాలిక్ వీడ్కోలుపాకిస్తాన్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్... టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టే తనకు చివరిదని ప్రకటించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 13 నుంచి 17 వరకు అబుదాబీలో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ (245)తో కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఓవరాల్‌గా 35 టెస్టులాడిన మాలిక్ 1,898 పరుగులు చేశాడు. మూడు సెంచరీలతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు.

No comments:

Post a Comment